రాజధాని భూసేకరణకు వారంలో నోటిఫికేషన్
తొలిసారి ఆగస్టులో యత్నించిన ప్రభుత్వం
తీవ్రంగా ప్రతిఘటించిన రైతులు
విజయవాడలో ధర్నా నిర్వహించిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
అప్పట్లో వెనక్కి తగ్గిన రాష్ట్ర సర్కారు
రాజధానికి శంకుస్థాపన నేపథ్యంలో మళ్లీ సీఎం ఆదేశాలు!
సాక్షి, విజయవాడ బ్యూరో/ సాక్షి ప్రతినిధి గుంటూరు: రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ కింద ఇవ్వని భూములను త్వరలో భూసేకరణ ద్వారా తీసుకుంటామని వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. బుధవారం సీఎం క్యాంప్ కార్యాలయంలోని మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. మొదటి దశలో తుళ్లూరు మండలంలో 30 కుటుంబాలకు చెందిన 300 ఎకరాలను సేకరిస్తామన్నారు. ఇందుకు వారంరోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని తెలిపారు. రాజధాని మాస్టర్‌ప్లాన్‌కు అనుగుణంగా ఇంకా 1,500 ఎకరాలను సేకరించాల్సి ఉందని తొలి విడతలో 300 ఎకరాలు సేకరించగా మిగిలిన భూములను మలి విడతలో సేకరిస్తామని చెప్పారు. ఇప్పటివరకు 33 వేల ఎకరాలకు పైగా భూమిని సమీకరణ కింద తీసుకున్నామన్నారు. సమీకరణ కింద రైతులు ఇప్పుడు ముందుకు వచ్చినా భూములు తీసుకుంటామన్నారు.
భూ సమీకరణ విధానం కింద ప్రభుత్వం తుళ్లూరు మండలంలో 26,746 ఎకరాలను రైతుల నుంచి తీసుకుంది. ఇక్కడే మరో 300 ఎకరాలు సమీకరించాల్సి ఉండ గా.. పాలకులు, అధికారులు ఎన్ని విధాలుగా మభ్యపెట్టినా, బెదిరింపులకు గురిచేసినా ఆ భూములిచ్చేందుకు రైతులు అంగీకరించలేదు. మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్, జిల్లాకు చెందిన ఇతర టీడీపీ నాయకులు భూములు ఇవ్వని రైతులతో భేటీ అయ్యారు. మంతనాలు జరిపారు. నానా రకాలుగా ప్రలోభపెట్టినా 300 ఎకరాలను సమీకరించలేక పోయారు. రైతులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నప్పటికీ భూములను తీసుకోవాలని భావిస్తున్న ప్రభుత్వం భూసేకరణ అస్త్రం ప్రయోగించాలని నిర్ణయించింది.
మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని రైతులు భూములు ఇచ్చేందుకు తొలినుంచీ నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రెండు నెలల క్రితం భూసేకరణ చట్టం ప్రయోగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆగస్టు 21న ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదట తుళ్లూరు మండలంలోని తుళ్లూరు-2, బోరుపాలెం, అబ్బురాజుపాలెం, పిచుకలపాలెం, అనంతవరం గ్రామాల పరిధిలో 11.14 ఎకరాలు సేకరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భూ సేకరణకు వ్యతిరేకంగా ఆగస్టు 26న విజయవాడలోని సీఆర్‌డీఏ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భూసేకరణ యత్నాలను తాత్కాలికంగా విరమించుకుంది.
సేకరించాల్సిందేనన్న చంద్రబాబు
అమరావతికి శంకుస్థాపన జరిగిన తర్వాత తుళ్లూరుతో పాటు తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని భూములపై చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. మంగళగిరి, తాడేపల్లి మండలాల రైతులు సమీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించడంతో.. వారి భూములు తీసుకునే అవకాశం లేదని అధికారులు తేల్పిచెప్పారు. మల్కాపురంలోని చెరుకుతోట దహనంతో ఉద్రిక్తత నెలకొందనీ, రైతులు తిరగబడే అవకాశం ఉందని వివరించారు. అయినా ఆ భూములు తీసుకోవాల్సిందేనన్న చంద్రబాబు భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయాల్సిందిగా ఆదేశించినట్టు సమాచారం.