రణస్థలం: కొవ్వాడ అణువిద్యుత్ పార్క్ నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా కోటపాలెంలో భూసర్వేకు వచ్చిన అధికారులను గ్రామస్తులు, సీఐటీయూ నాయకులు అడ్డుకున్నారు. ఇక్కడ అణుపార్కు నిర్మించవద్దని, భూములు సర్వే చేయవద్దని తేల్చిచెప్పారు. అణువిద్యుత్ పార్క్ నిర్మాణం కోసం కోటపాలెం గ్రామంలో సోమవారం నుంచి అధికారులు భూసర్వేలు చేయనున్నారని తెలుసుకున్న సీఐటీయూ జిల్లా ప్రధానకార్యదర్శి, నాయకులు ఎన్‌వీ రమణ, శ్యాంసుందరతో పాటు మరికొంతమంది సీఐటీయూ నాయకులు ఉదయాన్నే కోటపాలెం గ్రామస్తులతో సదస్సు నిర్వహించారు.
అధికారులు మాయమాటలు చెప్పి భూసర్వేలు చేపడుతున్నారని, సర్వేలు అనంతరం నోటీసులు జారీచేసి బలవంతంగా భూములు లాక్కోవటమే కాకుండా గ్రామాలను ఖాళీచేయిస్తారని చెప్పారు. ఈ సమయంలో కొవ్వాడ భూసేకరణాధికారి, డెప్యూటీ కలెక్టర్ జె.సీతారామారావు, తహసీల్దార్ ఎం.సురేష్ కోటపాలెం గ్రామంలోకి విచ్చేశారు. వారి వాహనాలకు అడ్డంగా సీఐటీయూ నాయకులు, గ్రామస్తులు నిల్చొని నినాదాలు చేశారు. భూసర్వేలు నిలిపివేయాలని, అణువిద్యుత్ పరిశ్రమ మాకు వద్దని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా డెప్యూటీ కలెక్టర్ జె.సీతారామారావు వాహనం దిగి గ్రామస్తులతో మాట్లాడారు. కొవ్వాడ అణుపార్క్ వల్ల ప్రజలకు ఎటువంటి నష్టం కలగదని అందరికీ న్యాయం చేస్తామని తెలిపారు. ప్రమాదకరమైతే ప్రభుత్వం అనుమతులు జారీచేయదన్నారు. భూసర్వేలకు సహకరించాలని కోరారు. అయితే గ్రామస్తులు మాత్రం తమకు అణువిద్యుత్ పార్క్‌వద్దు, సర్వేలు వద్దని తేల్చిచెప్పేశారు. సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ అణుపార్క్‌ను నిర్మిస్తే ఈ ప్రాంతం సర్వనాశనం అవుతుందని ఇటువంటి ప్రమాదక పరిశ్రమలకు భూసర్వేలు చేపడితే చూస్తూ ఊరుకునేదిలేదని అన్నారు.
అధికారులు ఎంత నచ్చచెప్పినా స్థానికులు, సీఐటీయూ నాయకులు ఒప్పుకోకపోవటంతో అధికారులు అక్కడ నుంచి వెనుదిరిగారు. ఇక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా రణస్థలం ఎస్సై వి.సత్యనారాయణ, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. శ్రీకాకుళం ఆర్డీవో దయానిధి మాట్లాడుతూ కోటపాలెంలో రెండురోజుల్లో గ్రామసభను నిర్వహించి అనంతరం సర్వేలను ప్రారంభిస్తామని చెప్పారు.
భూసర్వే చేపడితే ఊరుకోం
Published Tue, May 24 2016 1:31 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM
Advertisement