సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న కబ్జాకోరులపై జిల్లా రెవెన్యూ యంత్రాంగం దృ ష్టి సారించింది. జిల్లాలో వేలాది ఎకరాల ప్రభు త్వ భూములను అందినకాడికి దండుకున్నట్లు భూ సర్వేలో వెల్లడైంది. ఈ మేరకు తిరిగి వాటి ని స్వాధీనం చేసుకోవాలనే కృతనిశ్చయంతో రెవెన్యూ యంత్రాంగం ఉంది. నిబంధనల్లో లొ సుగులను ఆధారం చేసుకుని చట్టబద్ధత కల్పిం చుకున్న ఘనులు ఎవరో కూడా ఇప్పటికే గుర్తిం చారు.
ప్రభుత్వ భూ ఆక్రమణల అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ప్రభుత్వ భూమి ఎంత ఉంది? ఎంత ఆక్రమణకు గురైం ది? వాటిలో పక్కా భవనాలు ఎన్ని నిర్మించారు? వాటి విలువ ఎంత? అనే అంశాలపై రెవెన్యూ అధికారులు మండలాల వారీగా జరిపిన భూ సర్వేలో అనేక విషయాలు వెలుగు చూశాయి. ఇవి రెవెన్యూ వ్యవహారాల్లో అనుభవం ఉన్న సీనియర్ అధికారులనే విస్మయపరిచాయి.
ఇన్నాళ్లకు మోక్షం
జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని కొన్ని సంవత్సరాలుగా పలు రాజకీయపక్షాలు, ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏ ప్రాంతంలో ఎంత మేరకు ఆక్రమణకు గురయ్యాయి, ప్రభుత్వ భూమి ఎవరి చెరలో ఉందన్న అంశంపై మాత్రం ఇప్పటి దాకా స్పష్టత లేకుండా పోయింది. ప్రభుత్వ భూముల ఆక్రమణ వ్యవహారంలో కిందిస్థాయి రెవెన్యూ అధికారుల అండదండలే అధికంగా ఉన్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.
గ్రామాల్లో రైతుల ఆధీనంలో ఉన్న భూములకు ఓ సర్వే నంబర్, ప్రభుత్వ భూములకు మరో సర్వే నంబర్ ఉండటం ఆనవాయితీగా వస్తోంది. కబ్జాకోరులతో మిలాఖత్ అయిన రెవెన్యూ అధికారులు కొన్ని మండలాల్లో తమ బుద్ధి ప్రదర్శించారు. కబ్జాకోరులతో కుమ్మక్కై ప్రభుత్వ సర్వే నంబర్‌లో ఉన్న భూములకు సైతం విచ్చలవిడిగా రెవెన్యూ పట్టాలు, హక్కు పత్రాలు మంజూరు చేశారు.
దీని ఆధారంగా ఖమ్మం రెవెన్యూ డివిజన్‌లోనే వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన అక్రమార్కులు వాటిలో లక్షల రూపాయల విలువ చేసే భవనాలను సైతం నిర్మించారు. ఆక్రమించిన ప్రభుత్వ భూములకు చట్టబద్ధత కల్పించుకున్నారు. వాటిలో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేయడం సైతం జరిగినా ఇప్పటి దాకా వాటి గురించి కూలంకషంగా ప్రభుత్వ యంత్రాంగం ఆరా తీయలేదు. ఇదే అదనుగా ఆక్రమణదారులు ఆడిందే ఆటగా...చెలామణి అయ్యారు.
ప్రభుత్వ అవసరాలకు దొరకని భూమి
వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నా సర్కార్ అవసరాలకు భూములు దొరకకపోవడం ఉన్నతాధికారులను విస్మయానికి గురిచేసింది. పేదల గృహ నిర్మాణాలు మొదలు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, చివరకు రక్షిత మంచినీటి పథకాలకు సైతం భూములు దొరక్కపోవడం గమనార్హం. ఈ పరిస్థితిని గమనించిన జిల్లా జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ ఆక్రమిత భూములను వెలికి తీయాలని నిర్ణయించుకున్నారు.
జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూమి ఎంత ? అందుబాటులో ఉన్నది ఎంత? దానిలో ప్రజా అవసరాలకు ఉపయోగపడేది ఎంత? మిగిలిన భూమి ఏయే రూపంలో అన్యాక్రాంతం అయిందో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని జేసీ ఆదేశించారు. ఈ మేరకు మూడునెలలుగా మండలస్థాయి రెవెన్యూ యంత్రాంగం, సర్వే అధికారులు మూకుమ్మడిగా కసరత్తు చేశారు. వేలాది ఎకరాల భూములు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. ఆ భూముల్లో విలువైన భవనాలు, బహుళ అంతస్థుల మేడలు నిర్మించినట్లు తెల్చారు. వీటి ఆధారంగా ఆయా ఆక్రమణదారులపై చర్యలు తీసుకునేందుకు జిల్లా యంత్రాంగం ఉపక్రమించింది.
చెరువులూ..కుంటలు సైతం ఆక్రమణ
జిల్లాలోని చెరువులు, కుంటలను సైతం ఆక్రమణదారులు వదలలేదు. వీటిలో సైతం పక్కా భవనాలు నిర్మించారు. రియల్‌ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ చెరువుల స్ఫూర్తిని తుంగలో తొక్కారు. జిల్లాలో రెండువేల ఎకరాల చెరువు భూములను దాదాపు మూడు వేలమందికి పైగా ఆక్రమించారని ఈ సర్వే తేల్చింది. కబ్జాదారులకు జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఆయా ప్రాంతాల్లోని అధికారుల ద్వారా నోటీసులు జారీ చేసింది. భూములపై ఆక్రమణదారులకు గల హక్కు ఏమిటో, వారికిఉన్న పత్రాలు ఏమిటో సంబంధిత అధికారులకు చూపించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.
ఐదు, పది కుంటల నుంచి ఎకరాలకు ఎకరాలను తమ ఆధీనంలో ఉంచుకున్న రైతులకు అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు. ఇందులో కేవలం చెరువు గట్టుకింద ఉన్న భూమిని సాగు చేసుకున్న రైతులు సైతం లేకపోలేదు. ప్రభుత్వం ఇచ్చిన నోటీసుల వల్ల తమ జీవనాధారం పోతుందేమోనని, ఉన్న అరెకరం చెరువు పొలం దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నామని చిన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా కేంద్రం పరిసరాలపై దృష్టి
ఖమ్మం అర్బన్, రూరల్ వంటి మండలాల్లో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి చేరడంలో ఎవరి పాత్ర ఎంత అనే అంశంపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించింది. ప్రభుత్వ సర్వే నంబర్లలో ప్రైవేట్ వ్యక్తులకు పట్టాలు ఏ ప్రాతిపదికన జారీ చేశారో తేల్చడానికి సైతం రెవెన్యూ అధికారులు సంస్థాగతంగా ప్రయత్నా లు ప్రారంభించారు. ఏ మండలంలో, ఏ అధికారి హయాంలో ఈ తరహా అక్రమాలు జరిగా యో కూపీ లాగేందుకు ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యంగా ఖమ్మం అర్బన్ మండలంలో భూ ఆక్రమణలు జరిగిన తీరు జిల్లా రెవెన్యూ అధికారులనే ఆశ్చర్యపరుస్తోంది. చట్టంలో ఉన్న లొసుగులు, రెవెన్యూ శాఖలో ఉన్న అనుభవాన్ని క్రోడీకరించి కొందరు రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులకు సహకరించారు. ఎక్కడా దొరకకుండా ఉండేందుకు తమకున్న తెలివితేటలు, యావత్తు ఉపయోగించారని రెవెన్యూశాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణదారుల చేతిలోకి వెళ్లడానికి పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారి ఉంటాయన్న విషయం బహిరంగ రహస్యమే.
ఇప్పటికైనా యంత్రాంగం అప్రమత్తం కావడం ఒకింత మంచిదే అయినా..ప్రభుత్వ భూముల్లో నిర్మించిన పక్కా భవనాలను గుర్తించినా..వాటిని స్వాధీనం చేసుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలి సింది. వాటిని తక్షణం కూల్చివేయకుండా ప్రజా అవసరాలకు ఉపయోగించుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ తరహాలో ఇప్పటికే భద్రాచలంలో ప్రభుత్వ స్థలంలో కట్టిన కట్టడాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు వాటిని ప్రజా ఉపయోగార్థం వినియోగిస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ప్రైవేట్ భవనాల్లో ప్రభుత్వ వసతి గృహాలను ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉంటుందన్న అంశం సైతం సర్కారు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఆక్రమణలపై కొరడా
Published Tue, Nov 25 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM
Advertisement
Advertisement