కూలిన ఆశలు | Huts Removal Tension in khammam district | Sakshi
Sakshi News home page

కూలిన ఆశలు

Published Fri, Jan 24 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM

Huts Removal Tension in khammam district

 ఖమ్మం అర్బన్,న్యూస్‌లైన్: నిన్నటి వరకు పిల్లాపాపలతో కళకళలాడిన ఖమ్మం సమీపంలోని ఎన్నెస్పీ కాల్వ కట్ట పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. పదేళ్లుగా తాము నివసిస్తున్న ఇళ్లను అధికారులు కూల్చివేయడంతో నిర్వాసితులు గుండెలవిసేలా విలపించారు. ఒకవైపు మహిళలు, పిల్లల రోదనలు, మరోవైపు అధికారుల హడావిడితో ఆ ప్రాంతంలో గురువారం కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చెప్పా పెట్టకుండా గుడిసెలు తొలగిస్తే ఉన్నట్టుండి తట్టాబుట్టా సర్దుకుని ఎక్కడికి వెళ్లాలంటూ గుడిసెవాసులు ఆవేదన వ్యక్తం చేశారు.
 
 కోర్టు ఆదేశాల పేరుతో ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు తొలగించడంతో పెట్టే బేడా సర్దుకుని ప్రత్యామ్నాయ స్థావరాలు వెతుక్కుంటూ బయటపడాల్సి వచ్చిందని  విలపిస్తున్నారు. తమకు ముందుగా ఎక్కడైనా స్థలం కేటాయించి, ఆ తర్వాత తొలగిస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండేది కాదంటున్నారు. పేదల కోసమే పని చేస్తున్నామని చెపుతున్న పాలకులు, అధికారులు ఇప్పుడు ఇలా చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం తమవద్దకు వచ్చే నాయకులు ఇప్పుడెక్కడికి వెళ్లారని ప్రశ్నిస్తున్నారు. కొందరు పెద్దల కోసం తమను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. బుధవారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేశారని, దీంతో పిల్లలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని వాపోయారు. తాము అడ్డుకున్నా తొలగింపులు ఆపరనే భయంతో ఇంట్లోని సామగ్రి, రేకులను కాపాడుకునేందుకు అన్నీ సర్దుకుని స్వచ్ఛందంగానే బయటకు వచ్చామన్నారు.
 
 పోలీసుల బందోబస్తు మధ్య తొలగింపు...
 భారీ పోలీసు బందోబస్తు.. రహదారుల దిగ్బంధం మధ్య రెండోరోజు గురువారం కూడా కూల్చివేతల పర్వం కొనసాగింది. ఖమ్మం ఆర్డీఓ సంజీవరెడ్డి, డీఎస్పీ బాలకిషన్ పర్యవేక్షణలో తొలగింపులు చేపట్టారు. ఒక్కో టీమ్‌కు ఒక సీఐ, ముగ్గురు ఎస్సైలు, 15 మంది సివిల్, 15 మంది ఏఆర్, ఆరుగురు మహిళా పోలీసులతో పాటు ఒక తహశీల్దార్, ఒక సర్వేయర్‌లతో 16 టీమ్‌లుగా ఏర్పడ్డారు. వీరి పర్యవేక్షణలో, జేసీబీల సహాయంతో మున్సిపల్ సిబ్బంది ఇళ్లు తొలగించారు. కూల్చివేతల సందర్భంగా ఎవరూ అక్కడికి రాకుండా ప్రధాన రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతో పాటు  వైరా, ఇల్లెందు, సత్తుపల్లి డీఎస్పీలు సాయిశ్రీ, క్రిష్ణ, అశోక్ పర్యవేక్షణలో మరో 250 మంది పురుష, 200 మంది మహిళా కానిస్టేబుళ్లు కూడా బందోబస్తు నిర్వహించారు. ఎనిమిది 108 వాహనాలు, రెండు ఫైర్ ఇంజన్లను సిద్ధంగా ఉంచారు. బుధవారం నుంచే కాల్వల పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. కలెక్టర్, జేసీ, ఎస్పీ సూచనలతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌లు గణేష్, నారాయణరెడ్డి, సమజ తొలగింపులను పర్యవేక్షించారు.
 
 ప్రార్థనా మందిరాలకు తాత్కాలిక మినహాయింపు...
  గుడిసెల కూల్చివేత ప్రాంతంలో ఉన్న దేవాలయాలు, మసీదులు, చర్చీలను తొలగించకుండా వాటికి తాత్కాలిక మినహాయింపు ఇచ్చారు. ఉన్నతాధికారుల సూచన మేరకు గుడిసెలన్నీ తొలగించిన తర్వాత వాటిపై నిర్ణయం తీసుకుంటామని ఆర్డీఓ సంజీవరెడ్డి తెలిపారు. కాగా, మొత్తం 1200 పైగా గుడిసెలు ఉన్నాయని, అందులో సగం మంది మాత్రమే అర్హులు ఉన్నారని, వారికి ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతాల్లో స్థలాలు ఇస్తామని చెప్పారు. ఇవి కాక కొందరు పెద్దలు నిర్మించిన భవనాలు సుమారు 50 వరకు ఉంటాయని, వాటిని కూడా తొలగిస్తామని తెలిపారు.
 
  ముందస్తుగా అదుపులోకి...
 కూల్చివేతలను అడ్డుకోకుండా పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతురావు, నాయకులు మౌలానా, సలాం, జానీమియా, ఏనుగు గాంధీ, మల్లేష్, రామకృష్ణ,  కాంగ్రెస్ నాయకుడు పువ్వాడ అజయ్‌కుమార్ తో పాటు మొత్తం 27 మంది ఉన్నారు. గుడిసెవాసులతో పాటు నాయకులను కూడా టేకులపల్లిలోని మహిళా ప్రాంగణం, డైట్ కాలేజీ, సర్దార్ పటేల్ స్టేడియం, పాకబండలోని కమ్యూనిట్ హాల్‌లో ఏర్పాటు చేసిన స్థావరాలకు తరలించినట్లు ఆర్డీఓ తెలిపారు. ఇళ్లు కోల్పోయిన పేదలకు ఈ స్థావరాల్లోనే భోజన, వసతి సదుపాయాలు కల్పించామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement