సాక్షి, అమరావతి బ్యూరో/అమరావతి: వచ్చే మే నాటికి గోదావరి జలాలను నాగార్జునసాగర్ కుడి కాలువలో కలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గుంటూరు జిల్లా నకరికల్లు మండలంలో రూ.6,020.15 కోట్లతో తలపెట్టిన గోదావరి– పెన్నా నదుల అనుసంధానం మొదటి దశ పనులకు, రూ.736 కోట్లతో నిర్మించతలపెట్టిన కొండమోడు – పేరేచర్ల రహదారి పనులకు, రెండు బీసీ వసతి గృహాలకు సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదు పెద్ద నదులను అనుసంధానం చేసి పవిత్ర సంగమానికి శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు. గోదావరి– పెన్నా నదుల అనుసంధానం మొదటి దశలో భాగంగా ఐదు చోట్ల లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీని ద్వారా గుంటూరు జిల్లాలోని 39 మండలాల్లో 5,12,150 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 40 మండలాల్లో 4,49,081 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నట్లు వెల్లడించారు. పనుల కోసం ఏడు మండలాల్లో 3,541 ఎకరాల భూమిని సేకరించాల్సి వస్తుందన్నారు. భూసేకరణకు రైతులు భూములివ్వాలని కోరారు. పంటలకు తెగులు రాకుండా ఉండేందుకు టెక్నాలజీని పూర్తిగా ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ గెలిస్తేనే న్యాయం
రాజకీయ నేతలు, అధికారులు చేసే తప్పులతో ప్రభుత్వంపై అసంతృప్తి పెంచుకోవద్దని సీఎం చంద్రబాబు ప్రజలను కోరారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు తనకు అండగా ఉండాలన్నారు. విభజన చట్టంలో హామీలు, నమ్మక ద్రోహంపై కేంద్రాన్ని నిలదీసినందుకు ఐటీ, ఈడీలతో సుజనా చౌదరితోపాటు ఇతర టీడీపీ నేతలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ కూటమి గెలిచినప్పుడే న్యాయం జరుగుతుందన్నారు. కాగా, సీఎం ప్రసంగం ప్రారంభం కాగానే సభకు వచ్చిన మహిళలు వెళ్లిపోవడం కనిపించింది. కుర్చీలు ఖాళీగా కనిపించాయి. స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, శిద్ధా రాఘవరావు, దేవినేని ఉమా, నక్కా ఆనందబాబు, నీటిపారుదల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, జిల్లా కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, ఎన్‌ఎస్పీ ఎస్‌ఈ పురుషోత్తం గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
సీఎంను కలిసిన అసోం విద్యార్థి నేతలు
ప్రభుత్వ శాఖలు మరింత మెరుగైన పనితీరును కనబర్చేందుకు కొత్తగా వయాడక్ట్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్‌టీజీ) ఏర్పాటై ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా సచివాలయంలో సోమవారం ప్రభుత్వ శాఖాధిపతులు, అధికారులతో సీఎం సమీక్షించారు. కాగా, 10 వేల జనాభాకు పైన ఉన్న మండల కేంద్రాల్లో, పంచాయతీల్లో జీ+ప్లస్ త్రీ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నామని మంత్రి కాల్వ పేర్కొన్నారు. కాగా, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పౌరసత్వ (సవరణ) చట్టం– 2016ను వ్యతిరేకిస్తూ తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని అఖిల అసోం విద్యార్థుల సంఘం సీఎం చంద్రబాబును కోరింది.
మే నాటికి గోదావరి జలాలను సాగర్‌లో కలుపుతాం
Published Tue, Nov 27 2018 5:17 AM | Last Updated on Tue, Nov 27 2018 5:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment