గుడిసెల తొలగింపుతో ఉద్రిక్తత | Huts Removal Tension in Adilabad | Sakshi
Sakshi News home page

గుడిసెల తొలగింపుతో ఉద్రిక్తత

Published Sun, Sep 22 2013 4:00 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM

Huts Removal Tension in Adilabad

ఆదిలాబాద్ రూరల్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన గుడిసెల తొలగింపు ప్రక్రియ ఉద్రిక్తతకు దారితీసింది. తహశీల్దార్‌పై స్థానికుల దాడి.. ఆపై నిందితుల అరెస్టు.. ఎమ్మెల్యే చర్చలు.. ఇలా క్షణక్షణం ఉత్కంఠ రేపింది. ఆదిలాబాద్ మండలం బట్టిసావర్గాం పంచాయతీ పరిధి శాస్త్రినగర్‌లో సర్వే నంబర్ 72లోని ప్రభుత్వ స్థలంలో కొందరు అక్రమంగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. ఈ గుడిసెల తొలగింపు ప్రక్రియకు అధికారులు శ్రీ కారం చుట్టారు. శనివారం ఉదయం 6 గంటల కు ఆర్డీవో సుధాకర్‌రెడ్డి,  తహశీల్దార్ సిడాం దత్తు,  రెవెన్యూ సిబ్బంది శాస్త్రినగర్‌కు వెళ్లారు. జేసీబీ సాయంతో గుడిసెలు తొలగింపునకు య త్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ముందస్తు గా సమాచారం ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని వాగ్వాదానికి దిగారు. గతంలోనే స్థలం ఖాళీ చేయాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందన లేకపోవడంతోనే తొలగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అనంతరం జేసీబీల సాయంతో గుడిసెలు తొలగింపు ప్రారంభించారు. ఆగ్రహించిన కాలనీవాసులు అధికారులపై దాడికి దిగారు. తహశీల్దార్ దత్తుపై కర్రతో దాడిచేయడంతో ఆయనకు గాయూలయ్యూరుు.
 
 రంగంలోకి దిగిన పోలీసులు కాలనీవాసులను చెదరగొట్టారు. టూటౌన్ సీఐ నారాయణ, ఆదిలాబాద్ రూరల్, జైనథ్, తలమడుగు ఎస్సైలు సురేశ్, శ్రీనివాస్, శ్రీనివాస్, వంద మంది పోలీసుల బందోబస్తు మధ్య గుడిసెల తొలగింపు కొనసాగించారు. ఎమ్మెల్యే జోగు రామన్న సంఘటన స్థలానికి చేరుకుని ఆర్డీవో, తహశీల్దార్‌తో మాట్లాడారు. కాలనీవాసులు ఖాళీ చేసేందుకు గడువు ఇవ్వాలని, వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వరకు గుడిసెలు తొలగించొద్దని సూచించారు. స్పందించిన అధికారులు రెండు రోజుల గడువు ఇచ్చారు. ఈలోగా అక్రమంగా వేసిన గుడిసెలు ఖాళీ చేయూలని ఆదేశించారు. తహశీల్దార్‌పై దాడి చేసిన పలువురిని అరెస్టు చేసి రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ కేసులో వై.గౌరుబాయి, గౌర్ల సుభాష్, ఎస్‌కే.అమీద్, ఎస్‌కే.మహముద్ తుకారాంను రిమాండ్‌కు తరలించినట్లు రూరల్ ఎస్సై జవాజీ సురేశ్ తెలిపారు. అంతకుముందు గుడిసెల తొలగింపును అడ్డుకునేందుకు వచ్చిన సీపీఐ జిల్లా నాయకుడు ముడుపు ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ నాయకుడు నారాయణను పోలీసులు అరెస్టు చేసి రూరల్ ఠాణాకు తరలించారు. అనంతరం వీరిని సొంత పూచికత్తుపై విడుదల చేశారు.
 
 వర్షంలో ఎటువెళ్లేది..
 ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. గుడిసెలు తొలగించొద్దు. కూల్చితే పసిపిల్లలతో ఈ వానలో మేము ఎటు వెళ్లేది.’అంటూ కాలనీవాసులు అధికారుల ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నారు. వర్షంలో తడుస్తూనే బోరున విలపించారు. ఎమ్మెల్యేతో తమ సమస్యలు ఏకరువు పెట్టారు. గుడిసెల తొలగింపుతో చిన్నారులు వర్షంలో అవస్థలు పడ్డారు.
 
 తహశీల్దార్‌కు పరామర్శ..
 గాయాలపాలైన తహశీల్దార్ దత్తును మావల పంచాయతీ పరిధి రాంనగర్‌లోని ఆయన నివాసంలో పలువురు ఉద్యోగులు, గిరిజన సంఘాల నాయకులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని ఆర్డీవో సుధాకర్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ అహ్మద్ బాబు దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. అధికారులపై దాడులకు పాల్పడడం సరికాదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement