సాక్షి, మచిలీపట్నం :ఓ వైపు సమైక్యాంధ్ర ఉద్యమ జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే మరోవైపు సీమాంధ్ర రాజధాని కోసం అనువైన ప్రాంతం కోసం పాలకులు వెదుకులాట మొదలెట్టారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి వచ్చిన ఉన్నతస్థాయి మౌఖిక ఉత్తర్వులతో పలు జిల్లాల కలెక్టర్లు రంగంలోకి దిగినట్టు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలో రాజధాని ఏర్పాటుకు అనువైన ప్రాంతం కోసం మందు నుంచే దృష్టి పెట్టినట్టు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు పరిశీలిస్తే అవగతమవుతోంది.
ఇప్పటికే సీమాంధ్రలోని విశాఖ నుంచి కడప వరకు ప్రభుత్వ భూములపై జిల్లా కలెక్టర్లు ఆరా తీసే పనిలో పడినట్టు తెలిసింది. ప్రధానంగా ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ కొత్త రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయన్న ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా కలెక్టర్ విజయ్‌కుమార్ ఈ నెల 2, 3తేదీల్లో ప్రత్యేకంగా ప్రభుత్వ భూమి ఎంత ఉంది, ఎక్కడెక్కడ ఉంది తదితర విషయాలపై తనకు పూర్తిస్థాయి నివేధిక ఇవ్వాలంటూ తహసిల్దార్‌లకు ఆదేశాలు ఇచ్చారు.
దీంతో ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ భూమిపై అక్కడి రెవెన్యూ యంత్రాంగం ఆరా తీసే పనిలో పడింది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నగరానికి ఆనుకుని సుమారు రెండు వేల ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నట్టు గుర్తించారు. దీనికితోడు ఒంగోలు నగర నడిబొడ్డు నుంచి జాతీయ రహదారి వెళ్లడం, సముద్ర తీరం దగ్గర ఉండటంతో రాజధానికి అనువైందిగా ప్రచారం జరుగుతోంది.
ఉన్నతస్థాయి అధికారుల మౌఖిక ఉత్తర్వులతో గుంటూరు జిల్లా కలెక్టర్ సురేష్‌కుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌లు ఇప్పటికే ప్రభుత్వ భూమి ఎంత ఉంది అనేది ఆరా తీస్తున్నారు. దీనిలో భాంగాగానే గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్శిటి ప్రాగణం సుమారు 350 ఎకరాల వరకు ఉండటంతో అక్కడ పరిపాలనకు అవసరమైన సముదాయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చన్న ప్రతిపాదన ఉంది.
మరోవైపు కృష్ణా-గుంటూరు జిల్లాల నడుమ సుమారు వెయ్యి నుంచి రెండువేల ఎకరాలకు వైగా ప్రభుత్వ భూమి ఉందని రెవెన్యూ వర్గాలు గుర్తించాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి కృష్ణా జిల్లా విజయవాడ నడుమ సుమారు ఐదు వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఏలూరు-విజయవాడ ప్రధాన రహదారికి అనుకుని పెదపాడు, బాపులపాడు, గన్నవరం మండలాల్లో ప్రభుత్వ భూమిపై క్షేత్ర స్థాయిలో ఆరా తీసేందుకు ఉన్నతాధికారులు ఆరాతీస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ భూమిపై పూర్తిస్థాయి నివేధిక ఇవ్వాలంటూ కృష్ణా జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి తాజాగా గన్నవరం, బాపులపాడు తహసిల్దార్‌లను ఆదేశించినట్టు సమాచారం. ఇదే విషయమై రెండు రోజుల క్రితం జిల్లా ఉన్నతస్థాయి ఆంతరంగిక సమావేశం నిర్వహించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
భూమి ధరలకు రెక్కలు..
రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర రాజధాని గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో హైకోర్టు ఒకచోట, సచివాలయం మరోచోట, అసెంబ్లీ ఇంకోచోట అనే ఏర్పాటు చేస్తారన్న ప్రచారంతో భూమి ధరలకు రెక్కలు వచ్చాయి. రాష్ట్ర విభజన ప్రకటనతో ఈ ప్రాంతంలో ఎకరం భూమి కోట్లు పలుకుతోంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమి సరిపోకపోతే ప్రత్యేకంగా ప్రైవేటు భూమిని సేకరించే అవకాశం ఉందన్న ప్రచారంతో ఇప్పటి నుంచే భూముల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రైవేటు భూమిని సేకరించాల్సి వస్తే అసరమైతే అసెంబ్లీలో పెట్టి భూ సేకరణ చట్టాన్ని మార్పులు చేస్తారన్న ప్రచారంతో ప్రైవేటు భూముల యజమానులు ఆశనిరాశల డోలాయమానంలో కొట్టుమిట్లాడుతున్నారు.
అవసరమైతే ప్రైవేటు భూమి ఎకరం రూ.50 లక్షలు వరకు ఇచ్చి భూ సేకరణ చేస్తారని, మాట వినకుంటే నిర్బంధంగానే అయినకాడికి ప్రభుత్వం తీసుకుంటున్న వాదనలతో ఆయా ప్రాంతాల్లో భూముల యజమానులు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఏది ఏమైనా రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించుకున్నట్టు సమైక్యాంధ్ర ఉద్యమ జ్వలలు ఎగిసిపడుతుంటే పాలకులు ప్రత్యేక రాష్ట్ర రాజధాని స్థల పరిశీలన చర్యలు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది.
ప్రభుత్వ భూములపై ఆరా
Published Wed, Aug 21 2013 12:53 AM | Last Updated on Thu, Mar 21 2019 8:30 PM
Advertisement
Advertisement