సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లా యంత్రాంగం విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రభుత్వ భూములు తరిగిపోవడంతో.. ప్రైవేటు వ్యక్తుల నుంచి భూములు కొనేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘దళితులకు భూ పంపిణీ’ పథకం అమలుకు భూములు అందుబాటులో లేకపోవడంతో బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. నగరానికి ఆనుకొని ఉన్న మన జిల్లాలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో దళితులకు భూపంపిణీ భారం తడిసిమోపెడుకానుంది. జిల్లాలో ఎవరికీ కేటాయించని భూమి కేవలం 4,100 ఎకరాలు మాత్రమే ఉంది. మరోవైపు పంద్రాగస్టున సగటున ప్రతీ దళిత కుటుంబానికి మూడెకరాల భూమిని పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించారు.
వామ్మో..కొనలేం..
రాజధాని పరిసరాల్లోనే జిల్లా ఉండడంతో భూముల ధరలు నింగినంటాయి. జిల్లాలో సాగుకు అనువుగా ఉండే భూమి కనిష్టంగా ఎకరాకు సగటున రూ.4 లక్షల ధర పలుకుతోంది. ఈ క్రమంలో భూములు కొని.. దళితులకు పంచడం అధికారయంత్రాంగానికి కత్తిమీద సాములా పరిణమించింది. ఇప్పటివరకు ఏడు విడతలలో చేపట్టిన భూపంపిణీల్లో సుమారు 7వేల ఎకరాలను దళితులకు కేటాయించారు. ఇద ంతా ప్రభుత్వ భూమే కావడంతో జిల్లా యంత్రాంగానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు.
అయితే, దీంట్లో సేద్యానికి యోగ్యంలేని భూమే ఎక్కువగా ఉంది. రాళ్లు, గుట్టలతో నిండిన భూములే లబ్ధిదారులకు అందాయి. దీంతో ఆయా భూములు ఇప్పటివరకు పడావుగా ఉన్నాయి. ఇదిలావుండగా, ఈ పంద్రాగస్టున మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి దళితులకు భూపంపిణీ చేయాలని రాష్ట్ర సర్కారు ఆదేశించింది. ఈ క్రమంలో నగర శివార్లలోని 17 మండలాలను మినహాయించి, మారుమూల మండలాల్లో మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలని జిల్లా యంత్రాంగం యోచిస్తోంది.
సాగుకు అనువైన భూమిని మాత్రమే ఇవ్వాలని, సగటున ప్రతి లబ్ధిదారుకు మూడు ఎకరాల చొప్పున పంపిణీ చేయాలనే నిబంధనలు అధికారులను ఇరకాటంలో పడేశాయి. జిల్లాలో ప్రభుత్వ భూముల కొరత తీవ్రంగా ఉండడంతో ఈ పథకం అమలు వారికి సవాల్‌గా మారింది. అవసరమైతే ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనయినా పంచాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో భూముల వేటలో పడి ంది.
కేవలం వికారాబాద్, పరిగి, తాండూరు, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేయాలని భావిస్తున్న యంత్రాంగం.. ఆయా ప్రాంతాల్లో లభ్యమయ్యే భూముల వివరాలను సేకరిస్తోంది. మండలంలో ఒక గ్రామం.. ఆ గ్రామంలో 30 మంది లబ్ధిదారులకు భూ పంపిణీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించిన యంత్రాంగం... జిల్లావ్యాప్తంగా1,800 ఎకరాలను సమీకరించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది.
ప్రభుత్వంపైనే ఆశలు..
ఈ నెల 30లోపు గ్రామాల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్న అధికారులు. ఆలోపు భూముల కొనుగోలుకు అవసరమైన నిధులపై స్పష్టత రాబట్టాలని భావిస్తోంది. జిల్లాలో నెలకొన్న విచిత్ర పరిస్థితి నేపథ్యంలోప్రభుత్వం ఇచ్చే నిధులపైనే ఆశలు పెట్టుకుంది. కేటాయించే నిధుల ఆధారంగానే భూపంపిణీ ల క్ష్యాన్ని నిర్దేశించుకోవాలని యోచిస్తోంది. 1,800 ఎకరాలకు కనిష్టంగా రూ.72 కోట్లు అవసరమమవుతాయని ప్రాథమిక అంచనాలు రూపొందించిన అధికారులు భూముల అన్వేషణలో తలమునకలయ్యారు. మరోవైపు భూ యజమానులు ఎక్కడ భూముల రేట్లు పెంచుతారోననే అనుమానం కూడా రెవెన్యూ అధికారుల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలు,నిధుల లభ్యత మేరకే గ్రామాలను ఎంపిక చేస్తే బాగుంటుందంటున్నారు.
భూములు కావలెను!
Published Thu, Jul 17 2014 11:38 PM | Last Updated on Wed, Mar 28 2018 11:05 AM
Advertisement
Advertisement