గూడు కూల్చి.. రోడ్డుకీడ్చి! | Revenue Officers who have Demolished the poor people huts in government land in Mahabubnagar | Sakshi
Sakshi News home page

గూడు కూల్చి.. రోడ్డుకీడ్చి!

Published Mon, Feb 5 2018 6:41 PM | Last Updated on Mon, Feb 5 2018 6:41 PM

Revenue Officers who have Demolished the poor people huts in government land in Mahabubnagar - Sakshi

క్రిష్టియన్‌ పల్లిలో గుడిసెను కూలుస్తున్న పోలీసులు, మున్సిపాలిటీ సిబ్బంది

మహబూబ్‌నగర్‌ రూరల్‌: వారంతా రెక్కాడితే డొక్కాడని నిరుపేదలు.. వారి స్థితిగతులను పరిశీలించి గత ప్రభుత్వం ఇళ్లు నిర్మించుకోవడానికి స్థలాలు కేటాయించింది. ఆ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకోవాలని ఆ పేదలంతా ఎంతో ఆశపడ్డారు. అయితే వారికి కేటాయించిన స్థలాన్ని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం కోసం అధికారులు కేటాయించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న లబ్ధిదారులు తమ స్థలాలు ఎక్కడ పోతాయోననే అభద్రతాభావంతో ఇటీవల గుడిసెలు వేసుకోవడంతో ఇళ్లుకుట్టుకుని స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. వాటిని మహబూబ్‌నగర్‌ మండల రెవెన్యూ అధికారులు ఆదివారం బలవంతంగా తొలగించారు..
 

1400 మందికి స్థలాల కేటాయింపు
2004లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మహబూబ్‌నగర్‌ పట్టణం క్రిష్టియన్‌పల్లి పంచాయతీ శివారులోని ఆదర్శనగర్‌లో 523 సర్వేనంబర్‌లో సుమారు 1400మంది నిరుపేదలకు ఇళ్లు నిర్మించుకోవడానికి  స్థలాలు కేటాయించింది. స్థలాలను పొందినవారిలో చాలామంది సొంతిళ్లు నిర్మించుకోలేదు. ఈ స్థలంలోనే డబుల్‌ బెడ్‌రూమ్‌ల కోసం ఇటీవల రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు ‘జీ’ ప్లస్‌– వన్‌ ఇళ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన కూడా చేశారు. తమకు కేటాయించిన స్థలాల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించొద్దని లబ్ధిదారులు మొదటినుంచీ వ్యతిరేకిస్తున్నారు. కానీ అధికారులు మాత్రం బలవంతంగా అక్కడినుంచి తొలగిస్తున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులు ఆదివారం పోలీసు బందోబస్తు మధ్య మున్సిపల్‌ సిబ్బంది చేత తొలగించారు. పట్టణంలో ఎన్నో ప్రభుత్వ భూములు ఒకపక్క కబ్జాకు గురవుతున్నా అధికారులు వాటినేమి పట్టించుకోకుండా నిరుపేదలపై ఉక్కుపాదం మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో అధికారులు ప్రవర్తించిన తీరుపై నిరుపేదలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిరుపేదలకు అండగా ఉంటామని కాంగ్రెస్, సీపీఎం నాయకులు ముందుకొచ్చారు. అధికారుల చర్యలను ఖండించారు.   

పోలీసులు దౌర్జన్యం చేసిండ్రు
కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మాకు ఇంటిస్థలాన్ని కేటాయించింది. ఆ స్థలంలో గుంతలు ఉంటే రూ.లక్షతో చదును చేసుకున్నాం. మాది నిరుపేద కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితిలో ముగ్గురు పిల్లలను పోషించడానికి ఇబ్బందిగా ఉన్నా నెలకు రూ.3500కు ఇంటిని అద్దె తీసుకుని జీవనం సాగిస్తున్నాం.  ఇప్పుడేమో డబుల్‌ బెడ్‌రూమ్‌ల పేరిట మాకు ఇచ్చిన స్థలాన్ని అధికారులు లాక్కుంటున్నారు. మాకు ఇచ్చిన స్థలంలో గుడిసె వేసుకుంటే పోలీసులు దౌర్జన్యంగా తొలగించారు.  – సంగీత, బాధితురాలు, క్రిష్టియన్‌పల్లి

అద్దె కట్టలేకపోతున్నాం..
మాకు సొంతిల్లు లేక నెలకు రూ.3వేలు చెల్లించి అద్దెఇంట్లో ఉంటున్నాం. ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో గుడిసైనా వేసుకుందామనుకుంటే అధికారులు బలవంతంగా ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు.  మాకు ఇచ్చిన స్థలానికి బదులు డబుల్‌ బెడ్‌రూం ఇల్లు ఇస్తే సంతోషిస్తాం. ఏదీ ఇవ్వకుండా స్థలాన్ని దౌర్జన్యంగా లాక్కుంటే ఎక్కడ ఉండాలి. ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూంల పేరిట మా లాంటి వారికి ఇచ్చిన స్థలాలను లాక్కోవడం సరికాదు. మాకు కచ్చితమైన హామీ ఇచ్చేంతవరకు స్థలాన్ని వదిలిపెట్టేది లేదు.  –పద్మ, బాధితురాలు, క్రిష్టియన్‌పల్లి

పేదలకు న్యాయం చేస్తాం
ఎవరినీ ఉద్దేశ పూర్వకంగా అన్యాయం చేయం. కాకపోతే వారికిచ్చిన ఇళ్ల స్థలాలను అమ్ముకున్నారని మా దృష్టికి వచ్చింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. నిరుపేదలు తమకు ఇచ్చిన పట్టా సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకుంటే వారికి తప్పకుండా న్యాయం చేస్తాం. ఇందులో నిరుపేదలు ఎవరి మాటలను పట్టించుకోకూడదు. రెచ్చగొట్టే ధోరణి మంచిది కాదు.  – ఎంవీ ప్రభాకర్‌రావు, తహసీల్దార్, అర్బన్‌ మండలం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement