యాచారం: అక్రమార్కులు చెరపట్టిన ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు రెవెన్యూ యంత్రాంగం నడుం కట్టింది. ప్రభుత్వానికి చెందిన స్థలాలను గుర్తించి వాటిలో హద్దురాళ్లు పాతారు. ఇందులోని ఆక్రమణలను వెంటనే తొలగించుకోవాలని రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో సర్కారు స్థలాలను ఆక్రమించుకున్నవారి గుండె ల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
ఇన్నాళ్లూ మండలంలో సర్కారు స్థలాల వివరాలను రికార్డులకే పరిమితం చేసిన అప్పటి తహసీల్దార్‌లు ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు సమర్పించి కాలం వెళ్లదీశారు. నాటి అధికారుల అలసత్వం అక్రమార్కులకు వరంగా మారింది. హైదరాబాద్ మహా నగరానికి యాచారం చేరువలో ఉండటంతో ఇక్కడి భూముల ధరలు రూ. కోట్లలో పలుకుతున్నాయి. దీంతో అక్రమార్కులు ఏదో ఒక రాజకీయ పార్టీ అండతో తహసీల్దార్లపై ఒత్తిడి చేయించి ఆ భూములను తమ గుప్పట్లో పెట్టుకుని కాలం వెల్లదీశారు.
కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు తారమారవుతున్నాయి. రెవెన్యూ రికార్డుల్లో నమోదైన వివరాల ప్రకారం ప్రభుత్వ భూము లు ఎన్ని ఉన్నాయో.. వాటినన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్‌లకు తెలంగాణ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్థానిక తహసీల్దార్ వసంత కుమారి రెవెన్యూ రికార్డుల్లో ప్రకారం సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిని అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకోవడానికి ఉపక్రమించారు. 20 గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల ప్రకారం వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని హద్దులు పాతడానికి నిర్ణయించారు.
అక్రమార్కుల గుండెల్లో గుబులు
వారం రోజులుగా సర్వేయర్ నరహరి రాజు, గ్రామ రెవెన్యూ కార్యదర్శి కృష్ణ యాచారంలో ప్రభుత్వ భూమిని గుర్తిం చారు. సోమవారం తహసీల్దార్ వసంతకుమారి ఆ భూముల్లో హద్దులు పాతిం చారు. రాళ్లపై, చెట్లపై ‘ఇది ప్రభుత్వ భూమి’ అని రాయించారు. యాచారం తూర్పు దిశలో సర్వే నంబరు 242లో 1-29 ఎకరాలు, 225లో 3 ఎకరాలు, 452లో 10 గుంటల భూమికి హద్దులు పాతించారు.
మండల కేంద్రంలో ఉన్న ఈ భూమి దాదాపు రూ. 2 కోట్లకుపైగా విలువ ఉంటుంది. గతంలో అధికారుల రికార్డుల ప్రకారం ఇక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి. కానీ ఇవి ఆక్రమణకు గురయ్యాయి. రాజకీయ పక్షాల ఒత్తిళ్లతో వీటిని అధికారులు స్వాధీనం చేసుకోలేదు. ప్రస్తుతం ఈ భూముల్లో హద్దులు పాతడం, ప్రభుత్వ భూమిగా గుర్తించడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు పట్టుకొంది. ‘రికార్డుల్లో చూస్తే వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కానీ ఆ స్థలం వద్దకు వెళ్లి చూస్తే మాత్రం ఆక్రమణలు ఉన్నాయి. అందుకే రికార్డుల ప్రకారం సెంటు ప్రభుత్వ భూమినైనా వదిలే ప్రసక్తి లేదు. ప్రజావసరాలుంటే కలెక్టర్ అనుమతితో ఆ భూమిని కేటాయిస్తాం’ అని తహసీల్దార్ వసంతకుమారి పేర్కొన్నారు.
ఇదిగో ప్రభుత్వ భూమి!
Published Tue, Jan 6 2015 2:26 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement