Huts Removal
-
గూడు కూల్చి.. రోడ్డుకీడ్చి!
మహబూబ్‌నగర్ రూరల్: వారంతా రెక్కాడితే డొక్కాడని నిరుపేదలు.. వారి స్థితిగతులను పరిశీలించి గత ప్రభుత్వం ఇళ్లు నిర్మించుకోవడానికి స్థలాలు కేటాయించింది. ఆ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోవాలని ఆ పేదలంతా ఎంతో ఆశపడ్డారు. అయితే వారికి కేటాయించిన స్థలాన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం అధికారులు కేటాయించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న లబ్ధిదారులు తమ స్థలాలు ఎక్కడ పోతాయోననే అభద్రతాభావంతో ఇటీవల గుడిసెలు వేసుకోవడంతో ఇళ్లుకుట్టుకుని స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. వాటిని మహబూబ్‌నగర్ మండల రెవెన్యూ అధికారులు ఆదివారం బలవంతంగా తొలగించారు.. 1400 మందికి స్థలాల కేటాయింపు 2004లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మహబూబ్‌నగర్ పట్టణం క్రిష్టియన్‌పల్లి పంచాయతీ శివారులోని ఆదర్శనగర్‌లో 523 సర్వేనంబర్‌లో సుమారు 1400మంది నిరుపేదలకు ఇళ్లు నిర్మించుకోవడానికి స్థలాలు కేటాయించింది. స్థలాలను పొందినవారిలో చాలామంది సొంతిళ్లు నిర్మించుకోలేదు. ఈ స్థలంలోనే డబుల్ బెడ్రూమ్ల కోసం ఇటీవల రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు ‘జీ’ ప్లస్– వన్ ఇళ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన కూడా చేశారు. తమకు కేటాయించిన స్థలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించొద్దని లబ్ధిదారులు మొదటినుంచీ వ్యతిరేకిస్తున్నారు. కానీ అధికారులు మాత్రం బలవంతంగా అక్కడినుంచి తొలగిస్తున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు ఆదివారం పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్ సిబ్బంది చేత తొలగించారు. పట్టణంలో ఎన్నో ప్రభుత్వ భూములు ఒకపక్క కబ్జాకు గురవుతున్నా అధికారులు వాటినేమి పట్టించుకోకుండా నిరుపేదలపై ఉక్కుపాదం మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో అధికారులు ప్రవర్తించిన తీరుపై నిరుపేదలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిరుపేదలకు అండగా ఉంటామని కాంగ్రెస్, సీపీఎం నాయకులు ముందుకొచ్చారు. అధికారుల చర్యలను ఖండించారు. పోలీసులు దౌర్జన్యం చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు ఇంటిస్థలాన్ని కేటాయించింది. ఆ స్థలంలో గుంతలు ఉంటే రూ.లక్షతో చదును చేసుకున్నాం. మాది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ముగ్గురు పిల్లలను పోషించడానికి ఇబ్బందిగా ఉన్నా నెలకు రూ.3500కు ఇంటిని అద్దె తీసుకుని జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడేమో డబుల్ బెడ్రూమ్ల పేరిట మాకు ఇచ్చిన స్థలాన్ని అధికారులు లాక్కుంటున్నారు. మాకు ఇచ్చిన స్థలంలో గుడిసె వేసుకుంటే పోలీసులు దౌర్జన్యంగా తొలగించారు. – సంగీత, బాధితురాలు, క్రిష్టియన్‌పల్లి అద్దె కట్టలేకపోతున్నాం.. మాకు సొంతిల్లు లేక నెలకు రూ.3వేలు చెల్లించి అద్దెఇంట్లో ఉంటున్నాం. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో గుడిసైనా వేసుకుందామనుకుంటే అధికారులు బలవంతంగా ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. మాకు ఇచ్చిన స్థలానికి బదులు డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తే సంతోషిస్తాం. ఏదీ ఇవ్వకుండా స్థలాన్ని దౌర్జన్యంగా లాక్కుంటే ఎక్కడ ఉండాలి. ప్రభుత్వం డబుల్ బెడ్రూంల పేరిట మా లాంటి వారికి ఇచ్చిన స్థలాలను లాక్కోవడం సరికాదు. మాకు కచ్చితమైన హామీ ఇచ్చేంతవరకు స్థలాన్ని వదిలిపెట్టేది లేదు. –పద్మ, బాధితురాలు, క్రిష్టియన్‌పల్లి పేదలకు న్యాయం చేస్తాం ఎవరినీ ఉద్దేశ పూర్వకంగా అన్యాయం చేయం. కాకపోతే వారికిచ్చిన ఇళ్ల స్థలాలను అమ్ముకున్నారని మా దృష్టికి వచ్చింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. నిరుపేదలు తమకు ఇచ్చిన పట్టా సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకుంటే వారికి తప్పకుండా న్యాయం చేస్తాం. ఇందులో నిరుపేదలు ఎవరి మాటలను పట్టించుకోకూడదు. రెచ్చగొట్టే ధోరణి మంచిది కాదు. – ఎంవీ ప్రభాకర్‌రావు, తహసీల్దార్, అర్బన్ మండలం -
జోగిపేటలో ఉద్రిక్తత
జోగిపేట - సంగారెడ్డి జాతీయ రహదారి పక్కన మార్కెట్ కమిటీ ముందు ఉన్న వడ్డెరుల గుడిసెల తొలగింపు ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం ఉదయం పోలీసు, రెవెన్యూ, మార్కెటింగ్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో గుడిసెల తొలగింపు జరిగింది. దీంతో నిరాశ్రయులైన 30 కుటుంబాలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. తమకు ప్రత్యామ్నయ స్థలం చూపించకుండా.. తమ గుడిసెలు కూల్చేశారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. వీరికి వేరొక చోట స్థలాలు చూపించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తహశీల్దార్ హామీ ఇచ్చారు. భారీ పోలీసు పహారా.. రెండు జేసీబీలు కార్యక్రమంలో పాల్గొనటంతో.. పెద్ద ఎత్తున రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. -
కూలిన ఆశలు
ఖమ్మం అర్బన్,న్యూస్‌లైన్: నిన్నటి వరకు పిల్లాపాపలతో కళకళలాడిన ఖమ్మం సమీపంలోని ఎన్నెస్పీ కాల్వ కట్ట పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి. పదేళ్లుగా తాము నివసిస్తున్న ఇళ్లను అధికారులు కూల్చివేయడంతో నిర్వాసితులు గుండెలవిసేలా విలపించారు. ఒకవైపు మహిళలు, పిల్లల రోదనలు, మరోవైపు అధికారుల హడావిడితో ఆ ప్రాంతంలో గురువారం కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చెప్పా పెట్టకుండా గుడిసెలు తొలగిస్తే ఉన్నట్టుండి తట్టాబుట్టా సర్దుకుని ఎక్కడికి వెళ్లాలంటూ గుడిసెవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాల పేరుతో ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు తొలగించడంతో పెట్టే బేడా సర్దుకుని ప్రత్యామ్నాయ స్థావరాలు వెతుక్కుంటూ బయటపడాల్సి వచ్చిందని విలపిస్తున్నారు. తమకు ముందుగా ఎక్కడైనా స్థలం కేటాయించి, ఆ తర్వాత తొలగిస్తే ఎలాంటి ఇబ్బందీ ఉండేది కాదంటున్నారు. పేదల కోసమే పని చేస్తున్నామని చెపుతున్న పాలకులు, అధికారులు ఇప్పుడు ఇలా చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్ల కోసం తమవద్దకు వచ్చే నాయకులు ఇప్పుడెక్కడికి వెళ్లారని ప్రశ్నిస్తున్నారు. కొందరు పెద్దల కోసం తమను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. బుధవారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేశారని, దీంతో పిల్లలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని వాపోయారు. తాము అడ్డుకున్నా తొలగింపులు ఆపరనే భయంతో ఇంట్లోని సామగ్రి, రేకులను కాపాడుకునేందుకు అన్నీ సర్దుకుని స్వచ్ఛందంగానే బయటకు వచ్చామన్నారు. పోలీసుల బందోబస్తు మధ్య తొలగింపు... భారీ పోలీసు బందోబస్తు.. రహదారుల దిగ్బంధం మధ్య రెండోరోజు గురువారం కూడా కూల్చివేతల పర్వం కొనసాగింది. ఖమ్మం ఆర్డీఓ సంజీవరెడ్డి, డీఎస్పీ బాలకిషన్ పర్యవేక్షణలో తొలగింపులు చేపట్టారు. ఒక్కో టీమ్‌కు ఒక సీఐ, ముగ్గురు ఎస్సైలు, 15 మంది సివిల్, 15 మంది ఏఆర్, ఆరుగురు మహిళా పోలీసులతో పాటు ఒక తహశీల్దార్, ఒక సర్వేయర్లతో 16 టీమ్‌లుగా ఏర్పడ్డారు. వీరి పర్యవేక్షణలో, జేసీబీల సహాయంతో మున్సిపల్ సిబ్బంది ఇళ్లు తొలగించారు. కూల్చివేతల సందర్భంగా ఎవరూ అక్కడికి రాకుండా ప్రధాన రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీసులతో పాటు వైరా, ఇల్లెందు, సత్తుపల్లి డీఎస్పీలు సాయిశ్రీ, క్రిష్ణ, అశోక్ పర్యవేక్షణలో మరో 250 మంది పురుష, 200 మంది మహిళా కానిస్టేబుళ్లు కూడా బందోబస్తు నిర్వహించారు. ఎనిమిది 108 వాహనాలు, రెండు ఫైర్ ఇంజన్లను సిద్ధంగా ఉంచారు. బుధవారం నుంచే కాల్వల పరిసర ప్రాంతాలలో 144 సెక్షన్ అమల్లోకి తీసుకొచ్చారు. కలెక్టర్, జేసీ, ఎస్పీ సూచనలతో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు గణేష్, నారాయణరెడ్డి, సమజ తొలగింపులను పర్యవేక్షించారు. ప్రార్థనా మందిరాలకు తాత్కాలిక మినహాయింపు... గుడిసెల కూల్చివేత ప్రాంతంలో ఉన్న దేవాలయాలు, మసీదులు, చర్చీలను తొలగించకుండా వాటికి తాత్కాలిక మినహాయింపు ఇచ్చారు. ఉన్నతాధికారుల సూచన మేరకు గుడిసెలన్నీ తొలగించిన తర్వాత వాటిపై నిర్ణయం తీసుకుంటామని ఆర్డీఓ సంజీవరెడ్డి తెలిపారు. కాగా, మొత్తం 1200 పైగా గుడిసెలు ఉన్నాయని, అందులో సగం మంది మాత్రమే అర్హులు ఉన్నారని, వారికి ప్రత్యామ్నాయంగా వేరే ప్రాంతాల్లో స్థలాలు ఇస్తామని చెప్పారు. ఇవి కాక కొందరు పెద్దలు నిర్మించిన భవనాలు సుమారు 50 వరకు ఉంటాయని, వాటిని కూడా తొలగిస్తామని తెలిపారు. ముందస్తుగా అదుపులోకి... కూల్చివేతలను అడ్డుకోకుండా పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సీపీఐ జిల్లా కార్యదర్శి భాగం హేమంతురావు, నాయకులు మౌలానా, సలాం, జానీమియా, ఏనుగు గాంధీ, మల్లేష్, రామకృష్ణ, కాంగ్రెస్ నాయకుడు పువ్వాడ అజయ్‌కుమార్ తో పాటు మొత్తం 27 మంది ఉన్నారు. గుడిసెవాసులతో పాటు నాయకులను కూడా టేకులపల్లిలోని మహిళా ప్రాంగణం, డైట్ కాలేజీ, సర్దార్ పటేల్ స్టేడియం, పాకబండలోని కమ్యూనిట్ హాల్లో ఏర్పాటు చేసిన స్థావరాలకు తరలించినట్లు ఆర్డీఓ తెలిపారు. ఇళ్లు కోల్పోయిన పేదలకు ఈ స్థావరాల్లోనే భోజన, వసతి సదుపాయాలు కల్పించామన్నారు. -
గుడిసెల తొలగింపుతో ఉద్రిక్తత
ఆదిలాబాద్ రూరల్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన గుడిసెల తొలగింపు ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. తహశీల్దార్‌పై స్థానికుల దాడి.. ఆపై నిందితుల అరెస్టు.. ఎమ్మెల్యే చర్చలు.. ఇలా క్షణక్షణం ఉత్కంఠ రేపింది. ఆదిలాబాద్ మండలం బట్టిసావర్గాం పంచాయతీ పరిధి శాస్త్రినగర్‌లో సర్వే నంబర్ 72లోని ప్రభుత్వ స్థలంలో కొందరు అక్రమంగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. ఈ గుడిసెల తొలగింపు ప్రక్రియకు అధికారులు శ్రీ కారం చుట్టారు. శనివారం ఉదయం 6 గంటల కు ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, తహశీల్దార్ సిడాం దత్తు, రెవెన్యూ సిబ్బంది శాస్త్రినగర్‌కు వెళ్లారు. జేసీబీ సాయంతో గుడిసెలు తొలగింపునకు య త్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ముందస్తు గా సమాచారం ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని వాగ్వాదానికి దిగారు. గతంలోనే స్థలం ఖాళీ చేయాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందన లేకపోవడంతోనే తొలగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అనంతరం జేసీబీల సాయంతో గుడిసెలు తొలగింపు ప్రారంభించారు. ఆగ్రహించిన కాలనీవాసులు అధికారులపై దాడికి దిగారు. తహశీల్దార్ దత్తుపై కర్రతో దాడిచేయడంతో ఆయనకు గాయూలయ్యూరుు. రంగంలోకి దిగిన పోలీసులు కాలనీవాసులను చెదరగొట్టారు. టూటౌన్ సీఐ నారాయణ, ఆదిలాబాద్ రూరల్, జైనథ్, తలమడుగు ఎస్సైలు సురేశ్, శ్రీనివాస్, శ్రీనివాస్, వంద మంది పోలీసుల బందోబస్తు మధ్య గుడిసెల తొలగింపు కొనసాగించారు. ఎమ్మెల్యే జోగు రామన్న సంఘటన స్థలానికి చేరుకుని ఆర్డీవో, తహశీల్దార్‌తో మాట్లాడారు. కాలనీవాసులు ఖాళీ చేసేందుకు గడువు ఇవ్వాలని, వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వరకు గుడిసెలు తొలగించొద్దని సూచించారు. స్పందించిన అధికారులు రెండు రోజుల గడువు ఇచ్చారు. ఈలోగా అక్రమంగా వేసిన గుడిసెలు ఖాళీ చేయూలని ఆదేశించారు. తహశీల్దార్‌పై దాడి చేసిన పలువురిని అరెస్టు చేసి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కేసులో వై.గౌరుబాయి, గౌర్ల సుభాష్, ఎస్కే.అమీద్, ఎస్కే.మహముద్ తుకారాంను రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ ఎస్సై జవాజీ సురేశ్ తెలిపారు. అంతకుముందు గుడిసెల తొలగింపును అడ్డుకునేందుకు వచ్చిన సీపీఐ జిల్లా నాయకుడు ముడుపు ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ నాయకుడు నారాయణను పోలీసులు అరెస్టు చేసి రూరల్ ఠాణాకు తరలించారు. అనంతరం వీరిని సొంత పూచికత్తుపై విడుదల చేశారు. వర్షంలో ఎటువెళ్లేది.. ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. గుడిసెలు తొలగించొద్దు. కూల్చితే పసిపిల్లలతో ఈ వానలో మేము ఎటు వెళ్లేది.’అంటూ కాలనీవాసులు అధికారుల ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. వర్షంలో తడుస్తూనే బోరున విలపించారు. ఎమ్మెల్యేతో తమ సమస్యలు ఏకరువు పెట్టారు. గుడిసెల తొలగింపుతో చిన్నారులు వర్షంలో అవస్థలు పడ్డారు. తహశీల్దార్‌కు పరామర్శ.. గాయాలపాలైన తహశీల్దార్ దత్తును మావల పంచాయతీ పరిధి రాంనగర్‌లోని ఆయన నివాసంలో పలువురు ఉద్యోగులు, గిరిజన సంఘాల నాయకులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆర్డీవో సుధాకర్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ అహ్మద్ బాబు దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. అధికారులపై దాడులకు పాల్పడడం సరికాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.