Revenue Administration
-
తెరపైకి టీఏఎస్...
సాక్షి, హైదరాబాద్: ఇకపై రాష్ట్రంలో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు (టీఏఎస్) విధానం రాబోతోంది. దీని ద్వారా రాష్ట్ర పరిపాలన అధికారులను నియమించే కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. కొత్తగా రూపుదిద్దుకుంటున్న రెవెన్యూ చట్టంలో ఈ సర్వీసు విధి విధానాలను పొందుపరుస్తోంది. ప్రస్తుతం గ్రూప్–1 పరీక్ష విధానంతో ఎంపికవుతున్న డిప్యూటీ కలెక్టర్ పోస్టులను ఇకపై టీఏఎస్ ద్వారా భర్తీ చేస్తారు. అలాగే టీఏఎస్ ద్వారా ఎంపికైన వారికి నేరుగా రెవెన్యూ, వాణిజ్య పన్నులు, పోలీసు, ఎక్సైజ్, రవాణా శాఖల్లో పోస్టింగ్ ఇస్తారు. మహారాష్ట్ర రెవెన్యూ చట్టం తరహాలో... ప్రస్తుతం కర్ణాటక సహా వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఈ విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేసింది. వచ్చే శాసనసభ సమావేశాల తరువాత అమల్లోకి రానున్న కొత్త రెవెన్యూ చట్టం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. ఇది మహా రాష్ట్ర రెవెన్యూ చట్టం తరహాలో ఉంటుందని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు. రెవెన్యూ శాఖలో ఉన్న వీఆర్వోలను పంచాయతీరాజ్ శాఖలో, వీఆర్ఏలను నీటిపారుదల శాఖలో విలీనం చేయనున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం తహసీల్దార్లకు ఉన్న అధికారాల్లో కోతపెట్టనున్నారు. కొనుగోలు చేసిన లేదా వంశపారంపర్యంగా సంక్రమించిన భూముల మ్యుటేషన్‌ను సరళీకృతం చేస్తారు. సబ్ రిజిస్ట్రార్– తహసీల్దార్ కార్యాలయాలను అనుసంధానం చేస్తారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగియగానే ఆటోమేటిక్‌గా మ్యుటేషన్ జరిగిపోవడంతో పాటు పాసు పుస్తకాన్ని కూడా జారీ చేస్తారు. భూమి రిజిస్ట్రేషన్ తరువాత రోజులు, నెలల తరబడి మ్యుటేషన్ కోసం రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇకపై ఉండదు. రైతు పాసు పుస్తకాల్లోనూ మార్పులు తీసుకురానున్నారు. (బడికి పోయేదెట్లా..!) భూముల వర్గీకరణ... ఇకపై భూములను నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజావసరాలు, గ్రామ కంఠం భూములుగా ఉంటాయి. పాసు పుస్తకాల్లో సైతం భూమి కేటగిరీని పొందుపరుస్తారు. భూ వివాదాలు తలెత్తితే పరిష్కరించే బాధ్యత ఇకపై కలెక్టర్లు తీసుకుంటారు. రెవెన్యూ వ్యాజ్యాలను కలెక్టర్లు 40 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) అధికారాల్లో కూడా కోత పడనుంది. -
తహసీల్దార్ రిజిస్ట్రేషన్లు.. అంత ఈజీ కాదట!
సాక్షి, హైదరాబాద్ : రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించే ప్రతిపాదనపై భిన్నాభి ప్రాయం వ్యక్తమవుతోంది. అటు ప్రభుత్వ పెద్దలుగానీ, ఇటు ఉన్నతాధికారులుగానీ పైకి ఏమీ మాట్లాడకపోయినా ఈ ప్రతిపాదన సాధ్యాసాధ్యాలపై తీవ్రమైన తర్జనభర్జన జరుగుతోంది. కొత్త విధానం అమలు అంత సులువుకాదని, ప్రస్తుత విధానం కొనసాగింపే మేలన్న భావన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈనెల 8న జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అంతర్గతంగా ఇచ్చిన నివేదిక కీలకంగా మారింది. ఎమ్మార్వో కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవల అమలు సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఆ నివేదికలో పేర్కొన్న గణాంకాలు, సూచనలు ప్రభుత్వ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రస్తుత విధానాన్ని కొనసాగించడమే మంచిదని ఆ నివేదిక స్పష్టం చేసినట్లు తెలిసింది.నివేదికలోని ముఖ్యాంశాలివీ.. రోజుకు ఒకటి రెండు డాక్యుమెంట్లే! గతేడాది రాష్ట్రంలోని 567 గ్రామీణ మండలాల్లో వ్యవసాయ భూముల కేటగిరీలో 4,54,607 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. అందులో 373 మండలాల్లో సగటున రోజుకు మూడు అంతకన్నా తక్కువ సంఖ్యలో (260 మండలాల్లో రోజుకు రెండు.. ఇందులో 128 మండలాల్లో రోజుకో డాక్యుమెంట్ మాత్రమే) డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. మిగతా 194 మండలాలకుగాను 65 చోట్ల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అంటే సబ్రిజిస్ట్రార్లు లేని 129 మండలాల్లో మాత్రమే రోజుకు మూడు కన్నా ఎక్కువ లావాదేవీలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని మండల కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలు, మానవ వనరుల కల్పన అనవసరపు భారంగా మారుతుంది. ‘శిక్షణ’తో తలనొప్పి ప్రస్తుతం డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ల చట్టం–1908, స్టాంపుల చట్టం–1899 ప్రకారం రిజిస్టర్ అవుతున్నాయి. ఇప్పుడు ఎమ్మార్వో కార్యాలయాల్లో రిజిస్టర్ చేయాలంటే.. ఎమ్మార్వోలకు ఈ చట్టాలు, నియమ నిబంధనలు, స్టాండింగ్ ఆర్డర్ల గురించి శిక్షణ ఇవ్వాలి. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రస్తుతం అమలు చేస్తున్న ‘కార్డ్ (కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్)’ వ్యవస్థపై కూడా 443 మంది ఎమ్మార్వోలకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్లున్న మండలాల్లో పనిచేస్తున్న ఎమ్మార్వోలకు వీటి గురించి అవగాహన ఉండదు. వారు తర్వాత సబ్రిజిస్ట్రార్లు లేని మండలాలకు బదిలీ అయితే శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది. బోలెడు సిబ్బంది అవసరం ప్రతి సబ్‌రిజిస్ట్రార్‌కు ఒక సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు సబార్డినేట్లు, క్లర్కులు కావాలి. మార్కెట్ విలువ సర్టిఫికెట్ల జారీ, చెక్స్లిప్ల తయారీ, డాక్యుమెంట్ల స్కానింగ్, చలానాలు, ఈసీల తయారీ, బయోమెట్రిక్ వివరాల సేకరణ, వెబ్‌ల్యాండ్‌ను పోల్చడం, పాస్ పుస్తకాల పరిశీలన, రికార్డుల మెయింటెనెన్స్, స్టాంపుల అమ్మకాల వంటి బాధ్యతలు ఉంటాయి. ఈ మేరకు పోస్టులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ‘నెట్వర్క్’ ఎలా..? రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ‘కార్డ్ (కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్)’ వ్యవస్థ ఆధారంగా డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఎమ్మార్వో కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయాలంటే ఆ మేరకు కంప్యూటర్లు, ఇంటర్నెట్ నెట్వర్క్ అనుసంధానం అవసరం. రాష్ట్రంలోని భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతమున్న 141 సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు నెట్‌వర్క్‌ను నిర్వహించడమే గగనంగా ఉంది మారుమూల ప్రాంతాల్లోని 584 ఎమ్మార్వో కార్యాలయాలకు నెట్వర్క్ అందించడం చాలా కష్టం. సబ్రిజిస్ట్రార్ల పరిధితో తిప్పలు ప్రస్తుతం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలు మండలాల ప్రాతిపదికన లేవు. కొన్ని మండలాల్లో సగం గ్రామాలు ఓ సబ్‌రిజిస్ట్రార్, మరిన్ని గ్రామాలు మరో సబ్‌రిజిస్ట్రార్ పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు ఎమ్మార్వో కార్యాలయాల వారీగా విధానం అమలుతో.. పలు సబ్రిజిస్ట్రార్ల కార్యాలయాల పరిధిని మార్చాల్సి ఉంటుంది. పర్యవేక్షణకు ఇబ్బందులు ఇప్పుడున్న వ్యవస్థ ప్రకారం సబ్రిజిస్ట్రార్లు జిల్లా రిజిస్ట్రార్లకు, వారు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌కు బాధ్యులుగా ఉంటారు. ఎమ్మార్వోలు నేరుగా కలెక్టర్లకు బాధ్యులుగా ఉంటారు. ఇప్పుడు సబ్‌రిజిస్ట్రార్లతోపాటు ఎమ్మార్వోలు రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తే.. వారు ఎవరికి బాధ్యులుగా ఉండాలన్న సందేహం తలెత్తుతోంది. దీనితో ఇరు శాఖల సమన్వయంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశముంది. ఎమ్మార్వోలు అందుబాటులో లేకుంటే..? ఎమ్మార్వోల వ్యవస్థ అత్యంత క్రియాశీలంగా ఉంటుంది. వారు వారంలో మూడు రోజుల పాటు తమ పరిధిలో క్షేత్రస్థాయి పరిశీలనలతోపాటు వ్యవసాయం, సాగునీరు, ప్రోటోకాల్ లాంటి విధులకు హాజరుకావాల్సి ఉంటుంది. ‘క్రాస్ చెకింగ్’కు ఇబ్బందే ప్రస్తుతం భూముల మార్కెట్ విలువలను సబ్రిజిస్ట్రార్లు కన్వీనర్లుగా ఉన్న కమిటీ నిర్ధారిస్తుంది. అందులో ఎమ్మార్వో సభ్యుడిగా ఉంటారు. ఇప్పుడు ఈ రెండూ ఎమ్మార్వోనే చేయాల్సి వస్తుంది. ఇక నిషేధిత భూముల జాబితాలను ఎమ్మార్వోలే సబ్రిజిస్ట్రార్లకు ఇస్తారు. సబ్ రిజిస్ట్రార్లు వాటిని పరిశీలించి రిజిస్ట్రేషన్ల సమయంలో క్రాస్ చెకింగ్ చేస్తారు. కొత్త విధానంతో రెండు పనులూ ఎమ్మార్వోనే చేయాల్సి వస్తే క్రాస్ చెకింగ్‌కు అవకాశం లేకుండా పోతుంది. ఏటా తప్పని ఖర్చు రెవెన్యూ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందించాలంటే ఏర్పాట్ల కోసం ఒక్కో మండలంలో రూ.10 లక్షల వరకు అవసరం. ఈ లెక్కన రూ.44.3 కోట్లు ఖర్చవుతాయి. తర్వాత నిర్వహణ కోసం కూడా ఏటా రూ.5 కోట్ల వరకు అదనంగా ఖర్చవుతుంది. ఇది అనవసరపు భారంగా పరిణమిస్తుంది. ఈ యోచన సమంజసం కాదు! కొత్త పాస్ పుస్తకాలు రైతులకు ఇబ్బంది లేకుండా సకాలంలో అందించాలంటే.. రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖలను ఎలక్ట్రానిక్ అనుసంధానం చేస్తే సరిపోతుంది. ప్రభుత్వం అప్పటికీ చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ల చట్టానికి అనుగుణంగా ప్రతి మండలానికి, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు నోటిఫికేషన్లు జారీ చేయాలి. -
అధికారి.. అడ్డదారి
⇒ బినామీ పేర్లతో భూకబ్జాకు పాల్పడుతున్న రెవెన్యూ యంత్రాంగం ⇒ ఇటీవల పుల్లంపేటలో బయటపడిన వ్యవహారమే నిదర్శనం ⇒ మరి కొన్నిచోట్ల భూఆక్రమణల్లో వీఆర్వోలు, ఇతర అధికారులు ⇒ వివాదాస్పదమవుతున్న ఆక్రమణల వ్యవహారం ⇒ పలుచోట్ల భూములు, స్థలాలు లాగేసుకుంటున్న తమ్ముళ్లు ⇒ ఉన్నతాధికారులు కొరడా ఝుళిపిస్తేనే ఫలితం సాక్షి, కడప/ పుల్లంపేట: ప్రజల ఆస్తులకు, భూములకు రక్షణ లేకుండా పోతోంది. ఒకపక్క తెలుగుదేశం పార్టీ నాయకులు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని భూకబ్జాలకు పా ల్పడుతుండగా, వారికి తామేమీ తక్కువ కాదన్నట్లు జిల్లాలో పనిచేస్తున్న కొంతమంది రెవెన్యూ అధికారులు ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఏకంగా కొంతమంది అధికారులు బినామీ పేర్లతో భూములను పోగుచేసుకోవడం వివాదాస్పదమవుతోంది. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఇలాంటి వ్యవహారాలు అక్కడక్కడా వెలుగుచూస్తున్నా ఉన్నతాధికారులు కొరఢా ఝళిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. బినామీల పేరుతో అక్రమణలు జిల్లాలో ఒకప్పుడు ఎక్కడచూసినా బంజరు భూమి కనిపించేది. పెరిగిపోయిన ప్రజావసరాల దృష్ట్యా రానురాను భూమి తరిగిపోయింది. అయితే ఇదే అదునుగా కొంతమంది అక్రమాలకు తెరలేపారు. బినామీలుగా బంధువులను, అనుకూలమైన వారిని ఎంపిక చేసుకుని ఏదో ఒకచోట పాగా వేస్తున్నారు. ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపి ఇలా చేస్తుండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పుల్లంపేట, పోరుమామిళ్ల, కాశినాయన, మైలవరం ఇలా అనేకచోట్ల రెవెన్యూ యంత్రాంగం అందినకాడికి ఆక్రమించుకునే పనిలో పడినట్లు ఆ శాఖలోనే చర్చ జరుగుతోంది. ఆన్లైన్ పేరుతో దోపిడీ జిల్లాలో విలువైన భూములున్న ప్రాంతాల్లో తహసీల్దార్లు ఆన్లైన్ దోపిడీకి తెరలేపుతున్నారు. ఎంతోకొంత ముట్టజెప్పందే భూములను ఆన్లైన్లో ఎక్కించడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బద్వేలు నియోజకవర్గంతోపాటు కమలాపురం, రాయచోటి, మైదుకూరు నియోజకవర్గాల్లో ఎక్కువగా ఆన్లైన్ పేరుతో దోపిడీ వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏది ఏమైనా ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే తప్ప అనేక అంశాలు బయటపడవు. కొత్తగా వచ్చిన డీఆర్వోనైనా ఆక్రమణలు, భూకబ్జాలాంటి వ్యవహారాలపై ప్రత్యేక పరిశీలన జరిపితే కొత్త కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
పక్కాగా బీసీల కల్యాణలక్ష్మి: రామన్న
దరఖాస్తుల రిజిస్ట్రేషన్ కోసం వెబ్సైట్ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: బీసీ, ఈబీసీల కల్యాణలక్ష్మి పథకాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఈ పథకం ద్వారా ఈ ఏడాది రూ.300 కోట్లతో 58,820 మందికి ప్రయోజనం చేకూర్చనున్నట్లు పేర్కొన్నారు. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తుల పరిశీలన, ఇతరత్రా సమాచారాన్ని రెవెన్యూ యంత్రాంగం ద్వారా సరిచూడనున్నట్లు చెప్పారు. శుక్రవారం సచివాలయంలో బీసీల కల్యాణలక్ష్మి వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆన్లైన్లో http://epasswebsite.cgg.gov వెబ్సైట్ ద్వారా ఆయాపత్రాలను జత చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. గత నెల 1వ(ఏప్రిల్) తేదీ తర్వాత వివాహం చేసుకున్నవారు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులను తెలిపారు. రాష్ట్రానికి చెందిన 32 బీసీ కులాలను జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరుతూ గత అక్టోబర్‌లోనే బీసీ కమిషన్‌కు లేఖ రాశామని, ఈ విషయమై మరోసారి లేఖ రాస్తామని మంత్రి చెప్పారు. అనంతరం మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల లోగోను మంత్రి ఆవిష్కరించారు. -
రెవెన్యూలో స్థానిక అలజడి
♦ పనిచేసే చోట ఉండకపోతే ఇంటికే ♦ హెడ్‌క్వార్టర్‌లో లేకుంటే హెచ్ఆర్ఏ కట్ ♦ తాజాగా మరో సర్క్యులర్ జారీ ♦ పద్ధతి మార్చుకోకపోతే చర్యలు ♦ ఉద్యోగవర్గాల్లో కలవరం రెవెన్యూ యంత్రాంగాన్ని ‘స్థానిక నివాసం’ అంశం వణుకు పుట్టిస్తోంది. పనిచేసే కేంద్రంలో నివాసం ఉండాలనే నిబంధన కలవరపరుస్తోంది. సర్వీసు నియమావళి ప్రకారం స్థానికంగా ఉండాలనే నిబంధనను కచ్చితంగా పాటించాల్సిందేనని తాజాగా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అనూహ్య పరిణామంతో హైద రాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తున్న ఉద్యోగవర్గాల్లో ఆందోళన మొదలైంది. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మూడో వంతు మంది జంటనగరాల నుంచే వచ్చి వెళ్తున్నారు. దాదాపు ప్రతిశాఖలోనూ ఇదే తంతు కొనసాగుండడంతో ‘హెడ్‌క్వార్టర్ ’లో తప్పనిసరిగా ఉండాలనే ఆంక్షలు అమలు కావడంలేదు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి హెడ్‌క్వార్టర్‌లో ఉండాల్సిందే ఎక్కడ పనిచేసే వారు అక్కడే ఉండాలి. హెడ్‌క్వార్టర్‌లో నివసించని ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఈ అంశంపై ఇప్పటికే ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేశాం. పౌర సేవలు అందించడంలో కీలకంగా వ్యవహరించే వీఆర్ఓలు కూడా తమ పరిధిలోని గ్రామాల్లోనే ఉండాలి. - ఆమ్రపాలి, జేసీ2 గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్ఓ) త మ క్లస్టర్ పరిధిలోని ఒక గ్రామాన్ని తమ నివాస కేంద్రంగా ప్రకటించాలి. ఈ సమాచారాన్ని తహసీల్దార్లకు అందించాలి. తహసీల్దార్ మొదలు ఆఫీస్ సబార్డినేట్ వరకు తమ నివాసానికి సంబంధించిన ల్యాండ్‌లైన్, మొబైల్ బిల్లులను పై అధికారులకు సమర్పించాలి. నివాస ధ్రువీకరణపత్రం పొందుపరచాలి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రెవెన్యూ యంత్రాంగం స్థానికంగా ఉండకపోవడంతో పౌరసేవలు సరిగా అందడంలేదని గుర్తించిన భూ పరిపాలనా ప్రధాన కమిషనర్(సీసీఎల్ఏ) రేమాండ్ పీటర్ స్థానికంగా ఉండాలనే నిబంధనను తూ.చ.తప్పకుండా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. నిబంధనలను పాటించని సిబ్బందికి తాఖీదులు ఇవ్వాలని, తీరు మార్చుకోకపోతే హెచ్ఆర్ఏలో కోత పెట్టాలని స్పష్టం చేశారు. అప్పటికీ ప్రవర్తన మారకపోతే సస్పెన్షన్ వేటు వేయాలని తేల్చిచెప్పారు. తహసీల్ కార్యాలయాల ఉద్యోగులేకాకుండా.. వీఆర్ఓలకు కూడా ఈ నిబంధనను వర్తింపజేయాలని ఆదేశించారు. అవినీతిని రూపుమాపాలంటే వీఆర్ఓలు కూడా స్థానికంగా ఉండాలని, వారికి కార్యాలయాలను కూడా ఏర్పాటు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించినందున.. వీఆర్ఓలు కూడా స్థానికంగా ఉండాల్సిందేనని ఉత్తర్వులిచ్చారు. రాజధాని నుంచే రాకపోకలు రెవెన్యూ ఉద్యోగులు విధిగా హెడ్‌క్వార్టర్‌లో ఉండాలని నిర్దేశిస్తూ జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు వారం రోజుల క్రితం సర్క్యులర్ ఇచ్చారు. అయినప్పటికీ అధికశాతం ఉద్యోగులు ఇంకా హైదరాబాద్ నుంచే రాకపోకలు సాగిస్తున్నట్లు అంతర్గత పరిశీలనలో తేలింది. 37 మంది తహసీల్దార్లలో కేవలం నలుగురు మాత్రమే స్థానికంగా ఉంటున్నారని స్పష్టమైంది. అలాగే వివిధ తహసీళ్లలో పనిచేసే 111 జూనియర్ అసిసెంట్లు, 60 మంది ఆర్ఐ, సీనియర్ అసిసెంట్లు, 55 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 434 మంది వీఆర్ఓలు పనిచేసే చోట నివసించడం లేదని వె ల్లడైంది. ఆఖరికి ఆఫీస్ సబార్డినేట్లు కూడా మండల కేంద్రాల్లో ఉండడంలేదని తేలింది. ఈ క్రమంలో స్థానికంగా ఉండని అధికారులపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో.. మరోసారి స్థానికతను గుర్తు చేయాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా బుధవారం తహసీల్దార్లకు మరో సర్క్యులర్ జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే సస్పెన్షన్ వేటు వేస్తామని హెచ్చరించింది. వాస్తవానికి రాజధాని చుట్టూ ఉన్న రంగారెడ్డి జిల్లాలో పనిచేసే ఉద్యోగులు పిల్లల విద్యాభ్యాసం నిమిత్తం హైదరాబాద్ కేంద్రంగా విధులు నిర్వర్తిస్తారు. ప్రభుత్వ మార్గదర్శకాలు అమలుచేయడం జిల్లాలో ఆచరణసాధ్యం కాదని ఉన్నతాధికారులు సైతం అంగీకరిస్తున్నారు. జిల్లాకే హెడ్క్వార్టర్లేనప్పుడు మమ్ముల్ని పనిచేసే కేంద్రంలోనే ఉండమనడం ఎంతవరకు సమంజసమని వాదిస్తున్నారు. మరోవైపు పంచాయతీరాజ్, విద్య, సంక్షేమశాఖలకు వర్తింపజేయని హెడ్‌క్వార్టర్ నిబంధనలు తమపై రుద్దడమేమిటనీ రెవెన్యూ వర్గాలు మండిపడుతున్నాయి. అన్ని శాఖలకు ఈ నియమావళి అమలు చేస్తే బాగుంటుంది తప్ప.. తమకే వర్తింపజేయడం సరికాదని, దీనిపై ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి. -
రెవెన్యూలో టెన్షన్... టెన్షన్
సాక్షి, విశాఖపట్నం : రెవెన్యూలో బదిలీ లకు రంగం సిద్ధమవడంతో యంత్రాం గంలో గుబులు మొద లైంది. జీవో నెం-68 ప్రకారం బదిలీలుచేయాలని చెప్పడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ పరిపాలనా సౌలభ్యం పేరిట ఎవరినైనా కదిపే అవకాశముండడంతో ప్రతీఒక్కరిలో టెన్షన్ మొదలైంది. మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి బదిలీ చేయాలంటూ గతంలో జీవో-57 జారీ చేశారు. ఈ జీవో ప్రకారం జిల్లాలో 659 మందికి బదిలీలకు అర్హులని లెక్కతేల్చారు. వీరిలో 470 మంది వీఆర్వోలకు కౌన్సెలింగ్ కూడా పూర్తి చేశారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిని మాత్రమే స్థానచలనం కల్పించాలని జారీ చేసిన మార్గ దర్శకాలు మేరకు రెవెన్యూయేతర శాఖల్లో బదిలీలు జరిగాయి. ఆ తర్వాత జీవో నెం. 68ప్రకారం ప్రస్తుత రెవెన్యూ శాఖలో బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలివ్వడం గందరగోళానికి దారితీసింది. ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారిని బదిలీచేయాలా? మూడేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారిరి కదపాలా లేక జీవో నెం.68 ప్రకారం 20 శాతానికి మించి బదిలీలు చేయకూడదో తెలియని మీమాంసలో రెవెన్యూ అధికారులు కొట్టుమిట్టాడు తున్నారు. 15వ తేదీకల్లా బదిలీ ప్రక్రియను పూర్తిచేయాలంటూ మూడో తేదీన జీవో జారీ చేసిన సర్కార్ ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను మాత్రం ఇవ్వలేదు. దీంతో రెవెన్యూ యంత్రాంగంలో ఒకింత సందిగ్ధత కొనసాగుతోంది. పైరవీలు ప్రారంభం: మరోపక్క బదిలీలయ్యే వారే కాకుండా, కోరుకున్న పోస్టింగ్ కోసం కూడా రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ల నుంచి తహశీల్దార్ల వరకు పైరవీలు సాగిస్తున్నారు. ఇప్పటికే పరిపాలనా సౌలభ్యం పేరిట పన్నెండు మంది తహశీల్దార్లకు స్థాన చలనం కల్పించారు. తాజాగా బదిలీల ఉత్తర్వుల నేపథ్యంలో మరికొంత మంది తహశీల్దార్లతో పాటు డిప్యూటీ తహశీల్దార్లకు కూడా స్థానచలనం తప్పదని తెలుస్తోంది. తహశీల్దార్ స్థాయి అధికారులే కాదు ఇతర మినిస్టీరియల్ సిబ్బంది కూడా సొంత ప్రాంతాలు, కోరుకున్న పోస్టింగ్‌ల కోసం పైరవీలు సాగిస్తున్నారు. విశాఖ నగర పరిసర మండలాల్లో తహశీల్దార్లతో పాటు ఇతర కీలక పోస్టుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే వీరంతా మంత్రు లు, ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణ లు చేస్తున్నారు. దీంతో వీరు ఇచ్చే సిఫార్సు లేఖలకు యమ గిరాకీ ఏర్పడింది. ఒకటి రెండ్రోజుల్లో మార్గదర్శకాలు విడుదలైతే బదిలీలపై క్లారిటీ వస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. -
ప్రభుత్వ భూమిలో ప్లాట్ల దందా
♦ అక్రమార్కులతో కుమ్మక్కైన ఓ ప్రజాప్రతినిధి? ♦ పక్షం రోజులుగా సాగుతున్న పనులు బెల్లంపల్లి : బెల్లంపల్లి మునిసిపాలిటీ శివార్లలోని విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు రంగం సిద్ధమైంది. కొందరు వ్యాపారులు ఈ పనికి పాల్పడుతూ ఓ ప్రజాప్రతినిధిని తమతో కలుపుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. బెల్లంపల్లి శివారులోని బుధాకలాన్ గ్రామ సర్వే నంబర్ 170లో ఉన్న తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, కళాశాల వెనకాల ఉన్న విలువైన ఖాళీ భూమిని ఆక్రమించేందుకు యత్నాలు జరుగుతున్నాయి. ఈ భూమిని ఇప్పటికే కొందరు నిరుపేదలకు ఇందిరమ్మ పథకం కింద కేటాయించగా పలువురు ఇళ్లు నిర్మించుకున్నారు. అలాగే, మరోపక్క గురి జాలకు వెళ్లే ప్రధాన రహదారిని ఆనుకుని ఐటీడీఏ ఆధ్వర్యంలో యూత్ ట్రైనింగ్ సెంటర్ నిర్మించారు. దీని పక్కనే తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులు సాగుతుండగా, ఇంకోపక్క ఏఆర్ పోలీసు హెడ్‌క్వార్టర్స్ ఉన్నాయి. ఇలా ప్రభు త్వ కార్యాలయాల నడుమ ఉన్న విలువైన ఖాళీ స్థలాన్ని ఆక్రమించేందుకు కబ్జాదారులు సిద్ధం కాగా.. పక్షం రోజులుగా ట్రాక్టర్లతో భూమి చదును చేయిస్తున్నాయి. అంతేకాకుండా గుంటన్నర చొప్పున ప్లాట్లు వేసి రూ. 20వేల చొప్పున వసూలు చేసి విక్రయాలకు తెర లేపినట్లు తెలుస్తోంది. మంజూరు కాకముందే ఆక్రమణ? బెల్లంపల్లిలోని ఓ సామాజికవర్గం ఇళ్ల స్థలాల కోసం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు తెలిసింది. అయితే, ఈ విషయంలో కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయినప్పటికీ ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి ఆధ్వర్యంలో దరఖాస్తు చేసుకున్న సదరు సామాజికవర్గం నాయకులు ఎలాగూ మంజూరు చేస్తారనే ధీమాతో ప్రస్తుతం ఆక్రమణకు గురైన సర్వే నం.170లోని మి గతా ఖాళీ భూమిని కబ్జా చేశారు. ఆ భూమి చుట్టూరా ఫెన్సింగ్ కూడా వేశారు. అంతేకాకుండా 40మంది కుల స్తులకు ప్లాట్లు కేటాయించి కందకాలు తవ్వడం గమ నార్హం. ఇది పోను పునాది నిర్మాణానికి ఇసుక, బండరాయి తెప్పించడం గమనార్హం. ఈ విషయమై రెవెన్యూ యంత్రాంగం మేల్కొని ప్రభుత్వ భూమి ఆక్రమణలను అడ్డుకోవాలని పలువురు కోరుతున్నారు. స్థలం మంజూరు కాలేదు ఇళ్ల స్థలాల మంజూరు కోసం ఓ సామాజిక వర్గం నాయకులు కలెక్టర్‌కు వినతిపత్రం పంపించారు. అయితే, కలెక్టర్ నుంచి ఉత్తర్వులు రాకముందే భూమి ఆక్రమించుకున్నారు. ఆ స్థలంలో నిర్మాణాలు చేయకుండా చర్యలు తీసుకుంటాం. ఈ మేరకు రెవెన్యూ సిబ్బందిని అక్కడికి పంపించి పనులు నిలుపుదల చేయిస్తాం. - కె.శ్యామలదేవి, తహశీల్దార్, బెల్లంపల్లి -
‘ఫిల్టర్’ మాఫియా!
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు, కృత్రిమ ఇసుక తయారీ - శామీర్‌పేట్ మండలంలో తిష్టవేసిన ఇసుక దొంగలు - నిత్యం వందలాది లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలింపు - సహజ సంపదను దోచుకుంటున్న బడాబాబులు - చూసీచూడనట్లుగా రెవెన్యూ యంత్రాంగం తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత.. దోచుకున్నోళ్లకు దోచుకున్నంత. కృత్రిమ ఇసుక తయారీకి.. మట్టి తవ్వకాల అక్రమార్కులకు శామీర్‌పేట్ మండలం అడ్డాగా మారింది. వారికి అధికారులే అండగా ఉండడంతో ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా మారింది. వీరి వ్యాపారం మూడు ట్రాక్టర్లు, ఆరు లారీలుగా వర్ధిల్లుతోంది. ఫిల్టర్ ఇసుక, మట్టిని అక్రమంగా తరలించే వాహనాలకు జరిమానాలు కలెక్టర్ కార్యాలయం నుంచే విధిస్తారని.. ఈ విషయంలో తమకేమీ తెలియదని చెబుతుండడమే ఈ వ్యవహారంలో అధికారుల పాత్ర ఏమిటో చెప్పకనే చెబుతోంది. ఇప్పటివరకు ఎన్ని వాహనాలు సీజ్ చేశారు. ఎంత మొత్తం జరిమానాల రూపంలో ఆదాయం వచ్చింది. ఎంత మందిపై కేసులు నమోదు చేశారు అనే వివరాలు రెవెన్యూ కార్యాలయంలో లేవనే సమాధానమే వారి నుంచి వస్తోందంటే.. అక్రమాల పుట్ట ఎంతగా పెరిగి విస్తరించిందో ఇట్టే అవగతమవుతోంది. శామీర్‌పేట్/కీసర/మేడ్చల్ : శామీర్‌పేట్ మండలంలోని ఉద్దమర్రి, శామీర్‌పేట్ పెద్ద చెరువు, మూడుచింతలపల్లి, లక్ష్మాపూర్, ఆద్రాస్‌పల్లి, కేశవరం, ఎల్లగూడ, ఉషార్‌పల్లి, నారాయణపూర్, అనంతారం, అలియాబాద్ తదితర గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ భూములనే తేడా లేకుండా మట్టి తవ్వకాలు, కృత్రిమ ఇసుక తయారీ జోరుగా కొనసాగుతున్నాయి. రాత్రి వేళల్లో వందల సంఖ్యలో లారీల్లో మట్టి, కృత్రిమ ఇసుక తర లిస్తున్నారు. ప్రధానంగా ఉద్దమర్రి అలియాబాద్ శామీర్‌పేట్ పెద్ద చెరువు, ఎల్లగూడెం తదితర గ్రామాల నుంచి వందల సంఖ్యల్లో లారీలు రాజీవ్ రహదారి గుండా, ఉద్దమర్రి నుంచి కీసర మీదుగా వీటి రవాణా కొనసాగుతోంది. అధికారులు మాత్రం తూతూమంత్రంగానే దాడులు చేస్తున్నారు. నామమాత్రంగా జరిమానాలు విధిస్తున్నారు. మట్టి అక్రమ తవ్వకాలపై నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ సెలవు దినాల్లో మట్టి వ్యాపారులకు పండగనే. అక్రమ సంపాదనకు అలవాటు పడిన వ్యాపారులు కాసుల కక్కుర్తితో చెరువులు, కుంటల్లో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. వాటి రూపురేఖలనే మార్చివేస్తున్నారు. రాత్రింబవళ్లూ కృత్రిమ ఇసుక తయారీ చేస్తున్నారు. చెరువులు, కుంటల్లో భారీ గుంతలు ఏర్పడటంతో అమాయకులు వాటిలో పడి మృతిచెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. ప్రజలు ప్రాణాలకు ముప్పుతెస్తున్న అక్రమ మట్టి, ఇసుక తవ్వకాలపై అధికారులు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీడులుగా పచ్చని పొలాలు.. అక్రమార్కుల మట్టి తవ్వకాలతో పచ్చని పంట పొలాలు బీడులుగా మారుతున్నాయి. డబ్బు ఆశ చూపుతూ వ్యవసాయ భూముల్లో మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. పట్టా భూముల్లో సైతం వాస్తు దోషం ఉందని నేల మట్టం చేయాల్సిన అవసరం ఉందని, పక్క భూములకన్నా ఎత్తు, లోతు ఉందని రకరకాల కారణాలతో అమాయకులకు డబ్బుల ఎర చూపిస్తున్నారు. మట్టి తవ్వి తీసుకెళ్తున్నారు. ఎకరానికి లక్షల్లో చెల్లించి పట్టా భూముల్లో సైతం మట్టి, ఇసుక దందా కొనసాగిస్తున్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం ఈ అక్రమ తవ్వకాలపై ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిత్యం వందలాది లారీల్లో.. కృత్రిమ ఇసుకను రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 4గంటల వరకు లారీల్లో తరలిస్తున్నారు. ఉద్దమర్రి మీదుగా బొమ్మలరామారం, అంకిరెడ్డిపల్లి, కీసర కుషాయిగూడ ప్రాంతాల మీదుగా నగరానికి ఇవి చేరుకుంటున్నాయి. మరోవైపు జమీలాల్పేట్ బర్షిగూడెం, బోగారం, కొండాపూర్, ఘట్కేసర్ మీదుగా, ఉప్పల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాలకు చేరుతున్నాయి. రాత్రి వేళల్లో అక్రమంగా తరలించే క్రమం లో వేగంగా వెళ్తున్న లారీలతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయిని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గస్తీ నిర్వహించే పోలీసులు లారీలను పట్టుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారనే విమర్శలున్నాయి. లారీ యజమానులు పోలీసులకు అమ్యామ్యాలు ఇస్తూ తమ పని కానిచ్చేస్తున్నారు. మేడ్చల్ మండలంలోని రావల్కోల్, సోమారం, రాజబొల్లారం, ఘన్పూర్, బండమాదారం, శ్రీరంగవరం గ్రామాల్లో ఫిల్టర్ ఇసుక తయారు చేస్తున్నారు. మేడ్చల్ అడ్డాపై విక్రయించడంతో పాటు నగరానికి లారీల్లో తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నారెవెన్యూ అధికారులు కంటితుడుపు చర్యలకే పరిమితమవుతున్నారు. అక్రమార్కులపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. రెవెన్యూ యంత్రాంగం మామూళ్ల యావలో పడి చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండటంతోనే ఈ అక్రమ దందా యథేచ్ఛగా కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ తవ్వకాలు వాస్తవమే.. మండలంలో మట్టి కృత్రిమ ఇసుక స్థావరాలపై దాడులు చేస్తున్నాం. కేసులు నమోదు చేస్తున్నాం. మట్టి, కృత్రిమ ఇసుక తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. గ్రామాల్లో ప్రత్యేక నిఘాతో వాహనాలను సీజ్ చేశాం. వాటి యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేశాం. మండలంలో మట్టి అక్రమ తవ్వకాలు వాస్తవమే. - దేవుజా, శామీర్‌పేట్ తహసీల్దార్ కీసర మీదుగా నగరానికి ఫిల్టర్ ఇసుక రవాణా.. ఇసుక వ్యాపారులు నల్గొండ జిల్లా పరిధిలోని వివిధ గ్రామాల్లో ఫిల్టర్ ఇసుక కేంద్రాలను నెలకొల్పి దందాను కొనసాగిస్తున్నారు. ఆ జిల్లాలోని బొమ్మల రామారం మండలం చీకటిమామిడి, జలాల్పూర్. కేశపూర్, బండకాడిపల్లి, జమీలాల్పేట్, భాషినగర్, కేశపూర్, రామలింగంపల్లి శివారు ప్రాంతం, జేనపల్లి తదితర గ్రామాల నుంచి శామీర్‌పేట్ పెద్దచెరువు వాగు ఇరువైపులా భారీ ఎత్తున ఇసుక ఫిల్టర్ల నిర్వహణ కొనసాగిస్తున్నారు. ఇక్కడి నుంచి వివిధ మార్గాల్లో ఇసుకను లారీల్లో నగరంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తూ.. వ్యాపారులు లక్షల్లో ఆర్జిస్తున్నారు. -
బోగస్ ఓటుకు నోటీసు..!
సిద్దిపేట జోన్ : బోగస్ ఓటర్ల ఏరివేత ప్రక్రియలో భాగంగా సిద్దిపేట పట్టణ పరిధిలోని వేలాది మంది ఓటర్లకు రెవెన్యూ యంత్రాంగం నోటీసులు జారీ చేయనుంది. గతంలో పలుమార్లు క్షేత్ర స్థాయిలో విచారణ, సర్వే నిర్వహించి ఓటర్ జాబితాకు ఆధార్‌కార్డును అనుసంధానం చేసే విధానాన్ని అధికారులు చేపట్టారు. అయినప్పటికి సంబంధిత జాబితాలో నేటికి సుమారు 23వేల మంది అధికారికంగా పట్టణంలో అనుసందానానికి దూరంగా ఉన్నట్లు గుర్తించారు. ఒక్క దశలో కలెక్టర్ ఆదేశాల మేరకు సిద్దిపేట ఆర్డీ ఓ ముత్యంరెడ్డి పర్యవేక్షణలో 23 వేల మందికి నోటిసులు జారీ చేయడం మొదలు పెట్టారు. మొదటి ద ఫాలో నోటిసులను అందుకున్న వారిలో ఇప్పటికి సుమారు 3 వేల మంది తమ ఆధార్ నంబర్‌ను ఓటర్ జాబితాతో సీడింగ్ చేయించినట్లు సమాచారం. 20 వేల మంది ఓటర్లు ఎక్కడా.. మరో వైపు సిద్దిపేట పట్టణంలోని 20 వేల ఓటర్లు ఆధార్ సీడింగ్ కు ముందుకు రావడం లేదని యంత్రాంగం గుర్తించింది. గత కొన్ని రోజులుగా విస్తృత ప్రచారం, సమీక్షలు, ఆవగాహన సదస్సులు నిర్వహించినప్పటికి ఇప్పటికి పట్టణంలో 20 వేల మంది ఆచూకిని కనుక్కోవడంలో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.మరో మారు సంబంధిత వ్యక్తులకు నోటిసులు జారీ చేసి చివరి అవకాశం ఇచ్చి అప్పటికీ స్పందించకుంటే జాబితా నుంచి శాశ్వతంగా పేర్లను తొలగించేందుకు అధికార యంత్రాంగం సమయాత్తమవుతోంది. ఇంటింటికి వెళ్లి విచారించినా.. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలీటి గా గుర్తింపు పొందిన సిద్దిపేటలో లక్షకు పై చిలుకు జనాభా ఉంది. 2015 రికార్డుల ప్రకారం ఇటీవల మున్సిపల్ విడుదల చేసిన జాబితాలో 88వేల పై చిలుకు ఓటర్లు ఉన్నారు. ప్రతి ఓటర్‌కు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేసి బోగస్ ఓటర్ల ఏరివేతతో పాటు ఓటర్ జాబితా ప్రక్షాళనకు సిద్దిపేట అధికారులు శ్రీకారం చుట్టారు. విస్తృతంగా ప్రత్యేక క్యాంపును , నమోదు ప్రక్రియను చేపట్టిన అధికారులకు గత నెలలోనే 23 వేల మంది ఓటర్లు సీడింగ్ కు దూరంగా ఉన్నట్లు గుర్తించారు. ఒక్క దశలో పట్టణంలోని 34 వార్డులను ఆయా అంగన్వాడీ కేంద్రం వర్కర్ , మెప్మా ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలోనే సమ్రగ విచారణ జరిపించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ జాబితాను పరిగణలోకి తీసుకొని ఓటర్లకు ఆధార్‌ను సీడింగ్ చేసే విధానాన్ని వేగ వంతంచేశారు. అయినప్పటికీ సిద్దిపేట పట్టణంలోనే 23 వేల మంది ఓటర్లు సీడింగ్‌కు ముందుకు రావడంలేదు. నోటీసుల జారీ వేగవంతం.. రెవెన్యూ యంత్రాంగం ఓటర్ జాబితాను ఆధారంగా చేసుకొని ఆనుసంధానానికి దూరంగాఉన్న ఓటర్లకు వ్యక్తి గతంగా నోటీసులను జారీ చేసే ప్రక్రియను చేపడుతున్నారు. ముఖ్యంగా ఓటర్ జాబితాలో ఉన్న వారిలో కొందరు వలసలకు వెళ్లడం , మృతి చెందడం, రెండు చోట్ల ఓటరు జాబితాలో పేర్లు కలిగి ఉండడం , వివాహమై ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు ఆధార్ సిడింగ్ దూరంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయినప్పటికీ మరో ప్రయత్నంగా రెవెన్యూ యంత్రాంగం రెండవ దశలో నోటీసుల జారీ చేసి అర్హులైన వారికి జాబితాలో అవకాశం కల్పించడం , అనర్హులను తొలగించి బోగస్ ఓటర్లను ఏరివేయడం లాంటి ప్రక్రియను వేగవంతం చేస్తోంది. -
ఆ దరఖాస్తులను ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్ : క్రమబద్ధీకరణ ప్రక్రియలో ఉచిత పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేసుకున్న రెవెన్యూ యంత్రాంగం.. తాజాగా చెల్లింపు కేటగిరీ దరఖాస్తులపై దృష్టి సారించింది. ఇప్పటికే చెల్లింపు కేటగిరీకి సంబంధించి 29,281దరఖాస్తులు సర్కారు వద్ద ఉండగా, తాజాగా మరిన్ని దరఖాస్తులు జతయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత కేటగిరీలో క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకున్న 3,36,869 మందిలో 16,915 మంది చెల్లింపు కేటగిరీ పరిధిలోకి వస్తారని అధికారులు తాజాగా నిర్థారించారు. దీంతో క్షేత్రస్థాయిలో పరిస్థితి గందరగోళంగా తయారైంది. తమ ద రఖాస్తులను చెల్లింపు కేట గిరీలోకి మార్చడం పట్ల దరఖాస్తుదారులు రెవెన్యూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉచిత కేటగిరీ నుంచి చెల్లింపు కేటగిరీలోకి మారిన దరఖాస్తుదారులకు నోటీసులు ఇచ్చేందుకు సర్కారు సన్నద్ధమైంది. జీవో నెంబరు 59 ప్రకారం నిర్ధేశితం సొమ్మును వెంటనే చెల్లించకుంటే.. ఆయా స్థలాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు పంపాలని భావిస్తోంది. చెల్లింపు కేటగిరీలో స్థలం రిజిస్ట్రేషన్ ధరను చెల్లించేందుకు ప్రభుత్వం ఐదు సులభ వాయిదాల పద్ధతిని, ఒకేసారి చెల్లించే వారికి ఐదు శాతం రాయితీ సదుపాయాన్ని కూడా కల్పించింది. అయితే.. చెల్లింపు కేటగిరీలో రెండు వాయిదాలను చెల్లించాల్సిన గడువు ఇప్పటికే పూర్తయింది. మూడో వాయిదా చెల్లించే సమయం (జూన్30) కూడా ఆసన్నమవుతున్న తరుణంలో.. ఉచితం నుంచి చెల్లింపు కేటగిరీలోకి మారిన దరఖాస్తుదారులు మూడు వాయిదాల సొమ్మును ఒకేసారి చెలించాల్సి వస్తోంది. ఇప్పటికిప్పుడు రూ.ల క్షలు చెల్లించమనడం ఎంతవరకు సబబని దరఖాస్తుదారులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఉచితంగా పట్టాలిస్తామంటే.. దరఖాస్తు చేసుకున్నాం గానీ, ఇప్పటికిప్పుడు సొమ్ములు చెల్లించమంటే ఎలాగని ఆగ్రహిస్తున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదని ప్రభుత్వం వెంటనే మార్గదర్శకాలు ఇస్తేమేలని అధికారులంటున్నారు. క్షేత్రస్థాయిలో వస్తున్న ఒత్తిడి మేరకు సరైన మార్గదర్శకాలు ఇవ్వాలని సీసీఎల్ఏ అధికారులు ప్రభుత్వానికి తాజాగా లేఖ రాశారు. -
రైతులకు సేవా దృక్పథంతో సహకారం అందించాలి
హన్మకొండ అర్బన్ : రైతులు సుఖ సంతోషాలతో ఉంటేనే సమాజం సుఖ సంతోషాలతో ఉంటుందని.. ఈ మేరకు రెవెన్యూ యంత్రాంగం, బ్యాంకర్లు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ వాకాటి కరుణ సూచించారు. గురువారం వరంగల్ డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, బ్యాంకర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరుణ మాట్లాడుతూ జిల్లాలో 90శాతంమంది వ్యవసాయంపై ఆధార పడి జీవిస్తునారని.. వారికి అవసరమైన సహకారాన్ని సేవా దృక్పథంతో అందించాలన్నారు. ప్రస్తుతం రైతు ప్రతి విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బ్యాంకులు పంటరుణాలు ఇచ్చేందుకు అవసరమైన పత్రాలు రెవెన్యూ అధికారులు సకాలంలో అందజేయాలన్నారు. అర్హత ఉన్న రైతులకు బ్యాంకులు వారి ఇంటి వద్దనే రుణంఇచ్చేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎస్బీహెచ్ నియంత్రణాధికారి మాట్లాడుతూ అర్హత ఉన్న రైతులు రుణం పొందిన తర్వాత పంటలు చేతికి వచ్చినా... రుణం తిరిగి చెల్లించడం లేదన్నారు. గ్రామాల వారీగా బకాలయిల వివరాలు ఇస్తే గ్రామ సభల్లో వివరాలు చెప్పి, రుణం తిరిగి చెల్లింపులు చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు. -
అర్హత..మా కొద్దు!
రుణ అర్హత కార్డులకు తగ్గిన దరఖాస్తులు జిల్లాలో కౌలు రైతుల సంఖ్య 2 లక్షలు 1.19 లక్షల మందికి కార్డులు ఇవ్వాలనేది లక్ష్యం వచ్చిన దరఖాస్తులు 21,164 కర్నూలు అగ్రికల్చర్ : రుణ అర్హత కార్డులను పొందడానికి కౌలురైతులు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. దరఖాస్తుల స్వీకరణకు రెవెన్యూ యంత్రాంగం గత నెల 10 నుంచి 30వ తేదీ వరకు రెవెన్యూ గ్రామాల వారీగా గ్రామసభలు నిర్వహించగా స్పందన అంతంతమాత్రమే. జిల్లాలో 2 లక్షలకుపైగా కౌలు రైతులు ఉండగా వీరిలో 1.19 లక్షల మందికి రుణ అర్హత కార్డులు జారీ చేయాలనేది లక్ష్యం. ఈ మేరకు రాష్ట్ర భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్(సీసీఎల్ఏ) నుంచి ఆదేశాలు వచ్చాయి. గ్రామ సభలు నిర్వహించి కౌలు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి అర్హులైన వారందరికీ రుణ అర్హత కార్డులు జారీ చేయాలని సూచించారు. ఇందుకు అనుగుణంగా గ్రామసభలు నిర్వహించినా కౌలు రైతులు పట్టించుకున్న దాఖలాలు లేవు. కేవలం 22,070 మంది దరఖాస్తు చేసుకోగా రెవెన్యూ అధికారుల విచారణలో 21,164 మంది అర్హులని తేలారు. వీరికి మాత్రమే రుణ అర్హత కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ లెక్కల ప్రకారం జిల్లాలో పది శాతం మంది రైతులు మాత్రమే రుణ అర్హత కార్డులు పంపిణీ చేయనున్నారు. గత ఏడాది 48,025 మందికి వీటిని పంపిణీ చేయగా ఈసారి దానిలో సగం కూడా లేకపోవడం గమనార్హం. ఇవీ ప్రయోజనాలు.. రుణ అర్హత కార్డులుంటే కౌలు రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు ఇస్తారు. బ్యాంకులు రుణాలు ఇస్తాయి. అతివృష్టి, అనావృష్టితో పంటలు దెబ్బతింటే కౌలు రైతుకే నేరుగా పరిహారం అందుతుంది. వైఫల్యాలు ఇవీ.. రుణ అర్హత కా ర్డులు కలిగిన కౌలు రైతులకు బ్యాం కులు రుణా లు ఇవ్వడం లేదు. పంట లు నష్టపోయినప్పుడు పరిహారం అందడం లేదు. ఎందుకూ ఉపయోగపడని రుణ అర్హత కార్డులను పొందడానికి రైతులు ఆసక్తి చూపడం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
సర్కారీ జాగా.. అక్రమార్కుల పాగా!
వివిధ సంస్థలకు కట్టబెట్టిన సర్కారీ స్థలాల్లో వెలసిన కట్టడాల క్రమబద్ధీకరణపై రాష్ట్ర ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. పారిశ్రామిక, అటవీ, విద్యా, నీటిపారుదల తదితర శాఖలకు బదలాయించిన స్థలాల్లో చాలాచోట్ల నిర్మాణాలు పుట్టుకొచ్చాయి. ఈ ఆక్రమణదారులంతా జీఓ 58 కింద తమ నిర్మాణాలను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వీలున్నంత వరకు స్థలాల క్రమబద్ధీకరణపై ఉదారంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు స్పష్టం చేయడంతో.. చెరువులు, శ్మశానవాటిక, లేఅవుట్లలో ఖాళీ స్థలాలు, శిఖం భూములను కూడా రెగ్యులరైజ్చేసే కోణంలో రెవెన్యూ యంత్రాంగం కసరత్తు చేస్తున్నది. ⇒ టీఐఐసీ, అటవీ స్థలాల క్రమబద్ధీకరణ ⇒ జంట జిల్లాల్లో 13 వేల దరఖాస్తుల పరిశీలన ⇒ ఆమోదానికి అత్యున్నతస్థాయి కమిటీ ⇒ శిఖం భూములపై ఆచీతూచీ అడుగు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం మరింత పట్టువిడుపుగా వ్యవహరించనుంది. వివిధ సంస్థలకు బదలాయించిన స్థలాల్లో వెలిసిన నిర్మాణాలను కూడా ఆయా శాఖల సమ్మతితో క్రమబద్ధీకరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలి స్తోంది. ఫలితంగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో 13,417 దరఖాస్తులకు మోక్షం కలిగించే అంశంపై భూపరిపాలనా ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నేతృత్వంలోని కమిటీ కుస్తీ పడుతోంది. ఇందులో రంగారెడ్డి జిల్లా పరిధిలో 6,692 దరఖాస్తులు, హైదరాబాద్ జిల్లా పరిధిలో 6,725 దరఖాస్తులు ఉన్నాయి. పారిశ్రామిక, ప్రజావసరాల కోసం ఆయా శాఖలకు ప్రభుత్వం స్థలాలను కేటాయియించింది. ఈ స్థలాల వినియోగంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కొన్నిచోట్ల అవసరానికి మించి స్థలం కట్టబెట్టడంతో ఆ జాగాలను పరిరక్షించడంలో ఆయా శాఖలు చేతులెత్తేశాయి. ఫలితంగా ఈ స్థలాలు కాస్తా బస్తీలుగా అవతరించాయి. ఈ బస్తీదారులంతా ఇప్పుడు ఉచితకేటగిరీ (58 జీఓ) కింద తమ ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ప్రభుతానికి అర్జీలు పెట్టుకున్నారు. ఉదాహరణకు.. బాలానగర్ మండలం అల్లావుద్దీన్ కుట్టి కాలనీ స్థలాన్ని గతంలో టీఐఐసీకి బదలాయించారు. దశాబ్ధాల క్రితమే పారిశ్రామిక అవసరాల కోసం ఈ భూమని టీఐఐసీకి కేటాయించారు. అయితే, ఈ స్థలసేకరణలో ఆ సంస్థ నిర్లిప్తంగా వ్యవహరించింది. దీనికితోడు అప్పటికే ఆ ప్రాంతంలో కాలనీ ఉండడంతో వారిని ఖాళీ చేయించే సాహసం చే యలేకపోయింది. ఈ క్రమంలోనే అల్లావుద్దీన్ కుట్టీలో నివసిస్తున్న 355 మంది తమ ఇళ్లను రెగ్యులరైజ్ చేయమని రెవెన్యూ యంత్రాంగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఎలాగూ ఈ స్థలాన్ని వెనక్కి తీసుకోవడం సాధ్యంకాదు కనుక.. టీఐఐసీ సమ్మతితో ఈ స్థలాలను క్రమబద్ధీకరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇలా ప్రతి శాఖ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని స్థలాల క్రమబద్ధీకరణకు ముందడుగు వేయాలని భావిస్తోంది. శిఖం స్థలాలకు వెనుకడుగు! శిఖం భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ స్థలాల క్రమబద్ధీకరణ జోలికి వెళితే న్యాయపరమైన చిక్కులు తప్పవని స్పష్టం కావడంతో పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఒకప్పుడు ఉన్న చెరువులు నగరీకరణ నేపథ్యంలో కనుమరుగు కావడాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. వరదనీటి ప్రవాహం, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని శిఖం/ఎఫ్టీఎల్లో వెలిసిన నిర్మాణాలపై నిర్ణయం తీసుకోవాలని భావించింది. ఇందులోభాగంగా జిల్లాలో దాదాపు 8,887 దరఖాస్తులకు మోక్షం కలిగించే దిశగా ఆలోచించింది. శిఖం భూములపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, పలు సందర్భాల్లో న్యాయస్థానాలు స్పష్టం చేసిన అభిప్రాయాలను గమనంలోకి తీసుకున్న సర్కారు.. వీటిని పక్కనపెట్టడమే మేలనే అభిప్రాయానికి వచ్చినట్లు అధికారవర్గాల ద్వారా తెలిసింది. -
సజావుగా ఎంసెట్
95 శాతం హాజరు ముందు రోజే నగరానికి చేరుకున్న విద్యార్థులు ఫలించిన రెవెన్యూ యంత్రాంగం ముందస్తు చర్యలు యూనివర్సిటీ : ఎంసెట్-2015 రాత పరీక్షలు జిల్లాలో సజావుగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. శుక్రవారం ఉదయం జరిగిన ఇంజనీరింగ్ ప్రవేశాల రాత పరీక్ష 17 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. మెత్తం 8, 275 మంది (95.6శాతం) అభ్యర్థులు హాజరుకాగా, 385 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన మెడిసిన్ అండ్ అగ్రికల్చర్ కోర్సు ప్రవేశాల రాత పరీక్షలు 6 కేంద్రాలలో నిర్వహించారు. మెత్తం 3058 (93.2 శాతం) మంది అభ్యర్థులు హాజరుకాగా 226 మంది గైర్హాజరయ్యారు. ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ కోర్సులకు రెండు కలిపి 95శాతం హాజరు నమోదు అయిందని రీజనల్ కో ఆర్డినేటర్ ఆచార్య బి. ప్రహ్లాదరావు వెల్లడించారు. పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు. జేఎన్టీయూ అనంతపురం సెంటర్లో జామర్లు ఏర్పాటు చేశారు. సమ్మె నేపధ్యంలో ముందస్తు జాగ్రత్తలు: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో జిల్లా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎంసెట్‌కు హాజరయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో సఫలీకృతులయ్యారు. దీంతో తాజాగా ఊహాగానాల నడుమ జరిగిన ఎంసెట్ విజయవంతంగా నిర్వహించడంలో అధికారులు అంకితభావంతో విధులు నిర్వహించారు. ఎంసెట్ పరీక్షలకు అరగంట ఆలస్యమైనా అనుమతించండని జిల్లా కలెక్టర్ కోనశశిధర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఎవరూ ఈ వెసులుబాటును ఉపయోగించుకోలేదు. సమ్మె ప్రభావం, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతిచ్చిలేదనే ముందస్తు హెచ్చరికలతో ముందు రోజే నగరానికి చేరుకున్నారు. ప్రవేటు కళాశాలల ఉచిత తాయిలాలు: ఎంసెట్‌కు గణనీయ స్థాయిలో అభ్యర్థులు హాజరుకావడంతో అనుబంధ కళాశాలల యాజమాన్యాల అంచనాలు రెట్టింపయ్యాయి. గత ఏడాది ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితి, లోకల్ క్యాటగిరి వివాదం, సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఆలస్యంగా ఎంసెట్ నిర్వహణ, కౌన్సెలింగ్ దృష్ట్యా పొరుగు రాష్ట్రాల వైపు విద్యార్థులు మళ్లారు. ఇందుకు భిన్నంగా తాజా ఎంసెట్ జరగడంతో ప్రవేటు కళాశాలలో గత ఏడాదితో పోలిస్తే ప్రవేశాలు ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఇంజనీరింగ్ రాత పరీక్ష ముగిసిన వెంటనే అనుబంధ ఇంజనీరింగ్ కళాశాలలు తాయిలాలు మెదలెట్టాయి. కళాశాలలో అడ్మిషన్ పొందితే ఉచిత ల్యాప్‌టాప్ కంప్యూటర్లు, బస్ ఫీజు ప్రీ, హాస్టల్ ప్రీ అంటూ ఎన్నికల ప్రచారాన్ని తలపించే విధంగా తాయిలాలు ఇస్తుండడం విశేషం. మెడిసిన్‌కు ఎండ దెబ్బ: ఉదయం జరిగిన ఇంజనీరింగ్ పరీక్షల కంటే మధ్యాహ్నం జరిగిన మెడిసిన్ ఎంట్రెన్స్ టెస్ట్‌కు హాజరయ్యే వారికి అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని పరీక్ష కేంద్రాలలో ఇందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అవస్థలు పడ్డారు. -
పట్టాల పంపిణీ ఇప్పట్లో లేనట్టే!
కంచికి చేరని క్రమబద్ధీకరణ కథ ⇒ అభ్యంతర భూములపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం ⇒ చేతులెత్తేసిన రెవెన్యూ యంత్రాంగం ⇒ నైరాశ్యంలో లక్షలమంది దరఖాస్తుదారులు ⇒ జూన్ 2న పట్టాలు పంపిణీ చేయాలని యోచన? సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ కథ ఇప్పట్లో కంచికి చేరేలా కనిపించడం లేదు. ప్రభుత్వానికి అందిన 3.66 లక్షల దరఖాస్తుల్లో అభ్యంతర కరమైన భూములకు చెందినవే అధికంగా ఉండడం ఈ ప్రక్రియకు ప్రధాన ఆటంకంగా మారింది. నిరభ్యంతరకరమైన భూములనే క్రమబద్ధీకరిస్తామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన ప్రభుత్వం.. ఇప్పటి కిప్పుడు అభ్యంతరకరమైన భూములను కూడా నిరభ్యంతరకర కేటగిరీకి మార్చాలని రెవెన్యూ అధికారులపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. అయితే.. దీనికి అనుగుణంగా ప్రభుత్వం నుం చి ఎటువంటి ఉత్తర్వులు రాకపోవడంతో.. తామేమీ చేయలేమని అధికారులు చేతులెత్తేస్తున్నారు. పాలకులు, అధికారుల మధ్య జరుగుతున్న ప్రచ్ఛ న్నపోరుతో క్రమబద్ధీకరణ ప్రక్రియ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. పోనీ.. అభ్యంతరం లేని భూములకు చెందిన పేదలకైనా పట్టాలు ఎప్పుడు పంపిణీ చేస్తారనేది ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టం చేయట్లేదు. ముందుగా పట్టాల పంపిణీ జగ్జీవన్‌రామ్ జయంతి రోజున చేస్తారని, ఆ తర్వాత బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున చేస్తారని ప్రకటనలు వెలువడినా, చివరికి అవన్నీ వట్టిదేనని తేలింది. దీంతో క్రమబద్ధీకరణ పక్రియ ద్వారా లక్షలాది మంది పేదలకు పట్టాలు పంపిణీ చేసి, ప్రజల మెప్పు పొందాలనుకున్న ప్రభుత్వ పెద్దల ఆశలకు గండిపడింది. ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం ఈ నెలాఖరు కల్లా భూముల క్రమబద్ధీకరణ తంతు సంపూర్ణంగా ముగియాల్సి ఉంది. అయితే.. ఉచిత క్రమబద్ధీకరణ ఇంకా కొలిక్కి రాకపోవడం, చెల్లింపు కేటగిరీ దరఖాస్తుల పరిశీలన ఇంకా ప్రారంభం కాకపోవడం గమనార్హం. అభ్యంతరకరమైనవే అధికం.. క్రమబద్ధీకరణ ప్రక్రియకు రాష్ట్రవ్యాప్తంగా 3,66,150 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటిలో ఉచిత కేటగిరీ కింద 3,36,869 దరఖాస్తులు రాగా, చెల్లింపు కేటగిరీలో కేవలం 29,281 దరఖాస్తులే వచ్చాయి. క్రమబద్ధీకరణ ప్రక్రియలో ముందుగా ఉచిత కేటగిరీలో దరఖాస్తులను పరిశీలించి మార్చి నుంచే పట్టాలను పంపిణీ చేయాలని సర్కారు సంకల్పించింది. అయితే.. క్రమబద్దీకరణకు వచ్చిన దరఖాస్తుల్లో కనీసం 30 శాతం మందికైనా పట్టాలను ఇవ్వలేని పరిస్థితులు ఎదురు కావడం సర్కారును సైతం షాక్‌కు గురిచేసింది. మొత్తం దరఖాస్తుల్లో అభ్యంతరం లేని భూములకు చెందినవి కేవలం 95,034 మాత్రమే ఉన్నాయని అధికారులు తేల్చారు. అభ్యంతరకర భూములకు చెందిన దరఖాస్తుల్లో అధికంగా కేంద్ర ప్రభుత్వ, రైల్వే మిలటరీ.. తదితర సంస్థల భూములకు చెందినవి 93,770 దరఖాస్తులు ఉన్నట్లు నిర్ధారించారు. అభ్యంతరాలన్నీ తొలగే వరకూ నిరీక్షణే... అంతే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే.. ఇప్పటికే పట్టా ఉన్నవి, మున్సిపల్ భూములు, దేవాలయ/దర్గా భూములు, మురుగు కాలువలు, రహదారుల వెంబడి, శ్మశానవాటికల, శిఖం భూములు, కోర్టు కేసుల్లో ఉన్నవి, హౌసింగ్‌బోర్డు, జీపీడబ్ల్యూడీ, నిజాం నవాబువి, నాన్ ఐఎస్ఎఫ్, విద్యాశాఖ, దేవాదాయశాఖ.. తదితర 21 రకాల అభ్యంతరకరమైన భూములకు చెందిన దరఖాస్తులు సుమారు లక్ష వరకు ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర పరిధిలోని అభ్యంతరకర భూముల్లోని ఆక్రమణలను క్రమబద్ధీకరించాలన్నా.. ప్రభుత్వం వేరుగా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఇప్పటికే క్రమబద్ధీకరణ అంశంపై హైకోర్టులో కేసు నడుస్తున్నందున ప్రభుత్వం మరోసారి మార్గదర్శకాలను సవరిస్తూ వేరొక ఉత్తర్వులు ఇచ్చే అవకాశం లేకపోయిందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. అభ్యంతరాలన్నీ తొలగిపోతే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న పట్టాలను పంపిణీ చేయాలని సర్కారు యోచిస్తున్నట్లు తెలిసింది. అందాక లక్షలాది మంది దరఖాస్తుదారులకు నిరీక్షణ తప్పదేమో మరి. -
రండి బాబూ.. రండి!
కబ్జాదారులకు బంపర్ ఆఫర్ స్థలాల క్రమబద్ధీకరణకు అధికారుల దండోరా మైకులు, కరపత్రాల ద్వారా జోరుగా ప్రచారం విస్తృతంగా అవగాహన సదస్సులు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఆక్రమణదారులకు ప్రభుత్వం రెడ్‌కార్పెట్ పరిచింది. భూముల క్రమబద్ధీకరణకు సాదరస్వాగతం పలుకుతోంది. ఆలసించిన ఆశాభంగం.. అంటూ బస్తీల్లో మైకులు, కరపత్రాలతో హోరెత్తిస్తోంది. స్థలాల క్రమబద్ధీకరణతో ఖజానా నింపుకోవాలని ఆశపడుతున్న సర్కారు.. ప్రభుత్వ స్థలాల్లోని ఇళ్లకు పట్టాలివ్వాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో కబ్జాదారులతో కూడా సమావేశాలు నిర్వహిస్తున్న రెవెన్యూ యంత్రాంగం.. ఆక్రమణలను రెగ్యులరైజ్ చేసుకోవాలని హితబోధ చేస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించుకుంటే సరేసరి లేకపోతే స్థలాలను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తోంది. జిల్లావ్యాప్తంగా 6,202 ఎకరాల్లో ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించిన యంత్రాంగం.. వీటి క్రమబద్ధీకరణ ద్వారా భారీగా నిధులు సమకూరుతాయని అంచనా వేసింది. దీంతో క్రమబద్ధీకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వం కూడా దీనిపై గంపెడాశ పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే కబ్జాదారులకు అవగాహన కల్పించే పనిలో నిమగ్నమైంది. భవిష్యత్తులో ఆక్రమణలు తావివ్వకుండా వీలైనంతమేరకు స్థలాలను రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడంతో.. కాలనీలు, బస్తీల్లో విస్తృతంగా దండోరా వేయిస్తోంది. ఖరారుకాని మార్గదర్శకాలు ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడి ఐదు రోజులైనా.. ఇప్పటివరకు ప్రభుత్వం మార్గదర్శకాలు వెలువరించకపోవడంపై అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జీఓ విడుదల చేసిననాటి నుంచి 20 రోజుల వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించిన సర్కారు.. ఇంకా గైడ్‌లైన్స్ ఖరారు, దరఖాస్తు ఫారాాలు ఇవ్వకపోవడంపై పెదవి విరుస్తున్నారు. మార్గదర్శకాల విడుదలలో జాప్యం జరిగినందున.. దరఖాస్తుల సమర్పణకు గడువును పొడగించే అవకాశముందనే ప్రచారమూ జరుగుతోంది. వేలానికి వేళాయే.. నగర శివార్లలోని ప్రధాన ప్రాంతాల్లోని 213 స్థలాలను వేలం వేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అత్యంత విలువైన 930 ఎకరాలు అమ్మడం ద్వారా రూ.3వేల కోట్ల ఆదాయం పొందవచ్చని అంచనా వేసింది. అయితే, తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భూముల విక్రయం మాట దేవుడెరు గు.. కనీస అవసరాలకు కూడా భూమి దొరకని పరిస్థితి తలెత్తుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజోపయోగ అవసరాలకు కేటాయించిన పిమ్మట వేలం వేసే భూముల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర సర్కారు ఆదేశించింది. ఈ క్రమంలో కసరత్తు ప్రారంభించిన రెవెన్యూ యంత్రాంగానికి దిమ్మతిరిగింది. పలు సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ ఇప్పటికే ప్రభుత్వం వద్ద దరఖాస్తులు పెండింగ్‌లో ఉండడం, అంగన్వాడీ స్కూళ్లు, శ్మశానవాటికలు, కమ్యూనిటీ హాళ్లకు స్థలాలు నిర్దేశిస్తే వేలానికి మిగిలేది 30 నుంచి 40 శాతమేనని ప్రాథమికంగా తేలింది. కొన్ని మండలాల్లో అయితే అమ్మకానికి ప్రభుత్వ స్థలాల్లేని పరిస్థితి ఏర్పడింది. ఈ మేరకు నిర్దేశించిన ఫార్మెట్ ప్రకారం తహసీల్దార్ల నుంచి జిల్లా యంత్రాంగం వివరాలను సేకరిస్తోంది. గచ్చిబౌలికి కలెక్టరేట్ కలెక్టరేట్‌ను గ చ్చిబౌలికి తరలించాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది. శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 25,26లోని 20ఎకరాలను కలెక్టరేట్ సముదాయ నిర్మాణానికి వినియోగించునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. భవిష్యత్తులో వికారాబాద్ ప్రత్యేక జిల్లా కానున్నందున.. ఇది అన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటుందని భావిస్తోంది. సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ఉన్న ఈ స్థలంలో శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం కూడా ఉంది. ప్రతిపాదిత కలెక్టరేట్ స్థలాన్ని సోమవారం జాయింట్ కలెక్టర్ -1 చంపాలాల్ కూడా పరిశీలించారు. ఇదిలావుండగా, రాజేంద్రనగర్ మండలం అపార్డ్‌కు సమీపంలోని సర్వే నం 259లోని భూమిని కూడా కలెక్టరేట్ కాంప్లెక్స్ నిర్మించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అయితే, ఈ భూమిని హెచ్ఎండీఏకు కేటాయించినందున.. గచ్చిబౌలి వైపు మొగ్గు చూపుతున్నారు. -
ఇదిగో ప్రభుత్వ భూమి!
యాచారం: అక్రమార్కులు చెరపట్టిన ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు రెవెన్యూ యంత్రాంగం నడుం కట్టింది. ప్రభుత్వానికి చెందిన స్థలాలను గుర్తించి వాటిలో హద్దురాళ్లు పాతారు. ఇందులోని ఆక్రమణలను వెంటనే తొలగించుకోవాలని రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో సర్కారు స్థలాలను ఆక్రమించుకున్నవారి గుండె ల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇన్నాళ్లూ మండలంలో సర్కారు స్థలాల వివరాలను రికార్డులకే పరిమితం చేసిన అప్పటి తహసీల్దార్లు ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు సమర్పించి కాలం వెళ్లదీశారు. నాటి అధికారుల అలసత్వం అక్రమార్కులకు వరంగా మారింది. హైదరాబాద్ మహా నగరానికి యాచారం చేరువలో ఉండటంతో ఇక్కడి భూముల ధరలు రూ. కోట్లలో పలుకుతున్నాయి. దీంతో అక్రమార్కులు ఏదో ఒక రాజకీయ పార్టీ అండతో తహసీల్దార్లపై ఒత్తిడి చేయించి ఆ భూములను తమ గుప్పట్లో పెట్టుకుని కాలం వెల్లదీశారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు తారమారవుతున్నాయి. రెవెన్యూ రికార్డుల్లో నమోదైన వివరాల ప్రకారం ప్రభుత్వ భూము లు ఎన్ని ఉన్నాయో.. వాటినన్నింటినీ స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్లకు తెలంగాణ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్థానిక తహసీల్దార్ వసంత కుమారి రెవెన్యూ రికార్డుల్లో ప్రకారం సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిని అక్రమార్కుల నుంచి స్వాధీనం చేసుకోవడానికి ఉపక్రమించారు. 20 గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల ప్రకారం వందలాది ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకొని హద్దులు పాతడానికి నిర్ణయించారు. అక్రమార్కుల గుండెల్లో గుబులు వారం రోజులుగా సర్వేయర్ నరహరి రాజు, గ్రామ రెవెన్యూ కార్యదర్శి కృష్ణ యాచారంలో ప్రభుత్వ భూమిని గుర్తిం చారు. సోమవారం తహసీల్దార్ వసంతకుమారి ఆ భూముల్లో హద్దులు పాతిం చారు. రాళ్లపై, చెట్లపై ‘ఇది ప్రభుత్వ భూమి’ అని రాయించారు. యాచారం తూర్పు దిశలో సర్వే నంబరు 242లో 1-29 ఎకరాలు, 225లో 3 ఎకరాలు, 452లో 10 గుంటల భూమికి హద్దులు పాతించారు. మండల కేంద్రంలో ఉన్న ఈ భూమి దాదాపు రూ. 2 కోట్లకుపైగా విలువ ఉంటుంది. గతంలో అధికారుల రికార్డుల ప్రకారం ఇక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి. కానీ ఇవి ఆక్రమణకు గురయ్యాయి. రాజకీయ పక్షాల ఒత్తిళ్లతో వీటిని అధికారులు స్వాధీనం చేసుకోలేదు. ప్రస్తుతం ఈ భూముల్లో హద్దులు పాతడం, ప్రభుత్వ భూమిగా గుర్తించడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు పట్టుకొంది. ‘రికార్డుల్లో చూస్తే వందలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. కానీ ఆ స్థలం వద్దకు వెళ్లి చూస్తే మాత్రం ఆక్రమణలు ఉన్నాయి. అందుకే రికార్డుల ప్రకారం సెంటు ప్రభుత్వ భూమినైనా వదిలే ప్రసక్తి లేదు. ప్రజావసరాలుంటే కలెక్టర్ అనుమతితో ఆ భూమిని కేటాయిస్తాం’ అని తహసీల్దార్ వసంతకుమారి పేర్కొన్నారు. -
‘ల్యాండ్ బ్యాంకు’ సిద్ధం
జగిత్యాల : ప్రతీ జిల్లాలో ఫారెస్ట్ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ల్యాండ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. అంతరించిపోతున్న అడవుల స్థానంలో కొత్తగా గ్రీనరీ అభివృద్ధితోపాటు పలు చోట్ల పరిశ్రమల కోసం తీసుకునే అటవీశాఖ భూముల స్థానంలో ఈ భూముల ను అటవీశాఖకు అప్పగించనున్నారు. ల్యాండ్ బ్యాం కు ఆఫ్ ఫారెస్ట్ కోసం అవసరమైన భూమి సేకరించాలని సర్కార్ జిల్లా అధికారులను ఆదేశించింది. రెండు రకాలుగా... జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీ, పరిశ్రల ఏర్పాటు, ఇతర అవసరాల కోసం ప్రభుత్వం భూ సేకరణ జరపాలని ఆదేశించింది. జిల్లాలో ఇప్పటికే రెవెన్యూ అధికారులు లక్షలాది ఎకరాల భూమిని సేకరించారు. జిల్లాలో 3,69,311 ఎకరాల భూమిని ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించారు. ఏ, బీ కేటగిరీ భూములను పరిశ్రమలు, భూపంపిణీకి తీసుకోనున్నారు. సీ, డీ భూముల్లో అడవులు పెంపకానికి వినియోగించాలని అలోచిస్తున్నారు. రాష్ట్రంలో పలు పరిశ్రమలు, మంచినీటి పథకాలకు, రోడ్ల విస్తరణకు పలు ప్రాంతాల్లో ఫారెస్టు భూములు తీసుకునే అవకాశముంది. తీసుకున్న ఆటవీశాఖ భూముల స్థానంలో సీ, డీ కేటగిరీ భూములను ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో సీ, డీ కేటగిరీ భూములివి... జిల్లాలో ‘సీ’ కేటగిరీలో 28,430 ఎకరాలు, ‘డీ’ కేటగిరీలో 3,13,220 ఎకరాలు సేకరించారు. ప్రధానంగా ‘డీ’ కేటగిరీలో గుట్టలు, బండరాళ్లు ఉన్న భూమిగా ఉంది. ‘సీ’ కేటగిరీలో భూమితోపాటు బండరాళ్లు ఉన్నట్లుగా అధికారులు రికార్డులు తయారుచేశారు. జిల్లాలో అవసరమైతే అటవీశాఖకు కేటాయించడానికి సిరిసిల్ల రెవెన్యూ డివిజన్లో ,7406 ఎకరాలు, జగిత్యాలలో 1,20,390 ఎకరాలు, మంథనిలో 32,352 ఎకరాలు, పెద్దపల్లిలో 61,894 ఎకరాలు, కరీంనగర్లో 29,965 ఎకరాలను రెవెన్యూ అధికారులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఇవ్వడానికి సిద్ధంగా ఉంచారు. మొక్కల పెంపకానికి... రాబోయే సంవత్సరం నుంచి హరితతోరణం కింద లక్షలాది మొక్కలను పెంచడానికి కొత్త కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇందులో మొక్కలు పెంపకానికి గ్రామాలతోపాటు గ్రామ శివారుల్లో ఉన్న గుట్టలు, ఆడవులప్రాంతాల్లోనూ ప్రత్యేకంగా మొక్కలు పెంచడానికి ఇప్పటికే ప్రణాళికలు సిద్ధంచేశారు. ఖాళీస్థలం ఎక్కడున్నా మొక్కలు పెంచడానికి ప్రభుత్వం ఆలోచిస్తోంది. అధికంగా జగిత్యాల డివిజన్‌లోనే... జిల్లాలో ఎక్కువగా సీ, డీ కేటగిరీలకు చెందిన భూమి జగిత్యాల రెవెన్యూ డివిజన్‌లోనే ఉంది. ఈ మేరకు డివిజన్లో ‘సీ’ కేటగిరీలో 14,176 ఎకరాలు, డీ కేటగిరీలోలో 1,43,616 ఎకరాల భూమి డివిజన్లో ఉంది. ఈ భూముల్లో అటవీశాఖకు కేటాయించడానికి అనువుగా 14,300 ఎకరాల భూమిని తొలి విడతగా అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆర్డీవో ఎస్.పద్మాకర్ జిల్లా కలెక్టర్‌కు నివేదిక తయారు చేశారు. -
10వేల ఎకరాలు హాంఫట్!
* విలువ రూ.20 వేల కోట్ల పైనే! * సర్వేలో విస్మయపరిచే నిజాలు * నగర శివార్లలోనే ఏకంగా 8 వేల ఎకరాలు అన్యాక్రాంతం * ప్రాథమిక నివేదిక సమర్పించిన రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: ప్రభుత్వ భూములకు రెక్కలొచ్చాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.20 వేల కోట్ల విలువైన సర్కారీ భూములు కబ్జాదారుల కబంధహస్తాల్లో చిక్కుకుపోయాయి. భూముల ఆక్రమణలపై రంగారెడ్డి జిల్లా యంత్రాంగం జరిపిన సర్వేలో విస్మయకర నిజాలు వెలుగు చూశాయి. ప్రభుత్వ భూముల్లో ఎంతమంది పాగా వేశారో లెక్క తీయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారగణం.. జిల్లాలో 10,366.14 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనట్లు గుర్తించింది. మరికొన్ని మండలాల నుంచి సమాచారం రావాల్సి ఉండడంతో ఈ గణాంకాలు పెరిగే అవకాశం లేకపోలేదు. పరిశ్రమలకు, వివిధ సంస్థలకు బదలాయించిన స్థలాలతోపాటు ఇంకా ఎవరికీ కేటాయించని భూముల వివరాలను పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలోనే 64,671.39 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు నిర్ధారించిన రెవెన్యూ యంత్రాంగం.. ఇందులో కేవలం 3,395.07 ఎకరాలు మాత్రమే వివాదరహితంగా ఉందని తేల్చింది. పోరంబోకు, సీలింగ్, కారీజ్ ఖాతాలుగా వర్గీకరించిన భూములు అక్రమార్కుల చెరల్లో చిక్కుకున్నాయని పసిగట్టిన యంత్రాంగం.. గ్రామీణ ప్రాంతాల్లో వీటిని సాగుకు వినియోగించుకుంటున్నట్లు గుర్తించింది. నగర శివార్లలో మాత్రం ల్యాండ్ మాఫియా గుప్పిట్లో వేలాది ఎకరాలు మగ్గుతున్నట్లు లెక్క తేల్చింది. అయితే, ఈ భూముల హక్కుల కోసం కోర్టుల్లో కేసులు నడుస్తుండడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది. మల్కాజిగిరిలో 6,248 ఎకరాలు హాంఫట్ స్థిరాస్తి రంగం పుంజుకోవడంతో శివార్లలోని విలువైన స్థలాలు కైంకర్యమవుతున్నాయి. మరీ ముఖ్యంగా మల్కాజిగిరి, సరూర్‌నగర్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 7,783 ఎకరాలు ఆక్రమణకు గురైంది. రాజేంద్రనగర్ డివిజన్లో 2,127 ఎకరాల మేర ఆక్రమించినట్లు జిల్లా యంత్రాంగం తేల్చింది. ఇక్కడ ఎకరా సగటున రూ.3 కోట్లు పైమాటే. ఈ లెక్కన ఈ మూడు డివిజన్లలోనే సుమారు రూ.15 వేల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమైనట్లు అంచనా. బాలానగర్ మండలంలో 537.28, శేరిలింగంపల్లి 850.20, రాజేంద్రనగర్ 345, శంషాబాద్ 394, కుత్బుల్లాపూర్ 1913, ఉప్పల్ 121, శామీర్‌పేట 2993, మల్కాజిగిరి 162, మేడ్చల్ 340 ఎకరాలు కబ్జా అయినట్లు తేలింది. దీంట్లో అధికశాతం వ్యవసాయేతర భూములు కావడంతో వీటి విలువ రూ.కోట్లలో పలుకుతోంది. రెవెన్యూ అధికారులు భూ ఆక్రమణలపై క్షేత్రస్థాయిలో సర్వే జరపడమే కాకుండా రికార్డులను కూడా పరిశీలిస్తుండడంతో కబ్జా చిట్టా మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. 18,476 మంది కబ్జాదారులు! జిల్లావ్యాప్తంగా ఆక్రమణకు గురైన పది వేల ఎకరాల్లో 18,476 మంది పాగా వేసినట్లు అధికార యంత్రాంగం తేల్చింది. ఇందులో అధికంగా మల్కాజిగిరి డివిజన్ పరిధిలో 17,590 మంది కబ్జాదారులు ఉన్నట్లు గుర్తించింది. చిన్నచిన్న బిట్లుగా ఉన్న స్థలాలపై కన్నేసిన అక్రమార్కులు.. వాటిని సొంతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది అండదండలు కూడా ఉండడంతో రికార్డులు తారుమారు చేయడం ద్వారా స్థలాల హక్కుల కోసం కోర్టుకెక్కుతున్నారు. ఇంటిదొంగలు హస్తం ఉండడంతో ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం ప్రభుత్వానికి తలకుమించిన భారంగా పరిణమించింది. ఆక్రమణదారుల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, బడాబాబులు ఉండడంతో అన్యాక్రాంతమవుతున్న జాగాలపై పట్టు బిగించలేకపోతోంది. ల్యాండ్ బ్యాంక్ సిద్ధం! ఐటీ కంపెనీలు, బహుళ జాతి సంస్థల పెట్టుబడులను ప్రోత్సహించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని తేవాలని భావిస్తున్న ప్రభుత్వం.. అందుకనుగుణంగా కంపెనీల స్థాపనకు ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేసింది. గతంలో టీఐఐసీ, హెచ్ఎండీఏ, రాజీవ్ స్వగృహ, దిల్ తదితర సంస్థలకు బదలాయించిన భూముల్లో వినియోగంలోకిరాని భూములతోపాటు, పారిశ్రామిక అవసరాలకు పోను అట్టిపెట్టుకున్న భూముల వివరాలను కూడా సేకరించింది. ఈ నేపథ్యంలో తాజాగా 30 వేల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. అగ్రశ్రేణి సంస్థలు, ఫార్మా రంగం కంపెనీలు రాజధాని శివార్లలోనే పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపే అవకాశం ఉండడంతో అక్ర మార్కుల చేతుల్లోని భూములను కూడా రాబట్టుకునే దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా ప్రభుత్వ భూముల వివరాలు, ఆక్రమణలకు సంబంధించి సర్వే నంబర్ల వారీగా వివరాలను సేకరిస్తోంది. -
హుదూద్...అప్రమత్తం
రాంనగర్ : ‘‘హుదూద్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది... రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి’’ అని కలెక్టర్ టి.చిరంజీవులు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ తన చాంబర్లో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగకుండా సమర్థంగా పనిచేయాలన్నారు. ప్రజలకు వైద్య సౌకర్యం అందించేందుకు 108 వాహనాలను సిద్ధం చేయాలన్నారు. తహసీల్దార్లు, ఇతర అధికారులు సెలవులో వెళ్లరాదని, విధిగా హెడ్‌క్వార్టర్లలోనే పనిచేయాలని ఆదేశించారు. ఇప్పటికే పూర్తి నీటిసామర్థ్యంతో చెరువులు, కుంటలు నిండి ఉన్నాయని, బలహీనంగా ఉన్నవాటిని ముందస్తుగానే గుర్తించి ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా అన్ని చర్యలూ తీసుకోవాలని ఇరిగేషన్ ఇంజినీర్లను ఆదేశించారు. సోమవారం భారీ వర్షాలు కురిస్తే పాఠశాలలకు అవసరమైతే సెలవు ప్రకటించాలని డీఈఓకు సూచించారు. పట్టణాలలో మురుగుకాల్వలు, పెద్ద డ్రెయినేజీలు చెత్తాచెదారంతో నిండి కాలనీలు జలమయం కాకుండా ఉండేందుకు ముందస్తుగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశిం చారు. ముఖ్యంగా రైల్వేట్రాక్ వెంట భారీగా వరద నీరు ప్రవహించడాన్ని గుర్తించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాద హెచ్చరికలు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రజలనుంచి సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో 1800-425-1442 నంబర్‌తో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఏైవైనా సమస్యలు, సమాచారం ఉంటే ఈ నంబర్‌కు ఫోన్‌చేసి చెప్పాలని కోరారు. -
ముగిసిన భూసర్వే
ఖమ్మం అర్బన్: ప్రభుత్వ భూములను గుర్తించే ప్రక్రీయలో భాగ ంగా రెవెన్యూ యంత్రాంగం ఆదివారం సాయంత్రం వదరకు సమగ్ర సర్వే నిర్వహించారు. మొత్తం 17 రెవెన్యూ గ్రామాల్లో 102 మంది అధికారులతో రెండురోజులు పాటు నిర్వహించారు. పలు గ్రామాల్లో ప్రభుత్వ, అసైన్డ్, చెరువులకు సంబంధించిన భూములు ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించి ఆ నీవేదికలను ఆర్డీఓ సంజీవరెడ్డికి అందజేశారు. సర్వేలో మొత్తం 17 రెవెన్యూ గ్రామాల పరిధిలో 102 మంది సిబ్బంది పాల్గొన్నారు. శనివారం చేపట్టిన సర్వేలో వీవీపాలె లో ఒక ఎకరం ప్రభుత్వ భూమిని సర్వే అధికారులు గుర్తించారు. చిమ్మపుడిలో 11 ఎకరాలు, శివాయిగూడెంలో ఐదెకరాలకు పైగా, రేగులచెలకలో ఇనాం భూమికి సంబంధించి సుమారు 30 ఎకరాల వరకు ఆక్రమణలకు గురైనట్లు తేల్చారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధితో పాటు అనుకొని ఉన్న రెవెన్యూ గ్రామాలైన వీవీపాలెం, బల్లేపల్లి, రఘునాథపాలెం, కోయచెలక, వెలుగుమట్ల, ధంసలాపురం, ఖానాపురం తదితర రెవెన్యూ గ్రామాల్లో అత్యంత విలువైన భూముల ఆక్రమణలు కొన్ని వెలుగులోకి వస్తున్నట్లు తెలిసింది. దీంతో ఇప్పటి వరకు ప్రభుత్వ భూములలో ఆక్రమణ చేసి నిర్మాణాలు చేసిన వారిలో సర్వేతో భయం పట్టుకుంది. ఈసర్వే కోసం జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో పని చేసే రెవెన్యూ ఉద్యోగులను రెండురోజుల సర్వే కోసం రప్పించి సర్వేను చేయించారు. జేసీ సురేంద్రమోహన్, ఆర్డీఓ సంజీవరెడ్డి, తహశీల్దార్ వెంకారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సర్వే తీరును గ్రామాల్లోకి పరిశీలించారు. -
బతుకమ్మ ఆటకు స్థలం లేదు!
కబ్జా గుప్పిట చారిత్రక గుట్ట సహకరిస్తున్న రెవెన్యూ యంత్రాంగం మౌనముద్రలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తెలంగాణ పల్లె ఆత్మను ప్రతిబింబించే సద్దుల బతుకమ్మ జిల్లాలో వైభంగా జరుగుతుంది. హన్మకొండ పద్మాక్షి గుట్ట వద్ద జరిగే సద్దుల బతుకమ్మ ఉత్సవాలను చూసి తీరాల్సిందే. రాష్ట్రంలో సద్దుల బతుకమ్మ అంటే.. పద్మాక్షి గుట్ట అనే అభిప్రాయం ఉంది. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత తొలి బతుకమ్మ పండుగ దగ్గరకు వస్తోంది. అయితే, వరంగల్‌లో సద్దుల బతుకమ్మ ఆడే స్థలం మాత్రం కరిగిపోతోంది. ప్రసిద్ధిగాంచిన పద్మాక్షి గుట్ట ఇప్పుడు కబ్జా కోరల్లో చిక్కుకుంది. సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ నగరంలోని భూ ఆక్రమణదారులు పద్మాక్షి గుట్టకు గురిపెట్టారు. ఇప్పటికే గుట్ట చుట్టూ స్థలం చాలావరకు ప్రైవేటు పరమైంది. తెలంగాణలో జరగనున్న తొలి బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతుంటే.. ప్రతిష్టాత్మక స్థలం పరాధీనమవుతున్నా టీఆర్ఎస్కు చెందిన ఎంపీలుగానీ, ఎమ్మెల్యేలు గానీ పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో రెవెన్యూ అధికారులు ఉదాసీనంగా ఉండడం ఆరోపణలకు తావిస్తోంది. వరంగల్ నగరం విస్తరించి జనాభా పెరుగుతుండడంతో మారుమూల ప్రాంతాల్లోనూ స్థలాల ధరలు పెరిగాయి. హన్మకొండలోని పద్మాక్షి గుట్ట ప్రాంతం పరిస్థితి ఇలాగే ఉంది. రెవెన్యూ రికార్డుల ప్రకారం 898 సర్వే నెంబరులో పద్మాక్షి గుట్ట, 78.03 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వం గతంలో 83 మందికి 80, 60 గజాల చొప్పున ఇళ్ల స్థలాలను కేటాయించింది. ప్రభుత్వం కేటాయించిన భూములు మినహా మిగిలిన భూమి ఎంత ఉంటుందనేది రెవెన్యూ అధికారులు స్పష్టం చేయడం లేదు. రాజకీయంగా పలుకుబడి ఉన్న పలువురు నాయకులు, వారి అనుచరులు ఇష్టారాజ్యంగా భూములను కబ్జా చేస్తున్నారు. రెవెన్యూ అధికారుల సహకారంతో గుట్టను, చుట్టుపక్క భూములను సొంతం చేసుకుంటున్నారు. గుట్టకు సమీపంలోని ప్రైవేటు వ్యక్తుల పట్టా భూములను చూపి... ఆ పక్కన ఉండే ప్రభుత్వ భూముల్లోనూ కట్టడాలు మొదలుపెడుతున్నారు. ప్రతిష్టాత్మక భూములు కావడంతో నేరుగా ప్రైవేటు నిర్మాణాల జోలికి పోవడం లేదు. మొదట దేవుళ్ల రూపాలను పెట్టి ఆ పక్కన ఉండే స్థలాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నారు. మరికొందరు దేవుళ్ల పేరిట సంస్థలు స్థాపించి.. రెవెన్యూ అధికారుల సహకారంతో తర్వాత సొంతం చేసుకుంటున్నారు. ఇటీవలి వరకు అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నేతలు, వారి అనుచరులు ఇన్నాళ్లు గుట్టను సొంతం చేసుకున్నారు. ఇతర పార్టీ నేతలు కొందరు శ్మశానాన్ని సైతం ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. అప్పుడు చోద్యం చూసిన రెవెన్యూ ఉన్నతాధికారులు ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. ఇలా జరుగుతోంది... పద్మాక్షి గుట్ట ఉన్న 898 సర్వే నెంబరులో కొంత భాగం ఖాళీగా ఉంది. మూడేళ్ల క్రితమే కొందరు ఈ స్థలంలో చిన్న గుడి నిర్మాణాన్ని మొదలుపెట్టారు. దీన్ని గమనించిన రెవెన్యూ అధికారులు మొదట అడ్డుకున్నారు. ఆ తర్వాత కబ్జాదారులకు సహకరించారు. వెంటనే గుడి నిర్మాణం పూర్తయింది. పద్మాక్షి గుట్ట పరిధిలో గల ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ పెరిగింది. ప్రభుత్వ స్థలాలకు హద్దులు గుర్తించి పాతిన రాళ్ళను తొలగించారు. గుడి వెనుకాల గల గుట్టను కొల్లగొడుతున్నారు. రెండు ఇళ్ల నిర్మాణాలు చేపట్టేంత మేరకు చదును చేశారు. గుట్టను ఆనుకుని ఉన్న పట్టా స్థలాలకు, ప్రభుత్వ స్థలాల సరిహద్దులో కొత్తగా గుడి, విగ్రహాలు పెడుతున్నారు. దీన్ని ఆసరగా చేసుకుని గుట్టను, గుట్ట స్థలాన్ని కబ్జా చేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే.. కొన్నాళ్లలో పద్మాక్షి గుట్ట మొత్తం కరిగిపోయే ప్రమాదం ఉంది. -
వర్షాలతో తస్మాత్ జాగ్రత్త
చెరువులు, నదులకు గండ్లు పడే ప్రమాదం అధికారులు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ యువరాజ్ ఆదేశం విశాఖ రూరల్: జిల్లాలో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నందున రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి డివిజనల్, మండల స్థాయి అధికారులతో సోమవారం నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వర్షాలు తీవ్రమైతే రోడ్లకు, చెరువులకు, నదులకు, కాల్వలకు గండ్లు పడే అవకాశమున్నందున గ్రామ స్థాయి వరకు ఉన్న రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండి, పరిస్థితులను పై అధికారులకు తెలియజేయాలన్నారు. అధికారులు హెడ్‌క్వార్టర్స్‌లో ఉండాలని ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ లబ్ధిదారులకు ఆధార్ నమోదు శత శాతం పూర్తి చేయాలన్నారు. భూములకు సంబంధించిన రికార్డుల ప్రక్రియను ఈ నెల 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. తహశీల్దార్ల బదిలీల నేపథ్యంలో 9 అంశాలతో కూడిన నివేదికను జిల్లాలోని అన్ని తహశీల్దార్ల కార్యాలయాలకు పంపినట్టు తెలిపారు. ఈ నివేదికను బదిలీపై వెళ్తున్న, వచ్చిన తహశీల్దార్లకు అందజేయాలన్నారు. అలా చేయని పక్షంలో బదిలీపై వెళ్తున్న పాత తహశీల్దార్ ఎల్పీసీ నిలుపుదల చేస్తామని హెచ్చరించారు. ఆధార్ నమోదు ప్రక్రియను ప్రభుత్వం ప్రతి రోజు సమీక్షిస్తోందని తెలిపారు. జిల్లాలోని 3.2 లక్షల పింఛనుదారుల్లో 2.87 లక్షల మందికి ఆధార్ నమోదు పూర్తయిందని, మిగిలిన వారితో కూడా ఆధార్ నమోదు పూర్తి చేయించాలన్నారు. కొంత మంది పింఛనుదారులు అస్వస్థతతో మంచానికే పరిమితమై ఉంటారని, వారికి కూడా ఆధార్ నమోదు చేయించేందుకు ఎంపీడీవోలు చొరవ చూపాలని చెప్పారు. గ్రామాల్లో చెత్త పేరుకుపోవడంపై వస్తున్న వార్తలపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ఉపాధి హామీ పథకం ద్వారా డంపింగ్ యార్డుల ఏర్పాటు చేసే అవకాశమున్నందున ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. పాడేరు ఏజెన్సీలో 500 పాఠశాలల్లో టాయిలెట్స్ లేనట్టు గుర్తించామన్నారు. వాటికి నిధులు మంజూరు చేశామని, నిర్మాణ పనులు పూర్తి చేయించాలని పాడేరు సబ్ కలెక్టర్‌కు సూచించారు. సమావేశంలో జేసీ ప్రవీణ్‌కుమార్, ఏజేసీ నరసింహారావు, డీపీఓ సుధాకర్, డుమా పీడీ శ్రీరాములు నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
రుణం..అందనంత దూరం!
కర్నూలు(అగ్రికల్చర్): కౌలు రైతులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందడం లేదు. రుణ అర్హత కార్డులు ఇస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. జిల్లాలో కౌలు రైతులు రెండు లక్షల మంది ఉన్నారు. రెవెన్యూ యంత్రాంగం గత నెల 27 నుంచి ఈనెల 20వ తేదీ వరకు గ్రామగ్రామాన సభలు నిర్వహించింది. అయితే రుణ అర్హత కార్డుల కోసం 42 వేల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. వీటితో ప్రయోజనం లేదని తెలియడంతో చాలా మంది దరఖాస్తు చేసుకునేందుకు ముందుకు రాలేదు. కౌలు రైతులను ఆదుకునేందుకు 2011లో ‘సాగు రైతుకు రక్షణ హస్తం’ పేరుతో ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా మండలాల వారీగా తహశీల్దార్లు కౌలు రైతులను గుర్తించి వారికి రుణ అర్హత కార్డులను జారీ చేస్తున్నారు. వీటి ఆధారంగా బ్యాంకులు పంట రుణాలు ఇవ్వాల్సి ఉంది. ప్రకృతి విపత్తులు ఏర్పడినప్పుడు పంటలకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించాల్సి ఉంది. సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందజేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. కౌలుదారులకు వీటిలో ఏ ఒక్కటీ లభించడం లేదు. ఒక్క ఏడాది మాత్రమే చెల్లుబాటు అయ్యే విధంగా పంపిణీ చేస్తున్న రుణ అర్హత కార్డుల ఆధారంగా రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు రావడం లేదు. మొదటి ఏడాది అంటే 2011లో 58 వేల మందికి రుణ అర్హత కార్డులు పంపిణీ చేశారు. బ్యాంకర్లపై కలెక్టర్ ఒత్తిడి తీసుకురావడంతో కౌలు రైతులతో గ్రూపులు తయారు చేయించి 17,500 మందికి రూ.35 కోట్లు రుణాలుగా ఇచ్చారు. ఈ మొత్తం పంట వచ్చిన తర్వాత రికవరీ చేయాల్సి ఉంది. ఇందులో ఒక్క రూపాయి కూడా రికవరీ కాలేదనేది బ్యాంకర్లు చెబుతన్నారు. దీంతో మరుసటి ఏడాది నుంచి కౌలుదారులకు రుణాలు ఇవ్వడాన్ని పూర్తిగా తగ్గించారు . 2012లో 18,500 మందికిగాను 2,500 మందికి మాత్రమే రూ.5 కోట్లు రుణాలు ఇచ్చారు. 2013లో 35 వేల మందికిగాను వెయ్యి మందికి కోటి రూపాయలు రుణాలుగా ఇచ్చారు. గత మూడేళ్లలో మొత్తం 1.08 లక్షల మందికి రుణ అర్హత కార్డులు పంపిణీ చేయగా 21 వేల మందికి 41 కోట్ల రుణాలు ఇచ్చినా రికవరీ జీరో ఉన్నట్లుగా బ్యాంకర్లు చెబుతున్నారు. అయితే ఈ ఏడాది కచ్చితంగా కౌలుదారులకు రుణాలు ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి అధికారులకు ఆదేశాల జారీ చేశారు. రు ణాలు ఇవ్వండి.. రికవరీ చేయించే బాధ్యతను తాము తీసుకుంటామని ఉపముఖ్యమంత్రితో పాటు అధికార యంత్రాంగం బ్యాంకర్లకు భరో సా ఇస్తోంది. వీరి ఆదేశాలు ఏ మేరకు ప్రయోజనం చేకూరుస్తాయో వేచి చూడాల్సిందే. రెండేళ్లుగా తిరుగుతున్నా కొన్నేళ్లుగా భూములు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నా. 2012-13 సంవత్సరంలో ఎనిమిది ఎకరాల్లో వేరుశనగ, పత్తి పంటలు వేశాను. గత రెండు సంవత్సరాలు రుణ అర్హత కార్డులు తీసుకుని బ్యాంకులకు వెళితే ఎవ్వరూ పట్టించుకోలేదు. సక్రమంగా డబ్బు చెల్లిస్తానన్నా వినిపించుకోలేదు. బయట అధిక వడ్డీతో అప్పు తీసుకుంటున్నా. వ్యవసాయం కలిసిరాక జీవనం భారమవుతోంది. బ్యాంకోళ్లు పట్టించుకోనప్పుడు ఈ కార్డులతో ఉపయోగమేమి? - తెలుగు చంద్ర, కౌలుదారుడు, పెండేకల్, తుగ్గలి మండలం కౌలుదారుల జాబితాలు రాలేదు 2014 సంవత్సరానికి సంబంధించి బ్యాంకులకు ఇంకా కౌలుదారుల జాబితాలు రాలేదు. మండలాల వారీగా వెంటనే బ్యాంకులకు ఇవ్వాలని కలెక్టర్ ఇటీవల రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రుణ అర్హత కార్డుల ఆధారంగా కౌలుదారులకు రుణాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. రికవరీ లేదనే ఉద్దేశంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. అయినా ఈసారి రికవరీ బాధ్యత తీసుకుంటామని కలెక్టర్ చెబుతుండటంతో రుణాలు ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తాం. - నరసింహారావు, ఎల్డీటీఎం -
పరిహారం ఇవ్వకుండానే పొమ్మంటున్నారు
సీఎస్‌కు పోలవరం నిర్వాసితుల ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: పోలవరం నిర్వాసిత గ్రామాల్లో రెవెన్యూ యంత్రాంగం తమకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే ఖాళీ చేయిస్తున్నారని, పోలీసులతో బెదిరిస్తున్నారని గిరిజనులు ఆరోపించారు. ముంపు ప్రాంత గిరిజనులు శుక్రవారం డాక్టర్ పెంటపాటి పుల్లారావు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని కలిశారు. అనంతరం పుల్లారావు మాట్లాడుతూ.. దీనిపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశానని తెలిపారు. అలాగే కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లానన్నారు. మరోవైపు పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో వెంటనే జోక్యం చేసుకుని న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌కు, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్పర్సన్ రామేశ్వర్ ఓరాన్‌కు కేంద్ర గిరిజన వ్యవహారాలు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి వి.కిశోర్ చంద్రదేవ్ లేఖలు రాశారు.