హద్దులు దాటిన గ‘లీజు’
అక్రమార్కులు ‘హద్దు’ మీరారు. లీజు తీసుకున్న ప్రాంతాన్ని దాటి నాపరాతి తవ్వకాలు చేపడుతున్నారు. కోట్ల రూపాయల విలువైన సహజ సంపదను కొల్లగొడుతున్నారు. సర్కారు ఖజానాకు గండికొడుతున్నారు. ఇవేం గ‘లీజు’ పనులని ప్రశ్నిస్తే.. జిల్లాకు చెందిన మంత్రి పేరు చెప్పి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంకేం లీజుదారులు యథేచ్ఛగా తమ పని కానిచేస్తున్నారు. తాండూరు మండలంలోని నాపరాతి గనులున్న ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాల పరంపరకు అడ్డుకట్ట వేసేవారే లేకుండాపోయారు.
- ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు
- నిక్షేపంగా తరలుతున్న నాపరాతి నిక్షేపాలు
- కొల్లగొడుతున్న రూ.కోట్ల సహజ సంపద
- అనుమతులు ఒకచోట.. తవ్వకాలు మరోచోట
- అమాత్యుడి పేరు చెప్పి అక్రమార్కుల ఆగడాలు
తాండూరు రూరల్: మండలంలోని ఓగిపూర్, కరన్‌కోట్, మల్కాపూర్, కోట్‌బాసుపల్లి తదితర గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో వందలాది ఎకరాల్లో నాపరాతి నిక్షేపాలున్నాయి. సర్కారు ఇందులో కొన్నింటిని ప్రైవేట్ వ్యక్తులు నాపరాతిని తవ్వుకునేందుకు అనుమతులు ఇచ్చింది. కాగా.. అనుమతుల గడువు దాటిన తర్వాత కూడా సమీపంలోని ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు జరుపుతున్నారు. అనుమతులు పొందింది ఒకచోట అయితే నాపరాతిని వెలికితీస్తోంది మరోచోట. తనిఖీలు చేయాల్సిన రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఓగిపూర్‌లో..
ఓగిపూర్‌లో సర్వేనంబర్ 129లో 85 ఎకరాల 15 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొన్నేళ్ల క్రితం 55 ఎకరాలు ప్రభుత్వం వివిధ సంఘాలకు మైనింగ్ కోసం అనుమతి ఇచ్చింది. మిగతా 30 ఎకరాలు ఉండాలి. ప్రస్తుతం ఎకరా భూమి కూడా లేకుండాపోయింది. ఇందులో అక్రమార్కులు తిష్టవేశారు. కరన్‌కోట్‌లోని సర్వేనంబర్ 18లో 29 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వం గతంలో వివిధ సంఘాలకు అనుమతులు ఇచ్చింది. మిగతా భూములను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. కాగా.. లీజు పూర్తి కావడంతో పీఓటీ కింద స్వాధీనం చేసుకున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. పేదవారికి ప్రభుత్వం లీజుకు ఇస్తే.. బడా వ్యాపారులు వారి వద్ద నుంచి తీసుకొని తవ్వకాలు కొనసాగిస్తున్నారు.
మల్కాపూర్‌లో..
మల్కాపూర్ శివారులోని సర్వే నంబర్ 15లో 338 ఎకరాలను గని కార్మిక కాంట్రాక్టు సొసైటీలోని కార్మికులకు 20 ఏళ్ల క్రితం లీజు అనుమతులు ఇచ్చింది. రెండేళ్ల క్రితం గడువు పూర్తయింది. మిగతా 10-15 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. ప్రస్తుతం ఆ భూమిలో అక్రమార్కులు నాపరాతి గనులు తవ్వుతున్నారు. ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపితిస్తున్నాయి. కోట్‌బాసుపల్లిలోని ప్రభుత్వ భూమి 116లో కూడా నాపరాతి తవ్వకాలు జరుగుతున్నాయి. రాయల్టీలు చెల్లించకుండానే నాపరాతి లోడ్ లారీలు చెక్‌పోస్టు దాటుతున్నా మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. అది రెవెన్యూ అధికారుల బాధ్యత అని తప్పించుకుంటున్నారు.
నివేదికతోనే సరి పెట్టారు..
ఆరు నెలల క్రితం రెవెన్యూ అధికారులు సబ్‌కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ నాపరాతి భూముల్లో సర్వే చేశారు. ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంది.. ఎవరికి లీజు ఉంది అనే కోణంలో వారంరోజులపాటు గనుల్లో తిరిగారు. ప్రభుత్వ నాపరాతి భూముల్లో తవ్వకాలు జరుపుతున్నారని సబ్ కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. ఇప్పటి వరకు అక్రమార్కులపై ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా నాపరాతి తవ్వకాలు జరిపేందుకు కావాల్సిన విద్యుత్ కనెక్షన్లను సైతం అక్రమంగా తీసుకున్నా.. ఆ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.