ప్రాణాలైన తీసుకుంటాం.. భూములు ఇవ్వం
తంగెడంచ(జూపాడుబంగ్లా): ప్రాణాలైన తీసుకుంటాం..జీవ నాధారమైన భూములను మాత్రం ఇవ్వమని తంగెడంచ రైతులు తేల్చిచెబుతున్నారు.రెండోవిడత భూసేకరణలో భాగంగా తంగెడంచ రెవెన్యూ పరిధిలోని 1595.63 ఎకరాల భూములను సేకరించేందుకు మంగళవారం 35 మంది సర్వేయర్లు గ్రామానికి వచ్చారు. ఏడు బృందాలుగా విడిపోయి రైతుల పొలాల్లో కొలతలు వేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న రైతులు వెంటనే అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. మాకు చెప్పాపెట్టకుండా మా భూముల్లో ఎలా కొలతలు వేస్తారని సర్వే అధికారులను నిలదీశారు.
1980లో శ్రీశైలం జలాశయానికి భూములిచ్చి నష్టపోయామని, మళ్లీ ఇప్పుడు పరిశ్రమలకు ఇచ్చి కుటుంబసభ్యులతో రోడ్డున పడలేమన్నారు. మొదటి విడతగా తంగెడంచ ఫారంలోని 864 ఎకరాల భూములను సేకరించి ఇప్పటిదాకా ఒక్క పరిశ్రమను స్థాపించలేదన్నారు. పరిశ్రమల పేర్లు చెప్పి రెండుకార్ల పండే భూములను బలవంతంగా లాక్కుంటే సహించమని హెచ్చరించారు. ఎన్నికల ముందు రైతులకు పెద్దపీఠ వేస్తానన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బలవంతంగా భూములు లాక్కొని పాడెకట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.
వెనుదిరిగిన అధికారులు
భూసర్వేకు వచ్చిన 30 మంది అధికారులకు రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఈ విషయాన్ని సర్వేయర్లు జిల్లా అధికారులకు తెలియజేయగా రైతులతో సమావేశం కాకుండా ముందే వారి పొలాల్లోకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించడంతో కిమ్మనకుండా కొలతలను వేయటం విరమించుకుని వెనుదిరిగి పోయారు.
ఉన్నభూమి పోతే ఎలా బతకాలి
నాకు 11.25 ఎకరాల పట్టాపొలం ఉంది. రెండోవిడత భూసేకరణలో మొత్తం భూమిని ప్రభుత్వం తీసుకుంటుందని తెలిసింది. ఉన్నదంతా ప్రభుత్వం తీసుకుంటే వ్యవసాయం ఆధారపడి జీవించే మా కుటుంబం ఏమి తినాలో, ఎలా బతకాలో చెప్పాలి.
- గోకారమయ్య, రైతు తంగెడంచ
ఆత్మహత్యలే శరణ్యం
నాకు 20 ఎకరాల పొలం ఉంది. భూసేకరణలో మొత్తం భూమిని ప్రభుత్వం తీసుకుంటుందంట. కుటుంబానికి వ్యవసాయయే ఆధారం. ఈ ఆధారం పోతే మేమంతా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది.
- చిన్నరంగస్వామి, రైతు తంగెడంచ
చెప్పాపెట్టకుండా సర్వే చేస్తున్నారు.
నాకు 12 ఎకరాల పట్టాభూమి ఉంది. ఒకరి వద్దకు వెళ్లకుండా ఏటా పంటలు పండించుకుంటూ బతుకుతున్నాం. మంగళవారం చెప్పాపెట్టకుండా అధికారులు వచ్చి భూములు కొలతలు వేస్తున్నారు. మమ్మల్ని ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో అర్థం కావడం లేదు.
- శ్రీనివాసరెడ్డి, రైతు తంగెడంచ