Public lands
-
మంచు తుపానులో మనుషుల్ని వదిలేసినట్లుగా ఉండకూడదు
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగుల సంక్షేమ ఫలాలు పేపర్లకే పరిమితం అవుతున్నాయని, అధికారులు ఏసీ గదుల్లో కూర్చుని సమీక్షలు చేస్తే అంతా భేషుగ్గానే ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. గ్రామ స్థాయిలో తనిఖీలు చేస్తే విస్తుపోయే నిజాలు బయట పడతాయని, దీని కోసం ఒకే ఒక్క జిల్లాలో అధ్యయనం చేస్తే సరిపోతుందని వ్యాఖ్యానించింది. గత 60 ఏళ్లుగా వృద్ధాశ్రమాల్లో 80– 90 ఏళ్ల వయసు వాళ్లు ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసింది. వసతులు లేని బ్రిటిష్ కాలంలోనే చాలా లోతుగా సమాచారాన్ని సేకరించారని, ఇప్పుడు అన్ని వసతులు, సాంకేతికత అరచేతిలో ఉన్నా ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించింది. అలస్కా మంచు తుపానులో కదల్లేకపోయిన వారిని వదిలేసినట్లుగా ఉండకూడదని ఘాటు వ్యాఖ్య చేసింది. లాక్డౌన్లో దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ఉత్తర్వులివ్వాలంటూ హైదరాబాద్‌కు చెందిన గణేశ్ కర్నాటి దాఖలు చేసిన పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం విచారించింది. కోర్టు విచారణకు హాజరైన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ కమిషనర్ దివ్య కల్పించుకుని దేశంలోనే అత్యధికంగా తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ల కోసం రూ.1,800 కోట్లు కేటాయించిందని, నెలకు రూ. 3,016 చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు అత్యవసరాల కోసం రూ.3.5 కోట్లను సిద్ధంగా ఉంచిందన్నారు. దీనిపై స్పందిం చిన ధర్మాసనం, లాక్డౌన్లో ఇబ్బందిపడే వారి కోసం రూ.10 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించింది. వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల్లో 45 వేల మంది దివ్యాంగులు ఉంటే ఆ జిల్లాలకు రూ.లక్ష కేటాయిస్తే ఏ మూలకు సరిపోతాయని అడిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం లో 10.46 లక్షల మంది దివ్యాంగులు ఉంటే ఇప్పుడు పెరిగే ఉంటారని, వారి జనాభాకు అనుగుణంగా సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే ఎలాగని ప్రశ్నించింది. దివ్యాంగుల బతుకులు మరొకరికి భారం కాకూడదని హితువు చెప్పింది. దీనిపై దివ్య సమాధానమిస్తూ.. అంగన్వాడీ వర్కర్ల ద్వారా రూ.3.5 కోట్ల నిధి గురించి వీడి యో కాన్ఫరెన్స్‌లో వివరించామని, 1,533 మంది దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. అనంతరం విచారణ జూలై 16కి వాయిదా పడింది. మాయమైపోతున్న ప్రభుత్వ భూములు సాక్షి, హైదరాబాద్: నిన్న మొన్నటి వరకు కళ్ల ముందు కనబడిన ప్రభుత్వ భూములు, చెరువులు మాయం అవుతుంటే ప్రభుత్వం ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడ చెరువు, కుత్బుల్లాపూర్ మండలం సూరారంలోని కట్టమైసమ్మ చెరువు, మూసీ నది ఆక్రమణలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలన్నింటినీ కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం విచారించింది. మూసీ నది గురించి గూగుల్‌లో చూస్తే ఎంతగా ఆక్రమణలకు గురైందో తెలుస్తుందని, మురుగు నీటిని మూసీలోకి మళ్లిస్తుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. మూసీ నదికి సమీపం లోని వారు కాలుష్యంతో కలిసి కాపురం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ వాదనలు ఒకే రీతిగా లేకపోవడాన్ని తప్పుబట్టింది. మాస్టర్‌ప్లాన్, రెవెన్యూ, నీటిపారుదల, హెచ్ఎండీఏ రికార్డుల్లో అక్కడ ఏముందో పూర్తి వివరాలు నివేదించాలని ఆదేశిం చింది. వాదనల అనంతరం విచారణను వచ్చే నెల 15కి వాయిదా వేసింది. -
భూముల వేలం నిలిపివేతకు ‘నో’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కోసం అవసరమైన నిధులను సమీకరించే నిమిత్తం ప్రభుత్వ భూములను విక్రయించేందుకు ఈనెల 28న జరగనున్న తొలిదశ ఆన్లైన్ వేలం ప్రక్రియను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో ఈ దశలో ఎటువంటి ఉత్తర్వులు జారీచేయడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. అయితే, ఈ భూముల విక్రయాలు మాత్రం ఈ వ్యాజ్యంలో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్‌కుమార్, జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం తలపెట్టిన భూముల విక్రయాన్ని అడ్డుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త సురేష్‌బాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ రాకేష్‌కుమార్, జస్టిస్ సురేష్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. రాజకీయ ముసుగులో ‘పిల్’లు ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అణగారిన వర్గాలు, కోర్టులను ఆశ్రయించలేని పేదలు, తదితరుల కోసం ఉద్దేశించిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) నేడు తీవ్రస్థాయిలో దుర్వినియోగమవుతోందని వివరించారు. రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల ముసుగులో ‘పిల్’లు దాఖలు చేయడం ఇటీవల కాలంలో ఎక్కువైపోయిందన్నారు. ఇప్పుడు ప్రభుత్వ భూముల విక్రయాన్ని అడ్డుకోవాలంటూ దాఖలు చేసిన ఈ వ్యాజ్యం కూడా రాజకీయ ప్రయోజనాలను ఆశించే దాఖలు చేశారని వివరించారు. పిల్‌ను దుర్వినియోగం చేయడమంటే, అది న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనన్నారు. భూములమ్మే అధికారం ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వ భూములను విక్రయించడం ఇదేమీ మొదటిసారి కాదని, గత ప్రభుత్వాలు కూడా విక్రయించాయని ధర్మాసనం దృష్టికి పొన్నవోలు తీసుకొచ్చారు. ప్రభుత్వ భూములను విక్రయించే అధికారం ప్రభుత్వానికి ఉందని.. విక్రయించరాదని ఎక్కడా నిషేధం లేదన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, లాక్డౌన్ సమయంలో ఏ రకమైన వేలం ప్రక్రియలు చేపట్టరాదని హైకోర్టు గతంలోనే ఆదేశాలిచ్చింది కదా అని గుర్తుచేసింది. వేలం విషయంలో ప్రభుత్వాన్ని నియంత్రించలేదని సుధాకర్‌రెడ్డి తెలిపారు. అయినా.. పేద రాష్ట్రంగానే ఎందుకుంది? అందరి వాదనలు విన్న ధర్మాసనం, మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడానికి నిరాకరించింది. అయితే.. భూముల విక్రయాలు మాత్రం తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టంచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సమయంలో ధర్మాసనం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఆంధ్రప్రదేశ్‌లో మంచి సారవంతమైన భూములున్నాయి.. మంచి పంటలు పండుతాయి.. ఇక్కడ ప్రజలు సంపన్నులు.. అయినప్పటికీ పేద రాష్ట్రంగానే ఎందుకుంది’ అని వ్యాఖ్యానించింది. దీనికి సుధాకర్‌రెడ్డి బదులిస్తూ.. రాష్ట్ర విభజన తరువాతే ఏపీ ఆర్థికంగా బాగా నష్టపోయిందని, పరిశ్రమలన్నీ హైదరాబాద్‌లోనే ఉండిపోయాయని చెప్పారు. ప్రభుత్వం తీసుకునే ప్రతీ విధాన నిర్ణయాన్ని ఇలా రాజకీయ కారణాలతో సవాలు చేస్తూ ఉంటే తాము చేసేది ఏముంటుందని సుధాకర్‌రెడ్డి తెలిపారు. తాము రాజకీయాల జోలికి వెళ్లడంలేదంటూ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. గతంలో లాగా జేబులు నింపుకోవడానికి అమ్మడంలేదు.. డబ్బు కోసం ఇలా ప్రభుత్వ భూములను అమ్మడం సబబేనా? అని ధర్మాసనం ప్రశ్నించింది. గతంలో లాగా జేబులు నింపుకోవడానికి భూములు అమ్మడంలేదని.. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుకు అవసరమైన నిధుల కోసం భూములు అమ్ముతున్నామని సుధాకర్‌రెడ్డి చెప్పారు. ఈ సమయంలో పిటిషనర్ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు జోక్యం చేసుకుంటూ.. గుంటూరులో మార్కెట్ స్థలాన్ని అమ్మేస్తున్నారని చెప్పారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్మోహన్రెడ్డి అభ్యంతరం తెలిపారు. అక్కడ ఇప్పుడు మార్కెట్ లేదని, మరోచోట మార్కెట్ నిర్మించామని, చక్కగా అక్కడ కార్యకలాపాలు సాగుతున్నాయని చెప్పారు. ఈనెల 28న ఆన్లైన్ వేలం ఉందని, అందువల్ల వేలాన్ని అడ్డుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా.. ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని పొన్నవోలు అభ్యర్ధించారు. -
రెచ్చిపోతున్న పచ్చ మాఫియా
తిరుమనకొండను తవ్వి గ్రావెల్ అక్రమ తరలింపు అధికార పార్టీ అండదండలు పట్టించుకోని అధికారులు మండల కేంద్రం సంగానికి కూతవేటు దూరంలో ఉన్న తిరుమనకొండను తవ్వి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారు. కొందరు పచ్చ కార్యకర్తలు మాఫియాగా ఏర్పడి ఇక్కడి నుంచి అక్రమంగా గ్రావెల్‌ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తిరుమనకొండపై ఏకంగా యంత్రాలను పెట్టి భారీగా గోతులు తీసి గ్రావెల్‌ను తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సంగం(ఆత్మకూరు): సంగం, బుచ్చి మండలాల్లో గ్రావెల్‌కు మంచి డిమాండ్ ఉండడంతో కొందరు పచ్చ కార్యకర్తలు అక్రమంగా తిరుమనకొండను తవ్వేస్తున్నారు. ఇది ప్రభుత్వ భూమి అని, ఎవరూ ప్రవేశించడానికి వీలు లేదంటూ సంగం తహసీల్దారు రామాంజనేయులు బోర్డులు ఏర్పాటు చేసినా మాఫియా గ్రావెల్ తరలింపులను ఆపలేదు. ఈ బోర్డులు అలంకారప్రాయంగా మిగిలిపోయాయి. సంగం సర్వే నెం.252/ఏ2లో 15 ఎకరాల తిరుమనకొండ ప్రభుత్వ భూమిగా ఉంది. గత కొంతకాలంగా ఇక్కడ గ్రావెల్‌ను అక్రమంగా తరిలిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు గత వారంలో ధైర్యం చేసి ఒక జేసీబీ యంత్రాన్ని, 10 ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న వీటిపై కేసులు నమోదు చేసే ధైర్యం చేయలేకపోయారు. అధికార పార్టీ స్థానిక నేతల నుంచి మంత్రుల స్థాయి వరకు ఫోన్లు, బెదరింపులు వస్తుండడంతో వీటిని వదిలేశారు. అధికార పార్టీ నేతల బెదిరింపులతో తిరుమనకొండ వైపు చూడడానికి అధికారులు సాహసం చేయడం లేదు. దీంతో రెచ్చిపోతున్న పచ్చగ్రావెల్ మాఫియా భారీగా గ్రావెల్‌ను తరలిస్తుంది. యథేచ్ఛగా తరలింపు ఏకంగా తిరుమనకొండ పైకి రహదారి ఏర్పాటు చేసి మరీ యథేచ్ఛగా గ్రావెల్ తరలిస్తున్నారు. పగలు, రాత్రి ఈ గ్రావెల్ తరలింపు వల్ల దుమ్ము విపరీతంగా వచ్చి ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికంగా నివాసమున్న దళితులు వాపోతున్నారు. ట్రాక్టర్ గ్రావెల్‌ను సంగానికి తరలించడానికి రూ.1000, బుచ్చిరెడ్డిపాళేనికి అయితే రూ.1500 వసూలు చేస్తున్నారు. రోజుకు 100 ట్రిప్పులు గ్రావెల్ తరలిపోతున్నట్లు తెలుస్తోంది. లక్షల్లో చేతులు మారుతున్నాయి. గ్రావెల్ తరలింపును అడ్డుకోవాల్సిన మైనింగ్ శాఖ మాత్రం ఇటు వైపు దృష్టి సారించిన దాఖలాలు లేవు. ఇప్పటికే మైనింగ్ శాఖకు నెలసరి మామూళ్లు ఇచ్చేలా గ్రావెల్ మాఫియా ఏర్పాటు చేసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మైనింగ్ శాఖ పనిచేయకుండా నెలసరి మామూళ్ల మత్తులో జోగుతూ తరలింపుదారులకు సహకరిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ ముత్యాలరాజు స్పందించి ప్రభుత్వ భూముల్లో అక్రమ గ్రావెల్ తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. చర్యలు తప్పవు తిరుమనకొండ ప్రాంతం పూర్తిగా ప్రభుత్వ భూమి. దీనిలో అక్రమంగా గ్రావెల్ తరలిస్తే చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే అక్కడ బోర్డులు ఏర్పాటు చేశాం. అయినా అక్రమాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం. – రామాంజనేయులు, తహసీల్దారు, సంగం -
మంత్రి గంటాకు హైకోర్టు నోటీసులు
ప్రభుత్వ భూముల తాకట్టుపై ప్రత్యూష డైరెక్టర్లందరికీ నోటీసులు సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా, ఆనందపురం మండలం, వేములవలస గ్రామంలోని పలు సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూములను తాకట్టుపెట్టి రూ.141 కోట్ల రుణాలు తీసుకున్న వ్యవహారంలో ఉమ్మడి హైకోర్టు స్పందించింది. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ప్రత్యూష డైరెక్టర్లు పరుచూరి రాజారావు, పరుచూరి ప్రభాకరరావు, పరుచూరి వెంకట భాస్కరరావులతో పాటు ఆ సంస్థ ప్రతినిధులు కొండయ్య బాల సుబ్రహ్మణ్యం, నార్ని అమూల్య, ప్రత్యూష ఎస్టేస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు నోటీసులు జారీ చేసింది. వీరితో పాటు రెవెన్యూ, హోంశాఖల ముఖ్య కార్యదర్శులు, జిల్లా రిజిష్ట్రార్, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఇండియన్ బ్యాంక్ మేనేజర్లకు సైతం నోటీసులిచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ భూములను తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్న వ్యవహారంలో మంత్రి గంటాతో పాటు ప్రత్యూష రీసోర్సెస్ ఇన్ఫ్రా డైరెక్టర్లు, ఇండియన్ బ్యాంక్ అధికారు లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గాజువాకకు చెందిన సాలాది అజయ్‌బాబు గత వారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. -
చెప్పిన పని చేయకుంటే నీ అంతు చూస్తాం
- నెల్లూరు జిల్లా దగదర్తి మహిళా ఆర్ఐపై టీడీపీ నేతల దౌర్జన్యం - ప్రభుత్వ భూముల్ని తమ పేరిట పట్టాలుగా మార్చాలని ఒత్తిడి - టీడీపీ నేతల మీద చర్యలు కోరుతూ సిబ్బంది సామూహిక సెలవు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. తమ దోపిడీకి సహకరించని అధికారులపై ఏకంగా దాడులకు దిగుతున్నారు. తాజాగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దగదర్తి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్(ఆర్ఐ) కామాక్షిపై స్థానిక తెలుగుదేశం నేతలు ప్రతాపం చూపారు. ప్రభుత్వ భూముల్ని తమ పేరిట పట్టాలుగా మార్చాలన్న వారి వినతిని తోసిపుచ్చడమే ఆమె చేసిన తప్పు. తమ మాట విననందుకు బూతులు తిడుతూ.. దాడికి తెగబడ్డారు. సంఘటనకు దారితీసిన కారణాలివీ.. దగదర్తి వద్ద విమానాశ్రయ నిర్మాణం, పారిశ్రామిక అవసరాలకోసం ఏపీఐఐసీ వేలాది ఎకరాల భూములు సేకరిస్తోంది. ఈ క్రమంలో ఏడాదిన్నర నుంచి కావలి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు భూముల రికార్డుల తారుమారుకోసం రెవెన్యూ అధికారుల మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో కాట్రాయపాలెం గ్రామంలోని ప్రభుత్వ భూముల్ని తమ పేరుమీద పట్టాలుగా మార్చి వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో నమోదు చేయాలంటూ మండల టీడీపీ నేతలు నెలన్నరగా ఆర్ఐ కామాక్షిపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. తమ పని చేయకపోతే సెలవులో వెళ్లాలని బెది రిస్తున్నారు. వారి ఒత్తిడికి కామాక్షి తలొగ్గలేదు. కార్యాలయంలోనే దౌర్జన్యం బుధవారం సాయంత్రం ఆర్ఐ కార్యాలయంలో ఉండగా సుమారు 20మంది టీడీపీ నేతలు వెళ్లి ‘చెప్పిన పని చేయకపోతే నీ అంతు చూస్తాం. జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర మనుషులం’ అని బెదిరించారు. ప్రభుత్వ రికార్డులు మార్చడం కుదరదని ఆర్ఐ తెగేసి చెప్పడంతో మహిళనీ చూడకుండా బూతులు తిట్టారు. ఇతర ఉద్యోగులు అడ్డుపడి వారిని అదుపు చేశారు. తనమీద జరిగిన దౌర్జన్యం పట్ల కామాక్షి కన్నీటి పర్యంతమయ్యారు. తహసీల్దార్ మధుసూదనరావుతోపాటు కావలి ఆర్డీవో లక్ష్మీనరసింహానికి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల నుంచి గురువారం సాయంత్రందాకా స్పందన రాకపోవడంతో శుక్రవారం సిబ్బంది మొత్తం సామూహిక సెలవు పెట్టారు. దీంతో తహసీల్దార్ సిబ్బందిని ఆర్డీవో లక్ష్మీ నరసింహం వద్దకు తీసుకెళ్లి సమస్యను సావధానంగా పరిష్కరించుకుందామని బుజ్జగించే ప్రయత్నం చేశారు. సిబ్బంది ససేమిరా అన్నారు. దౌర్జన్యానికి దిగినవారిపై ఈ నెల 13వ తేదీలోగా కేసులు నమోదుచేసి చర్యలు తీసుకోంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. దీనిపై జాయింట్ కలె క్టర్ మహ్మద్ ఇంతియాజ్, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ నాయకులకు ఫిర్యాదు చేశారు. ఆర్.ఐ కామాక్షి దీన్ని నిర్ధారించారు.తనపై దౌర్జన్యం జరగడం వాస్తవమేన్నారు. -
క్రమబద్ధీకరణ 15 శాతమే!
♦ భూముల క్రమబద్ధీకరణకు ఆన్లైన్ సమస్యలు ♦ దరఖాస్తుల్లో 15 శాతానికి మించని రిజిస్ట్రేషన్లు ♦ కొంచెం నివాసం, మరికొంత వాణిజ్య ప్రాంతంతో సమస్యలు ♦ అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణమని ఆరోపణలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. వివిధ దశల్లో ఆన్లైన్ సమస్యలు చుట్టుముడుతుండడంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ఏడాది క్రితమే సొమ్ము చెల్లించినా భూములను రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ భూముల్లో నివాసాలేర్పరచుకున్న మధ్య, ఉన్నత వర్గాలకు నిర్దేశిత ధర చెల్లిస్తే ఆయా భూములను క్రమబద్ధీక రించాలని ప్రభుత్వం జీవో 59లో పేర్కొన్న సంగతి తెలిసిందే. 2014 డిసెంబర్లో ఈ జీవో జారీ కాగా, రాష్ట్రవ్యాప్తంగా 28,248 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటివరకు అధికారులు క్రమబద్ధీకరించినవి 15 శాతం లోపే కావడం గమనార్హం. చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణ నిమిత్తం భూపరిపాలన అధికారులు కొనుగోలు చేసిన సాఫ్ట్‌వేర్‌లో రోజుకోరకమైన సమస్యలు తలెత్తుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్‌ను అందించిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, క్రమబద్ధీకరణ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో అంతా గందరగోళంగా తయారైందని క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది వాపోతున్నారు. కమర్షియల్‌తో కిరికిరి..! ప్రభుత్వ భూముల్లో నివాసాలేర్పరచుకున్న వారికి ఆయా భూములను రెసిడెన్షియల్ కేటగిరీ కింద రిజిస్ట్రేషన్ బేసిక్ వాల్యూలో 25శాతం, వాణిజ్య కేటగిరీలోనైతే పూర్తి సొమ్ము చెల్లిస్తే ఆయా భూములను క్రమబద్ధీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, నగర, పట్టణ ప్రాంతాల్లో ఎంతోమంది ఆర్థికంగా కలసివస్తుందని తమ ఇంటి ఆవరణల్లోనే గదుల(దుకాణాల)ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సదరు ఇల్లు వాణిజ్య కేటగిరీనా, రెసిడెన్షియల్ కేటగిరీనా అన్న అంశాన్ని అధికారులు తేల్చుకోలేకపోతున్నారు. కొంత ప్రదేశం నివాస ప్రాంతంగానూ, మరికొంత ప్రదేశం వాణిజ్య ప్రాంతంగానూ చూపేందుకు సాఫ్ట్‌వేర్‌లో వెసులుబాటు లేకపోవడంతో పరిస్థితి జఠిలంగా మారింది. ఇటువంటి జాగాలను వాణిజ్య కేటగిరీ కిందనే పరిగణించాలని ఇటీవల సీసీఎల్ఏ స్పష్టం చేయడంతో అంత సొమ్ము తాము చెల్లించలేమంటూ లబ్ధిదారులు చేతులెత్తేస్తున్నారు. కమర్షియల్ కిరికిరి ఇలా ఉంటే.. పూర్తిస్థాయిలో నివాస ప్రాంతాల్లోనూ అధికారుల సమన్వయ లోపం కారణంగా కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు జరగడం లేదని అంటున్నారు. అంతేకాక రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా పత్రాల జారీలో పలు సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. రూ.లక్షలు పోసి కొనుగోలు చేస్తున్నా, సరైన విధంగా పత్రాలను ఇవ్వకపోవడం పట్ల లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సబ్ రిజి స్ట్రార్ల పేచీ.. ఇదిలా ఉండగా హైదరాబాద్‌తో పాటు కొన్ని జిల్లాల్లో జీవో 59 ప్రకారం స్టాంప్ డ్యూటీ మినహాయింపుపై జిల్లా కలెక్టర్ల నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదంటూ. రిజిస్ట్రేషన్లు చేసేందుకు సబ్ రిజిస్ట్రార్లు ససేమిరా అంటున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో సాఫ్ట్వేర్ సమస్యల పరిష్కారం పట్ల సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారులు శ్రద్ధ చూపడం లేదని, ఫిర్యాదు చేసినా భూపరిపాలన అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియంతా ఒక డిప్యూటీ కలెక్టర్ కేంద్రంగానే నడుస్తుండడం, ఆమెకు వాస్తవ పరిస్థితులపై అవగాహన లేకపోవడంవల్లే మొత్తం ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైందని కొందరు ఆర్డీవోలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరుతో క్రమబద్ధీకరణ ప్రక్రియకు గడువు ముగియనున్నందున ఇప్పటికైనా సీసీఎల్ఏ స్పందించి ఆన్లైన్లో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని, చిన్నచిన్న దుకాణాలున్న నివాసాలకు కమర్షియల్ కేటగిరీ వర్తింపజేయడంపై పునఃపరిశీలించాలని తహసీల్దార్లు,లబ్ధిదారులు కోరుతున్నారు. -
రూ.13,500 కోట్లకు వచ్చింది 392 కోట్లే..!
♦ భూముల విక్రయంపై సర్కారు అంచనాలు తలకిందులు ♦ మొదటి విడత వేలంలో అమ్ముడుపోని భూములు ♦ రెండో విడత భూముల అమ్మకానికి రంగం సిద్ధం సాక్షి. హైదరాబాద్: సర్కారు భారీ అంచనాలు పల్టీ కొట్టాయి. మొదటివిడతలో భూముల అమ్మకం ద్వారా సర్కారుకు కేవలం రూ.392 కోట్ల ఆదాయం వచ్చింది. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములు, ఆస్తులను అమ్మి అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించుకుంది. వీటి ద్వారా రూ.13,500 కోట్ల భారీ ఆదాయం వస్తుందని బడ్జెట్లో అంచనా వేసుకుంది. కానీ ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగకపోవడం, వేలం వేసిన కొన్ని స్థలాలకు సైతం మి శ్రమ స్పందన రావడంతో అంచనాలు తలకిం దులయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగి సేందుకు ఇంకో నెల మాత్రమే మిగిలి ఉంది. భూములు అమ్మితే వస్తుందనుకున్న ఆదాయంలో ఇప్పటివరకు మూడు శాతమే ఖజానాకు చేరింది. ప్రభుత్వం అన్ని జిల్లాల్లో నిరుపయోగంగా ఉన్న సర్కారు స్థలాల వివరాలను కలెక్టర్ల నుంచి తెప్పించుకొని, కొన్నింటిని మొదటి విడతగా నవంబరులో విక్రయించిం ది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) ద్వారా భూముల అమ్మకానికి ఈ-వేలం నిర్వహించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కొన్ని స్థలాలనే తొలి దశలో వేలం వేశారు. నగర శివార్లలోని రాయదుర్గంలో గరిష్టంగా ఒక ఎకరానికి రూ.29 కోట్ల వరకు ధర పెట్టి కొనేందుకు ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కానీ వేలం వేసిన భూముల్లో కొన్నింటికి అసలు స్పందనే లేదు. విస్తీర్ణంలో ఆ స్థలాలు చిన్నవిగా ఉండటంతోపాటు కొనేందుకు కంపెనీలు ముందుకు రాలేదు. ప్రైవేటు వ్యక్తులు, బిల్లర్లు ఆసక్తి ప్రదర్శించలేదు. కొన్ని స్థలాలకు అప్రోచ్ రోడ్లు లేకపోవటంతోపాటు మౌలిక సదుపాయాలలేమి కారణంగా అమ్ముడుపోలేదు. మరోవైపు మార్కెట్లో ఉన్న రేటు కంటే ప్రభుత్వం కనీస వేలం ధరను ఎక్కువగా నిర్ణయించిందనే విమర్శలున్నాయి. వచ్చే నెల్లో రెండో విడత వేలం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతోపాటు ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో ప్రభుత్వం మళ్లీ భూముల అమ్మకానికి తెర లేపింది. వచ్చే నెల్లో రెండో దశ భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ దశలో రూ.1,500-2,000 కోట్ల ఆదాయాన్ని అర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి తగు జాగ్రత్తలు పాటించాలని సర్కారు భావిస్తోంది. మొదటిదఫాలో మిగిలిన స్థలాలతో పాటు మరి కొన్నింటిని చేర్చి రెండోదశ వేలం బాధ్యతను టీఎస్ఐఐసీకి అప్పగించనుంది. కొనుగోలుదార్లకు వెసులుబాటు కల్పించేలా గతంలోని నిబంధనల్లోనూ కొన్ని మార్పులు చేసే అవకాశాలున్నాయి. అప్రోచ్ రోడ్లు లేని కారణంగా కొన్ని స్థలాలు అమ్ముడుపోలేదని గుర్తించిన అధికారులు.. వేలం వేసేందుకు ముందే రోడ్ల నిర్మాణం చేపడితే పెట్టుబడిదారులను ఆకట్టుకునే వీలుందని యోచిస్తున్నారు. తమకు కొన్ని నిధులు కేటాయిస్తే రహదార్లను అభివృద్ధి చేస్తామంటూ ఇటీవలే టీఎస్ఐఐసీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. -
హద్దులు దాటిన గ‘లీజు’
అక్రమార్కులు ‘హద్దు’ మీరారు. లీజు తీసుకున్న ప్రాంతాన్ని దాటి నాపరాతి తవ్వకాలు చేపడుతున్నారు. కోట్ల రూపాయల విలువైన సహజ సంపదను కొల్లగొడుతున్నారు. సర్కారు ఖజానాకు గండికొడుతున్నారు. ఇవేం గ‘లీజు’ పనులని ప్రశ్నిస్తే.. జిల్లాకు చెందిన మంత్రి పేరు చెప్పి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంకేం లీజుదారులు యథేచ్ఛగా తమ పని కానిచేస్తున్నారు. తాండూరు మండలంలోని నాపరాతి గనులున్న ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాల పరంపరకు అడ్డుకట్ట వేసేవారే లేకుండాపోయారు. - ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు - నిక్షేపంగా తరలుతున్న నాపరాతి నిక్షేపాలు - కొల్లగొడుతున్న రూ.కోట్ల సహజ సంపద - అనుమతులు ఒకచోట.. తవ్వకాలు మరోచోట - అమాత్యుడి పేరు చెప్పి అక్రమార్కుల ఆగడాలు తాండూరు రూరల్: మండలంలోని ఓగిపూర్, కరన్‌కోట్, మల్కాపూర్, కోట్బాసుపల్లి తదితర గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో వందలాది ఎకరాల్లో నాపరాతి నిక్షేపాలున్నాయి. సర్కారు ఇందులో కొన్నింటిని ప్రైవేట్ వ్యక్తులు నాపరాతిని తవ్వుకునేందుకు అనుమతులు ఇచ్చింది. కాగా.. అనుమతుల గడువు దాటిన తర్వాత కూడా సమీపంలోని ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు జరుపుతున్నారు. అనుమతులు పొందింది ఒకచోట అయితే నాపరాతిని వెలికితీస్తోంది మరోచోట. తనిఖీలు చేయాల్సిన రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఓగిపూర్‌లో.. ఓగిపూర్‌లో సర్వేనంబర్ 129లో 85 ఎకరాల 15 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొన్నేళ్ల క్రితం 55 ఎకరాలు ప్రభుత్వం వివిధ సంఘాలకు మైనింగ్ కోసం అనుమతి ఇచ్చింది. మిగతా 30 ఎకరాలు ఉండాలి. ప్రస్తుతం ఎకరా భూమి కూడా లేకుండాపోయింది. ఇందులో అక్రమార్కులు తిష్టవేశారు. కరన్‌కోట్‌లోని సర్వేనంబర్ 18లో 29 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వం గతంలో వివిధ సంఘాలకు అనుమతులు ఇచ్చింది. మిగతా భూములను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. కాగా.. లీజు పూర్తి కావడంతో పీఓటీ కింద స్వాధీనం చేసుకున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. పేదవారికి ప్రభుత్వం లీజుకు ఇస్తే.. బడా వ్యాపారులు వారి వద్ద నుంచి తీసుకొని తవ్వకాలు కొనసాగిస్తున్నారు. మల్కాపూర్‌లో.. మల్కాపూర్ శివారులోని సర్వే నంబర్ 15లో 338 ఎకరాలను గని కార్మిక కాంట్రాక్టు సొసైటీలోని కార్మికులకు 20 ఏళ్ల క్రితం లీజు అనుమతులు ఇచ్చింది. రెండేళ్ల క్రితం గడువు పూర్తయింది. మిగతా 10-15 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. ప్రస్తుతం ఆ భూమిలో అక్రమార్కులు నాపరాతి గనులు తవ్వుతున్నారు. ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపితిస్తున్నాయి. కోట్బాసుపల్లిలోని ప్రభుత్వ భూమి 116లో కూడా నాపరాతి తవ్వకాలు జరుగుతున్నాయి. రాయల్టీలు చెల్లించకుండానే నాపరాతి లోడ్ లారీలు చెక్‌పోస్టు దాటుతున్నా మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. అది రెవెన్యూ అధికారుల బాధ్యత అని తప్పించుకుంటున్నారు. నివేదికతోనే సరి పెట్టారు.. ఆరు నెలల క్రితం రెవెన్యూ అధికారులు సబ్‌కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ నాపరాతి భూముల్లో సర్వే చేశారు. ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంది.. ఎవరికి లీజు ఉంది అనే కోణంలో వారంరోజులపాటు గనుల్లో తిరిగారు. ప్రభుత్వ నాపరాతి భూముల్లో తవ్వకాలు జరుపుతున్నారని సబ్ కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. ఇప్పటి వరకు అక్రమార్కులపై ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా నాపరాతి తవ్వకాలు జరిపేందుకు కావాల్సిన విద్యుత్ కనెక్షన్లను సైతం అక్రమంగా తీసుకున్నా.. ఆ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. -
కొండలకే ఎసరు
- టీడీపీ పెద్దలపరం కానున్న ఎర్రకొండ, సీతకొండ - కన్సీల్టెన్సీ ద్వారా ధారాదత్తానికి నిర్ణయం - వుడా బోర్టు సూత్రప్రాయ నిర్ణయం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : భూ బకాసురుల ఆకలి తీర్చడానికి ప్రభుత్వ భూములు చాలవనుకున్నారేమో!... ఆరగించమని ఏకంగా కొండలను వడ్డించేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. అందుకే విశాఖ శివారులోని ఎర్రకొండ, సీతకొండలు బంగారు పళ్లెంలో వడ్డించేందుకు ‘వంటవాడి’ని నియమించింది. పీపీపీ ప్రాజెక్టుల రూపంలో ఎర్రకొండ, సీతకొండలను సన్నిహితులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కన్సెల్టెన్సీని నియమించింది. ఇందుకు వుడా బోర్టు మంగళవారం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. తద్వారా 1,105 ఎకరాల విస్తీర్ణంలోని ఎర్రకొండ, సీతకొండలను తమ అస్మదీయులకు కట్టబెట్టేందుకు మార్గం సుగమంచేసింది. అటవీశాఖ పరిధిలోని ఆ కొండలను డీనోటిఫై చేయాలన్న వుడా ప్రతిపాదనపై కేంద్రం ఇంకా ఆమోదం తెలపనే లేదు. కానీ ఇంతలోనే వాటిని అప్పగించేందుకు కన్సల్టెన్సీని నియమించడం గమనార్హం. కొండలపై కన్నేశారు : సముద్రతీరానికి సమీపంలో ఎర్రకొండ(893 ఎకరాలు) , సీతకొండ(212 ఎకరాలు) ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. 1,105 ఎకరాల్లో ఉన్న ఈ కొండలను ప్రైవేటు-పబ్లిక్ పార్ట్నర్షిప్(పీపీపీ) పద్దతిలో తమ అస్మదీయులకు కట్టబెట్టాలని భావించింది. అందుకే ఆ కొండలపై క్లబ్‌హౌస్‌లు, రిసార్టులు, కాసినోలు, కన్వెన్షన్ సెంటర్లు నిర్మించాలని నిర్ణయించింది. కొండలపై 70 ఎకరాల్లో విలాసవంతమైన విల్లాలు నిర్మించి తమ అస్మదీయులు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పథకం వేసింది. అందుకోసం పీపీపీ విధానంలో ప్రాజెక్టుల కోసం కొన్ని నెలల క్రితం టెండర్లు పిలిచింది. మంగళవారం తొలిసారి సమావేశమైన వుడా బోర్డు దీనిపై నిర్ణయం తీసుకుంది. కన్సెల్టెన్సీలను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించింది. వీఎండీయేగా రూపాంతరం చెందిన వెంటనే కన్సల్టెన్సీ ద్వారా ఆ కొండలను అస్మదీయులపరం చేయాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగంగా ఉంది. డీనోటిఫై చేయకుండానే! కొండలను తమ వారికి ధారాదత్తం చేయాలన్న ఆతృతలో ప్రభుత్వం నిబంధనలకు తిలోదకాలు ఇచ్చేస్తోంది. రక్షిత అటవీప్రాంతం పరిధిలని ఎర్రకొండ, సీతకొండలపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అందుకే ఆ కొండలను అటవీశాఖ పరిధి నుంచి డీనోటిఫై చేయాలని వుడా ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఆ కొండలను డీనోటిఫై చేయడం కేంద్ర, రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ నిబంధనలకు విరుద్ధం. అరుదైన ఔషధ మొక్కలతోపాటు పలు జంతు, పక్షులకు అవి ఆవాసంగా ఉన్నాయి. ఆ కొండలను వ్యాపార కేంద్రాలుగా మారిస్తే ఆ జీవజాలం ఉనికికే ముప్పువాటిల్లుతుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్ర అనుమతి వరకు వేచి చూడకుండా ప్రభుత్వ పెద్దలు వాడా ద్వారా కథ నడపించారు. ముందుగా ఆ రెండు కొండలు దక్కేలా చేసుకునేందకు కన్సెల్టెన్సీ నియామకాన్ని ఖరారు చేయించారు. మాస్టర్ ప్లాన్‌నూ కాదని.. - మాస్టర్‌ప్లాన్‌లో పేర్కొన్న భూ వినియోగ ప్రణాళికనూ మార్చడానికి వీల్లేదు. ఆ మాస్టర్‌ప్లాన్‌లో ఆ కొండలను పరిరక్షించాల్సిన జాబితాలో చేర్చారు. వాటిని ఇతర అవసరాలకు కేటాయించాలంటే ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. కానీ ఆ ఊసే ఎత్తకుండా ప్రభుత్వం కన్సెల్టెన్సీ ద్వారా కథ నడపించాలని నిర్ణయించింది. - ప్రభుత్వం సీఆర్‌జెడ్ నిబంధనలనూ ఉల్లంఘిస్తోంది. రెండు కొండలు సీఆర్‌జెడ్ 1, 3 పరిధిలో ఉన్నాయి. అక్కడ నిర్మాణ పనులు చేపట్టంగానీ బోర్లు వేయడంగానీ నిబంధనలకు విరుద్ధం. ఇవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వం ఆ రెండు కొండలను తమ వారికి కట్టబెట్టడానికి కార్యాచరణను వేగవంతం చేసింది. - అడ్డగోలుగా నిబంధనలను ఉల్లంఘిస్తూ మరీ ఎర్రకొండ, సీతకొండలను తమ అస్మదీయుల పరం చేయడానికి ప్రభుత్వం సిద్ధపడటం విస్మయపరుస్తోంది. -
కనిపిస్తే కబ్జా
- ప్రభుత్వ, ప్రైవేటు భూములనే తేడాలేదు - ఏది కనిపించినా.. కన్నుపడితే చాలు ఆక్రమణలే - వేములపాడు మహమ్మదాపురం పంచాయతీల్లో కబ్జాలపర్వం - యథేచ్ఛగా అటవీ భూముల ఆక్రమణ.. - జామాయిల్ తోటల సాగు హనుమంతునిపాడు : ప్రభుత్వ భూములు, కుంటలు, పురాతన బంగళాలు, పోలీసు ఠాణా స్థలాలు, అటవీ భూములు, కొండ వాలు భూములు, పశువుల బీడు.. ఒక్కటేమిటి ఆక్రమణకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. వందల ఎకరాలు ఆక్రమించుని ఏకంగా తోటలు సాగు చేస్తున్నారు. హనుమంతునిపాడు మండలం వేములపాడు, కొండారెడ్డిపల్లి, మహమ్మదాపురం పంచాయతీలు కబ్జాదారుల అడ్డగా మారాయి. ప్రధానంగా వందల ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుని జామాయిల్, క్లోన్స్ మొక్కలు సాగు చేశారు. ముప్పళ్లపాడు పంచాయతీలోనూ ప్రభుత్వ భూమిని ఆక్రమించి బడా బాబులు నిమ్మతోటలు నాటారు. కొంత మంది పక్క మండలాల రైతులకు కౌలుకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. కొండారెడ్డిపల్లి పంచాయతీలో.. కొండారెడ్డిపల్లి పంచాయతీలో సర్వే నంబర్ 222లో గాడిరాళ్లకొండ వద్ద 274 ఎకరాలు, సర్వేనంబర్ 208లో ఆరెకరాల పోరంబోకు భూమి, సర్వేనంబర్ 207లోని 42 ఎకరాల పశువుల బీడును ఆక్రమించుకున్నారు. జామాయిలు తోటలు విస్తారంగా సాగు చేశారు. ఇటీవల జామాయిల్ కర్రను రాత్రులు తరలిస్తుండగా రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాలతో వదిలేశారు. హైవే పొడవునా.. వేములపాడు సమీప నంద్యాల-ఒంగోలు హైవే పక్కన 419, 422, 420,421,405 సర్వే నంబర్లలో భూమిని దర్జాగా కబ్జా చేశారు. కుంటలు, ఫారెస్టు భూమి, ప్రభుత్వ భూములు, రోడ్డు సైడు భూములు, పశువుల బీడు భూమి, చెక్ డ్యాం సైతం కబ్జాలకు గురయ్యాయి. పశువుల కుంటలు చదును చేసి సాగు చేయడంతో పశువులకు తాగునీరు కరువైంది. అడవికి మేతకెళ్లిన జీవాలు, పశువులు అల్లాడుతున్నాయి. మహమ్మదాపురం రెవెన్యూలో సర్వేనంబర్ 422లో అసైన్డు భూమిలో ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయలకు, హాస్టల్ వార్డెన్లకు 18 ఎకరాల్లో పట్టాలు ఇచ్చారు. వాటికి కూడా పాస్ పుస్తకాలు సృష్టించి అమ్ముకున్నట్లు సమాచారం. కఠిన చర్యలు తప్పవు డిప్యూటీ తహసీల్దార్ షేక్ రఫీని భూ కబ్జాలపై వివరణ కోరగా ప్రభుత్వ భూముల ఆక్రమిస్తే వారిపై కఠిన చర్యలతోపాటు కేసుల నమోదు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో దండోరా కూడా వేయించినట్లు తెలిపారు. హెచ్చరిక బోర్డులనుకూడా ఏర్పాటు చేశామన్నారు. కబ్జా భూములను పరిశీలించి హెచ్చరించినట్లు తెలిపారు. -
భూములు పంచకుంటే పతనం తప్పదు
ఇబ్రహీంపట్నం ఘటనపై కేసీఆర్ నోరు విప్పాలి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కరీంనగర్: ప్రభుత్వ భూములను పేదలకు పంచే వరకు ప్రజా ఉద్యమాలను ఉధృతం చేస్తామని, భూమి లేని నిరుపేదలకు భూములు పంచకుంటే పతనం తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ముందు భూమి లేని దళితులందరికీ మూడెకరాల భూమి ఇస్తామని, అధికారంలోకి వచ్చాక కాకిలెక్కలతో కాలయాపన చేయడం కేసీఆర్‌కే చెల్లిందన్నారు. సీపీఐ నిర్ణయం మేరకు మంగళవారం నుంచే భూపోరాటాలకు శ్రీకారం చుట్టామన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మండలం చీర్లవంచలో వందల ఎకరాల ప్రభుత్వ భూమిని బడా బాబులు బీనామీల పేరిట పట్టాలు సృష్టించుకొని సాగు చేస్తున్నారని, గ్రామం లో ఉన్న పేదలతో ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు పోరాటం మొదలెట్టామన్నారు. ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తులకు తక్కువ రేటుతో ఇస్తున్న ప్రభుత్వ తీరుపై ప్రజలు ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలో 2 వేల మంది పేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తుంటే పోలీసులు లాఠీచార్జీ చేసి గుడిసెలు ఖాళీ చేయించడం అప్రజాస్వామికమన్నారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రభుత్వ భూములు, కాల్వలు ఆక్రమిస్తే చర్యలు మంత్రి మహేందర్‌రెడ్డి
ఆదిబట్ల: ప్రభుత్వ భూములను, కాల్వలను ఆక్రమిస్తే ఉపేక్షించబోమని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. ఇబ్రహీంపట్నం మం డల పరిధిలోని మంగల్‌పల్లి రెవెన్యూ పరిధిలోని కుమ్మరికుంటపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంత్రి మహేందర్‌రెడ్డి ఆదివారం ఆకస్మికంగా సందర్శించారు. స్థానిక తహసీల్దార్ లేకపోవడంతో అక్కడే ఉన్న ఆర్ఐ బాలకృష్ణ నుంచి వివరాలు సేకరించారు. మంత్రి తహసీల్దార్‌తోపాటు ఆర్డీవోను సంఘటన స్థలానికి పిలిపించారు. రెవెన్యూ అధికారులు శనివారం నిర్మాణాలను కూల్చివేస్తుండగా మధ్యలో మంత్రి పేషీ నుంచి ఫోన్ వచ్చిందని కొన్ని పత్రికల్లో (సాక్షి కాదు) వచ్చిన వార్తలో వాస్తవం లేదని మంత్రి మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇక్కడి భూమిని రెవెన్యూ అధికారులు పట్టా భూమిగా చూపుతుండగా, ఇరిగేషన్ అధికారులు మాత్రం కుంట ఉన్నట్లు చూపుతున్నారు. ఏది వాస్తవం అనే విషయం తెలుసుకోవడానికి వచ్చినట్లు మంత్రి వివరించారు. మొత్తం 6 ఎకరాల 9 గుంటల భూమిని పట్టా భూమి అని రెవెన్యూ అధికారులు మంత్రికి తెలిపారు. కాగా ఇరిగేషన్ అధికారులు కుంట ఉందని పత్రాల్లో పేర్కొన్నారు. రెండు శాఖల సమన్వయ లేమితో సమస్యలు వస్తాయన్నారు. తహసీల్దార్ ఉపేందర్‌రెడ్డి, ఆర్డీవో యాదగిరిరెడ్డిని వివరాలు సేకరించి చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ భూమి అయితే వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు. తప్పుడు వార్తలు రాసిన పత్రికపై చర్యలు తీసుకోవాలి.. తప్పుడు వార్తలు రాసిన సదరు పత్రికపై చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఒకవేళ రెవెన్యూ అధికారుల పాత్ర ఉన్నట్లుయితే బాధ్యులను వెంటనే సస్పెండ్ చేస్తామని మంత్రి తెలిపారు. చేతిలో కలం ఉంది కదా అని ఆధారాలు లేకుండా వార్తలు రాయొద్దని ఓ విలేకరికి మంత్రి సూచించారు. ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంతో చెరువులను నీటితో నింపి రైతన్నల బాధలను దూరం చేసేందుకు తీవ్రంగా కృషిచేస్తుందని చెప్పారు. ముందస్తు జాగ్రత్తగా ఏసీపీ నారాయణ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి వెంట స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి, సీనియర్ నాయకులు ఈసీ శేఖర్‌గౌడ్, యాచారం జెడ్పీటీసీ రమేష్‌గౌడ్, ఎంపీపీ జ్యోతినాయక్, రాందాస్‌పల్లి, మంగల్‌పల్లి, తుర్కగూడ, గ్రామాల సర్పంచ్‌లు ఏనుగుశ్రీనివాస్‌రెడ్డి, కందాళ ప్రభాకర్‌రెడ్డి, కిలుకత్తి అశోక్‌గౌడ్, ఎంపీటీసీలు కొప్పు జంగయ్య, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
బీపీఎల్ కథ కంచికేనా?
రామగుండంలోని ప్రతిపాదిత బీపీఎల్ (బిటిష్ ఫిజికల్ లాబోరేటరీ) పవర్‌ప్లాంట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఒకే అంటే.. ఇక్కడ విద్యుత్ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు బీపీఎల్ అన్ని వనరులతో సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. కానీ గతంలో బీపీఎల్‌కు అప్పగించిన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడం, తర్వాత ఉపసంహరించుకోవడం, ఉన్నతాధికారుల అత్యవసర భేటీలు తదితర పరిణామాల నేపథ్యంలో మరోసారి బీపీఎల్ అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. రామగుండం : 2001వ సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయూం లో రామగుండం కేంద్రంగా 520 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు బీపీఎల్‌తో ఒప్పం దం జరిగింది. ఇందుకోసం బీపీఎల్ 1200 ఎకరాల ప్రైవేట్ భూమి, 600 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించి ప్లాంట్ ఏ ర్పాటుకు రంగం సిద్ధం చేసింది. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ) ఎక్కువగా ఉందంటూ ఒప్పం దాన్ని నిరాకరించింది. అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు బీపీఎల్‌కు తలనొప్పిగా మారాయి. అరుునప్పటికీ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు అనుమతులు సాధించి, ప్లాంట్ నిర్మాణానికి డిజైన్ పూర్తి చేసుకొని, పనులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. అప్పటికే భూ సేకరణ, ప్రాజెక్టు డిజైన్, ఇతర పనుల కోసం రూ.300 కోట్లకు పైగా వెచ్చించింది. వైఎస్సార్ మరణానంతరం ఈ ప్రాజెక్టుకు రాజకీయ గ్రహణం పట్టడంతో పనులను అంతటితోనే నిలిపివేసింది. కొత్త ప్లాంట్ల నిర్ణయంతో మళ్లీ తెరపైకి.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎదురవుతున్న విద్యుత్ కొరతను అధిగమించేందుకు యుద్ధప్రాతిపదికన విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయూలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో రామగుండంలో 800 మెగావాట్ల సామర్థ్యం గల ఐదు యూనిట్లు.. మొత్తం 4వేల మెగావాట్ల సామర్థ్యంతో కొత్త పవర్‌ప్లాంట్ నెలకొల్పనున్నట్టు ప్రకటించింది. దీంతో మరోసారి బీపీఎల్ విద్యుత్ కేంద్రం అంశం తెరమీదకొచ్చింది. పవర్‌ప్లాంట్ ఏర్పాటుకు బీపీఎల్ జాప్యం చేసినందున ఆ సంస్థపై నమ్మకం లేక ప్రభుత్వం ఎన్టీపీసీ వైపు మొగ్గుచూపింది. బీపీఎల్‌కు సంబంధించిన భూములను ఎన్టీపీసీకి కేటారుుంచేందుకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు నిరుపయోగంగా ఉన్న ఐదు వందల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను సర్కారు స్వాధీనం చేసుకుంది. దీనిపై బీపీఎల్ కోర్టును ఆశ్రరుుంచింది. ఈ వ్యవహారంలో కోర్టులో చుక్కెదురవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం భూముల విషయంలో వెనక్కు తగ్గింది. దీంతో ఎన్టీపీసీకి మళ్లీ భూసేకరణ కష్టాలు మొదలయ్యూరుు. తప్పుకుంటే నిండా మునగాల్సిందే.. విద్యుత్ కేంద్రం ఏర్పాటు నుంచి బీపీఎల్ తప్పుకుంటే ఇప్పటిదాకా చేసిన వ్యయమంతా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీపీఎల్ భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేస్తే.. వాటికి ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం లెక్కగట్టి డబ్బులు ఇచ్చేందుకు సర్కారు సిద్ధంగా లేదని తెలుస్తోంది. పదిహేనేళ్ల క్రితం బీపీఎల్ చెల్లించిన భూసేకరణ ధరనే ఇవ్వాలని యోచిస్తున్నట్టు సమాచారం. అప్పుడు ప్రైవేట్ భూములకు ఎకరానికి రూ.30 వేల దాకా బీపీఎల్ చెల్లించింది. అవే భూములకు ప్రస్తుత మార్కెట్ ధర రూ.4-5లక్షలు పలుకుతోంది. దీంతో భూములను సర్కారు అప్పగిస్తే భారీ నష్టపోవాల్సి వస్తుందని బీపీఎల్ భావిస్తోంది. దీంతో ప్రభుత్వం అనుమతిస్తే పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకే ఆ సంస్థ మొగ్గుచూపుతోంది. 22 నెలల్లో ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధం గతేడాది నవంబర్‌లో అప్పటి జారుుంట్ కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ బీపీఎల్, ఎన్టీపీసీ అధికారులతో స్థానిక జెన్కో కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. విద్యుత్ కేంద్రాన్ని నిర్మించి విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఎంత సమయం పడుతుందని రెండు సంస్థలను అడిగారు. తాము పబ్లిక్ హియరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులు పూర్తి చేసి సిద్ధంగా ఉన్నామని, 22నెలల్లో ప్లాంట్ నిర్మించి విద్యుత్ ఉత్పత్తి సాధిస్తామని బీపీఎల్ ప్రతినిధి స్పష్టం చేశారు. ఎన్టీపీసీ అధికారులు మాత్రం తమకు ప్రభుత్వం సహకరించి, ఆయూ ప్రక్రియల్లో జాప్యం జరుగకుంటే 48 నెలల్లో ప్లాంట్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. త్వరితగతిన విద్యుత్ ఉత్పత్తి చేసే వారికి అప్పగించాల్సి ఉన్నప్పటికీ బీపీఎల్‌ను విస్మరించడంలో ప్రభుత్వ వైఖరి ఏమిటోనని పలువురు చర్చించుకుంటున్నారు. బీపీఎల్ ప్రణాళిక ఇదీ.. విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు 1,817.03 ఎకరాల భూమిని సేకరించగా.. మల్యాలపల్లి, కుందనపల్లి, రామగుండం శివారు పరిధిలో ప్రధాన విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు 441.48 ఎకరాలు, రాయదండి, రామగుండం శివారులో యాష్‌పాండ్ ఏర్పాటుకు 597.58 ఎకరాలు, బ్రాహ్మణపల్లిలో రా వాటర్ రిజర్వాయర్‌కు 662.35 ఎకరాలు, ఐదు గ్రామాల మీదుగా పైపులైన్ ఏర్పాటుకు 65.20 ఎకరాలు, ఆపరేటర్స్ కాలనీకి 45.15 ఎకరాలు, రిహాబిలిటేషన్‌కు 2.32 ఎకరాలతో బీపీల్ ప్రణాళిక సిద్ధం చేసింది. -
సర్కారు తోటల్లో అక్రమాల చెడుగుడు
ఆ తోటలు ఎవరికీ చెందవని కోర్టు తేల్చి చెప్పింది. సర్కారు ఆధీనంలో ఉంచాలని ఆదేశించింది. పుష్కర కాలం తర్వాత లక్షల విలువైన ఆ తోటలు నరికివేతకు, తరలింపునకు గురవుతున్నాయి. ‘అధికారం మా వెంట ఉంటే.. ఏ తీర్పు ఉన్నా మాకేంటి’ అన్నట్లు కొందరు బడాబాబులు ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారు. తమ ఆధీనంలోనే ఉన్న వీటిని కాపాడాల్సిన రెవెన్యూ యంత్రాంగం అధికార ఒత్తిళ్లకు తలొగ్గి మౌనం వహిస్తోంది. స్థానికులు పలుమార్లు చేసిన ఫిర్యాదులు బట్టదాఖలవుతున్నాయి. శ్రీకాకుళం రూరల్ : రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం రెవెన్యూ శాఖ ఆధీనంలో ఉన్న సుమారు రూ. 50 లక్షల విలువైన సరుగుడు తోటలు అక్రమార్కుల గొడ్డలివేటుకు నేలకూలి కలపగా మారి తరలిపోతున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో జరుగుతున్న ఈ దందాను ఎవరూ పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సీఆర్‌జెడ్ జోన్లోకి వచ్చే శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని కనుగులవానిపేట, మోపసుబందురు రెవెన్యూ గ్రామాలకు చెందిన సుమారు 30 ఎకరాల అన్సర్వ్డ్ భూములను గతంలో కొందరు ఆక్రమించుకుని, ఫలసాయాన్ని అనుభవించేవారు. అయితే 30 ఎకరాల ప్రభుత్వ భూములను ఒకరిద్దరు మాత్రమే అనుభవించడేమిటి?.. వాటిని పేదలు పంచాలని కోరుతూ ఈ గ్రామాలకు చెందిన పలువురు హైకోర్టును ఆశ్రయించారు. 30 ఏళ్లపాటు ఈ వివాదం కోర్టులో నలిగింది. చివరికి 2002లో హైకోర్టు దీనిపై తీర్పు ప్రకటిస్తూ ఈ భూములపై ఎవరికీ హక్కు లేదని తేల్చి చెప్పింది. సీఆర్‌జెడ్ జోన్లో ఉన్నందున జిల్లా కలెక్టర్‌కు ఈ భూముల సంరక్షణ బాధ్యత అప్పగించింది. అప్పటినుంచి రెవెన్యూ శాఖ ఆధీనంలో ఉన్న ఈ భూముల్లో పెరిగిన సరుగుడు తోటల ఫలసాయాన్ని 2012లో అప్పటి తహశీల్దార్ ఆధ్వర్యంలో వేలం వేయగా రూ. 29 లక్షలకు పాట ఖరారైంది. మళ్లీ కోర్టుకు.. ఈ తరుణంలో గతంలో ఈ తోటల ఫలసాయాన్ని అనుభవించిన ఆక్రమణదారులు వేలాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టు మళ్లీ జోక్యం చేసుకున్న ఖరారైన వేలం పాట అమలు కాకుండా నలిపివేసింది. అయితే భూములపై హక్కును మాత్రం మార్చలేదు. ఆ మేరకు ఈ భూములు, తోటలు రెవెన్యూ ఆధీనంలోనే ఉన్నాయి. కాగా గత నెల రోజులుగా ఈ తోటల్లోని సరుగుడు చెట్లను కొందరు ఆక్రమంగా నరికి, తరలిస్తున్నారు. ప్రస్తుతం ఈ తోటల విలువ రూ. 50 లక్షలకుపైగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇంత విలువైన ఆస్తి కరిగిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తహశీల్దారుకు, ఆర్డీవోకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని, కనీసం ఇక్కడ ఏం జరుగుతోందో తెలుసుకున్న పాపాన పోలేదని అంటున్నారు. గత సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్సులో కూడా ఫిర్యాదు చేశామని గ్రామస్తులు చెప్పారు. కొద్దిమంది వ్యక్తులు అధికార పార్టీ అండదండలతో అక్రమంగా నరికి తరలిస్తుంటే చూసి చూడనట్లు వ్యవహరించడం తగదని అంటున్నారు. ఆ తోటలను గ్రామంలో నిరుపేదలకు పంచిపెట్టాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి. ఇంతవరకు రెవెన్యూ శాఖ ఆధీనంలో ఉన్న తోటలను అధికార పార్టీ నాయకులకు తలొగ్గి అప్పగించడం తగదు. ఇప్పటికైనా చెట్ల నరికివేతను నిలువరించాలి. - కనుగులు జనార్దనరావు, మాజీ ఎంపీటీసీ అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి సీఆర్‌జెడ్ జోన్ పరిధిలోని చెట్లను అక్రమంగా నరికి, తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. సుమారు రూ. 50 లక్షల విలువైన ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి. - ఇప్పిలి రామారావు, స్థానికుడు వేలం వేసిన ఆస్తిని తరలిస్తున్నారు గతంలో తహశీల్దార్ ఆధ్వర్యంలో రూ. 29 లక్షలకు వేలం వేసిన ప్రభుత్వ ఆస్తిని అక్రమంగా తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. పలుమారు ఫిర్యాదులు చేసినా స్పందన లేదు. - కనుగుల ఆమ్మాజమ్మ, మాజీ సర్పంచ్ -
అడవులకూ మడత
తీరంలో ఆక్రమణల పర్వం కనుమరుగువుతున్న మడ అడవులు కబ్జా చేసిన భూముల్లో ఆక్వా సాగు ఇప్పటికే వందలాది ఎకరాలు స్వాహా పర్యావరణానికి పెనుముప్పుగా మారిన వైనం ఏ మాత్రం పట్టించుకోని అధికార యంత్రాంగం పర్యావరణానికి అండగా నిలుస్తున్న తీర ప్రాంత ప్రభుత్వ భూములపై కబ్జాదారులు కన్నువేశారు. ఆ భూములను వారు సొంత జాగాగా చేసుకుని ఆక్వాసాగుకు ఉపక్రమిస్తున్నారు. సముద్ర ఆటుపోట్ల సమయంలో తీరానికి రక్షణ వలయంగా ఉండే మడ అడవులను సైతం నరికివేసి దర్జాగా ఆక్వా సాగు చేస్తున్నారు. పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ఈ వ్యవహారంపై అధికారుల నోరు పెగలడం లేదు. భీమవరం:జిల్లాలో సముద్రతీరం 19 కిలోమీటర్లు ఉంది. దీనికితోడు ఉప్పుటేరును అనుకుని మరో 20 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. యలమంచిలి, నర్సాపురం, మొగల్తూరు, భీమవరం, కాళ్ల, ఆకివీడు మండలాల్లో సముద్రం, ఉప్పుటేరు తీర ప్రాంతం విస్తరించి ఉంది. ఈ మండలాల్లోని సముద్రం, ఉప్పుటేరును అనుకుని ఉన్న గ్రామాల్లో సుమారు నాలుగువేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూముల్లోని అధిక భాగంలో ఇప్పటికే కబ్జాదారులు ఆక్వాసాగు చేస్తున్నారు. మరికొంతమంది దర్జాగా డి నమూనా పట్టాలు సృష్టించి సాగు చేసుకుంటున్నారు. మొగల్తూరు మండలంలోని ఏటుమెండి, పేరుపాలెం, ముత్యాలపల్లి, పాతపాడు, కాళీపట్నం, నర్సాపురం మండలం వేములదీవి, భీమవరం మండలం లోసరి, నాగిడిపాలెం, దొంగపిండి, కాళ్ల మండలం మోడి, గోగితిప్పా తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల తీర ప్రాంత భూములు కబ్జాకు గురయ్యాయి. ఉప్పుటేరు, సముద్ర వెంబడి ఉన్న భూములను ఆక్రమించి వాటిలో ఉన్న మడ, ఆల్చి, ఇతర అడవులను నరికివేస్తున్నారు. రాత్రికి రాత్రే చేపలు, రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. దీనితో కాలుష్య కోరల్లో తీర ప్రాంతం చిక్కు కుంటుంది. పర్యావరణానికి పెనుముప్పు తీర ప్రాంతంలో ఉన్న మడ అడవులతోపాటు ఇతర చెట్లను నరికివేయడం వల్ల పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీరం కూడా భారీగా కోతకు గురువుతుందంటున్నారు. దీన్నిపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచిస్తున్నారు. పట్టించుకోని అధికారులు తీరం ప్రాంతంలోని భూములను కబ్జా చేసి ఆక్వా సాగు చేసుకుంటున్నా జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోవపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాళ్ల వంటి మండలంలోనే అధికంగా సుమారు రెండువేల ఎకరాల వరకు ప్రభుత్వ భూములకు డి నమూన పట్టాలు పొంది కొంతమంది బడా రైతులు వాటిని తమ సొంత భూములుగా చేసుకుని ఆక్వాసాగు చేస్తూ రూ. కోట్లు ఆర్జిస్తున్నారు. ఉప్పుటేరు వెంబడి ఉన్న భూములను కబ్జా చేసి చేపల చెరువుల్లో కలుపుకుని సాగు చేస్తున్నా అధికారుల పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
రాజధాని భూములతో రియల్ వ్యాపారమా: అంబటి
హైదరాబాద్: రాజధాని భూములతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకోవడం దురదృష్టకరమని వైఎస్సార్సీపీ అధికారప్రతినిధి అంబటి రాంబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ పరిణామం ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తోందన్నారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంపై ప్రభుత్వం స్పష్టతనివ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి న్యాయంగా రావాల్సిన నిధులను రాబట్టుకోలేక ప్రభుత్వం రైతుల పొట్టకొట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. రాజధాని కోసం వేల ఎకరాల భూసమీకరణ కేవలం టీడీపీ అనుయాయుల రియల్ వ్యాపారం కోసమేనని అంబటి వ్యాఖ్యానించారు. రైతుల ప్రస్తుత దారుణ పరిస్థితులపై ప్రభుత్వం తక్షణమే పునరాలోచించాలని ప్రభుత్వానికి హితవు పలికారు. రాజధాని కోసం భూములిచ్చేందుకు కూడా ఇదేవిధంగా కోట్లు చెల్లిస్తారా అని అంబటి ప్రభుత్వాన్ని ప్రశ్చించారు. -
భూముల క్రమబద్ధీకరణ గడువు పెంచాలి: సీపీఐ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ గడువు పెంచాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది, 125 గజాలు, ఆ పైన ఆక్రమించుకుని ఎలాంటి నిర్మాణాలు లేకుండా ఖాళీగా ఉన్న ప్లాట్లను ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని, గతంలో భూపోరాటాల సందర్భంగా పెట్టిన కేసులన్నింటిని ఎత్తేయాలని తీర్మానం ఆమోదించింది. ఆదివారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశం పలు తీర్మానాలు చేసింది. క్రమబద్ధీకరణ పేరుతో భూకబ్జాదారులు లాభపడకుండా చూడాలని, అక్రమ లేఅవుట్లు చేసి అమ్మినవారిని కఠినంగా శిక్షించాలని కోరింది. రాష్ట్రంలోని 338 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని, వ్యవసాయకూలీలు, పేదలకు కరువు భృతిని అందించాలని విజ్ఞప్తి చేసింది. మార్చి 7-10 తేదీల్లో ఖమ్మంలో జరగనున్న సీపీఐ రాష్ట్ర మహాసభ ల డాక్యుమెంట్‌లోని అంశాలపై చర్చించి ఈ సమావేశం ఆమోదించింది. -
గడువు తొమ్మిది రోజులే
ముకరంపుర: ఖాళీ స్థలాలను ఆక్రమించుకుని నిర్మించుకున్న ఇంటి నిర్మాణాల క్రమబద్ధీకరణకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖాళీ స్థలాలకు సంబంధం లేకుండా ఇళ్లు నిర్మించుకున్న పేద వారికే ఈ అవకాశం పరిమితం చేసింది. ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం జీవో నెం.58, 59ల జారీ ద్వారా అవకాశం కల్పించింది. జీవోలను డిసెంబర్ 30 న విడుదల చేసినప్పటికీ రెండు రోజుల క్రితమే మార్గదర్శకాలను జారీ చేసింది. జిల్లాలో ఇంతవ రకూ ఒక్క దరఖాస్తు కూడా నమోదు కాలేదు. ఈ నెల 19 వరకు తుది గడువుండగా ఆక్రమణలపై.. నిర్మాణాలపై ఎవరూ ముందుకు రాలేదు. జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో ఆక్రమిత నిర్మాణాలున్నప్పటికీ ఇప్పటికీ వరకు స్పందన లేకపోవడంపై అధికారులు సమాలోచన చేస్తున్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్. మీనా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించాలని ఆదేశించారు. దరఖాస్తు ఫారాలను అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచారు. అర్బన్ ప్రాంతాలే కీలకం.. పేదల ఆక్రమిత నివాస స్థలాల్లోని ఇండ్ల రెగ్యులరైజేషన్‌లో అర్బన్ ప్రాంతాలే కీలకం కానున్నాయి. జిల్లాలోని 11 పట్టణ ప్రాంతాల్లోనే రెగ్యులరైజేషన్‌కు దరకాస్తులు వచ్చే అవకాశాలున్నాయి. జిల్లాలో ఆక్రమిత భూముల వివరాలు ప్రజలు దరఖాస్తు ద్వారానే తెలుసుకునే పరిస్థితి రావడం జిల్లా యంత్రాంగం పనితీరుకు అద్దం పడుతోంది. అయితే ఆక్రమిత నిర్మాణం చేసి తప్పు చేసిన భావనతోనే దరఖాస్తులకు ముందుకు రాకపోవడానికి కారణంగా తెలుస్తోంది. రెగ్యులరైజేషన్ ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు వర్తించదని జీవో స్పష్టం చేస్తోంది. క్రమబద్ధీకరణకు ఆర్డీవోలు, తహశీల్దార్లనే బాధ్యులు చేశారు. దరఖాస్తులు చేసుకున్న 90 రోజుల్లో ఆ ఇంటికి సంబంధించి మహిళ పేరున పట్టాజారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించారు. ప్రజావసరాల కోసం కేటాయించిన స్థలాలు, శిఖం, నాలాలు, కుంటలు, చెరువులు, పూర్తి నీటి మట్టం పరిధిలోనివి, నీటి ట్యాంకులు, నీటి శుద్ధి ప్రాంతాలు, శ్మశానాలు, మోడల్ టౌన్షిప్లకు ప్రభుత్వం గుర్తించిన ప్రాంతాలు, కాలిబాటలు, అత్యంత విలువైన స్థలాలు, నీటి శుద్ధిప్లాంట్లు, గ్రీన్‌బెల్ట్ స్థలాలు, బఫర్‌జోన్‌లో ఉన్న స్థలాలను మినహాయించారు. చారిత్రాత్మక వారసత్వ భవనాలు, కట్టడాలు ఉన్న ప్రాంతాల్లోని వాటిని క్రమబద్ధీకరించడం జరిగిందని ప్రభుత్వం నిబంధనల్లో స్పష్టంగా పేరొన్నారు. ఇదీ టారిఫ్.. 125 గజాల స్థలం వరకు ఉచితంగా, 250 గజాలలోపు ఉన్న స్థలానికి బేసిక్ వాల్యూ ప్రకారం 50 శాతం కట్టించుకుని క్రమబద్ధీకరించనున్నారు. 500 గజాల స్థలం వరకు నిబంధనల 75 శాతం డీడీ తీసి దరఖాస్తుతో పాటు జతపర్చాల్సి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన జూన్ 2వ తేదీ 2014 వరకు ఆక్రమిత స్థలాల్లో నివాసం ఉన్న వారికే ఈ క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. ఈ పథకంలో లబ్ధిపొందాలంటే పట్టణాల్లో రూ.2 లక్షలు, పల్లెల్లో రూ.1.5 లక్షల ఆదాయం లోపు ఉన్న వారు మాత్రమే అర్హులు. ఇంకా భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, కరెంటుబిల్లు, నల్లా బిల్లు, ఇంటి పర్మిషన్ పత్రం వీటిలో ఏదో ఒకటి జతచేసి తహశీల్దార్ కార్యాలయంలో అందించాల్సి వుంటుంది. గడువు పెంచండి.. ఆక్రమిత నివాసస్థలాలోని ఇండ్ల రెగ్యులరైజేషన్‌కు దరఖాస్తుల స్వీకరణ గడువు మరింత పెంచాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించింది. శుక్రవారం ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్మీనాతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో మిగిలిన కలెక్టర్లు కూడా ఇదే సమస్యను విన్నవించారు. ఈ నెల 19 లోపు సెలవులు అధికంగా ఉన్నాయని.. మరింత గడువు అవసరమని పేర్కొన్నారు. అంతకుముందు బీఆర్ మీనా మాట్లాడుతూ జిల్లాలోని సింగరేణి తదితర సంస్థలకు ప్రభుత్వం కేటాయించిన భూములలో నివాసం ఉంటున్న వారి క్రమబద్ధీకరణ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు. -
భూముల క్రమబద్ధీకరణతో రూ.15 వేల కోట్ల ఆదాయం
పెబ్బేరు: రాష్ట్రంలోని ప్రభుత్వ భూములన్నీ క్రమబద్ధీకరించి వేలం వేస్తే సుమారు రూ.15 వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఈ భూములను గుర్తించి ఆక్రమణలకు గురికాకుండా చూస్తామన్నారు. దీంతోపాటు కొన్ని భూములను వేలం వేసి వాటిద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాభివృద్ధికి వినియోగించుకుంటామని తెలిపారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు కావడం వల్ల ఐఏఎస్‌ల కొరత ఏర్పడిందని.. వారం రోజుల్లో ఈ సమస్య పరిష్కారం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఎంసెట్ నోటిఫికేషన్ జారీ చేశామని, కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండి వైఖరితో ఇబ్బందులు తలెత్తుతున్నాయని రాజీవ్‌శర్మ చెప్పారు. త్వరలోనే సమస్యను అధిగమించి ఎంసెట్ నిర్వహిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు ఎత్తిపోతల పథకం, ప్రాణహిత-చేవెళ్ల తదితర సాగునీటి పథకాలను వీలైనంత త్వరగా పూర్తయ్యేలా చూస్తామన్నారు. వ్యవసాయరంగంలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తామని తెలిపారు. గతంలో ఉన్న పింఛన్దారులలో అనర్హులను తొలగించడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని.. అర్హులైన ప్రతి ఒక్కరికీ తప్పకుండా పింఛన్ అందుతుందని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకేచోట ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. దీంతో పాలనాపరంగా సులభంగా ఉండటంతో పాటు ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. -
ప్రభుత్వ జాగా వేసెయ్ పాగా
బేస్తవారిపేట: ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు పాగాకు మేం సిద్ధమంటూ ముందుకురుకుతున్నారు ఆక్రమణదారులు. అడ్డుకోవల్సిన సంబంధితాధికారులు ప్రేక్షకపాత్ర వహించడంతో వీరి భూదాహానికి అంతులేకుండా పోతోంది. బేస్తవారిపేట మండలంలోని పందిళ్లపల్లె బస్టాండ్ సమీపాన ఒంగోలు-నంద్యాల హైవే రోడ్డుకు పక్కనే ఉన్న విలువైన ప్రభుత్వ, అసైన్డ్ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. మోక్షగుండం, పందిళ్లపల్లె, పూసలపాడు గ్రామాలకు చెందిన పశువుల మేతకు ఉపయోగపడే అసైన్డ్ భూముల్లో రెండు నెలలుగా గిద్దలూరుకు చెందిన ఓ వ్యక్తి యంత్రాలతో రూ.3 కోట్ల విలువైన 25 ఎకరాల అసైన్డ్ భూమిలో చెట్ల తొలగించారు. కొండ మీదున్న వ్యాఘ్ర మల్లేశ్వర దేవస్థానానికి వెళ్లే రోడ్డును ఆక్రమించుకున్నారు. జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో మూడు గ్రామాలకు చెందిన రైతులు పశువుల మేతకోసం పశుగ్రాసం పెంచుకుంటున్నారు. ఈ భూమిని కూడా వదలకుండా ఆక్రమించేయడంతో పందిళ్లపల్లె సర్పంచి కర్నాటి మోహన్‌రెడ్డి, మోక్షగుండం సర్పంచి కొండసాని గోవిందమ్మలు రెండు నెలల కిందటే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని గతంలో సర్పంచి గోవిందమ్మ రెవెన్యూ కార్యాలయం ఎదుట పశుపోషకులతో కలిసి ధర్నా కూడా చేశారు. అప్పట్లో స్పందించిన రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటామని చెబూతూ ఆ స్థలంలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. బోర్డు ఏర్పాటు చేసిన మరుసటి రోజు గుర్తు తెలియని వ్యక్తులు బోర్డును పీకేశారు. అక్కడితో ఆగకుండా ఆక్రమణదారులు యంత్రాలతో కొండపైనున్న చెట్లను తొలగించి పొలంలోనే కాల్చి ... ట్రాక్టర్లతో దున్ని నేలను చదును చేసి సవాల్ విసిరినా చర్యలు తీసుకోవల్సిన అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆక్రమించిన 25 ఎకరాల్లో తాజాగా కంచెను ఏర్పాటు చేసేందుకు కూలీలను పెట్టి రాళ్లు పాతిస్తున్నాడు. మండల సమావేశంలో ప్రస్తావించినా... అసైన్డ్ భూముల ఆక్రమణల విషయంలో ముగ్గురు సర్పంచులు లిఖిత పూర్వకంగా రెండు నెలల క్రితం చేసిన ఫిర్యాదునూ పట్టించుకోలేదు ... మండల సర్వసభ్య సమావేశంలో అన్యాక్రాంతంపై రెవెన్యూ అధికారులను నిలదీసినా స్పందన లేకపోవడం వెనుక ఆంతర్యమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఆక్రమణలో ఉన్న భూమి రిజస్ట్రేషన్ కార్యాలయం వెబ్‌ల్యాండ్‌లో, రెవెన్యూ రికార్డుల్లో అసైన్డ్ భూములుగా నమోదై ఉంది. ఈ వివరాలతో కోర్టుకు త్వరలోనే వెళ్లనున్నట్లు సర్పంచులు తెలిపారు. -
కబ్జాలపై ఉక్కుపాదం
భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలకు కేసీఆర్ ఆదేశం రాజకీయాలతో సంబంధం లేకుండా చర్య తీసుకోవాలన్న సీఎం ముందుగా టీఆర్ఎస్ వారిపైనే కేసులు పెట్టండి కఠిన శిక్షలు విధించేలా చట్టాన్ని రూపొందించాలి.. ఇదివరకే నిర్మాణం చేసుకుంటే చివరి అవకాశంగా క్రమబద్ధీకరించండి గడువులోగా ముందుకురాకపోతే స్థలాలు స్వాధీనం చేసుకోవాలి వెంటనే మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులకు ఆదేశం ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాల పంపిణీకి నిర్ణయం శ్రీ ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారి విషయంలో నేను కఠినంగా ఉంటే కొందరికి గిట్టదు. నన్ను బద్నాం చేయాలని చూస్తారు. అయినా దేనికీ భయపడేది లేదు. ప్రభుత్వ భూములు ప్రజలకు ఉపయోగపడాలి. పేదలకు మేలు జరగాలి. ప్రభుత్వ ఉద్దేశాన్ని, చిత్తశుద్ధిని అర్థం చేసుకోండి. నగరానికి సోకిన ఈ జబ్బును వదిలించే బాధ్యత మీపై పెడుతున్నాను. ప్రభుత్వ భూమిని ముట్టుకోవాలంటేనే భయపడాలి. - కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా కబ్జాదారులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అధికార పార్టీకి చెందిన వారినైనా వదిలిపెట్టకూడదని చెప్పారు. కబ్జాలకు పాల్పడే వారిలో ముందుగా టీఆర్ఎస్కు చెందిన వారిపైనే కేసులు నమోదు చేసి ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టం చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ భూము ల్లో ఇప్పటికే నిర్మాణాలు జరిగి ఉంటే ఆ స్థలాలను, భవనాలను క్రమబద్ధీకరించాలని, అనధికారిక లే అవుట్ల క్రమబద్ధీకరణకు వెంటనే మార్గదర్శకాలను రూపొందించాలని కేసీఆర్ పేర్కొన్నారు. క్రమబద్ధీకరణకు దరఖాస్తులను స్వీకరించి, విచారణ అనంతరం నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇందుకు నిర్ణీత గడువు విధించాలని, ఇదే చివరి అవకాశంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా క్రమబద్ధీకరణ చేసుకోని వారి నుంచి స్థలాలను స్వాధీనం చేసుకుంటామని కేసీఆర్ హెచ్చరించారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల కబ్జాపై గురువారం ఆయన సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రాజీవ్ శర్మతో పాటు రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు ముఖేష్‌కుమార్ మీనా, శ్రీధర్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేసుకుని రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటున్నారని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఓపక్క ప్రభుత్వ అవసరాల కోసం స్థలాలు కరువైపోగా.. మరోపక్క వేలాది ఎకరాలు కబ్జాదారుల చేతుల్లోకి పోతున్నాయంటూ విస్మయం వ్యక్తం చేశారు. కబ్జాదారులు ఎంతటి వారైనా విడిచిపెట్టవద్దని అధికారులకు నొక్కిచెప్పారు. ఇందుకు ప్రస్తుతమున్న చట్టాలు సరిపోవని, కబ్జాదారులకు కఠిన శిక్షలు పడేలా కొత్త చట్టాలను రూపొందించాల్సిన అవసరముందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. సీఎస్ రాజీవ్‌శర్మ అధ్యక్షతన గతంలో ఏర్పాటైన కార్యదర్శుల స్థాయి కమిటీకే ఈ బాధ్యతను అప్పగిస్తున్నట్లు చెప్పారు. సర్కారు భూముల పరిరక్షణ, ఆక్రమణదారులపై కఠిన చర్యలు, లీజుదారులు, అసైన్డ్ భూముల వ్యవహరాల్లో అనుసరించాల్సిన విధి విధానాలను కమిటీ రూపొందించాలని సూచించారు. దీనిపై ఈ నెల 9న కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో పూర్తిస్థాయి సమావేశం నిర్వహించాలని సీఎస్‌ను ఆదేశించారు. కార్యదర్శుల కమిటీ రూపొందించే చట్టానికి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు. ఇక మురికివాడల్లో నివసించే పేదలకు గౌరవప్రదమైన నివాసాలు కట్టించాలని, ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న పేదలకు పట్టాలివ్వాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. నగరానికి వలస వచ్చి గుడిసెలు వేసుకున్న వారిపట్ల ప్రభుత్వం అత్యంత ఉదారంగా వ్యవహరిస్తుందని చెప్పారు. గుడిసెల్లో నివాసముంటున్న రెండు లక్షల మందికి నీడ కల్పిస్తామన్నారు. అభాగ్యుల కోసం 50 నైట్ షెల్టర్లు నిర్మించాలని, నాలాలకు అడ్డంగా ఉన్న నివాసాలను తొలగించి వారికి మరోచోట స్థలం కేటాయించాలని అధికారులకు సూచించారు. కొందరికి గిట్టదు.. అయినా భయపడను పేదలు వేసుకునే గుడిసెలను వెంటనే తొలగిస్తున్న అధికారులు.. అక్రమంగా వెలసిన భవనాలను మాత్రం పట్టించుకోవడం లేదని సీఎం అన్నారు. ప్రభుత్వం, అధికారులు పేదల పక్షపాతిగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ భూముల్లో ఇప్పటికే నిర్మాణాలు చేసుకుని ఉంటే వాటిని క్రమబద్ధీకరించాలని, అందుకోసం ముందుకు రాని వారి నుంచి భూమిని స్వాధీనం చేసుకోవాలని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజోపయోగం పేరిట భూములను తీసుకుని వ్యాపారం చేసుకుంటున్న వారిపైనా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అసైన్డ్ భూముల సంగతి కూడా తేల్చాలని ఉన్నతాధికారులకు నిర్దేశించారు. నకిలీ పత్రాలను సృష్టించి స్థలాలు కాజేస్తున్న వారి కేసుల విషయంలో అధికారులు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగడంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. అలాంటి వారి విషయంలో గత ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించాయని, కులం, ప్రాంతం, రాజకీయాల ఆధారంగా ప్రేమ చూపించాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అలాంటి వారిని ఉపేక్షించాల్సిన అవసరం లేదన్నారు. తప్పు చేసిన వారెవరైనా శిక్షపడాల్సిందేనని పేర్కొన్నారు. ‘ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారి విషయంలో నేను కఠినంగా ఉంటే కొందరికి గిట్టదు. నన్ను బద్నాం చేయాలని చూస్తారు. అయినా దేనికి భయపడేది లేదు. నాకు స్వప్రయోజనాలు లేవు. కచ్చితంగా ఉంటా. వెనక్కి తగ్గను. నన్నెవరూ ఒత్తిడికి గురిచేయలేరు. ప్రభుత్వ భూములు ప్రజోపయోగాలకు ఉపయోగపడాలి. పేదలకు మేలు జరగాలి. అదే నా లక్ష్యం. ప్రభుత్వ ఉద్దేశాన్ని, చిత్తశుద్ధిని అర్థం చేసుకోండి. నగరానికి సోకిన ఈ జబ్బును వదిలించే బాధ్యత మీపై పెడుతున్నాను. ప్రభుత్వ భూమిని ముట్టుకోవాలంటేనే భయపడాలి’ అని అధికారులతో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. -
ఫార్మా, ఫిల్మ్‌సిటీల కోసం భూ పరిశీలన
ఆమనగల్లు: ఫార్మా, ఫిల్మ్‌సిటీ ఏర్పాటు కోసం రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల సరిహద్దులో ఉన్న ప్రభుత్వ భూములను ఆదివారం అధికారులు పరిశీలించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి ప్రదీప్‌చంద్ర, టీఐఐసీ ఎండీ జేఎస్ రంజన్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ హైదరాబాద్ నుండి హెలికాప్టర్లో ఇక్కడికి వచ్చారు. రంగారె డ్డి జిల్లా ముచ్చర్ల గ్రామ రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూముల్ని పరిశీలించారు. రంగారెడ్డి కలెక్టర్ శ్రీధర్, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ప్రియదర్శినిలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ 3 జిల్లాల సరిహద్దులో విస్తరించి ఉన్న రాచకొండ ప్రాంతంలో ఫార్మా సిటీ, ఫిల్మ్‌సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఈనెల 3న సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఏరియల్ సర్వే చేయనున్నారు. -
అనధికార క్రయవిక్రయాల క్రమబద్ధీకరణ
నోటరీలు, తెల్లకాగితాలపై అమ్మకాలకు రిజిస్ట్రేషన్ ఆదాయ ఆర్జనపై దృష్టి పెట్టిన టీ సర్కార్ సాక్షి, హైదరాబాద్: నోటరీలు, తెల్లకాగితాలపై చేసుకున్న క్రయవిక్రయాలను క్రమబద్ధీకరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. హైదరాబాద్ పాతబస్తీతోపాటు, తెలంగాణలోని వివిధ జిల్లాల్లో భూ రికార్డులకు సంబంధించి సమస్యలు ఉండడంతో... ప్రభుత్వ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా నోటరీల ద్వారా క్రయవిక్రయాలు జరుపుతున్నారు. దీంతో రాష్ట్ర ఖజానాకు భారీగా గండిపడుతోందని ప్రభుత్వం గుర్తించింది. పాతబస్తీలో అనధికారికంగా జరిగే విక్రయాలను రిజిస్ట్రేషన్ చేసుకునేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ భూముల ఆక్రమణలను క్రమబద్ధీకరించడం ద్వారా ఆదా యం సమకూర్చుకోవాలని యోచిస్తోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం ఆదాయార్జనపై ప్రధానంగా దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా లొసుగుల కారణంగా రిజిస్ట్రేషన్ల శాఖ కోల్పోతున్న ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. విలువ ఆధారిత పన్ను వసూళ్లలో ఈసారి కూడా 25 శాతం వృద్ధి సాధించాలని ఇటీవల ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ వద్ద జరిగిన సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ఆన్లైన్ అమ్మకాలపైనా దృష్టి సారించాలని ఆదేశించారు. రవాణా వాహనాలకు 3 నెలలకోమారు మోటారు వాహనాల పన్ను వసూలు చేస్తు న్నా.. ఆ ఆదాయం తగ్గుతోందని గుర్తించారు. భూగర్భ ఖని జాలు, గనుల ఆదాయం తగ్గకుండా చూసుకోవాలని నిర్ణయించారు. ఆంధ్రావాళ్లు వృత్తిపన్ను చెల్లిస్తున్నారా? హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చెల్లిస్తున్న వృత్తిపన్నును ఏపీ ప్రభుత్వం ఇక్కడ జమ చేస్తున్నదో లేదో తెలుసుకోవాలని టీ సర్కార్ సంబంధిత అధికారులను కోరింది. చెల్లించకుంటే ఆ మొత్తం రాబట్టాలని సూచించింది. -
ఆక్రమణలపై కొరడా
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న కబ్జాకోరులపై జిల్లా రెవెన్యూ యంత్రాంగం దృ ష్టి సారించింది. జిల్లాలో వేలాది ఎకరాల ప్రభు త్వ భూములను అందినకాడికి దండుకున్నట్లు భూ సర్వేలో వెల్లడైంది. ఈ మేరకు తిరిగి వాటి ని స్వాధీనం చేసుకోవాలనే కృతనిశ్చయంతో రెవెన్యూ యంత్రాంగం ఉంది. నిబంధనల్లో లొ సుగులను ఆధారం చేసుకుని చట్టబద్ధత కల్పిం చుకున్న ఘనులు ఎవరో కూడా ఇప్పటికే గుర్తిం చారు. ప్రభుత్వ భూ ఆక్రమణల అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ప్రభుత్వ భూమి ఎంత ఉంది? ఎంత ఆక్రమణకు గురైం ది? వాటిలో పక్కా భవనాలు ఎన్ని నిర్మించారు? వాటి విలువ ఎంత? అనే అంశాలపై రెవెన్యూ అధికారులు మండలాల వారీగా జరిపిన భూ సర్వేలో అనేక విషయాలు వెలుగు చూశాయి. ఇవి రెవెన్యూ వ్యవహారాల్లో అనుభవం ఉన్న సీనియర్ అధికారులనే విస్మయపరిచాయి. ఇన్నాళ్లకు మోక్షం జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని కొన్ని సంవత్సరాలుగా పలు రాజకీయపక్షాలు, ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏ ప్రాంతంలో ఎంత మేరకు ఆక్రమణకు గురయ్యాయి, ప్రభుత్వ భూమి ఎవరి చెరలో ఉందన్న అంశంపై మాత్రం ఇప్పటి దాకా స్పష్టత లేకుండా పోయింది. ప్రభుత్వ భూముల ఆక్రమణ వ్యవహారంలో కిందిస్థాయి రెవెన్యూ అధికారుల అండదండలే అధికంగా ఉన్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. గ్రామాల్లో రైతుల ఆధీనంలో ఉన్న భూములకు ఓ సర్వే నంబర్, ప్రభుత్వ భూములకు మరో సర్వే నంబర్ ఉండటం ఆనవాయితీగా వస్తోంది. కబ్జాకోరులతో మిలాఖత్ అయిన రెవెన్యూ అధికారులు కొన్ని మండలాల్లో తమ బుద్ధి ప్రదర్శించారు. కబ్జాకోరులతో కుమ్మక్కై ప్రభుత్వ సర్వే నంబర్లో ఉన్న భూములకు సైతం విచ్చలవిడిగా రెవెన్యూ పట్టాలు, హక్కు పత్రాలు మంజూరు చేశారు. దీని ఆధారంగా ఖమ్మం రెవెన్యూ డివిజన్‌లోనే వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన అక్రమార్కులు వాటిలో లక్షల రూపాయల విలువ చేసే భవనాలను సైతం నిర్మించారు. ఆక్రమించిన ప్రభుత్వ భూములకు చట్టబద్ధత కల్పించుకున్నారు. వాటిలో రియల్ఎస్టేట్ వ్యాపారం చేయడం సైతం జరిగినా ఇప్పటి దాకా వాటి గురించి కూలంకషంగా ప్రభుత్వ యంత్రాంగం ఆరా తీయలేదు. ఇదే అదనుగా ఆక్రమణదారులు ఆడిందే ఆటగా...చెలామణి అయ్యారు. ప్రభుత్వ అవసరాలకు దొరకని భూమి వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నా సర్కార్ అవసరాలకు భూములు దొరకకపోవడం ఉన్నతాధికారులను విస్మయానికి గురిచేసింది. పేదల గృహ నిర్మాణాలు మొదలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, చివరకు రక్షిత మంచినీటి పథకాలకు సైతం భూములు దొరక్కపోవడం గమనార్హం. ఈ పరిస్థితిని గమనించిన జిల్లా జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ ఆక్రమిత భూములను వెలికి తీయాలని నిర్ణయించుకున్నారు. జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూమి ఎంత ? అందుబాటులో ఉన్నది ఎంత? దానిలో ప్రజా అవసరాలకు ఉపయోగపడేది ఎంత? మిగిలిన భూమి ఏయే రూపంలో అన్యాక్రాంతం అయిందో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని జేసీ ఆదేశించారు. ఈ మేరకు మూడునెలలుగా మండలస్థాయి రెవెన్యూ యంత్రాంగం, సర్వే అధికారులు మూకుమ్మడిగా కసరత్తు చేశారు. వేలాది ఎకరాల భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. ఆ భూముల్లో విలువైన భవనాలు, బహుళ అంతస్థుల మేడలు నిర్మించినట్లు తెల్చారు. వీటి ఆధారంగా ఆయా ఆక్రమణదారులపై చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం ఉపక్రమించింది. చెరువులూ..కుంటలు సైతం ఆక్రమణ జిల్లాలోని చెరువులు, కుంటలను సైతం ఆక్రమణదారులు వదలలేదు. వీటిలో సైతం పక్కా భవనాలు నిర్మించారు. రియల్ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ చెరువుల స్ఫూర్తిని తుంగలో తొక్కారు. జిల్లాలో రెండువేల ఎకరాల చెరువు భూములను దాదాపు మూడు వేలమందికి పైగా ఆక్రమించారని ఈ సర్వే తేల్చింది. కబ్జాదారులకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఆయా ప్రాంతాల్లోని అధికారుల ద్వారా నోటీసులు జారీ చేసింది. భూములపై ఆక్రమణదారులకు గల హక్కు ఏమిటో, వారికిఉన్న పత్రాలు ఏమిటో సంబంధిత అధికారులకు చూపించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఐదు, పది కుంటల నుంచి ఎకరాలకు ఎకరాలను తమ ఆధీనంలో ఉంచుకున్న రైతులకు అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు. ఇందులో కేవలం చెరువు గట్టుకింద ఉన్న భూమిని సాగు చేసుకున్న రైతులు సైతం లేకపోలేదు. ప్రభుత్వం ఇచ్చిన నోటీసుల వల్ల తమ జీవనాధారం పోతుందేమోనని, ఉన్న అరెకరం చెరువు పొలం దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నామని చిన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రం పరిసరాలపై దృష్టి ఖమ్మం అర్బన్, రూరల్ వంటి మండలాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి చేరడంలో ఎవరి పాత్ర ఎంత అనే అంశంపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించింది. ప్రభుత్వ సర్వే నంబర్లలో ప్రైవేట్ వ్యక్తులకు పట్టాలు ఏ ప్రాతిపదికన జారీ చేశారో తేల్చడానికి సైతం రెవెన్యూ అధికారులు సంస్థాగతంగా ప్రయత్నా లు ప్రారంభించారు. ఏ మండలంలో, ఏ అధికారి హయాంలో ఈ తరహా అక్రమాలు జరిగా యో కూపీ లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం అర్బన్ మండలంలో భూ ఆక్రమణలు జరిగిన తీరు జిల్లా రెవెన్యూ అధికారులనే ఆశ్చర్యపరుస్తోంది. చట్టంలో ఉన్న లొసుగులు, రెవెన్యూ శాఖలో ఉన్న అనుభవాన్ని క్రోడీకరించి కొందరు రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులకు సహకరించారు. ఎక్కడా దొరకకుండా ఉండేందుకు తమకున్న తెలివితేటలు, యావత్తు ఉపయోగించారని రెవెన్యూశాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణదారుల చేతిలోకి వెళ్లడానికి పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారి ఉంటాయన్న విషయం బహిరంగ రహస్యమే. ఇప్పటికైనా యంత్రాంగం అప్రమత్తం కావడం ఒకింత మంచిదే అయినా..ప్రభుత్వ భూముల్లో నిర్మించిన పక్కా భవనాలను గుర్తించినా..వాటిని స్వాధీనం చేసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలి సింది. వాటిని తక్షణం కూల్చివేయకుండా ప్రజా అవసరాలకు ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ తరహాలో ఇప్పటికే భద్రాచలంలో ప్రభుత్వ స్థలంలో కట్టిన కట్టడాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని ప్రజా ఉపయోగార్థం వినియోగిస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ప్రైవేట్ భవనాల్లో ప్రభుత్వ వసతి గృహాలను ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుందన్న అంశం సైతం సర్కారు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
10వేల ఎకరాలు హాంఫట్!
* విలువ రూ.20 వేల కోట్ల పైనే! * సర్వేలో విస్మయపరిచే నిజాలు * నగర శివార్లలోనే ఏకంగా 8 వేల ఎకరాలు అన్యాక్రాంతం * ప్రాథమిక నివేదిక సమర్పించిన రంగారెడ్డి జిల్లా యంత్రాంగం సాక్షి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి: ప్రభుత్వ భూములకు రెక్కలొచ్చాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.20 వేల కోట్ల విలువైన సర్కారీ భూములు కబ్జాదారుల కబంధహస్తాల్లో చిక్కుకుపోయాయి. భూముల ఆక్రమణలపై రంగారెడ్డి జిల్లా యంత్రాంగం జరిపిన సర్వేలో విస్మయకర నిజాలు వెలుగు చూశాయి. ప్రభుత్వ భూముల్లో ఎంతమంది పాగా వేశారో లెక్క తీయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారగణం.. జిల్లాలో 10,366.14 ఎకరాల భూమి అన్యాక్రాంతమైనట్లు గుర్తించింది. మరికొన్ని మండలాల నుంచి సమాచారం రావాల్సి ఉండడంతో ఈ గణాంకాలు పెరిగే అవకాశం లేకపోలేదు. పరిశ్రమలకు, వివిధ సంస్థలకు బదలాయించిన స్థలాలతోపాటు ఇంకా ఎవరికీ కేటాయించని భూముల వివరాలను పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలోనే 64,671.39 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు నిర్ధారించిన రెవెన్యూ యంత్రాంగం.. ఇందులో కేవలం 3,395.07 ఎకరాలు మాత్రమే వివాదరహితంగా ఉందని తేల్చింది. పోరంబోకు, సీలింగ్, కారీజ్ ఖాతాలుగా వర్గీకరించిన భూములు అక్రమార్కుల చెరల్లో చిక్కుకున్నాయని పసిగట్టిన యంత్రాంగం.. గ్రామీణ ప్రాంతాల్లో వీటిని సాగుకు వినియోగించుకుంటున్నట్లు గుర్తించింది. నగర శివార్లలో మాత్రం ల్యాండ్ మాఫియా గుప్పిట్లో వేలాది ఎకరాలు మగ్గుతున్నట్లు లెక్క తేల్చింది. అయితే, ఈ భూముల హక్కుల కోసం కోర్టుల్లో కేసులు నడుస్తుండడంతో దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటోంది. మల్కాజిగిరిలో 6,248 ఎకరాలు హాంఫట్ స్థిరాస్తి రంగం పుంజుకోవడంతో శివార్లలోని విలువైన స్థలాలు కైంకర్యమవుతున్నాయి. మరీ ముఖ్యంగా మల్కాజిగిరి, సరూర్‌నగర్ రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 7,783 ఎకరాలు ఆక్రమణకు గురైంది. రాజేంద్రనగర్ డివిజన్లో 2,127 ఎకరాల మేర ఆక్రమించినట్లు జిల్లా యంత్రాంగం తేల్చింది. ఇక్కడ ఎకరా సగటున రూ.3 కోట్లు పైమాటే. ఈ లెక్కన ఈ మూడు డివిజన్లలోనే సుమారు రూ.15 వేల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమైనట్లు అంచనా. బాలానగర్ మండలంలో 537.28, శేరిలింగంపల్లి 850.20, రాజేంద్రనగర్ 345, శంషాబాద్ 394, కుత్బుల్లాపూర్ 1913, ఉప్పల్ 121, శామీర్‌పేట 2993, మల్కాజిగిరి 162, మేడ్చల్ 340 ఎకరాలు కబ్జా అయినట్లు తేలింది. దీంట్లో అధికశాతం వ్యవసాయేతర భూములు కావడంతో వీటి విలువ రూ.కోట్లలో పలుకుతోంది. రెవెన్యూ అధికారులు భూ ఆక్రమణలపై క్షేత్రస్థాయిలో సర్వే జరపడమే కాకుండా రికార్డులను కూడా పరిశీలిస్తుండడంతో కబ్జా చిట్టా మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. 18,476 మంది కబ్జాదారులు! జిల్లావ్యాప్తంగా ఆక్రమణకు గురైన పది వేల ఎకరాల్లో 18,476 మంది పాగా వేసినట్లు అధికార యంత్రాంగం తేల్చింది. ఇందులో అధికంగా మల్కాజిగిరి డివిజన్ పరిధిలో 17,590 మంది కబ్జాదారులు ఉన్నట్లు గుర్తించింది. చిన్నచిన్న బిట్లుగా ఉన్న స్థలాలపై కన్నేసిన అక్రమార్కులు.. వాటిని సొంతం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది అండదండలు కూడా ఉండడంతో రికార్డులు తారుమారు చేయడం ద్వారా స్థలాల హక్కుల కోసం కోర్టుకెక్కుతున్నారు. ఇంటిదొంగలు హస్తం ఉండడంతో ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం ప్రభుత్వానికి తలకుమించిన భారంగా పరిణమించింది. ఆక్రమణదారుల్లో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, బడాబాబులు ఉండడంతో అన్యాక్రాంతమవుతున్న జాగాలపై పట్టు బిగించలేకపోతోంది. ల్యాండ్ బ్యాంక్ సిద్ధం! ఐటీ కంపెనీలు, బహుళ జాతి సంస్థల పెట్టుబడులను ప్రోత్సహించేలా నూతన పారిశ్రామిక విధానాన్ని తేవాలని భావిస్తున్న ప్రభుత్వం.. అందుకనుగుణంగా కంపెనీల స్థాపనకు ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేసింది. గతంలో టీఐఐసీ, హెచ్ఎండీఏ, రాజీవ్ స్వగృహ, దిల్ తదితర సంస్థలకు బదలాయించిన భూముల్లో వినియోగంలోకిరాని భూములతోపాటు, పారిశ్రామిక అవసరాలకు పోను అట్టిపెట్టుకున్న భూముల వివరాలను కూడా సేకరించింది. ఈ నేపథ్యంలో తాజాగా 30 వేల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. అగ్రశ్రేణి సంస్థలు, ఫార్మా రంగం కంపెనీలు రాజధాని శివార్లలోనే పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపే అవకాశం ఉండడంతో అక్ర మార్కుల చేతుల్లోని భూములను కూడా రాబట్టుకునే దిశగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగా ప్రభుత్వ భూముల వివరాలు, ఆక్రమణలకు సంబంధించి సర్వే నంబర్ల వారీగా వివరాలను సేకరిస్తోంది. -
ఖాళీ జాగా.. వేసై పాగా
మండలంలోని బొల్లారం జిల్లాలోనే అతిపెద్ద మేజర్ పంచాయతీ. హైదరాబాద్‌కు కూతవేటు దూరంలో ఉండడం, దీనికి తోడు పారిశ్రామికంగా బొల్లారం అభివృద్ధి చెందుతుండడంతో భూముల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఎకరా స్థలం విలువ సుమారు రూ. 2 కోట్ల వరకు ఉంటుంది. బొల్లారం ప్రాంతంలో సుమారు వె య్యి ఎకరాల వరకు ప్రభుత్వ భూములుంటాయి. ఇందులో 172 ఎకరాల స్థలాన్ని నాలుగేళ్ల క్రితం అధికారులు హుడాకు కేటాయించారు. ఇలా హుడాకు కేటాయించిన స్థలంతో పాటు, బొల్లారం రెవెన్యూ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములపై కబ్జాదారుల కన్ను పడింది. అందులో భాగంగానే వైఎస్సార్ కాలనీలో పార్కు కోసం కేటాయించిన సుమారు నాలుగు ఎకరాల స్థలాన్ని కబ్జా చేసేందుకు నాయకులు సిద్ధపడ్డారు. స్థలం చుట్టుపక్కల ఇప్పటికే కొన్ని నిర్మాణాలు చేపట్టగా, మరికొంత కబ్జా చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీని విలువ సుమారు రూ. 10 కోట్ల వరకు ఉంటుంది. స్థానికంగా ఉన్న చెరువులను కూడా ఇక్కడి అధికార పార్టీ నేతలు కబ్జాలు చేసేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
పట్టణ, నగరాల్లోని కబ్జాదారులపై నిఘా
సాక్షి ,బెంగళూరు : మొదట పట్టణ, నగర ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకున్న వారి నుంచి తిరిగి భూములను స్వాధీనం చేసుకోవడానికి వీలుగా ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టీబీ జయచంద్ర తెలిపారు. అందులో భాగంగా మొదట బెంగళూరులో ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరులో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన శనివారం మాట్లాడారు. ప్రత్యేక న్యాయస్థానంలో కేసుల విచారణకు న్యాయమూర్తికు ఇద్దరు ఐఏఎస్ స్థాయి అధికారులు, ఇద్దరు రెవెన్యూ అధికారులు సహకరిస్తారన్నారు. ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియలో పేదలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తపడతామని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం ప్రభుత్వ భూముల ఆక్రమణకు సంబంధించి న్యాయస్థానాల వద్ద ఎనిమిది వేల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. భవిష్యత్‌లో ఆక్రమణలకు సంబంధించి మరో 10 వేల కేసులు న్యాయస్థానం ముందుకు వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. బగర్‌హుకుం భూముల సాగుకు ప్రభుత్వ భూముల కబ్జాకు సంబంధం లేదని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. పేద రైతులకు ముఖ్యంగా బగర్‌హుకుం భూముల సాగు చేసుకుటున్న వారికి నూతన చట్టం వల్ల ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. జిల్లా, తాలూకా స్థాయి కార్యాలయాల్లో చాలా కాలంగా పెండింగ్‌లోఉన్న ఫైల్స్‌ను పూర్తి చేసే పనిని నవంబర్ ఒకటో తేదీ నుంచి 30 రోజుల పాటు చేపట్టనున్నామని తెలిపారు. ‘సకాల’ ప్రాజెక్టు కింద నిర్ధిష్ట సమయంలోపు పనులు పూర్తి చేయని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రెడ్ మార్క్ !
సాక్షి ప్రతినిధి,గుంటూరు : నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం జరుగుతున్న సర్వేలో ప్రభుత్వ భూముల వివరాలతోపాటు కొందరు రియల్టర్ల అక్రమాలూ వెలుగులోకి వస్తున్నాయి. చెరువులు, అసైన్డ్భూములను కొందరు ఆక్రమిస్తే, సామాజిక స్థలాలను మరి కొందరు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్న భూముల సర్వేలో ఇవన్నీ వెలుగులోకి వస్తుండటంతో అక్రమార్కుల వెన్నులో చలిపుడుతోంది. ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనే’ రీతిలో ఇరవై ఏళ్ల నాటి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ స్థలాల జాబితాను రూపొందించిన రెవెన్యూ శాఖ వాటి రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించడంతో అప్పటి కొనుగోలుదారులు పూర్తిగా నష్టపోతున్నారు. వీరంతా అప్పట్లో 200 చదరపు గజాల స్థలాన్ని రూ. ఆరు వేల నుంచి 60 వేలకు కొనుగోలు చేసినా, ప్రస్తుత మార్కెట్ ప్రకారం ధర చెల్లించాలని రియల్టర్లపై ఒత్తిడి చేస్తున్నారు. అప్పట్లోనే రియల్ భూమ్.. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల కంటే గుంటూరు జిల్లాలో ఇరవై సంవత్సరాల కిందట రియల్ ఎస్టేట్ వ్యాపారం అధికంగా జరిగింది. వ్యవసాయ భూముల్లో లే అవుట్లు వేసిన కొన్ని ప్రముఖ కంపెనీలు స్థలాలు విక్రయించాయి. ఆ సమయంలో తమ వ్యవసాయ భూములకు సరిహద్దునే ఉన్న చెరువులు, అసైన్డ్ల్యాండ్స్ను కలుపుకుని వెంచర్లు వేశాయి. ఈ లేఅవుట్లకు వీజీటీఎం ఉడా అనుమతి ఇవ్వడంతో స్థలాలు వేగంగానే అమ్ముడు పోయాయి. ఇలా అనుమతి ఇచ్చిన లే అవుట్‌లోని సామాజిక స్థలాలనూ కొందరు రియల్టర్లు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. గుంటూరుకు సమీపంలోని పెదకాకాని, కాజ, మంగళగిరి, తెనాలిలో ఈ తరహా స్థలాల అమ్మకాలు ఎక్కువగా జరిగాయి. రాజధానికి నిర్మాణం కోసం జరుగుతున్న సర్వేలో ఆక్రమణకు గురైన చెరువులు, అసైన్డ్ భూముల వివరాలను రెవెన్యూశాఖ సేకరించింది. వీటిల్లో వేసిన వెంచర్లకు సంబంధించిన స్థలాలపై రెడ్ మార్కు పెట్టి కొత్తగా రిజిస్ట్రేషన్ చేయకూడదని నిషేధం విధించింది. మరో వైపు అక్రమ లేఅవుట్లపై వీజీటీఎం ఉడా దృష్టి సారించింది. ఒక్క తెనాలి, గుంటూరు డివిజన్లలో సుమారు 12 వేల అనధికార లే ుట్లను గుర్తించి వాటి వివరాలను రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు అందజేసింది. దీంతో ఈ స్థలాలను కొత్తగా ఎవరైనా కొనుగోలు చేసినా, వాటి రిజిస్ట్రేషన్లు మాత్రం జరగడం లేదు. వీటిని అమ్మిన ప్రముఖ కంపెనీలు, రియల్టర్లపై కొనుగోలుదారుల ఒత్తిడి పెరిగింది. కొందరిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిరా్యాదు చేస్తున్నారు. -
ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు
ఖమ్మం అర్బన్: నగరంలోని విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమణదారుల నుంచి కాపాడేందుకు హైదరాబాద్ తరహాలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ (భూఆక్రమణ చట్టం) కఠినంగా అమలుచేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ (జేసీ) సురేంద్రమోహన్ ఆదేశించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. ఆయన సోమవారం ఖమ్మం అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో ‘గ్రీవెన్స్ డే’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం, వివిధ శాఖల పనితీరుపై మూడు గంటలపాటు సమీక్ష సమావేశం నిర్వహించారు. కొన్ని శాఖల పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఖమ్మం నగరంలో ఎంతో విలువైన ప్రభుత్వ భూములు ఉన్నాయని, అవి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను ఆక్రమించినవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు. నగరంలోని ప్రభుత్వ భూమిని ఎక్కడైనా ఆక్రమించినట్టయితే.. భూఆక్రమణ చట్టం ఆధారంగా ఆయా శాఖల అధికారులే కోర్టును ఆశ్రయిస్తే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. ఇందుకోసం అవసరమైతే ఈ చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు. నగరంలోని ప్రభుత్వ పాఠశాలల స్థలాల వివరాలను వారం రోజుల్లో కార్పొరేషన్, రెవెన్యూ రికార్డుల్లో చేర్చాలని ఆదేశించారు. చర్యలు తీసుకోకపోతే బాధ్యులవుతారు.. ‘‘ప్రభుత్వ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా, అందుకు అనుమతి ఇచ్చినా, అప్పటికే అక్కడ చేపట్టిన నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా మీరే బాధ్యులవుతారు’’ అని, కార్పొరేషన్ అధికారులను హెచ్చరించారు. ‘‘మీరు లెక్కలు తెల్చండి. లేకపోతే వేరే వారితో లెక్కలు తీసి దానికి మిమ్మల్ని బాధ్యులుగా చేయాల్సుంటుంది. ఇప్పటికే విజిలెన్స్ నివేదిక మా వద్ద ఉంది’’ అన్నారు. నగరంలో ప్రభుత్వ భూముల వివరాలతో వారం రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పౌర సరఫరాల, విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ఆగస్టులో బియ్యం సరఫరాలో జాప్యంపై జాయింట్ కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పౌర సరఫరాల, విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బడి బియ్యం సరఫరా నగరంలోనే ఇలా ఉంటే గ్రామాల్లో ఇంకెలా మెరుగ్గా ఉంటుంది..? బియ్యం నిల్వ ఉండి కూడా ఇతరుల వద్ద అప్పుగా తీసుకుని వండాల్సిన ఖర్మేమిటి..?’’ అని, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి (డీఎస్ఓ) గౌరీ శంకర్‌ను ప్రశ్నించారు. దీనిని మూడు నెలల్లో గాడిలో పెట్టాలని డీఈఓ, డీఎస్ఓను ఆదేశించారు. సమావేశంలో డీఎస్ఓ గౌరీశంకర్, డిపో మేనేజర్ సాంబశివరావు, తహశీల్దార్ వెంకారెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
పద్మాక్షి గుట్టను పరిశీలించండి
ఆక్రమణలను అరికట్టాలి ఆర్డీవోకు కలెక్టర్ ఆదేశం సాక్షి ప్రతినిధి, వరంగల్ : పద్మాక్ష్మి గుట్ట స్థలం ఆక్రమణ కాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జి.కిషన్ వరంగల్ ఆర్డీవో వెంకటమాధవరావును ఆదేశించారు. పద్మాక్షి గుట్ట, గుట్టకు సమీపంలోని ప్రభుత్వ భూముల పరిస్థితిని స్వయంగా పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. ‘బతుకమ్మ ఆటకు స్థలం లేదు’ శీర్షికతో సాక్షిలో శుక్రవారం ప్రచురితమైన కథనంపై కలెక్టర్ స్పందించారు. బతుకమ్మ ఉత్సవాలు జరిగే పద్మాక్షి గుట్ట కబ్జా కాకుండా నిరోధించాలని అధికారులకు చెప్పారు. ఆర్డీవో వెంకటమాధవరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘పద్మాక్షి గుట్ట ఆక్రమణలపై కలెక్టర్ ఆదేశించారని, ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. కాగా, గుట్ట స్థలం కబ్జాపై హన్మకొండ తహసీల్దార్ చెన్నయ్య మాత్రం నిర్లక్ష్యంగా స్పందించారు. కలెక్టర్ దగ్గరి నుంచి తమకు ఎలాంటి ఆదేశాలూ రాలేదన్నారు. తన పరిధిలోని భూములను పర్యవేక్షించాల్సిన అధికారి అయి ఉండి.. ఈ విషయం పట్టనట్లుగా వ్యవహరించారు. పాత ఆక్రమణలే ఉన్నాయి గానీ, కొత్తగా ఎలాంటి లేవు అని సిబ్బంది తహసీల్దార్‌కు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. తహసీల్దారు కార్యాలయం నిర్లక్ష్య వైఖరి చూస్తుంటే... పద్మాక్షి గుట్ట ఆక్రమణల విషయం ఇక్కడి అధికారులకు, సిబ్బందికి తెలిసే జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
పి.పొన్నవోలులో భూపోరాటం
జెండాలు పాతిన సీపీఐ నాయకులు, కూలీలు పోలీసుల మోహరింపు పి.పొన్నవోలు(రావికమతం): మండలంలోని పి.పొన్నవోలు, జి.చీడిపల్లి రెవెన్యూలో ఇతర జిల్లాల బడాబాబుల చేతుల్లో ఉన్న వందెకరాల ప్ర భుత్వ భూముల్లో సీపీఐ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం భూపోరాటం చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె. వి.సత్యనారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి స్టాలిన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండలరా వు, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి విమల తదితర జిల్లా నాయకు లు పాల్గొన్నారు. పెత్తందార్ల చేతుల్లో ఉన్న భూముల్లో వారే స్వయంగా కత్తిపట్టి తుప్పలు నరికి, జెండాలు పాతారు. పాకలు వేసేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో పొన్నవోలు, జి.చీడిపల్లి, ఆర్.కొత్తూరు గ్రామాల్లో భూమిలేని నిరుపేదలు, వ్యవసాయ కూలీలు వందలాదిగా ఎర్రజెండాల తో కదం తొక్కారు. ఆ గ్రామాల్లోని 156, 157, 158, 142, 143, 172, 131, 168, 173, 179 తదితర సర్వే నంబర్లలో సుమారు 150 ఎకరాల్లో భూమిని ఇతర జిల్లాలకు చెంది న బొక్కా సూర్యారావు, పి.కన్నతల్లి, గంధం త్రిమూర్తులు తదితర 30 మంది బడాబాబులకు ఒక్కొక్కరికి ఐదెకరాల చొప్పున గతంలో పట్టాలి చ్చారు. పట్టాలు పొందిన వా రంతా మృతి చెందారని, భూములను కొం తమంది పెద్దలు 99 ఏళ్లకు లీజుకిస్తున్నారని ఐదేళ్లుగా సీపీఐ నాయకులు ఆందోళన చేస్తున్నారు. అధికారులు మామూళ్లుకు అలవాటు పడి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో భూపోరాటం చేపట్టినట్టు సత్యనారాయణమూర్తి తెలిపారు. జిల్లా అధికారులు స్పందించి జెండాలు పాతిన భూములను భూమిలేని స్థానిక నిరుపేదలకివ్వాలని కోరారు. భారీ బందోబస్తు ఆ గ్రామంలో మూడేళ్ల క్రితం జరిగిన భూపోరాటంలో పలువురుకి తీవ్రగాయాలయ్యాయి. దీంతో కొత్తకోట సీఐ పి.వి. కృష్ణవర్మ భారీ బందోబస్తు నిర్వహించారు. కొత్తకోట, రావికమతం, రోలుగుంట, మాకవరపాలెం ఎస్ఐలు, సిబ్బందితో పాటు సీఆర్పీఎఫ్ బలగాలను, మహిళా పోలీసులు సుమారు 100 మందిని మోహరించారు. ప్రశాంతంగా కార్యక్రమం కొనసాగించాలని సీఐ కృష్ణవర్మ పదేపదే సీపీఐ నాయకులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో స్థానిక సీపీఐ నాయకులు జోగిరాజు, అజయ్‌బాబు, అర్జున్, సర్పంచ్ వరహాలుదొర, ఎంపీటీసి తదితరులు పాల్గొన్నారు. -
కూల్చివేతలు ఆగవు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో కొద్దిరోజులుగా నిలిచిపోయిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఆగిపోలేదని, కొనసాగుతాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెలిపారు. ఆదివారం విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ, ఈ విషయం స్పష్టం చేశారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు ఎలాంటి అనుమతి లేదని, చట్టప్రకారం దానిపై అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు. నగరంలోని ఎన్నో ప్రభుత్వ భూములు కబ్జా అయ్యాయని చెబుతూ, కేవలం మూడు కేసుల్లోనే రూ. 50వేల కోట్లకు పైగా ఆస్తులున్నాయన్నారు. సామాన్యుల భవనాలపైనే అధికారులు చర్యలు తీసుకుంటున్నారని ప్రస్తావించగా, దాన్ని ఖండించారు. ఐదారంతస్తులు నిర్మించిన వారు సామాన్యులెలా అవుతారని ఎదురు ప్రశ్నించారు. నగరంలో వాన కురిస్తే నీరు వెళ్లే మార్గం లేదని .. అందుకు కారణాలేమిటని అధికారులను అడిగితే అనుమతి లేని అక్రమ నిర్మాణాలని చెప్పారన్నారు. అందువల్లే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించానని, దాంతో వారు చర్యలకు దిగారన్నారు. -
ప్రభుత్వ భూములు కరిగిపోతున్నాయ్!
శ్రీకాకుళం పాత బస్టాండ్: జిల్లాలో ప్రభుత్వ భూములు క్రమంగా తగ్గుతున్నాయి. ప్రభుత్వ అవసరాలకు భూసేకరణ జరపడం, పేదలు, ఇతరులకు అసైన్మెంట్ రూపంలో ఇవ్వడంతోపాటు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురవుతుండటంతో ప్రభుత్వ ఆధీనంలోని భూముల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. కొన్నేళ్ల క్రితం జిల్లాలో 4,08,361.4 ఎకరాలు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు వీటి విస్తీర్ణం 3,18,865.70 ఎకరాలకు తగ్గిపోయింది. అంటే వివిధ రూపాల్లో 89,579.99 ఎకరాల భూములు వేరే వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయన్నమాట. వీటిలో ప్రజావసరాలకు ప్రభుత్వం సమకూర్చగా.. పెద్ద విస్తీర్ణంలోనే ఆక్రమణలకు గురయ్యాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులోనూ వ్యవసాయ భూములే ఎక్కువగా ఆక్రమణలకు గురవుతుండటం విశేషం. ఈ పరిస్థితికి ఆధికారుల అలసత్వం, రాజకీయ ప్రాబల్యం, ఒత్తిళ్లు ప్రధాన కారణం. ఇటీవల కాలంతో భూముల ధరలు, డిమాండ్ పెరగడం, గృహ నిర్మాణాలు పెరగడంతో వ్యవసాయ భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురై.. ఇళ్ల స్థలాలుగా రూపాంతరం చెందుతున్నాయి. దీనికితోడు మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వ భూములను కరిగించేస్తోంది. ఈ వ్యాపారులు తాము కొనుగోలు చేసే ప్రైవేట్ జిరాయితీ భూముల ముసుగులో వాటికి ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ లే అవుట్లు వేసి అమ్మేస్తున్నారు. ఇటువంటి అక్రమాలపై అధికారులు ఉదాసీనంగా వ్యవహరించమో.. మామూళ్లు తీసుకొని చూసీచూడనట్లు పోవడం వల్లనో ప్రభుత్వ భూములు మాయమవుతున్నాయి. ప్రభుత్వ భూముల గణాంకాలు పరిశీలిస్తే.. జిల్లాలో కొన్నాళ్ల క్రితం మొత్తం 4,08,361.4 ఎకరాల ప్రభుత్వ భూములు ఉండేవి. ఇటీవలి కాలంలో ప్రభుత్వ, ఇతర ప్రజావసరాలకు 79,785.24 ఎకరాలను అసైన్ చేశారు. మరో 2,212.83 ఎకరాలు ఎలియనేటెడ్ భూములుగా ఉన్నాయి. పేదల ఇళ్ల స్థలాలకు 3,730.72 ఎకరాలు కేటాయించారు. వీటి మొత్తం విస్తీర్ణం 85,728.79 ఎకరాలు. ఇకపోతే చెరువులు, మెట్ట భూములు, కాలువలు, గుట్టలు, కొండలు వంటి భూములు విరివిగా అక్రమణలకు గురవుతున్నాయి. వ్యవసాయ భూములు 3,651.44 ఎకరాలు, వ్యవసాయేతర భూములు 199.76 ఎకరాలు మొత్తం 3.851.20 ఎకరాలు అక్రమణలకు గురయ్యాయి. ఇవి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ప్రజా, ప్రభుత్వ అవసరాలకు భూములు లేకుండాపోయే ప్రమాదముంది. -
వడివడిగా...విచ్చలవిడిగా..
ప్రభుత్వ భూములు, డ్రెయిన్ల ఆక్రమణ అక్రమార్కులకు అధికారుల అండదండలు మామూళ్ల కోసమే తనిఖీలు గుడివాడ, నందివాడ మండలాల్లో చెరువులవుతున్న పంటపొలాలు గుడివాడ : ఇటీవల కాలంలో నందివాడ, గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు మండలాల్లో చేపల చెరువుల తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. దాదాపు 300 పొక్లెయిన్లు, 250 బుల్డోజర్లు చెరువుల తవ్వకానికి వినియోగిస్తున్నారంటే ఏ స్థాయిలో చేపల చెరువులు తవ్వారో తెలుస్తుంది. పంటబోదెలు, డ్రెయిన్లు, ప్రభుత్వ భూములు ఈచెరువుల్లో కలిసి పోయాయనే ఆరోపణలు ఉన్నాయి. కోర్టు అనుమతి ఉందంటూ తవ్వేశారు.. కోర్టు అనుమతి ఉందంటూ నందివాడ మండలంలో వందలాది ఎకరాల భూమిని తవ్వేశారు. కొంతమంది కోర్టునుంచి అనుమతి తెచ్చుకొని వ్యవసాయభూమిని చేపల చెరువుగా మార్చుకుంటే, చుట్టుపక్కల భూ యజమానులు సైతం తమకు కోర్టు అనుమతి ఉందంటూ చెరువులు తవ్వుకుంటున్నారు. నిబంధనల ప్రకారం వ్యవసాయశాఖ, రెవెన్యూ, ఇరిగేషన్, డ్రె యినేజీ, భూగర్భ జలాలశాఖ, కాలుష్య నియంత్రణశాఖలు చెరువుల తవ్వకానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపాక మత్స్యశాఖ వారికి ఎటువంటి అభ్యంతరం లేదని తెలపాలి. కానీ ఎవరి మామూళ్లు వారు తీసుకుని అనుమతులు అడ్డగోలుగా ఇచ్చేస్తున్నారు. ఇందులో రెవెన్యూశాఖది కీలక పాత్ర. చెరువులు అనుమతి వచ్చాక మండల సర్వేయర్ పెగ్ మార్కింగ్ ఇచ్చాక మాత్రమే తవ్వాలి. కాలువ గట్లు, డ్రెయినేజీలు, రోడ్లు, శ్మశాన వాటికలకు 10మీటర్లు దూరంగానే ఉండాలి. అలాగే దేవాలయ భూములు, అసైన్మెంటు భూముల్ని మినహాయించాలి. పంట బోదెలు, డ్రైన్లు పాడవకుండా తవ్వాలి. కానీ ఈనిబంధనలు ఎవరూ పాటించడం లేదు. తహశీల్దార్‌తో సహా అధికారులంతా రింగ్... నందివాడ మండలంలో చెరువుల అక్రమ తవ్వకాల్లో మండల తహశీల్దార్‌తో సహా అధికారులంతా రింగ్ అయ్యి అడ్డగోలు తవ్వకాలకు తెరలేపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తహశీల్దార్ మాత్రం తనకేమీ తెలియదనే చెబుతూనే గతంలో ఇచ్చిన అనుమతులకు పాత తహశీల్దార్ మామూళ్లు తీసుకున్నాడు కాబట్టి మళ్లీ ఇవ్వాలని డిమాండు చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. మండలంలో మండల సర్వేయర్, ఆర్ఐలు ఎవరి వాటా వారు వసూలు చేసుకుని ఇష్టారాజ్యంగా తవ్వేసుకునేందుకు సహకరిస్తున్నారని చెబుతున్నారు. నందివాడ మండల తహశీల్దార్‌ను అక్రమ తవ్వకాలపై ఎవరైనా ప్రశ్నిస్తే తనకేమీ తెలియదని మండల ఆర్ఐ, సర్వేయర్లు ఇక్కడ కీలకంగా ఉన్నారని చెప్పేస్తున్నారు. బాధ్యతగల అధికారి ఇలా మాట్లాడటమేమిటని మండల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. అడ్డగోలు తవ్వకాలకు ఆనవాళ్లు ఇవిగో.. నందివాడ, తమిరిశ, తుమ్మలపల్లి గ్రామాల్లో గత మే నెల నుంచి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సుమారు రెండు వేల ఎకరాల వరకు చేపల చెరువులు తవ్వారు. నందివాడలో తవ్విన చెరువులు కారణంగా భూమికోడు, దోసాపడు కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు 20 ఎకరాల వరకు దేవాదాయశాఖ భూమి చేపలచెరువుగా మారిపోయింది. తుమ్మలపల్లిలో ఏలూరుకు చెందిన ప్రముఖ చేపల వ్యాపారి 80 ఎకరాలు చెరువులో నడుంకోడు కాలువను పూర్తిగా చెరువులో కలిపేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఇదిగాక పంట కాలువ పోరంబోకు 15ఎకరాల వరకు ఆక్రమించాడు. దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఇదే గ్రామంలో టీడీపీకి చెందిన నేత 60 ఎకరాల చేపల చెరువును నిబంధనలకు విరుద్ధంగా తవ్వించారు. మేజర్ చానల్ అయిన రాసకోడు చాల వరకు చెరువుల యజమానులు అక్రమించారు. నందివాడ మండలానికి సాగు, తాగునీరు ఇచ్చే దోసపాడు చానల్‌కు చాల చోట్ల చెరువుల యజమానులు తూట్లు పొచించారు. చానల్‌కు అనుబంధంగా ఉన్న టీఆర్ఎస్ చానల్‌ను నందివాడ నుంచి తుమ్మలపల్లి వరకు పూర్తిగా అక్రమించారు. వెంకటరాఘవపురం వద్ద జగంకోడు చానల్‌ను సైతం పూర్తిగా కబ్జా చేశారు. దీనిపై ఆగ్రామానికి చెందిన నాయకుడు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. రామాపురంలో కొత్తగా 120 ఎకరాల చెరువు తవ్వకంలో ప్రభుత్వ నిబంధనలు పటించలేదు. గ్రామానికి వెళ్లే రోడ్డు సైతం కబ్జా చేశారు. చానల్ కరకట్టనే చేపల చెరువు కట్టగా మార్చుకున్నారు. గుడివాడ రూరల్ మండలంలోని మోటూరులో 80 ఎకరాల చెరువులో పంట బోదె తవ్వేశారు. ఈ చెరువుకు రోడ్డుకు ఆనుకుని గట్టువేశారు. గుంటాకోడూరులో కూడా ఇదేపరిస్థితి నెలకొంది. అడ్డగోలు తవ్వకాలపై ఆయా మండల తహశీల్దార్లను వివరణ కోరగా.. తవ్వేశాక లెసైన్సు ఇచ్చేటప్పుడు చూస్తామని చెబుతున్నారు. కబ్జా చేసిన వారికి నోటీసులు జారీ చేస్తామంటున్నారు. -
మాజీ సీఎం శెట్టర్‌ను అరెస్టు చేయలేం
ఆధారాలు సేకరించిన తర్వాతే చర్యలు బదిలీ అయిన తర్వాత విలేకరుల సమావేశంలో ఏడీజీపీ ఆర్పీ శర్మ బెంగళూరు : అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ భూములు అనర్హులకు కట్టబెట్టారని ఆరోపిస్తు మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్‌పై కేసు నమోదైందని, అయితే ఆయనను అరెస్టు చేయడం లేదని బీఎంటీఎఫ్ (బెంగళూరు మెట్రో పాలిటన్ టాస్క్ ఫోర్స్) చీఫ్, ఏడీజీపీ ఆర్.పీ. శర్మ తెలిపారు. బీఎంటీఎఫ్ చీఫ్ స్థానం నుంచి ఆర్పీ శర్మను బదిలీ చేస్తూ గురువారం పోద్దుపోయిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎఫ్ఐఆర్లో పేర్లు నమోదైన వారందరినీ అరెస్టు చేయాలని నిబంధనలు లేవన్నారు. దర్యాప్తు పూర్తి చేయడానికి ఆరు నెలల సమయం ఉంటుందని చెప్పారు. అన్ని వివరాలు పరిశీలించి ఆధారాలు సేకరించి తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటారన్నారు. బెంగళూరు నగరంలో మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూమి (పోరంబోకు భూములు) అనర్హులకు కట్టబెట్టారని గుర్తు చేశారు. బెంగళూరు దక్షిణ, ఉత్తర విభాగాలలో 1999 నుంచి 2003 సంవత్సరాల మధ్య ఈ అక్రమాలు జరిగాయని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన వారి పేర్లు చెప్పడం తనకు ఇష్టం లేదని, దర్యాప్తు చేసి నివేదిక సమర్పించినట్లు చెప్పారు. అక్రమంగా భూములు ఎవరు మంజూరు చేశారు అని విలేకరులు ప్రశ్నించగా ప్రభుత్వ భూములను కేటాయించే కమిటీ అధ్యక్షుడిగా స్థానిక శాసన సభ్యుడు ఉంటారని గుర్తు చేశారు. బెంగళూరు ఉత్తర నియోజక వర్గం (అప్పుట్లో, ప్రస్తుతం ఆర్. అశోక్ పద్మనాభనగర నియోజక వర్గం శాసన సభ్యుడు) శాసన సభ్యుడిగా, డిప్యూటి సీఎంగా ఉన్న ఆర్. అశోక్ అక్రమంగా భూములు అనర్హులకు కట్టబెట్టారని పరోక్షంగా చెప్పి విలేకరుల సమావేశం ముగించిన ఆర్పీ శర్మ అక్కడి నుండి వెళ్లిపోయారు. -
అటవీ భూములన్నీ ఆక్రమణలోనే
నూజివీడు డివిజన్లో 31,686 ఎకరాలు ప్రభుత్వ భూముల వివరాలన్నీ సేకరణ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోండి సబ్‌కలెక్టర్ చక్రధర్‌బాబు నూజివీడు : నూజివీడు డివిజన్లో 31,686ఎకరాల ప్రభుత్వ, అటవీభూములున్నాయని, వాటిలో దాదాపు 26వేల ఎకరాలున్న అటవీ భూములన్నీ ఆక్రమణలోనే ఉన్నాయని నూజివీడు సబ్‌కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు స్పష్టం చేశారు. ఆయన కార్యాలయంలో సోమవారం మాట్లాడుతూ డివిజన్లో ఉన్న అన్నిశాఖల ప్రభుత్వ భూముల వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. దీనిపై ప్రతి రోజూ ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్షిస్తున్నానన్నారు. ఇరిగేషన్‌కు చెందిన చెరువులు, వాగులు ఆక్రమణలకు గురైనట్లు తెలుస్తుందని, మొత్తం వివరాలు సేకరించిన తరువాత ఆ ఆక్రమణలను తొలగించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్షేత్రస్థాయిలో తగినంతమంది సిబ్బంది లేకపోవడం వల్లనే అటవీభూములు , ఇరిగేషన్ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని సంబంధిత శాఖ అధికారులు చెపుతున్నారని తెలిపారు. అలాగే గ్రామాలలో, పట్టణాలలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, ఆ భూముల్లో ఏమైనా ఆక్రమణలుంటే వాటినీ తొలగిస్తామన్నారు. ప్రభుత్వభూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు గానూ గ్రామస్థాయిలో వీఆర్వోతో పాటు ఆ మండల అధికారులతో కమిటీలు వేశామన్నారు. నూజివీడు, ముసునూరు, చాట్రాయి, రెడ్డిగూడెం, బాపులపాడు మండలాల్లో అటవీభూములు ఎక్కువగా ఉన్నాయని, ఇవన్నీ దాదాపు ఆక్రమణకు గురవ్వడమే కాకుండా పండ్లతోటలు పెంచుతున్నారని చెప్పారు. డివిజన్లో పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్డీడ్ల పెండింగ్ ఎక్కువగా ఉందని, ముఖ్యంగా గన్నవరం నియోజకవర్గంలో ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయని సబ్‌కలెక్టర్ వివరించారు.. ఈ పెండింగ్‌ను తగ్గించేందుకు చర్యలు చేపట్టానన్నారు. డివిజన్లో మీసేవా కేంద్రాల సంఖ్యను పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మీ సేవా కేంద్రాల వద్ద ధరల పట్టికను ప్రదర్శించాలని, ఆ పట్టికలో పేర్కొన్న ఫీజును మాత్రమే ప్రజలు చెల్లించాలన్నారు. అలాగే ఆధార్‌కార్డు కోసం ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని, గతంలో ఆధార్‌కార్డు తీసుకుని అందులో ఏమైనా తప్పులుంటే వాటిని సరిచేయించుకోవడానికి మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వ్యాధులు నివారించండి... వర్షాకాలం వచ్చినందున వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో మండల అధికారులు వ్యాధుల నివారణా చర్యలు తీసుకోవాలని సబ్‌కలెక్టర్ ఆదేశించారు. డ్రైనేజీల్లో పూడికను తొలగించడం, మంచినీటి ట్యాంకుల క్లీనింగ్, నీటిని క్లోరినేషన్ చేయడం, నివేశన ప్రాంతాల్లో, ఇంటి ఆవరణలో నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. -
ఆన్లైన్లో సర్కారు భూములు
సాక్షి, కర్నూలు: జిల్లాలో ఏ మండలంలో చూసినా ప్రభుత్వ భూములు ఉన్నాయి. వీటిని రెవెన్యూ సిబ్బంది సాయంతో కొందరు కబ్జాదారులు సొంతం చేసుకుంటున్నారు. ఆక్రమణలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. కబ్జాల నుంచి ప్రభుత్వ భూములను కాపాడేందుకు ప్రభుత్వం ఓ ప్రయత్నం చేస్తోంది. సర్కారు భూముల వివరాలను సేకరించి కంప్యూటరులో నిక్షిప్తం చేస్తున్నారు. త్వరలో ఆన్లైన్లో ఉంచనున్నారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు.. కొత్త పరిశ్రమలు.. సంస్థల ఏర్పాటు నేపథ్యంలో ఈ ప్రక్రియ ప్రాధాన్యం సంతరించుకుంది. రెవెన్యూ సిబ్బంది ఇందులో తలమునకలయ్యారు. భూముల నిక్షిప్తం ఇలా...: ప్రభుత్వ భూములు, కుంటలు, చెరువులు, మేతపోరంబోకు, శ్మశాన స్థలాలు, డొంకలు, వసతిగృహాలు, పాఠశాల స్థలాలు తదితర భూముల ప్రస్తుత పరిస్థితి.. అవి ఏ రూపంలో ఉన్నాయి.. బల్క్ డిజిటల్ సైనింగ్ పద్ధతి ద్వారా వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేస్తున్నారు. వీటిని సర్కారు భూమి పేరుతో ఆన్లైన్లో ఉంచనున్నారు. దాంతో ఎక్కడి నుంచైనా ఆ వివరాలు తెలుసుకోవచ్చు. ఎవరైనా భూములు కొనుగోలు చేసేటప్పుడు ఆ భూమి ప్రభుత్వానిదో.. కాదో తాజా పరిస్థితిని సులువుగా తెలుసుకోవచ్చు. ఈ విధానం ద్వారా కబ్జాదారుల ఆటలు కొంతవరకు అరికట్టవచ్చు. ప్రభుత్వ భూముల వివరాలు ఆన్లైన్లో నిక్షిప్తం చేస్తే.. రెవెన్యూ అధికారులతో సంబంధం లేకుండా భూముల స్థితి, స్వభావం తదితర వివరాలనునెట్లోచూసి తెలుసుకునే వీలుంది. దీంతోపాటు రెవెన్యూ కార్యాలయంలో అధికారులపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. అధికారుల సైతం ప్రభుత్వ భూములను భిన్నాలుగా మార్చి పట్టాలిచ్చే విధానానికి అడ్డుకట్టపడే అవకాశం ఉంది. -
రూ. 6 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం
సీబీఐ విచారణకు కుమారస్వామి డిమాండ్ అర్కావతి లేఔట్‌పై విచారణకు శెట్టర్ పట్టు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో సుమారు రూ.ఆరు లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని, ఒక్క బెంగళూరులోనే రూ.రెండు లక్షల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అయ్యాయని శాసన సభలో జేడీఎస్ పక్షం నాయకుడు హెచ్డీ. కుమారస్వామి ఆరోపించారు. ఈ భారీ కుంభకోణంపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. శాసన సభలో 69వ నిబంధన కింద దీనిపై శుక్రవారం జరిగిన స్వల్ప వ్యవధి చర్చలో ఆయన పాల్గొంటూ, నగరంలో చెరువులు కూడా ఆక్రమణకు గురయ్యాయని, 1985 నుంచి ఈ ఆక్రమణలు నిర్నిరోధంగా సాగిపోతున్నా రెవెన్యూ, బీబీఎంపీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులు భూకబ్జాదారులతో కుమ్మక్కై ప్రభుత్వ భూములకు అప్పనంగా పట్టాలిచ్చేశారని ఆరోపించారు. ఇలాంటి అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలో గృహ నిర్మాణ సంఘాలు భూములను ఆక్రమించుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించాయని విమర్శించారు. అక్రమాలకు పాల్పడిన అధికారులతో పాటు ఇతరులు తప్పించుకోవడానికి వీలు లేకుండా ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించడమే ఏకైక మార్గమని ఆయన సూచించారు. అర్కావతి లేఔట్‌పై కూడా.... : నగరంలోని అర్కావతి లేఔట్లో కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ జరిగిన డీనోటిఫికేషన్‌లో అవినీతి చోటు చేసుకుందని ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ ఆరోపించారు. శాసన సభలో 69వ నిబంధన ఆయన ఈ అంశాన్ని లేవనెత్తుతూ, కోర్టు ఆదేశాలను అడ్డం పెట్టుకుని భూసేకరణకు ఎంపిక చేసిన భూములను డీనోటిఫై చేశారని విమర్శించారు. బీడీఏ అత్యంత జాగ్రత్తగా డీనోటిఫై అని పేర్కొనకుండా, రీమాడిఫై అనే పదాన్ని ఉపయోగించిందని ఆరోపించారు. అర్కావతి లేఔట్లో ఇప్పటికే సుమారు అయిదు వేల ఎకరాల నివేశనాలను పంపిణీ చేసి, రిజిస్ట్రేషన్లను కూడా పూర్తి చేశారని తెలిపారు. అలాంటి భూములను డీనోటిఫై చేశారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో నివేశనాలను తీసుకున్న వారి గతి ఏమిటని ప్రశ్నించారు. ఈ అవకతవకలపై నిష్పాక్షిక దర్యాప్తును చేపట్టడానికి వీలుగా ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. భూమిని వినియోగించుకోకపోతే స్వాధీనం : పారిశ్రామికాభివృద్ధి, విద్యా సంస్థలు, పూజ మందిరాలు, గృహ నిర్మాణాలు, తోటల పెంపకానికి పొందే భూములను ఏడేళ్లలోగా సద్వినియోగం చేసుకోకపోతే తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని రెవెన్యూ శాఖ మంత్రి వీ. శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. కర్ణాటక భూ సంస్కరణల సవరణ బిల్లును శుక్రవారం ఆయన శాసన సభలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా సద్వినియోగం చేసుకోని భూములను భూ బ్యాంకులకు అప్పగించాల్సి ఉంటుందని చెప్పారు. దీనికి ప్రభుత్వం ఎలాంటి నష్ట పరిహరం చెల్లించబోదని తెలిపారు. -
భూములు కావలెను!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా యంత్రాంగం విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ భూములు తరిగిపోవడంతో.. ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు కొనేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘దళితులకు భూ పంపిణీ’ పథకం అమలుకు భూములు అందుబాటులో లేకపోవడంతో బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. నగరానికి ఆనుకొని ఉన్న మన జిల్లాలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో దళితులకు భూపంపిణీ భారం తడిసిమోపెడుకానుంది. జిల్లాలో ఎవరికీ కేటాయించని భూమి కేవలం 4,100 ఎకరాలు మాత్రమే ఉంది. మరోవైపు పంద్రాగస్టున సగటున ప్రతీ దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించారు. వామ్మో..కొనలేం.. రాజధాని పరిసరాల్లోనే జిల్లా ఉండడంతో భూముల ధరలు నింగినంటాయి. జిల్లాలో సాగుకు అనువుగా ఉండే భూమి కనిష్టంగా ఎకరాకు సగటున రూ.4 లక్షల ధర పలుకుతోంది. ఈ క్రమంలో భూములు కొని.. దళితులకు పంచడం అధికారయంత్రాంగానికి కత్తిమీద సాములా పరిణమించింది. ఇప్పటివరకు ఏడు విడతలలో చేపట్టిన భూపంపిణీల్లో సుమారు 7వేల ఎకరాలను దళితులకు కేటాయించారు. ఇద ంతా ప్రభుత్వ భూమే కావడంతో జిల్లా యంత్రాంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. అయితే, దీంట్లో సేద్యానికి యోగ్యంలేని భూమే ఎక్కువగా ఉంది. రాళ్లు, గుట్టలతో నిండిన భూములే లబ్ధిదారులకు అందాయి. దీంతో ఆయా భూములు ఇప్పటివరకు పడావుగా ఉన్నాయి. ఇదిలావుండగా, ఈ పంద్రాగస్టున మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి దళితులకు భూపంపిణీ చేయాలని రాష్ట్ర సర్కారు ఆదేశించింది. ఈ క్రమంలో నగర శివార్లలోని 17 మండలాలను మినహాయించి, మారుమూల మండలాల్లో మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలని జిల్లా యంత్రాంగం యోచిస్తోంది. సాగుకు అనువైన భూమిని మాత్రమే ఇవ్వాలని, సగటున ప్రతి లబ్ధిదారుకు మూడు ఎకరాల చొప్పున పంపిణీ చేయాలనే నిబంధనలు అధికారులను ఇరకాటంలో పడేశాయి. జిల్లాలో ప్రభుత్వ భూముల కొరత తీవ్రంగా ఉండడంతో ఈ పథకం అమలు వారికి సవాల్‌గా మారింది. అవసరమైతే ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనయినా పంచాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో భూముల వేటలో పడి ంది. కేవలం వికారాబాద్, పరిగి, తాండూరు, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలని భావిస్తున్న యంత్రాంగం.. ఆయా ప్రాంతాల్లో లభ్యమయ్యే భూముల వివరాలను సేకరిస్తోంది. మండలంలో ఒక గ్రామం.. ఆ గ్రామంలో 30 మంది లబ్ధిదారులకు భూ పంపిణీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిన యంత్రాంగం... జిల్లావ్యాప్తంగా1,800 ఎకరాలను సమీకరించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రభుత్వంపైనే ఆశలు.. ఈ నెల 30లోపు గ్రామాల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్న అధికారులు. ఆలోపు భూముల కొనుగోలుకు అవసరమైన నిధులపై స్పష్టత రాబట్టాలని భావిస్తోంది. జిల్లాలో నెలకొన్న విచిత్ర పరిస్థితి నేపథ్యంలోప్రభుత్వం ఇచ్చే నిధులపైనే ఆశలు పెట్టుకుంది. కేటాయించే నిధుల ఆధారంగానే భూపంపిణీ ల క్ష్యాన్ని నిర్దేశించుకోవాలని యోచిస్తోంది. 1,800 ఎకరాలకు కనిష్టంగా రూ.72 కోట్లు అవసరమమవుతాయని ప్రాథమిక అంచనాలు రూపొందించిన అధికారులు భూముల అన్వేషణలో తలమునకలయ్యారు. మరోవైపు భూ యజమానులు ఎక్కడ భూముల రేట్లు పెంచుతారోననే అనుమానం కూడా రెవెన్యూ అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలు,నిధుల లభ్యత మేరకే గ్రామాలను ఎంపిక చేస్తే బాగుంటుందంటున్నారు. -
భూ బకాసురులు
జిల్లాలో వేలాది ఎకరాలు ఆక్రమణ న్యాయస్థానాల్లో 900 భూవివాదాల కేసులు రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్టు అనుమానం సబ్రిజిస్ట్రార్ల పాత్రపై విచారణ వచ్చే వారం ‘రెవెన్యూ’ ప్రత్యేక సమావేశం విశాఖ రూరల్: ప్రభుత్వ భూముల సర్వేలో అ నేక అక్రమాలు బయటపడుతున్నాయి. వేలాది ఎకరాలు అన్యాక్రాంతమైనట్లు ఉన్నతాధికారు ల పరిశీలనలో వెల్లడైంది. రూ.వేల కోట్లు విలువైన భూములకు సంబంధించిన వివాదాలు న్యాయస్థానాల్లో నలుగుతున్నాయి. ఇప్పటి వరకు దాదాపు 900 భూ వివాదాల కేసులు జిల్లా, హైకోర్టులో ఏళ్ల తరబడి నడుస్తున్నట్లు లెక్కతేలాయి. వీటిలో చాలా కేసులకు సంబంధించి రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటిపై వచ్చే వారంలో సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల రోజులుగా జిల్లాలో ప్రభుత్వ భూ ముల సర్వే జరుగుతోంది. ప్రభుత్వ భూము లు, ఇతర శాఖలకు కేటాయించినవి, ఆక్రమణకు గురైనవి, కోర్టు వివాదాల్లో ఉన్నవి.. ఇలా నాలుగు కేటగిరీల కింద సర్వే చేపడుతున్నారు. కోర్టు వివాదాల్లో 900 కేసులు కోర్టు వివాదాల్లో ఉన్న భూముల వ్యవహారాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, జేసీ ప్రవీణ్‌కుమార్‌లు విస్తుపోయారు. ఏళ్ల తరబడి న్యాయస్థానాల్లో కేసులు నలుగుతున్నా వాటి పరిష్కారానికి కనీస చర్యలు లేవన్న విషయాన్ని గుర్తించారు. దాదాపు 900 కేసులు జిల్లా కోర్టు, హైకోర్టుల్లో ఉన్నట్టు లెక్క తేల్చారు. దసపల్లా లేఅవుట్, క్లోవర్ అసోసియేట్స్, డచ లేఅవుట్, కిర్లంపూడి లేఅవుట్, నడుపూర్, తాజాగా సర్వే నెంబర్ 152 ఇలా విశాఖ పరిధిలోనే కాకుండా గ్రామీణ ప్రాం తాల్లో కూడా కోట్లు విలువైన వేలాది ఎకరాల భూ వివాదాలు కోర్టుల్లో ఉన్నాయి. వీటిలో చాలా వరకు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించ డం, పక్క సర్వే నంబర్లతో భూములు కొట్టేయడానికి ప్రయత్నించడం, భూములు ఆక్రమించి రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం.. ఇలా అనేక అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. వివాదాల్లో ఉన్న చాలా భూములకు సంబంధించి అక్రమాలు జరిగినట్లు రికార్డుల ద్వారా స్పష్టం గా తెలుస్తున్నా.. వాటిని సక్రమంగా కోర్టుకు సమర్పించడం లేదు. ఫలితంగా కేసులు కోర్టుల్లో దీర్ఘకాలంగా నడుస్తూనే ఉన్నాయి. అధికారులు పాత్రపై అనుమానాలు చాలా భూముల కేసుల్లో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూముల రికార్డులు ట్యాంపరింగ్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. తాజాగా సర్వే నెంబర్ 152/4 వ్యవహార మే నిదర్శనం. నడుపూర్‌లో పక్క భూముల సర్వే నంబర్‌తో కోట్లు విలువ చేసే భూములు కాజేయడానికి ప్రైవేటు వ్యక్తులు కోర్టులో కేసు వేశారు. తప్పుడు సర్వే నంబర్ వేసిన విషయా న్ని కోర్టుకు విన్నవిస్తే కేసు వేగంగా పరిష్కారమవుతుంది. అయినప్పటికీ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇలా చాలా వివాదాలకు సంబంధించి రెవెన్యూ సిబ్బంది సక్రమం గా స్పందించ డం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సిబ్బందే ప్రైవేటు వ్యక్తులతో చేతులు కలిపి ఈ అక్రమాలకు సహకరిస్తున్నారన్న వా ర్తలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయా యి. రికార్డుల్లో ప్రభుత్వ భూమి అని ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్లు ఎలా చేపట్టారన్న విషయంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. వీటిపై విచారణకు సైతం ఆదేశాలు జారీ చేశారు. మొత్తం కేసుల విషయాలన్నింటిపై వచ్చే వారంలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. -
భూదాహం..
రూ.3 వేల కోట్ల విలువైన భూములపై పెద్దల కన్ను కారుచౌకగా కాజేసేందుకు యత్నాలు అధికారులపై ఒత్తిళ్లు విశాఖ రూరల్: జిల్లాలో ప్రభుత్వ భూములకు రెక్కలొస్తున్నాయి. వందల ఎకరాల వరకు ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. ఇప్పటికే పరదేశిపాలెంలో వందల కోట్ల రూపాయల విలువ చేసే భూధాన భూముల అక్రమ కేటాయింపులు వెలుగులోకి రాగా.. తాజాగా సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించిన స్థలాలపై పెద్దల కన్ను పడింది. రూ.3 వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కారుచౌకగా కొట్టేయడానికి ఫైలు సిద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్డీసీ) కోసం 8 ఏళ్ల క్రితం చేసిన జీవోను అడ్డుపెట్టుకొని 316 ఎకరాలను కేవలం రూ.158 కోట్లకే కొట్టేయడానికి కొంత మంది విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి తెరవెనుక మంత్రాంగాన్ని నడుపుతున్నట్లు భోగట్టా. ఇందుకోసం అధికారులపై తీవ్ర ఒత్తిళ్లు చేస్తున్నట్టు సమాచారం. ఎపీఎఫ్‌డీసీకి 316 ఎకరాలు విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం భూములు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ 2005లో ప్రభుత్వాన్ని కోరింది. దీంతో జిల్లా అధికారులు భీమిలిలో అన్నవరం సర్వే నంబర్ 101లో 80 ఎకరాలు, కుమ్మరిపాలెం సర్వే నంబర్ 87లో 80 ఎకరాలు, కొత్తవలస సర్వే నంబర్ 73లో 154 ఎకరాలు కొండ పోరంబోకు భూములను గుర్తించారు. అన్నవరం భూములకు ఎకరాకు రూ.4 లక్షలు, కొత్తవలసలో ఎకరాకు రూ.8 లక్ష లు, కుమ్మరిపాలెంలో ఎకరాకు రూ.10 లక్షలు చొప్పున ప్రతిపాదనలు రూపొందించారు. భూ పరిపాలన ముఖ్య కమిషనర్ మాత్రం ప్రాంతం తో సంబంధం లేకుండా ఎకరాకు రూ.50 లక్షలు చొప్పున ధర నిర్ణయించారు. 316 ఎకరాలకు మొత్తం రూ.158 కోట్లు చెల్లించాలంటూ 2006, నవంబర్ 10న జీవో నెంబర్ 1650 విడుదల చేశారు. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాత్రం ఇప్పటి వరకు ఆ భూములను కొనుగోలు చేయలేదు. అందరి కళ్లు ఆ భూముల పైనే.. రాష్ట్ర విభజన తర్వాత అందరి చూపు విశాఖపైనే పడింది. హైదరాబాద్ తర్వాత అంతటి స్థాయిలో అభివృద్ధి చెందుతున్న విశాఖలో భూముల ధరలు విపరీతంగా ఉన్నాయి. కొత్త రాష్ట్రంలో భవిష్యత్తు అభివృద్ధి విశాఖపైనే కేంద్రీకృతమై ఉంది. దీంతో ఇక్కడ భూములపై పెద్దల కళ్లు పడ్డాయి. ప్రభుత్వ భూములను కారు చౌకగా కొట్టేయడానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు కేటాయించిన స్థలాన్ని కొట్టేసే ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఆ సంస్థ కోసం చేసిన జోవోను ఆధారంగా చేసుకొని ఎకరా రూ.10 కోట్లు విలువ చేసే ఆ భూములను 2006లో ప్రతిపాదిత ధర రూ.50 లక్షలకే చేజిక్కించుకోడానికి కొంత మంది ప్రయత్నిస్తున్నారు. జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి అండదండలతో వ్యవహారాన్ని నడుపుతున్నట్టు సమాచారం. రెండేళ్ల క్రితం ఒక ప్రముఖ హీరో భీమిలిలో స్టూడియో నిర్మాణానికి స్థలాన్వేషణ చేశారు. అధికారులు సైతం అత్యంత రహస్యంగా భూములను గుర్తించే పనిని చేపట్టారు. అప్పట్లో ఏపీఎఫ్డీసీ భూములను కూడా పరిశీలించారు. కానీ స్టూడియో ఏర్పాటు నిర్ణయం జరగలేదు. అధికారులపై ఒత్తిళ్లు తాజాగా రూ.3 వేల కోట్లు విలువ చేసే ఆ భూములను 2006లో నిర్ణయించిన ధరకు కొనుగోలు చేసేందుకు ఫైలు సిద్ధమవుతోంది. ఈ విషయంలో ఒక ప్రజాప్రతినిధి అధికారులపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ స్థాయిలో ఈ నిర్ణయం జరగాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఈ భూములను ఇతర ప్రాజెక్టులకు గుర్తించకుండా ఉండాలంటూ సదరు ప్రజాప్రతినిధి అధికారులకు హుకుం జారీ చేసినట్టు తెలిసింది. సాధారణంగా ఒక ప్రాజెక్టు కోసం కేటాయించిన స్థలాన్ని సదరు సంస్థ కొనుగోలు చేయని పక్షంలో లేదా కొనుగోలు చేసినా నిర్ణీత సమయంలో నిర్మాణాలను చేపట్టని పక్షంలో ఆ భూములను వెనక్కు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఆ భూముల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా జిల్లాలో విద్యా సంస్థలు, ఇతర ప్రాజెక్టు కోసం రెవెన్యూ అధికారులు జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించి నివేదిక తయారు చేస్తున్నారు. ఇందులో ఏపీఎఫ్‌డీసీకి కేటాయించిన భూములను చేర్చకూడదంటూ అధికారులపై ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేటాయింపుల నిర్ణయం ప్రభుత్వ స్థాయిలో జరగాల్సి ఉంటుందని, ఇందులో తమ పాత్ర నామమాత్రమని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. -
భూమాయపై సీరియస్
ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వ భూములు రెవెన్యూ సిబ్బంది పాత్రే కీలకం అక్రమాలపై కలెక్టర ఆగ్రహం ఇప్పటికే ముగ్గురిపై వేటు మరో ఇద్దరిపై చర్యలకు రంగం సిద్ధం విశాఖ రూరల్ : కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో చిక్కుకుపోయాయి. రెవెన్యూ సిబ్బంది మాయాజాలంతో రికార్డులు తారుమారవుతున్నాయి. ఇటీవల అధికారులు ప్రభుత్వ భూములను సర్వే చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కో వ్యవహారం బయటకు వస్తోంది. ఈ అక్రమాలపై కలెక్టర్ సీరియస్‌గా ఉన్నారు. బాధ్యతలపై క్రిమినల్ కేసులు నమోదుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ భూములను ప్రయివేట్ వ్యక్తులకు కట్టబెట్టడం.. ఉన్నతాధికారుల ఆదేశాలతో వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు బోర్డులు పెట్టడం.. ఆ వ్యక్తులతో కోర్టుల్లో కేసులు వేయించడం.. ఇలా రెవెన్యూ సిబ్బంది కీలక పాత్రే పోషించినట్టు తెలిసింది. రికార్డులను ట్యాంపర్ చేయడం, న్యాయస్థానాలకు సక్రమమైన సమాచారం ఇవ్వకపోవడం, చివరకు కేసును నీరుగార్చేలా చేసి బడాబాబులకు సహకరించి లక్షల రూపాయలు వెనకేసుకున్న విషయాలు వెలుగుచూడడంతో రెవెన్యూలో కలకలం మొదలయింది. నడుపూరు, కొమ్మాది, పరదేశిపాలెం ప్రాంతాల్లో భూ అక్రమాలపై కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌లు సీరియస్‌గా ఉన్నారు. దీనిపై ఇప్పటికే ముగ్గురు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో కొంత మంది అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతుండడంతో ఆ దిశగా విచారణ చేపడుతున్నారు. ఇందులో భాగంగా పరదేశిపాలెం, కొమ్మాదిలో భూములను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. 152 సర్వే నంబర్ భూములకు సంబంధించి హైకోర్టులో కేసు ఉన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ భూములను అధికారులు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించినా న్యాయస్థానంలో కేసు ఉండడంతో దానికి సంబంధించి పూర్వాపరాలు పరిశీలించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. దీనిపై సంబంధిత తహశీల్దార్ రెండు రోజుల్లో నోటీసులు జారీ చేయనున్నారు. రికార్డుల ట్యాంపరింగ్‌పై అనుమానాలు రికార్డుల ట్యాంపర్ చేసే విషయంలో సిబ్బంది సిద్ధహస్తులు. వందల సంఖ్యలో రికార్డులు ట్యాంపర్ చేసిన సందర్భాలు అనేకం బయటపడ్డాయి. ప్రసుత్తం ఈ భూముల వ్యవహారంలో కూడా రికార్డులు ట్యాంపర్ అయి ఉంటాయని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ రద్దు చేసిన కేటాయింపులను రెండు నెలల్లో కొత్త వారికి కట్టబెట్టడం వెనుక ఉన్నతాధికారుల హస్తం కూడా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ హస్తం! జిల్లాలో ప్రస్తుతం 1500 ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు అధికారులు గుర్తించారు. ఇందులో వెయ్యి ఎకరాల భూములకు సంబంధించిన వివాదాలు న్యాయస్థానాల్లో నలుగుతున్నట్టు గుర్తించారు. స్టీల్‌ప్లాంట్, మధురవాడ, కొమ్మాది, భీమిలి ప్రాంతాల్లో కొన్ని భూ వివాదాలకు సంబంధించి కోర్టులకు సక్రమమైన సమాచారం అందించడం లేదన్న విషయాన్ని గమనించారు. వీటిలో కొన్ని భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయాయి. వాటన్నింటిపై నెల రోజుల్లో విచారణ జరిపించాలని కలెక్టర్ నిర్ణయించారు. ఈ భూ సర్వేలను కూడా నెల రోజుల్లో పూర్తి చేసి సమగ్ర నివేదికను తయారు చేయాలని భావిస్తున్నారు. అనంతరం కోర్టు కేసుల్లో ఉన్న భూములకు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలించి వాటిపై న్యాయ సలహాలు తీసుకొని కోర్టులో కేసులు వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఈ అక్రమాలతో సంబంధమున్న రెవెన్యూ, సబ్రిజిస్ట్రార్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. -
ఇంతకీ ఈ భూమి ఎవరిది?
సంగారెడ్డి క్రైం/మున్సిపాలిటీ: జిల్లాలోని ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామన్న జిల్లా యంత్రాంగం మాటలు ఆచరణలో ఒట్టిదేనని తేలిపోయింది. జిల్లా కేంద్రమైన సంగారెడ్డి ప్రధాన రహదారి పక్కనే ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యాడు. ఈ రోడ్డు వెంట కలెక్టర్, మంత్రులు వెళుతున్నా వారికి ఈ భూమి అన్యాక్రాంతం కావడం మాత్రం కనిపించడం లేదు. ఆ భూమి తమదేనంటూ ఇరిగేషన్ శాఖ అధికారులు అనేక సంవత్సరాలుగా మొత్తుకుంటున్నా వినేవారే లేరు. ఫలితంగా ఈ భూమి తమదేనంటూ సంవత్సరానికొకరు పుట్టుకొస్తున్నారు. కబ్జాకు యత్నిస్తున్నారు. తాజాగా ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆ భూమి తనదేనంటూ నిర్మాణాలు ప్రారంభించాడు. వివరాల్లోకి వెళ్లితే.. సంగారెడ్డి పట్టణ నడిబొడ్డులోని త్రినేత్ర కాంప్లెక్స్ వద్ద ఆర్అండ్బీ శాఖ కార్యాలయం వుంది. దాని పక్కనే ఇరిగేషన్ ఐబీ సెక్షన్ కార్యాలయం సర్వే నంబరు 212 కల్వకుంట శివారులో వున్నట్లు రెవెన్యూ రికార్డులు చెబుతున్నాయి. ఈ శాఖకు సంబంధించి ఇరిగేషన్ కార్యాలయం పక్కనే వంద గజాల ఖాళీ స్థలం ఉంది. 2009లో ఫిబ్రవరి నెలలో ఎండీ యూసుఫ్ అతని బంధువులు ఆ స్థలాన్ని ఆక్రమించుకొని రేకుల షెడ్డు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు పోలీసులకు ఇరిగేషన్ శాఖ ఏఈఈ జనార్దన్‌రావు ఫిబ్రవరి 12న ఫిర్యాదు చేశారు. 2014 మార్చినెలలో ఈ స్థలం తనదేనంటూ ఎంపీ రావు అనే వ్యక్తి రేకులతో కంచె ఏర్పాటు చేయగా ఇరిగేషన్ శాఖ సిబ్బంది వాటిని తొలగించేందుకు యత్నించారు. దీంతో వారిపై ఆ వ్యక్తి దౌర్జన్యం చేసిన ట్లు శాఖ ఏఈఈ ఎం.రామ్‌కిషోర్ మార్చి 27న పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆ స్థలం తనదేనంటూ ఏకంగా గుంతలు తవ్వి నిర్మాణాలు చేపడుతున్నారు. అక్రమ నిర్మాణాలను అరికట్టాలని ఇరిగేషన్ ఐబీ సెక్షన్ ఏఈఈ రామ్‌కిషోర్ రెవెన్యూ శాఖతో పాటు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఆక్రమణదారులు నిర్మాణాలను ఆపకుండా కొనసాగిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను ఆపాలని సీపీఎం నాయకులు సైతం ఇటీవల అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ చోటు చేసుకుంది. కాగా సంగారెడ్డి నుంచి రాజంపేట వరకు 40 అడుగుల రోడ్డు ఉండగా ఆ నిర్మాణం చేపడితే రోడ్డు సైతం 20 అడుగులకు కుదించుకుపోతుంది. రెవెన్యూ అధికారుల కుమ్మక్కు జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని ప్రధాన రహదారి పక్కనే ప్రభుత్వ స్థలం కబ్జాకు గురవుతున్నప్పటికీ పట్టించుకొనే వారేకరువయ్యారు. ఆ స్థలం తమ శాఖకు సంబంధించిందని ఇరిగేషన్ అధికారులు ఏళ్ల తరబడి చెబుతున్నా వారికి సహకరించే అధికారులే లేరు. జిల్లా యంత్రాంగం నిద్ర పోతుండటంతో కబ్జాదారులతో రెవెన్యూ అధికారులు కుమ్మక్కయి వారికి వత్తాసు పలుకుతున్నారు. నిర్మాణాలను అరికట్టి ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా చూడాలని ఇరిగేషన్ అధికారి మున్సిపల్, రెవెన్యూ అధికారులకు విన్నవిస్తున్నప్పటికీ వారు మౌనంగా ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. -
ఎన్నెన్నో..భూతాలు
1500 ఎకరాలు అన్యాక్రాంతం ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వ భూములు రెవెన్యూ సర్వేతో వెలుగులోకి.. పరదేశిపాలెంలో రద్దయిన అసైన్మెంట్లు వేరొకరికి కేటాయింపు కలెక్టర్ సీరియస్ రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలు కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములు ప్రయివేట్ వ్యక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. ఒకటి, రెండు కాదు ఏకంగా 1500 ఎకరాలకు పైగా భూములు అన్యాక్రాంతమయ్యాయి. రెవెన్యూ అధికారులు చేపట్టిన సర్వేలో ఈ వాస్తవాలు వెలుగు చూశాయి. విశాఖ రూరల్: అర్బన్ ఎగ్లామిరేషన్ యాక్ట్ అమలులో ఉన్నా జీవీఎంపీ పరిధిలో భూములు ప్రయివేటు వ్యక్తులకు కేటాయింపులు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్రమంగా అసైన్ చేసిన భూములను కలెక్టర్ రద్దు చేసిన రెండు నెలల్లోనే అవే భూములను మరో అయిదుగిరికి కేటాయించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం దీనిపై విచారణ చేపట్టనుండగా.. ఆ కేటాయింపులను రద్దు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మాస్టర్‌ప్లాన్‌తో వెలుగులోకి.. జిల్లాలో జాతీయ విద్యా సంస్థలకు అవసరమైన భూములతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం అధికారులు ప్రభుత్వ భూములతో మాస్టర్ తయారు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ భూములు, ఇతర శాఖలకు కేటాయించిన భూములు, అన్యాక్రాంతమైన భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న భూములు.. ఇలా నాలుగు అంశాలుగా సర్వేలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు సుమారుగా 7 వేల ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. రికార్డుల ప్రకారం ప్లెయిన్ ఏరియాలో ప్రభుత్వ భూములు లేవని అధికారులు ముందు భావించి విద్యా సంస్థల కోసం కొండ పోరంబోకు స్థలాలను గుర్తించి ఆ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించారు. తాజాగా క్షేత్ర స్థాయిలో చేసిన సర్వేలో 50 నుంచి 150 ఎకరాల విస్తీర్ణంలో అనేక బిట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వాటన్నింటినీ అక్రమంగా ప్రయివేట్ వ్యక్తులకు కేటాయించడంతో వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని అధికారులు నిర్ణయించారు. 1500 ఎకరాలు అన్యాక్రాంతం పరదేశిపాలెంలో వందల కోట్లు విలువ చేసే 50 ఎకరాల స్థలాన్ని అక్రమంగా 23 మందికి కేటాయింపులు చేసిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. వాస్తవానికి అర్బన్ ఎగ్లామిరేషన్ యాక్ట్ ప్రకారం జీవీఎంసీ పరిధిలో భూములను ఎవరికీ అసైన్ చేసే అవకాశం లేదు. అయినా 50 ఎకరాలను వ్యవసాయ భూమి కింద కొంత మందికి కేటాయింపులు చేయడాన్ని అధికారులు గుర్తించారు. కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆ అసైన్మెంట్లను ఫిబ్రవరిలో రద్దు చేశారు. అవే భూములను ఏప్రిల్‌లో మరో అయిదుగురికి కేటాయించడం ఇప్పు డు చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో 11 రిట్పిటీషన్లు కోర్టు లో ఉండగా.. వాటన్నింటినీ ఒకే కేసుగా పరిగణించి విచారణ చేపడితే వివాదం వేగంగా పరిష్కారమవుతుం దని అధికారులు భావిస్తున్నారు. ఆ దిశ గా కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. స్టీల్‌ప్లాంట్ గోడను ఆనుకొని నడుపూర్‌లో 200 ఎకరాల అటవీ భూమి ఉంది. దీన్ని కాజేయడానికి కొంత మంది పక్క భూమి సర్వే నంబ ర్ చూపించి కోర్టులో పిటీషన్ వేసిన విషయాన్ని అధికారులు గుర్తించారు. తప్పుడు సర్వే నంబర్‌తో పిటీషన్ వేసిన వేషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లి భూములను తమ స్వాధీనంలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఇలా రెవెన్యూ అధికారుల సర్వేలో అనేక ప్రాంతాల్లో 1500 ఎకరాలకు పైగా అన్యాక్రాంతమైన విషయాన్ని గుర్తించారు. వాటన్నింటిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. -
వారంలోగా నివేదికివ్వండి..
కలెక్టరేట్: హైదరాబాద్ జిల్లాలో ఉన్న ప్రభుత్వభూములను వారంలోగా గుర్తించి వాటి పరిస్థితిని వివరిస్తూ వారంలోగా నివేదిక సమర్పించాలని హైదరాబాద్ కలెక్టర్ ఎంకే మీనా తహసీల్దార్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో రెవెన్యూశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మొదటిదశలో భాగంగా జిల్లాలో ఉన్న సీలింగ్ సర్ప్లస్ భూముల వివరాలను సేకరించాలంటూ..ఈ స్పెషల్‌డ్రైవ్‌లో భూముల ప్రక్రియ శాస్త్రీయపద్ధతిలో చేసేందుకు వీలుగా 20 ప్రత్యేకటీంలను ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తుచేశారు. ప్రతీటీంలో ఒక సర్వేయర్, డిప్యూటీ తహశీల్దార్, వీఆర్వో ఉంటారన్నారు. ఈనెల 26 వరకు ప్రభుత్వ భూముల గుర్తింపు కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. సర్వేయర్లు వచ్చిన తర్వాత వారిని సంబంధిత ఆర్డీవోలకు కేటాయించి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మండలస్థాయిలో ప్రతీ మండలానికి తహశీల్దార్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, తహశీల్దార్లు తమ మండల పరిధిలో ఉన్న ప్రభుత్వభూముల హద్దులను సర్వేయర్ల సహాయంతో గుర్తించి వాటి ప్రస్తుత పరిస్థితుల నివేదికను వెంటనే పంపాలని ఆదేశించారు. జిల్లాలోని వివాదస్పద, వివాదరహిత భూములు వేర్వేరుగా గుర్తించి వాటి సమగ్ర సమాచారాన్ని నివేదికలో పొందుపర్చాలని సూచించారు. కోర్టు కేసుల్లో భూముల స్టేటస్‌ను కూడా ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి జేసీ సంజీవయ్య, ఎస్వోయూఎల్టీ సత్తయ్య, ఆర్డీవోలు రఘురాంశర్మ, నిఖిలతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. -
పదేళ్ల క్రితమే ‘భూ’గోతం!
రూ.2 కోట్ల ప్రభుత్వ భూ ఆక్రమణలో వెల్లడవుతున్న నిజాలు నుంచి డివిజన్ వరకు ‘రెవెన్యూ’ అండ ఆరు జమాబందీలు పూర్తయినా అధికారుల కంటికి చిక్కని వైనం నక్కపల్లి, న్యూస్‌లైన్: అమలాపురంలో రూ.2 కోట్ల విలువైన చెరువు, గెడ్డ భూ ఆక్రమణకు పదేళ్ల క్రితమే బీజం పడినట్లు భావిస్తున్నారు. 2004లోనే ఆక్రమణకు తెగబడిన కబ్జాదారులు ఏడాది క్రితం నుంచి రోడ్డు నిర్మాణం, కొబ్బరి, టేకు చెట్ల పెంపకం చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ కాలంలో ఆరు జమాబందీలు పూర్తయినా అధికారుల దృష్టికి సమస్య రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ వ్యవహారంలో ఆయా కాలాల్లో పనిచేసిన వీఆర్ఓల నుంచి తహశీల్దార్ల వరకు తప్పుపట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థానిక వీఆర్ఓలుగా పనిచేసిన వారి అండతోనే ఈ ‘భూ’గోతం నడిచినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఓ ఉద్యోగి పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. చెరువు, గెడ్డలను పలానావారు ఆక్రమించారని 2004లోనే అడంగల్‌లో నమోదై ఉండడం గమనార్హం. అందుకే జమాబందీ (రెవెన్యూ ఆడిట్) సమయంలో 2004 నుంచి ఉన్న అడంగల్, రికార్డులు పరిశీలించలేదని, 2010 అడంగల్ ఆధారంగా పరిశీలన చేయడం, నోటీసులు జారీ చేయడంలోనే అసలు మతలబు ఉందని భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఉద్యోగిని కాపాడుకునే ప్రయత్నంలో అధికారులు ఉన్నట్లు సమాచారం. లేదంటే వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటుందని వారు భయపడుతున్నారు. ఏటా నిర్వహించే జమాబందీలో ప్రభుత్వ భూముల ఆక్రమణల వివరాలు, ఎవరు పాల్పడ్డారో 4 సి అకౌంట్లో నమోదు చేస్తారు. ఈ రికార్డు ఆధారంగా జమాబందీ అధికారి (ఆర్డీఓ స్థాయి) పరిశీలించి ఆక్రమణలు తొలగించడం లేదా జరిమానా విధించడం చేస్తారు. అర్హులైతే డి పట్టాలివ్వాలని, బి మెమో వసూలుకు సిఫారసు చేస్తారు. ఇంతవ్యవహారం ఉన్నా ఈ ఆక్రమణను ఇన్నాళ్లు ఎందుకు పట్టించుకోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీఆర్ఓలు రాసిన అడంగల్ ఆధారంగా అన్యాక్రాంతమైన భూములను పరిశీలించాలి. ఇలా పరిశీలించారా? లేదా? అన్నది తెలియడం లేదు. ఒక వేళ పరిశీలిస్తే ఎందుకు చర్య తీసుకోలేదన్నది మరో ప్రశ్న. ఇప్పటికైనా అధికారులు పూర్తిదృష్టిసారిస్తే ఒక్క అమలాపురంలోనే కాదు మండలంలోని 32 గ్రామాల పరిధిలోని ఆక్రమణలు వెలుగు చూసే అవకాశం ఉంది. కబ్జాదారులకు నోటీలు అమలాపురం పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 270, 295లోని ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడిన వారికి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఎం.అప్పలకొండ అనే వ్యక్తి 1.5 ఎకరాలు, సూర్యనారాయణరాజు 1.5 ఎకరాలు, ఈశ్వరరెడ్డి అనే వ్యక్తి 2 ఎకరాలు ఆక్రమించినట్లు అడంగ్లో నమోదైనా ఆర్డీఓ ఆదేశాల మేరకు సర్వేచేసిన అధికారులు ముగ్గురూ కలిసి 1.74 ఎకరాలు మాత్రమే ఆక్రమించినట్లు నిర్థారించారు. దీంతో తహశీల్దార్ ఈ భూముల వివరాలు తెలపాలంటూ కబ్జాదారులకు నోటీసులిచ్చారు. గెడ్డ, చెరువు ఆక్రమణకు పాల్పడిన మీపై ఎందుకు చర్యతీసుకోకూడదో తెలపాలని నోటీసులో పేర్కొన్నారు. వీరిచ్చిన సమాధానం మేరకు శాఖాపరమైన చర్యలు ఉంటాయని తహశీల్దార్ తెలిపారు. -
ప్రభుత్వ భూముల వివరాలు ఇవ్వండి
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఖాళీగా ఉన్న 100 నుంచి 300 ఎకరాల్లోపు ప్రభుత్వ భూముల వివరాలు ఈనెల 26వ తేదీలోపు అందించాలని జాయింట్ కలెక్టర్ కే యాకూబ్ నాయక్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లాలోని ముగ్గురు ఆర్డీఓలు, 56 మంది తహసీల్దార్లతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో సీమాంధ్రలో కీలకమైన యూనివర్శిటీలను స్థాపించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఐఐటీ, ఐఐఐటీ, సెంట్రల్ యూనివర్శిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లను ఏర్పాటుకు అవసరమైన స్థలాలను గుర్తిస్తోందన్నారు. వీటిని ఏర్పాటు చేసేందుకు 100 నుంచి 300 ఎకరాల ప్రభుత్వ భూమి అవసరమవుతుందని, ఈ నేపథ్యంలో మండలాల్లో త్వరితగతిన భూములను గుర్తించి వెంటనే నివేదికలు అందించాలని ఆదేశించారు. అదేవిధంగా మండలాల వారీగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు ఎన్ని ఎకరాలున్నాయి, అసైన్డ్ భూమిలో ఎంతమందికి పట్టాలిచ్చారు, ఎంత ఖాళీగా ఉంది, ఎన్నిచోట్ల ఆక్రమణలకు గురయ్యాయో నెలాఖరులోపు వివరాలు అందించాలని ఆదేశించారు. ఆర్ఎస్ఆర్ యాక్ట్ కింద డివిజన్ల వారీగా ఎన్ని ఎకరాలున్నాయి, వాటిలో పట్టా భూములు ఎంత ఉన్నాయో నివేదికలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడైనా ఆక్రమణలకు గురైనట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు ప్రభుత్వం కోటి 40 లక్షల రూపాయలు విడుదల చేసిందన్నారు. మీ సేవ కేంద్రాల్లో 9070 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, వరుసగా ఎన్నికలు రావడంతో అర్జీల సంఖ్య పెరిగిపోయిందన్నారు. త్వరితగతిన మీ సేవ కేంద్రాల్లోని అర్జీలను పరిష్కరించాలని సూచించారు. గ్రీవెన్స్ సెల్లో అర్జీలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఒంగోలు డివిజన్లో 1354, కందుకూరు డివిజన్లో 1149, మార్కాపురం డివిజన్లో 573 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కోర్టు కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సకాలంలో సరైన సమాధానాలు ఇవ్వాలని సూచించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న చౌకధరల దుకాణాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని యాకూబ్ నాయక్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్‌తోపాటు జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి రంగాకుమారి పాల్గొన్నారు. -
కేంద్రం అనుమతే తరువాయి
భూస్వాధీనం ప్రక్రియపై న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర సాక్షి, బెంగళూరు : ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండటానికి, అన్యాక్రాంతమైన భూములను తిరగి స్వాధీనం చేసుకోవడానికి వీలుగా రాష్ట్ర రెవెన్యూ చట్టంలో చేసిన మార్పులకు కేంద్రప్రభుత్వం నుంచి అనుమతి లభించాల్సి ఉందని న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర తెలిపారు. విధానసౌధాలో ఆయన మీడియాతో గురువారం మాట్లాడారు. ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేసి సంబంధిత కేసులను త్వరగా ముగించడానికి అనువుగా రూపొందించిన నివేదిక కేంద్ర ప్రభుత్వం వద్ద చాలా కాలంగా పెండింగ్‌లో ఉందన్నారు. రెవెన్యూ, వక్ఫ్, దేవాదాయ తదితర ప్రభుత్వ శాఖలకు చెందిన ప్రభుత్వ భూమి రాష్ట్రంలో 62.25 లక్షల హెక్టార్లు ఉందన్నారు. ఇందులో 13.24 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైందని తెలిపారు. ఇప్పటి వరకూ దాదాపు లక్ష ఎకరాలు మాత్రమే ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే చట్ట ప్రకారం న్యాయస్థానాల ద్వారా మిగిలిన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడమే కాకుండా భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో ‘సకాల’ పథకం కింద ఇప్పటి వరకూ (రెండేళ్లలో) 4.72 కోట్లు దరఖాస్తులు పరిష్కరించినట్లు తెలిపారు. సకాల విషయంలో చిక్కబళాపుర జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గత నెలలో సకాల దరఖాస్తుల పరిష్కారం కొంత ఆలస్యమయిన మాట వాస్తవమేనని తెలిపారు. కార్పొరేట్ సోషియల్ రెస్పాన్సిబులిటీ కింద రాష్ట్రంలోని బహుళ జాతీయ, ప్రైవేటు కంపెనీల నుంచి రూ. వెయ్యికోట్ల నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నిధులను రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చుచేస్తామన్నారు. -
పేదల ఇళ్లపై గల్లా డేగ!
కూల్చిన ఇళ్ల మీదుగా ఫ్యాక్టరీకి దారి చుట్టుపక్కల పొలాలు,డీకేటీ భూముల ఆక్రమణ చస్తూ బతుకుతున్న లక్ష్మీపురం గ్రామస్తులు సాక్షి ప్రతినిధి, తిరుపతి: పాపం పుణ్యం, మంచీ చెడ్డ మాజీ మంత్రికి పట్టవు. అధికారంలో ఉన్నా లేకున్నా తాను అనుకున్నది జరగాల్సిందే. ఏ అధికారి అయినా, ఏ పేదవాడైనా తన మాటకు ఓకే అనాల్సిందే. పేదలకు బతుకునిస్తున్న డీకేటీ భూములు, ప్రభుత్వ భూములు, అటవీ భూములను ఆక్రమించడమో, నయానో భయానో స్వాధీనం చేసుకోవడమే కాదు.. పేదలు తలదాచుకునే ఇళ్లను సైతం కూలగొట్టించి తమ ఫ్యాక్టరీకి దారి వేసుకున్నారు. ఒక పక్క డబ్బు, మరోపక్క అధికార బలం ఉన్న మాజీ మంత్రిని ఎదిరించలేక తొమ్మిది కుటుం బాలు ఊరొదిలి పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అక్కడ జీవిస్తున్న వారు సైతం మాజీ మంత్రి గల్లా అరుణకుమారి గూండా లు తమ ఇళ్లు ఎప్పుడు కూల్చేస్తారోనని భయంతో కాలం గడుపుతున్నారు. ఇదంతా పూతలపట్టు మండలం లక్ష్మీపురంలో జరుగుతోంది. క్ష్మీపురం గ్రామంలోని 42 మంది పేదలకు వైఎస్ఆర్ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో కొందరు ఐఏవై కింద ఇళ్లు మంజూరు చేయించుకున్నారు. గ్రామానికి సమీపంలో తమకు ఇచ్చిన ప్రభుత్వ స్థలంలో లలితమ్మ, ఈశ్వరి, లక్ష్మి, జమున, గౌరమ్మ, చంద్రమ్మ, కాంతమ్మ, దేవమ్మ, జమున 2009-10లో ఇళ్లు నిర్మించుకున్నారు. లక్ష్మీపురానికి పక్కనే ఉన్న కొన్ని భూములను గల్లా అరుణకుమారి తమ గల్లా ఫుడ్స్ ఫ్యాక్టరీ కోసం అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. నయానో భయానో అక్కడున్న డీకేటీ భూములను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఫ్యాక్టరీకి రోడ్డు మార్గం లేదా? ఫ్యాక్టరీలోకి వెళ్లేందుకు ఏ వైపు నుంచి అయినా రోడ్డు వేసుకునే అవకాశం ఉంది. అయితే, కాలనీ మీదుగా రోడ్డు నిర్మిస్తే వారంతా దూరంగా వెళతారని, ఇక ఫ్యాక్టరీకి ఎటువంటి అడ్డంకులు ఉండవనేది గల్లా ఆలోచనగా తెలుస్తోంది. దీంతో గల్లా వర్గీయులు తొమ్మిది మంది పేదల ఇళ్లు కూల్చివేశారు. తరువాత లలితమ్మకు రూ.7లక్షలు, ఈశ్వరికి రూ. 2.5 లక్షలు, లక్ష్మికి లక్ష చొప్పున డబ్బు ఇచ్చారు. మిగిలిన వారికి ఇవ్వలేదు. ఇక్కడున్న కొంతమంది వడ్డెర్ల గుడారాలను ఖాళీ చేయించారు. గూండాల భయంతో దొరస్వామి అనే వ్యక్తి ఇల్లు నిర్మించేందుకు వేసుకున్న పునాదులను వదిలి తిరుపతికి వెళ్లి పోయాడు. లలితమ్మ, ఈశ్వరి బయట ప్రాంతాలకు వెళ్లిపోయారు. ప్రభుత్వ రోడ్డును ఆక్రమించారు చిత్తూరు- కడప జాతీయ రహదారి నుంచి గల్లాఫుడ్స్ ఫ్యాక్టరీ మీదుగా లక్ష్మీపురానికి రెండు కిలోమీటర్ల రోడ్డు ఉంది. 15 అడుగుల వెడల్పుతో ఉన్న ఈ రోడ్డును ఫ్యాక్టరీలోకి కలుపుకున్నారు. దీని పక్కన మరో 20 అడుగుల కొత్తరోడ్డు వేసేందుకు స్థలాన్ని ఆక్రమించారు. ఆ స్థలంలో కొత్తరోడ్డు వేస్తూ పాతరోడ్డును తవ్వేసే కార్యక్రమాన్ని 2011 మే 23 రాత్రి చేపట్టారు. దీనిని లక్ష్మీపురం గ్రామస్తులు అడ్డుకుని ఆందోళన చేపట్టడంతో తాత్కాలికంగా కొత్తరోడ్డు నిర్మాణాన్ని ఆపివేశారు. తరువాత రోడ్డువేయడంపై స్థానికులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఇంజక్షన్ ఇచ్చింది. అయితే పేదోళ్ల గుడిసెలు కూల్చిన ప్రాంతంలో మాత్రం రోడ్డు వేశారు. రైతుల భూములు స్వాహా... తేనేపల్లి రెవెన్యూ గ్రామం పరిధిలో సర్వే నెంబర్ 299/1ఎలో 1.65 ఎకరాలు, 1బిలో 2.02 ఎకరాలు, 227/1ఎలో 32 సెంట్లు, 1బీలో 52 సెంట్లు, 2ఎ1లో 68సెంట్లు, 2ఎ2లో 68సెంట్లు, 2బిలో 1.3 ఎకరాలు, 2సీలో 3.74ఎకరాలు, 327/3లో 1.5 ఎకరాలు, 327/4లో 1.07 ఎకరాలు, 1240/1లో 4.75 ఎకరాలు, 1241లో 4.68 ఎకరాలు, 1246/1లో 4.09 ఎకరాలు, 1246/2డీలో 1.11 ఎకరాలు, 1246/2బీలో 0.6 ఎకరాలు, 1247/2ఐలో 0.94ఎకరాలు, 1247/2జేలో 1.45 ఎకరాలు, 2264లో 4.20 ఎకరాలు, 1238లో 2.01ఎకరాలు, 1239లో 4.24 ఎకరాలు, 1265/2లో 1.16 ఎకరాలు, 1265/3ఏలో 0.58 ఎకరాల రైతుల భూములను గల్లా రామచంద్ర నాయుడు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు రైతులు ఆరోపించారు. తమ భూములను ఏపీఐఐసీ కి అమ్మినట్లు, వారు గల్లా ఫుడ్స్‌కు విక్రయించినట్లు రికార్డులు సృష్టించారంటూ రైతులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. ఈసీ కోసం రైతుల్లో కొందరు రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చిం ది. ప్రస్తుతం రెవెన్యూ రికార్డుల్లోని అడంగళ్లలో పైన ఉదహరించిన సర్వే నెంబర్లలోని భూముల అనుభవదారులుగా రైతుల పేర్లు ఉన్నాయి. మొత్తం 44.87 ఎకరాల ప్రైవేట్ భూమిని అక్రమంగా లాక్కున్నారనే ఆరోపణలు గల్లా ఎదుర్కొంటున్నారు. దీనిపై ఇంకా కోర్టు నిర్ణయం వెల్లడికాలేదు. ఈ భూములను ఏపీఐఐసీ నుంచి కొనుగోలు చేసినట్లు రికార్డులు తయారుకాగానే 2010 సెప్టెంబర్ 7న వ్యవసాయ పొలాలు ఇండస్ట్రీ కిందకు కన్వర్షన్ అయ్యాయి. పశువుల బీళ్లను, శ్మశానాన్నీ వదల్లేదు... తేనేపల్లి రెవెన్యూ గ్రామం పరిధిలోని 323 సర్వే నెంబరులో 4.10 ఎకరాల రోడ్డు, 3.25 ఎకరాల శ్మశాన స్థలం, పశువుల బీడుగా ఉన్న 2.03 ఎకరాలను కూడా ఆక్రమించారు. ఈ భూములన్నింటినీ సక్రమంగానే కొనుగోలు చేశామనే విధంగా డాక్యుమెంట్లు సృష్టించారు. అటవీ భూములనే లాక్కున్న వారికి సాధారణ భూములు లాక్కోవడం లెక్కలోది కాదనే విషయం సుస్పష్టమే. ఏపీఐఐసీ వారు ఇచ్చిన భూమి 521 ఎకరాలు ఫ్యాక్టరీ అవసరాల పేరు చెప్పి పలువురి నుంచి అక్రమంగా లాక్కున్న భూముల్లో ఏపీఐఐసీ వారు గల్లా ఫ్యాక్టరీకి 521 ఎకరాల భూమిని ఇచ్చారు. ఏపీఐఐసీ రికార్డులు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇందులో 341.22ఎకరాలు డీకేటీ భూములు ఉండగా 180.54 ఎకరాల ప్రభుత్వ సాధారణ భూములున్నాయి. -
భయమా.. బద్దకమా!
=ఆక్రమణల తొలగింపుపై ఉదాసీనత ఎందుకు? =రెవెన్యూ యంత్రాంగంపై మండిపడ్డ ప్రజాప్రతినిధులు =డీఆర్సీలో పట్టణ ప్రాంత సమస్యల ప్రస్తావన సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ప్రభుత్వ భూములు పరిరక్షించాల్సిన అధికారులే అక్రమార్కులకు సహకరిస్తున్నారు. భూ కబ్జాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఏమాత్రం చలనం ఉండట్లేదు. ఎందుకింత ఉదాసీనత? ఆక్రమణదారుల నుంచి ఇబ్బందులుంటున్నాయా? లేదంటే వాటిని తొలగించలేని నిర్లక్ష్యవైఖరా?’ అంటూ రెవెన్యూ, జీహెచ్ఎంసీ యంత్రాంగంపై జిల్లా సమీక్షా మండలి సభ్యులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లో మండలి పట్టణ ప్రాంత సమావేశం జరిగింది. జిల్లా ఇన్చార్జి మంత్రి డి.శ్రీధర్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి ప్రసాద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, వాటర్‌బోర్డు ఎండీ శ్యామలరావు, కలెక్టర్ బి.శ్రీధర్, అర్బన్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇది అధికారుల నిర్వాకమే... శేరిలింగంపల్లి మండలం కుడికుంట సర్వేనంబర్ 188లో ని చెరువు శిఖంలో ఓ ప్రైవేటు సంస్థ రియల్ వ్యాపారం సాగిస్తున్న తీరుపై ఫిర్యాదు చేసినా యంత్రాంగం ఇప్పటివరకు స్పందించలేదని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ శ్రీధర్ స్పందిస్తూ.. అధికారులతో సర్వే చేయించగా ఆక్రమణలున్నట్లు గుర్తించి జీహెచ్ఎంసీకి నివేదిక ఇచ్చామన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్... సదరు సంస్థకు నోటీసులు జారీ చేశామని, పరిస్థితిని సమీక్షిస్తానన్నారు. కుత్బుల్లాపూర్ మండలంలో మైనింగ్ కోసం ఓ కంపెనీకి భూమి కేటాయిస్తే దాని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని, ఇది చట్టవిరుద్ధమని ఎమ్మెల్యే కూన శ్రీశైలం అన్నా రు. మల్కాజ్‌గిరిలోనూ ఇదే తరహాలో ఆక్రమణలున్నాయంటూ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ చెప్పగా... తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బదులిచ్చారు. నీళ్లివ్వండి.. రోడ్లు వేయండి... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా శివార్లలో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. కేటాయింపులో కోతలు పెడుతుండడంతోనే సమస్య తీవ్రతరమవుతుందని ఎమ్మెల్యేలు ఎం.కిషన్‌రెడ్డి, కేఎల్లార్ తదితరులు వాటర్‌బోర్టుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో బిల్లులు చెల్లించిన మేరకు నీళ్లిస్తున్నామని వాటర్‌బోర్డు ఎండీ శ్యామలరావు స్పష్టంచేశారు. మల్కాజ్గిరి వాంబే కాలనీలో నిర్మాణాలు చేపట్టి ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ లబ్ధిదారులకు అందించలేదని, అక్కడి సామగ్రిని కొందరు దొంగిలిస్తున్నారని ఎమ్మెల్యేలు అన్నారు. నీటివసతి లేకపోవడంతో అబ్దుల్లాపూర్‌మెట్ జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి తాగునీటిని కేటాయించాలని కోరగా...పంచాయతీల పరిధిలో బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో అక్కడ నీటి సరఫరా నిలిపివేశామని, చెల్లిం పులు చేసిన వెంటనే పునరుద్ధరిస్తున్నామని శ్యామలరావు చెప్పారు. వర్షాలతో గ్రేటర్ రోడ్లు అధ్వానంగా మారాయని, వెంటనే పునరుద్ధరించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేయగా, ప్రణాళిక రూపొందించి మరమ్మతులు చేస్తామని ఆర్అండ్బీ అధికారులు సమాధానమిచ్చారు. విలీనంపై తేల్చండి ఇటీవల గ్రేటర్ హైదరాబాద్‌లో పంచాయతీల విలీనంపై స్పష్టత ఇవ్వాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. దీన్ని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు బదులిచ్చారు. నాగేశ్వర్ నిరసన అల్వాల్ ప్రభుత్వ పాఠశాలలో భవనం లేక విద్యార్థులు రోడ్ల పక్కన కూర్చోవాల్సి వస్తోందని ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. డీఈఓ సోమిరెడ్డి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేయగా.. సంతృప్తి చెందని ఆయన కుర్చీలోంచి లేచి వేదిక ముందు బైఠాయించారు. గతంలో ఎన్నోసార్లు ఇలాంటి ప్రకటనలు చేశారని, అయినా ఫలితం కనిపించలేదన్నారు. ఇందుకు ఎమ్మెల్యే జేపీ మద్దతు పలికారు. వారంలోపు షెడ్లు వేయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. -
కొలతలతో కబ్జా
సర్కారు భూములకే ఎసరు =ఓ సర్వేయర్ బాగోతం =ఆయన ఆడిందే ఆట... పాడిందే పాట =తప్పుడు సర్వేలతో ఖజానాకు ’2.30 కోట్ల నష్టం తూనికలు కొలతల్లో కాంటా కొట్టినంత ఈజీగా... సర్వేయర్లు సర్కారు భూమిని కొల్లగొడుతున్నారు. గొలుసు కొలతల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఒక్కోచోట... ఒక్కో గజం మిగిలినా సరే.. అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. మిగుల్చుకుంటున్న భూములను రికార్డులకు దొరక్కుండా సొంతం చేసుకుంటున్నారు. ఇందులో ఎస్సారెస్పీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ది అందెవేసిన చేయి. సర్కారు ఖజానాకు ఆయన నష్టం తెచ్చినట్లు నిర్ధారణ అయినా అధికారులు చోద్యం చూస్తున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత సర్వేయర్లపై ఉంది. దాన్ని విస్మరించిన కొందరు... సర్వే నంబర్ల హద్దులనే అటుదిటుగా మార్చేస్తున్నారు. రెండు రోజుల క్రితం వడ్డేపల్లి ప్రాంతంలోని ప్రశాంత్ నగర్లో వంద గజాల స్థలం ఓ ఎమ్మెల్యే కుటుం బీకులు, ఓ సర్వేయరు... మధ్యలో జోక్యం చేసుకున్న రియల్ గ్యాంగ్, సీఐ భార్యకు మధ్య జగడం పెట్టిం చిన విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. మరింత లోతుగా ఆరా తీయడంతో ఇంటి నిర్మాణం చేపడుతున్న సర్వేయర్ దారబోయిన రవీందర్ లీలలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఎస్సారెస్పీలో డిప్యూటీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఆయన గతంలో హన్మకొండ సర్వేయర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో జిల్లా కేంద్రం చుట్టుపక్కల ఉన్న సర్కారు భూములను ప్రై వేట్ పట్టాదారులకు అప్పగించినట్లు ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. తప్పుడు సర్వేలతో సర్కారు భూమిని కొల్లగొట్టినందుకు రవీందర్‌పై చర్యలు తీసుకోవాలని అప్పటి జేసీ వాకాటి కరుణ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. గత ఏడాది జూన్ 23వ తేదీన (ఆర్సీ నంబర్ ఈ 4/3121) జేసీ పంపిన నివేదికలో ఉన్న వివరాల ప్రకారం... కాజీపేట జాగీర్ గ్రామ పరిధి సర్వే నంబర్ 31, 27లోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. అధికారులు విచారణ చేపట్టడంతో గతంలో ఆ స్థలాన్ని డీ మార్కేషన్ చేసిన సర్వేయర్ రవీందర్... 1.10 ఎకరాలకు సంబంధించి తప్పుడు రిపోర్టు ఇచ్చినట్లుగా తేలింది. సర్వే నంబర్ 31లో అప్పటికే ఇళ్లు, నిర్మాణాలు వెలిశాయి. అక్కడ ఉండాల్సిన పట్టా భూములు సైతం సర్వే నంబర్ 27లోని ప్రభుత్వ భూముల్లో ఉన్నట్లుగా తప్పుడు నివేదిక ఇచ్చినట్లుగా గుర్తించారు. దాదాపు 37 గుంటల భూమి ఆక్రమణకు గురైందని.. ఆ విషయాన్ని సర్వేయర్ ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టినట్లు ధ్రువీకరించారు. అప్పటి మార్కెట్ రేటు ప్రకారం చదరపు గజానికి ’ 5,000 చొప్పున ’ 2.23 కోట్ల విలువైన సర్కారు భూమిని తప్పుడు సర్వేతో ఆక్రమణదారులకు దోచిపెట్టినట్లుగా లెక్కలేశారు. అదే తరహాలో హన్మకొండ మండలంలో లష్కర్ సింగారం గ్రామంలో సర్వే నంబర్ 326లో 23 గుంటల ప్రభుత్వ స్థలం, సర్వే నంబర్ 491లో ఐదు గుంటల స్థలానికి సంబంధించి హద్దులు నిర్ణయించే బాధ్యతను సర్వేయర్ రవీందర్‌కు తహసీల్దార్ అప్పగించారు. 326 సర్వే నంబర్లో ఉన్న 23 గుంటల స్థలాన్ని ఏకంగా పట్టాదారులకు సంబంధించిన సర్వే నంబర్25లో ఉన్నట్లుగా ఆయన నంబర్లు మార్చేసినట్లు తదుపరి విచారణలో తేలింది. ఆ స్థలం ’ 7.26 లక్షల విలువైనదిగా అధికారులు అంచనా వేశారు. తమ దష్టికి వచ్చిన ఈ రెండు సంఘటనల్లోనూ రవీందర్ ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసి సర్కారు ఖజానాకు నష్టం తెచ్చినట్లు జిల్లా యంత్రాంగం నిర్ధారించింది. కానీ.. ఫైలు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండడం గమనార్హం. తాజాగా ప్రశాంత్‌నగర్‌లో నిర్మాణంలో ఉన్న వివాదాస్పద స్థలం రవీందర్ భార్య పేరుతో ఉండడం గమనార్హం. మొత్తంగా సర్వేయర్ల లీలలు.. సర్కారు భూములు.. తప్పుడు కొలతలన్నీ.. యజమానుల మధ్య చిచ్చు పెడుతున్నట్లు ఈ సంఘటన రూఢీ చేసింది. -
భూ ఆక్రమణలకు చెక్
కొత్తగూడెం, న్యూస్‌లైన్: ‘రియల్’ భూమ్‌తో అన్యాక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములపై అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వం పేదలకు పంచిన అసైన్డ్ భూములు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు ఇప్పటికే చాలా వరకు కబ్జాకు గురికాగా, మిగిలిన వాటినైనా రక్షించే పనిలో పడ్డారు. అయితే ఇప్పటికే బడా బాబుల చేతికి చిక్కిన భూముల వివరాలు అందకపోవడం, సర్వే నంబరలలో మార్పు చేయడంతో వాటి వివరాలు అందించలేక మండలస్థాయి సిబ్బంది ఇబ్బంది పడాల్సి వస్తోంది. కొన్ని చోట్ల ప్రభుత్వ భూములను మాయం చేసేందుకు బై నంబర్లు సృష్టించడంతో గందరగోళం నెలకొంది. ప్రభుత్వ భూ వివరాలు సేకరించి రిజిస్ట్రేషన్ శాఖకు అందించాలని రెవెన్యూ సిబ్బందికి ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూముల సర్వే నంబర్లు అందించి అక్రమంగా సాగుతున్న రిజిస్ట్రేషన్లను అడ్డుకోవాలని రెవెన్యూ చట్టం 22 (ఎ)ను జారీ చేశారు. దీంతో గత నెల రోజులుగా జిల్లాలో ప్రభుత్వ భూముల వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అన్యాక్రాంతమైన భూములపై తర్జన భర్జన... జిల్లాలో 46 మండలాలు ఉండగా అందులో 29 మండలాలు ఏజెన్సీలో ఉన్నాయి. ఏజెన్సీ చట్టం ప్రకారం ఇక్కడ కొనుగోలు, అమ్మకాలు నిషేధం. గిరిజనేతరులు క్రయ, విక్రయాలు చేయకూడదనే నిబంధన ఉండడంతో ప్రస్తుతం ఏజెన్సీ పరిధిలో ఉన్న భూముల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగడం లేదు. అయితే ప్రభుత్వ భూములు మాత్రం చాలా వరకు అన్యాక్రాంతమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏజెన్సీ పరిధిలో ఉన్న భూముల వివరాలను సైతం రిజిస్ట్రేషన్ అధికారులకు అందించాలని ఉన్నతాధికారులు రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. దీంతోపాటు మైదాన ప్రాంతంలోని 17 మండలాల్లో అసైన్డ్ భూములు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు సైతం సర్వే నంబర్ల మార్పుతో అన్యాక్రాంతమయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉండాల్సిన అసైన్డ్ భూములు సక్రమంగా ఉన్నాయో..? లేదో అనే విషయంపై ఇప్పుడు అధికారులు దృష్టి సారించారు. ప్రభుత్వ భూమి వివరాలు అందించిన తర్వాత తప్పనిసరిగా వాటిని పొజిషన్ చూపించాల్సి రావడంతో అధికారులు ఇప్పుడు ఆ నివేదికల తయారీ పనిలో నిమగ్నమయ్యారు. నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశాలు... జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రభుత్వ, అసైన్డ్ భూముల వివరాలను సేకరించాలని నెల క్రితమే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ వివరాలు ఇంకా అందకపోవడంతో ఈ నెలాఖరులోగా ఆ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా ఉన్నతాధికారులు సూచించినట్లు సమాచారం. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెలాఖరులోగా నివేదిక తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా రెవెన్యూ అధికారి శివ శ్రీనివాస్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ప్రభుత్వ భూముల వివరాలు రిజిస్ట్రేషన్ శాఖకు అందిస్తే.. ఇకపై భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడవచ్చని చెప్పారు. -
ప్రభుత్వ భూములపై ఆరా
సాక్షి, మచిలీపట్నం :ఓ వైపు సమైక్యాంధ్ర ఉద్యమ జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంటే మరోవైపు సీమాంధ్ర రాజధాని కోసం అనువైన ప్రాంతం కోసం పాలకులు వెదుకులాట మొదలెట్టారు. ఇప్పటికే హైదరాబాద్ నుంచి వచ్చిన ఉన్నతస్థాయి మౌఖిక ఉత్తర్వులతో పలు జిల్లాల కలెక్టర్లు రంగంలోకి దిగినట్టు విశ్వసనీయ సమాచారం. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రలో రాజధాని ఏర్పాటుకు అనువైన ప్రాంతం కోసం మందు నుంచే దృష్టి పెట్టినట్టు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు పరిశీలిస్తే అవగతమవుతోంది. ఇప్పటికే సీమాంధ్రలోని విశాఖ నుంచి కడప వరకు ప్రభుత్వ భూములపై జిల్లా కలెక్టర్లు ఆరా తీసే పనిలో పడినట్టు తెలిసింది. ప్రధానంగా ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నడుమ కొత్త రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయన్న ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా కలెక్టర్ విజయ్‌కుమార్ ఈ నెల 2, 3తేదీల్లో ప్రత్యేకంగా ప్రభుత్వ భూమి ఎంత ఉంది, ఎక్కడెక్కడ ఉంది తదితర విషయాలపై తనకు పూర్తిస్థాయి నివేధిక ఇవ్వాలంటూ తహసిల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు. దీంతో ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ భూమిపై అక్కడి రెవెన్యూ యంత్రాంగం ఆరా తీసే పనిలో పడింది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు నగరానికి ఆనుకుని సుమారు రెండు వేల ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నట్టు గుర్తించారు. దీనికితోడు ఒంగోలు నగర నడిబొడ్డు నుంచి జాతీయ రహదారి వెళ్లడం, సముద్ర తీరం దగ్గర ఉండటంతో రాజధానికి అనువైందిగా ప్రచారం జరుగుతోంది. ఉన్నతస్థాయి అధికారుల మౌఖిక ఉత్తర్వులతో గుంటూరు జిల్లా కలెక్టర్ సురేష్‌కుమార్, కృష్ణా జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి, పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్జైన్లు ఇప్పటికే ప్రభుత్వ భూమి ఎంత ఉంది అనేది ఆరా తీస్తున్నారు. దీనిలో భాంగాగానే గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్శిటి ప్రాగణం సుమారు 350 ఎకరాల వరకు ఉండటంతో అక్కడ పరిపాలనకు అవసరమైన సముదాయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చన్న ప్రతిపాదన ఉంది. మరోవైపు కృష్ణా-గుంటూరు జిల్లాల నడుమ సుమారు వెయ్యి నుంచి రెండువేల ఎకరాలకు వైగా ప్రభుత్వ భూమి ఉందని రెవెన్యూ వర్గాలు గుర్తించాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి కృష్ణా జిల్లా విజయవాడ నడుమ సుమారు ఐదు వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఏలూరు-విజయవాడ ప్రధాన రహదారికి అనుకుని పెదపాడు, బాపులపాడు, గన్నవరం మండలాల్లో ప్రభుత్వ భూమిపై క్షేత్ర స్థాయిలో ఆరా తీసేందుకు ఉన్నతాధికారులు ఆరాతీస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ భూమిపై పూర్తిస్థాయి నివేధిక ఇవ్వాలంటూ కృష్ణా జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి తాజాగా గన్నవరం, బాపులపాడు తహసిల్దార్లను ఆదేశించినట్టు సమాచారం. ఇదే విషయమై రెండు రోజుల క్రితం జిల్లా ఉన్నతస్థాయి ఆంతరంగిక సమావేశం నిర్వహించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. భూమి ధరలకు రెక్కలు.. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర రాజధాని గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో హైకోర్టు ఒకచోట, సచివాలయం మరోచోట, అసెంబ్లీ ఇంకోచోట అనే ఏర్పాటు చేస్తారన్న ప్రచారంతో భూమి ధరలకు రెక్కలు వచ్చాయి. రాష్ట్ర విభజన ప్రకటనతో ఈ ప్రాంతంలో ఎకరం భూమి కోట్లు పలుకుతోంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమి సరిపోకపోతే ప్రత్యేకంగా ప్రైవేటు భూమిని సేకరించే అవకాశం ఉందన్న ప్రచారంతో ఇప్పటి నుంచే భూముల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ప్రైవేటు భూమిని సేకరించాల్సి వస్తే అసరమైతే అసెంబ్లీలో పెట్టి భూ సేకరణ చట్టాన్ని మార్పులు చేస్తారన్న ప్రచారంతో ప్రైవేటు భూముల యజమానులు ఆశనిరాశల డోలాయమానంలో కొట్టుమిట్లాడుతున్నారు. అవసరమైతే ప్రైవేటు భూమి ఎకరం రూ.50 లక్షలు వరకు ఇచ్చి భూ సేకరణ చేస్తారని, మాట వినకుంటే నిర్బంధంగానే అయినకాడికి ప్రభుత్వం తీసుకుంటున్న వాదనలతో ఆయా ప్రాంతాల్లో భూముల యజమానులు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. ఏది ఏమైనా రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి పిడేలు వాయించుకున్నట్టు సమైక్యాంధ్ర ఉద్యమ జ్వలలు ఎగిసిపడుతుంటే పాలకులు ప్రత్యేక రాష్ట్ర రాజధాని స్థల పరిశీలన చర్యలు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. -
12మంది తహశీల్దార్లపై కొరడా
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ భూముల కబ్జాకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బండ్లగూడ మండలంలో గతంలో పనిచేసిన 12 మంది తహశీలార్లకు ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ జారీకి రంగం సిద్ధమైంది. యూఎల్సీ సర్ప్లస్ ల్యాండ్‌గా గుర్తించిన ఖాళీస్థలంలో పదేళ్లుగా ఎన్నో ఆక్రమణలు జరిగిన నేపథ్యంలో 2003 నుంచి ఇప్పటి వరకు తహశీల్దార్లుగా పనిచేసిన వారందరిపై అభియోగాలు మోపనున్నట్లు తెలిసింది. సుమారు 14వేల గజాల విస్తీర్ణం ఉన్న ప్రభుత్వ స్థలంలో దశలవారీగా 8 వేల గజాలకు పైగా భూమి ఆక్రమణలకు గురైంది. ప్రభుత్వ భూములను పరిరక్షించడంలో అప్పట్నుంచి ఇప్పటి వరకు పనిచేసిన తహశీల్దార్లందరూ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ వారందరిపైనా చార్జెస్ నమోదు చేయాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. మొత్తం 12మందిపై చార్జెస్ నమోదు చేయనుండగా, వీరిలో కొందరు పదవీ విరమణ చేసినవారు, మరికొందరు పదోన్నతులపై బయటి జిల్లాలకు వెళ్లిన వారు ఉన్నారు. ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ అందుకోబోతున్న వారి జాబితాలో బండ్లగూడ మండలం మాజీ తహశీల్దార్లు కృపాకర్, లీల, రమేశ్, చంద్రావతి, కరుణాకర్, శ్రీనివాస్, నరేందర్, వంశీమోహన్, వెంకటేశ్వర్లు, అశోక్, నాగరాజు, సురేశ్‌బాబు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ స్థలం ఆక్రమణలకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ.. కొందరు ప్రైవేటు వ్యక్తులు లోకాయుక్తకు ఫిర్యాదు చేయగా, దీనిపై సమగ్ర నివేదిక పంపాలని జిల్లా కలెక్టర్‌ను లోకాయుక్త ఆదేశించింది. ప్రభుత్వ భూముల ఆక్రమణల వ్యవహారంపై ఎన్నో ఏళ్లుగా నిర్లిప్తంగా వ్యవహరించిన జిల్లా యంత్రాంగం లోకాయుక ్త జోక్యంతో ఎట్టకేలకు కళ్లు తెరిచింది.