ఖమ్మం అర్బన్: నగరంలోని విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమణదారుల నుంచి కాపాడేందుకు హైదరాబాద్ తరహాలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ (భూఆక్రమణ చట్టం) కఠినంగా అమలుచేయాలని అధికారులను జాయింట్ కలెక్టర్ (జేసీ) సురేంద్రమోహన్ ఆదేశించారు. ప్రభుత్వ భూమి ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. ఆయన సోమవారం ఖమ్మం అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో ‘గ్రీవెన్స్ డే’ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం, వివిధ శాఖల పనితీరుపై మూడు గంటలపాటు సమీక్ష సమావేశం నిర్వహించారు.
కొన్ని శాఖల పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఖమ్మం నగరంలో ఎంతో విలువైన ప్రభుత్వ భూములు ఉన్నాయని, అవి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను ఆక్రమించినవారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు.
నగరంలోని ప్రభుత్వ భూమిని ఎక్కడైనా ఆక్రమించినట్టయితే.. భూఆక్రమణ చట్టం ఆధారంగా ఆయా శాఖల అధికారులే కోర్టును ఆశ్రయిస్తే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. ఇందుకోసం అవసరమైతే ఈ చట్టంపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు. నగరంలోని ప్రభుత్వ పాఠశాలల స్థలాల వివరాలను వారం రోజుల్లో కార్పొరేషన్, రెవెన్యూ రికార్డుల్లో చేర్చాలని ఆదేశించారు.
చర్యలు తీసుకోకపోతే బాధ్యులవుతారు..
‘‘ప్రభుత్వ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టినా, అందుకు అనుమతి ఇచ్చినా, అప్పటికే అక్కడ చేపట్టిన నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోయినా మీరే బాధ్యులవుతారు’’ అని, కార్పొరేషన్ అధికారులను హెచ్చరించారు. ‘‘మీరు లెక్కలు తెల్చండి. లేకపోతే వేరే వారితో లెక్కలు తీసి దానికి మిమ్మల్ని బాధ్యులుగా చేయాల్సుంటుంది. ఇప్పటికే విజిలెన్స్ నివేదిక మా వద్ద ఉంది’’ అన్నారు. నగరంలో ప్రభుత్వ భూముల వివరాలతో వారం రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
పౌర సరఫరాల, విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి ఆగస్టులో బియ్యం సరఫరాలో జాప్యంపై జాయింట్ కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పౌర సరఫరాల, విద్యాశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బడి బియ్యం సరఫరా నగరంలోనే ఇలా ఉంటే గ్రామాల్లో ఇంకెలా మెరుగ్గా ఉంటుంది..?
బియ్యం నిల్వ ఉండి కూడా ఇతరుల వద్ద అప్పుగా తీసుకుని వండాల్సిన ఖర్మేమిటి..?’’ అని, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి (డీఎస్‌ఓ) గౌరీ శంకర్‌ను ప్రశ్నించారు. దీనిని మూడు నెలల్లో గాడిలో పెట్టాలని డీఈఓ, డీఎస్‌ఓను ఆదేశించారు. సమావేశంలో డీఎస్‌ఓ గౌరీశంకర్, డిపో మేనేజర్ సాంబశివరావు, తహశీల్దార్ వెంకారెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.