Private individuals
-
ప్రభుత్వ ప్రైవేట్ వ్యాపారం!
- తొలి దశలో రూ.400 కోట్లతో పది లక్షల ఇళ్లకు సెట్‌టాప్ బాక్సుల పంపిణీ - సీఎం చంద్రబాబు నిర్ణయం సాక్షి, విజయవాడ: ప్రైవేట్ వ్యక్తులు చేసుకోవాల్సిన వ్యాపారంలోకి రాష్ట్ర ప్రభుత్వం అడుగు పెడుతోంది. సెట్‌టాప్ బాక్సులను కొనుగోలు చేసి, రాష్ట్రంలో కోటి ఇళ్లకు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. తొలి దశలో అత్యవసరంగా పది లక్షల ఇళ్లకు సెట్‌టాప్ బాక్సులను పంపిణీ చేయాలని యోచిస్తున్నారు. సాధారణంగా సెట్‌టాప్ బాక్సుల కావాల్సిన వారు మార్కెట్లో కొనుక్కుంటారు. లేదంటే కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్ఓలు వాటిని అందజేస్తారు. అయితే. రాష్ట్ర ప్రభుత్వమే వీటిని కొనుగోలు చేయాలని నిర్ణయించడం పట్ల అధికార యంత్రాంగం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. తొలి దశలో పది లక్షల ఇళ్లకు అవసరమైన సెట్‌టాప్ బాక్సుల కొనుగోలుకు రూ.400 కోట్ల వ్యయం అవుతుందని మౌలిక సదుపాయాల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించింది. ఇందులో రూ.300 కోట్లను ఆంధ్రా బ్యాంకు నుంచి 9.75 శాతం వడ్డీపై రుణం తీసుకుంటామని, మిగతా రూ.100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అందులో పేర్కొంది. బ్యాంకు నుంచి తీసుకునే రుణానికి గ్యారెంటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. -
మంత్రి పేషీకి ప్రైవేటు ఏసీలు...
చల్లగా ఉండాలిగానీ ఏసీలు ఎవరివైతేనేమి? ఇదీ ఓ మంత్రి ఓఎస్డీ ఉవాచ. ప్రభుత్వానికి బిల్లులు పెట్టేవరకూ ఏసీలు పెట్టుకోకుండా ఉండాలా? అంటూ మంత్రి ఓఎస్డీ ఒకరు ఓ ప్రైవేటు కాంట్రాక్టరుతో మాట్లాడి 24 గంటల్లోనే సుమారు రూ.3లక్షలు పైనే ఖర్చు చేసి పేషీలో ఏసీలు బిగించారు. మంత్రి చల్లటి గాలి చూశారుగానీ, ఎక్కడ్నుంచి వచ్చాయని అడగలేదు. ఇప్పుడా విషయం మిగతా మంత్రుల పేషీల్లో ఈదురుగాలిలా వ్యాపించింది. ఇలా సచివాలయంలో ప్రైవేటు వ్యక్తులు స్పాన్సర్ చేసిన ఏసీలుగానీ, టేబుళ్లుగానీ ఏర్పాటు చేసుకునే వీలుందా? అని కొందరు, ఆ మంత్రిగారి పనే బావుందంటూ మరికొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటికే ఆక్సిజన్ సరఫరా కాంట్రాక్టర్ల విషయంలో ఓఎస్డీ బినామీలే ఉన్నారంటూ వచ్చిన వార్తలు దులుపుకోలేక మంత్రి ఆపసోపాలూ పడుతుంటే ఏసీల వార్త చికాకు కలిగిస్తున్నట్టు తెలుస్తోంది. చివరకు ఇలాంటి వార్తలు పేషీనుంచే లీకవుతున్నాయంటూ ఓఎస్డీ... పేషీలోని ఉద్యోగులను ఒక్కొక్కరినే పిలిపించుకుని స్పెషల్‌క్లాసులు పీకి, మీరే చెబుతున్నారు, మీరే లీక్ చేస్తున్నారని హెచ్చరించారట కూడా. -
హద్దులు దాటిన గ‘లీజు’
అక్రమార్కులు ‘హద్దు’ మీరారు. లీజు తీసుకున్న ప్రాంతాన్ని దాటి నాపరాతి తవ్వకాలు చేపడుతున్నారు. కోట్ల రూపాయల విలువైన సహజ సంపదను కొల్లగొడుతున్నారు. సర్కారు ఖజానాకు గండికొడుతున్నారు. ఇవేం గ‘లీజు’ పనులని ప్రశ్నిస్తే.. జిల్లాకు చెందిన మంత్రి పేరు చెప్పి మరీ బెదిరింపులకు పాల్పడుతున్నారు. అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇంకేం లీజుదారులు యథేచ్ఛగా తమ పని కానిచేస్తున్నారు. తాండూరు మండలంలోని నాపరాతి గనులున్న ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాల పరంపరకు అడ్డుకట్ట వేసేవారే లేకుండాపోయారు. - ప్రభుత్వ భూముల్లో అక్రమ తవ్వకాలు - నిక్షేపంగా తరలుతున్న నాపరాతి నిక్షేపాలు - కొల్లగొడుతున్న రూ.కోట్ల సహజ సంపద - అనుమతులు ఒకచోట.. తవ్వకాలు మరోచోట - అమాత్యుడి పేరు చెప్పి అక్రమార్కుల ఆగడాలు తాండూరు రూరల్: మండలంలోని ఓగిపూర్, కరన్‌కోట్, మల్కాపూర్, కోట్బాసుపల్లి తదితర గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో వందలాది ఎకరాల్లో నాపరాతి నిక్షేపాలున్నాయి. సర్కారు ఇందులో కొన్నింటిని ప్రైవేట్ వ్యక్తులు నాపరాతిని తవ్వుకునేందుకు అనుమతులు ఇచ్చింది. కాగా.. అనుమతుల గడువు దాటిన తర్వాత కూడా సమీపంలోని ప్రభుత్వ భూముల్లో తవ్వకాలు జరుపుతున్నారు. అనుమతులు పొందింది ఒకచోట అయితే నాపరాతిని వెలికితీస్తోంది మరోచోట. తనిఖీలు చేయాల్సిన రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఓగిపూర్‌లో.. ఓగిపూర్‌లో సర్వేనంబర్ 129లో 85 ఎకరాల 15 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొన్నేళ్ల క్రితం 55 ఎకరాలు ప్రభుత్వం వివిధ సంఘాలకు మైనింగ్ కోసం అనుమతి ఇచ్చింది. మిగతా 30 ఎకరాలు ఉండాలి. ప్రస్తుతం ఎకరా భూమి కూడా లేకుండాపోయింది. ఇందులో అక్రమార్కులు తిష్టవేశారు. కరన్‌కోట్‌లోని సర్వేనంబర్ 18లో 29 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ప్రభుత్వం గతంలో వివిధ సంఘాలకు అనుమతులు ఇచ్చింది. మిగతా భూములను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. కాగా.. లీజు పూర్తి కావడంతో పీఓటీ కింద స్వాధీనం చేసుకున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. పేదవారికి ప్రభుత్వం లీజుకు ఇస్తే.. బడా వ్యాపారులు వారి వద్ద నుంచి తీసుకొని తవ్వకాలు కొనసాగిస్తున్నారు. మల్కాపూర్‌లో.. మల్కాపూర్ శివారులోని సర్వే నంబర్ 15లో 338 ఎకరాలను గని కార్మిక కాంట్రాక్టు సొసైటీలోని కార్మికులకు 20 ఏళ్ల క్రితం లీజు అనుమతులు ఇచ్చింది. రెండేళ్ల క్రితం గడువు పూర్తయింది. మిగతా 10-15 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉంది. ప్రస్తుతం ఆ భూమిలో అక్రమార్కులు నాపరాతి గనులు తవ్వుతున్నారు. ప్రభుత్వ భూమిని ప్లాట్లుగా చేసి అమ్ముకుంటున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపితిస్తున్నాయి. కోట్బాసుపల్లిలోని ప్రభుత్వ భూమి 116లో కూడా నాపరాతి తవ్వకాలు జరుగుతున్నాయి. రాయల్టీలు చెల్లించకుండానే నాపరాతి లోడ్ లారీలు చెక్‌పోస్టు దాటుతున్నా మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు. అది రెవెన్యూ అధికారుల బాధ్యత అని తప్పించుకుంటున్నారు. నివేదికతోనే సరి పెట్టారు.. ఆరు నెలల క్రితం రెవెన్యూ అధికారులు సబ్‌కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ నాపరాతి భూముల్లో సర్వే చేశారు. ప్రభుత్వ భూమి ఎక్కడ ఉంది.. ఎవరికి లీజు ఉంది అనే కోణంలో వారంరోజులపాటు గనుల్లో తిరిగారు. ప్రభుత్వ నాపరాతి భూముల్లో తవ్వకాలు జరుపుతున్నారని సబ్ కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. ఇప్పటి వరకు అక్రమార్కులపై ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. అంతేకాకుండా నాపరాతి తవ్వకాలు జరిపేందుకు కావాల్సిన విద్యుత్ కనెక్షన్లను సైతం అక్రమంగా తీసుకున్నా.. ఆ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. -
రాజ్యాంగ విరుద్ధంగా జీవోల జారీ
- రౌండ్‌టేబుల్ సమావేశంలో - పలువురు వక్తల ధ్వజం గాంధీనగర్ : రాజధాని ప్రాంత గ్రామాల్లో రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందని, రాజ్యాంగ విరుద్ధంగా జీవోలు జారీ చేస్తోందని పలువురు వక్తలు ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఉభయ కమ్యూనిస్టు పార్టీల ఆధ్వర్యంలో రాజధాని భూములు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం, బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా గురువారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. పలువురు వక్తలు మాట్లాడుతూ అవసరం లేకపోయినప్పటికీ రైతులనుంచి వేల ఎకరాల భూమిని బలవంతంగా లాగేసుకుంటున్నారన్నారు. రాజ్యాంగ విరుద్దంగా జీవోలు జారీ చేసి రైతులను మోసగిస్తోందన్నారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 1.39లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని భర్తీచేయకుండా నిరంతరం రాజధాని చుట్టూ పాలకులు చక్కర్లు కొడుతున్నారన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు మాట్లాడుతూ 109, 110 ,166.జీవోలతో ప్రభుత్వ మోసం బయటపడిందని చెప్పారు, సీపీడీఎంసీ పేరుతో కంపెనీ పాలనకు తెరతీశారన్నారు. కంపెనీ పేరును తర్వాత కార్పొరేషన్‌గా ప్రభుత్వం మార్పు చేసిందన్నారు. రైతులు తమకు అంగీకారం ఉంటేనే భూముఇలివ్వండని నమ్మబలుకుతూ మరో వైపు బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు. కార్పొరేషన్ పాలన అమల్లోకి వస్తే ప్రతి పనికి పన్ను వసూలు చేస్తారన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ రాజధాని పేరుతో భూములు సమీకరించి కంపెనీలకు ధారదత్తం చేస్తున్నారన్నారు. తులసీదాసు మాట్లాడుతూ క్రెడా చట్టం ప్రకారం భూములు సేకరించి కార్పొరేషన్‌కు అప్పగిస్తోందని విమర్శించారు. భూములు కోల్పోతున్న రైతుల పక్షాన పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ(ఎంల్) న్యూడెమోక్రసీ నాయకుల పోలారి, సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శి జేవీ రాఘవులు, రాజధాని ప్రాంత కన్వీనర్ రాధాకృష్ణ, సీపీఐ నాయకులు, వై. కేశవరావు, కోటేశ్వరరావు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణను అడ్డుకోవాలన్నారు. ప్రభుత్వం తీసుకున్న భూములను 99 ఏళ్లపాటు లీజుకు ఇస్తే రైతులు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొటుందన్నారు. ప్రభుత్వా నిర్ణయాలకు వ్యతిరేకంగా సమైక్య పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఎం. విజయ్‌కుమార్, గంగాధరరావు, శ్రీనివాస్, జి. వీరాంజనేయులు, యలమందరావు పాల్గొన్నారు. -
భూమాయపై సీరియస్
ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వ భూములు రెవెన్యూ సిబ్బంది పాత్రే కీలకం అక్రమాలపై కలెక్టర ఆగ్రహం ఇప్పటికే ముగ్గురిపై వేటు మరో ఇద్దరిపై చర్యలకు రంగం సిద్ధం విశాఖ రూరల్ : కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో చిక్కుకుపోయాయి. రెవెన్యూ సిబ్బంది మాయాజాలంతో రికార్డులు తారుమారవుతున్నాయి. ఇటీవల అధికారులు ప్రభుత్వ భూములను సర్వే చేయడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కో వ్యవహారం బయటకు వస్తోంది. ఈ అక్రమాలపై కలెక్టర్ సీరియస్‌గా ఉన్నారు. బాధ్యతలపై క్రిమినల్ కేసులు నమోదుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ భూములను ప్రయివేట్ వ్యక్తులకు కట్టబెట్టడం.. ఉన్నతాధికారుల ఆదేశాలతో వాటిని వెనక్కి తీసుకుంటున్నట్టు బోర్డులు పెట్టడం.. ఆ వ్యక్తులతో కోర్టుల్లో కేసులు వేయించడం.. ఇలా రెవెన్యూ సిబ్బంది కీలక పాత్రే పోషించినట్టు తెలిసింది. రికార్డులను ట్యాంపర్ చేయడం, న్యాయస్థానాలకు సక్రమమైన సమాచారం ఇవ్వకపోవడం, చివరకు కేసును నీరుగార్చేలా చేసి బడాబాబులకు సహకరించి లక్షల రూపాయలు వెనకేసుకున్న విషయాలు వెలుగుచూడడంతో రెవెన్యూలో కలకలం మొదలయింది. నడుపూరు, కొమ్మాది, పరదేశిపాలెం ప్రాంతాల్లో భూ అక్రమాలపై కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్, జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్‌లు సీరియస్‌గా ఉన్నారు. దీనిపై ఇప్పటికే ముగ్గురు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. ఈ వ్యవహారంలో కొంత మంది అధికారుల పాత్ర కూడా ఉన్నట్టు అనుమానాలు వ్యక్తమవుతుండడంతో ఆ దిశగా విచారణ చేపడుతున్నారు. ఇందులో భాగంగా పరదేశిపాలెం, కొమ్మాదిలో భూములను జాయింట్ కలెక్టర్ పరిశీలించారు. 152 సర్వే నంబర్ భూములకు సంబంధించి హైకోర్టులో కేసు ఉన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ భూములను అధికారులు వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించినా న్యాయస్థానంలో కేసు ఉండడంతో దానికి సంబంధించి పూర్వాపరాలు పరిశీలించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. దీనిపై సంబంధిత తహశీల్దార్ రెండు రోజుల్లో నోటీసులు జారీ చేయనున్నారు. రికార్డుల ట్యాంపరింగ్‌పై అనుమానాలు రికార్డుల ట్యాంపర్ చేసే విషయంలో సిబ్బంది సిద్ధహస్తులు. వందల సంఖ్యలో రికార్డులు ట్యాంపర్ చేసిన సందర్భాలు అనేకం బయటపడ్డాయి. ప్రసుత్తం ఈ భూముల వ్యవహారంలో కూడా రికార్డులు ట్యాంపర్ అయి ఉంటాయని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ రద్దు చేసిన కేటాయింపులను రెండు నెలల్లో కొత్త వారికి కట్టబెట్టడం వెనుక ఉన్నతాధికారుల హస్తం కూడా ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ హస్తం! జిల్లాలో ప్రస్తుతం 1500 ఎకరాలు అన్యాక్రాంతమైనట్టు అధికారులు గుర్తించారు. ఇందులో వెయ్యి ఎకరాల భూములకు సంబంధించిన వివాదాలు న్యాయస్థానాల్లో నలుగుతున్నట్టు గుర్తించారు. స్టీల్‌ప్లాంట్, మధురవాడ, కొమ్మాది, భీమిలి ప్రాంతాల్లో కొన్ని భూ వివాదాలకు సంబంధించి కోర్టులకు సక్రమమైన సమాచారం అందించడం లేదన్న విషయాన్ని గమనించారు. వీటిలో కొన్ని భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోయాయి. వాటన్నింటిపై నెల రోజుల్లో విచారణ జరిపించాలని కలెక్టర్ నిర్ణయించారు. ఈ భూ సర్వేలను కూడా నెల రోజుల్లో పూర్తి చేసి సమగ్ర నివేదికను తయారు చేయాలని భావిస్తున్నారు. అనంతరం కోర్టు కేసుల్లో ఉన్న భూములకు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలించి వాటిపై న్యాయ సలహాలు తీసుకొని కోర్టులో కేసులు వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. ఈ అక్రమాలతో సంబంధమున్న రెవెన్యూ, సబ్రిజిస్ట్రార్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. -
ఆశల పల్లకిలో కమలనాథులు
సాక్షి, సిటీబ్యూరో: సార్వత్రిక సమరంలో అలుపెరగని పోరాటం చేసిన కమలనాథులు ఇప్పుడు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. ఈసారి గ్రేటర్ హైదరాబాద్‌లో 3 నుంచి 4 స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమన్న ధీమా ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. జాతీయ స్థాయి పార్టీ అయిన బీజేపీ ఇక్కడ పరిమితమైన బలమున్న దృష్ట్యా టీడీపీతో పొత్తు పెట్టుకొని గ్రేటర్లో 9 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. అయితే... పోలింగ్ అనంతరం ఆ పార్టీ జరిపిన అంతర్గత సర్వేలో 3 స్థానాల్లో మాత్రమే తమ పార్టీకి విజయావకాశాలున్నట్లు తేలింది. ప్రధానంగా ముషీరాబాద్, అంబర్‌పేట, గోషామహల్ స్థానాలు బీజేపీ ఖాతాలో పడతాయని ఆ పార్టీ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. అలాగే... మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్న మలక్‌పేట నియోజకవర్గంలో కూడా పరిస్థితి ఈ సారి బీజేపీకి అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ కొత్త ఓటర్లను ఆకట్టుకోగలిగామని, తద్వారా తమకు ఓట్ల సంఖ్య కూడా పెరిగినట్లు భావిస్తున్నారు. గట్టి పోటీ ఉన్న ఈ స్థానంలో స్వల్ప మెజార్టీతో బీజేపీ విజయం సాధిస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. భారీ మెజార్టీ అసాధ్యమే... నగరంలో ఓటింగ్ సరళిని బట్టి చూస్తే ఏ పార్టీకి కూడా భారీ మెజార్టీ వచ్చే పరిస్థితి కన్పించడంలేదు. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య తీవ్ర పోటీవల్ల ఓట్లు చీలిపోయాయి. దీంతో ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీయే వస్తుందని తెలుస్తోంది. అంబర్‌పేట నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోటీ ఉంటుందని అందరూ ఊహిస్తున్నా... ఇక్కడ వైఎస్సార్సీపీ కూడా గట్టి పోటీ ఇచ్చినట్లు ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు. ఈ స్థానంలో బీజేపీకే అత్యధికంగా ఓట్లు పోలైనట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీలో విజయం మాత్రం బీజేపీ పక్షానే ఉంటుదన్నది ఆ పార్టీ నేతల ధీమా. అలాగే ముషీరాబాద్‌లో కూడా బీజేపీకి విశేషమైన ఆదరణ లభించిందని, డాక్టర్ లక్ష్మణ్‌కు ఉన్న వ్యక్తిగత ఇమేజ్‌తో పాటు మోడీ గాలి ఇక్కడ బాగా పనిచేసిందంటున్నారు. అయితే... ఇక్కడ కాంగ్రెస్ కంటే కూడా టీడీపీకి చెందిన ఓట్లను టీఆర్ఎస్ బాగా చీల్చినట్లు వినికిడి. వైఎస్సార్సీపీకి కూడా ఆశించిన స్థాయిలో ఓట్లు పోలైనట్లు చెబుతున్నారు. ఇదే నిజమైతే... ఈ స్థానంలో ఎవరు గెలిచినా 200-250ల ఓట్ల తేడానే ఉంటుంది. అలాగే గోషామహల్ నియోజకవర్గం తమదేనని బీజేపీ భావిస్తున్నా... ఇక్కడ ఆ పార్టీ రెబల్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ భారీగా ఓట్లు చీల్చినట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ, టీఆర్ఎస్లకు కూడా ఆశించిన స్థాయిలో ఓట్లు పోలై ఉంటే... మధ్యలో కాంగ్రెస్ లబ్ధి పొందే అవకాశం కన్పిస్తోంది. అయితే... బీజేపీ మాత్రం ఇక్కడున్న హిందుత్వ ఓట్లు గంపగుత్తగా బీజేపీకే పడ్డాయని ఆ స్థానం తమదేనని గట్టిగా చెబుతోంది. మైనార్టీలు అధికంగా ఉన్న మలక్‌పేటలో ఎంఐఎంకే అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంది. అయితే.. ఈసారి టీఆర్ ఎస్, వైఎస్సార్సీపీలు కూడా ఇక్కడ బరిలో ఉండటంతో ఓట్లు చీలిపోయాయి, కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీస్తుండటంతో బీజేపీకి లబ్ధి చేకూరడం ఖాయమని కమలనాథల అంచనా. మిగతా స్థానాల్లో బీజేపీకి అంతంతమాత్రంగానే ఆదరణ లభించడంతో వాటిపై పెద్దగా ఆశలు పెంచుకోవట్లేదు. కార్వాన్లో పరిస్థితి బీజేపీకి కాస్త దగ్గరగా ఉంటుందని భావిస్తున్నా ఆ స్థానం తమదేనని బీజేపీ గట్టిగా చెప్పలేకపోతోంది. టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నా స్థానికంగా ఆ పార్టీ నేతలు సహకరించలేదన్న కారణంతో గెలుపు స్థానాలను కూడా బీజేపీ పరిమితం చేసుకొంది. -
ఇసుక లారీల బంద్
ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా నేటి నుంచి .. = కొత్త చట్టంతో అనేక సమస్యలు = సవరణ చేయాలని సీఎంకు విజ్ఞప్తి = అయినా స్పందన కరువు = విధిలేక బంద్ చేస్తున్నాం = లారీ యజమానుల వెల్లడి సాక్షి, బెంగళూరు : ఇసుక తరలింపుపై ప్రభుత్వం విధించిన నియమాలు, వివిధ శాఖల అధికారుల నుంచి తమకు ఎదురవుతున్న ఇబ్బందులకు నిరసనగా శనివారం నుంచి ఇసుక లారీల బంద్ నిర్వహిస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక లారీ ఓనర్స్ అసోషియేషన్ వెల్లడించింది. ఇదే విషయంపై కొంత మంది లారీల ఓనర్లు శుక్రవారం నుంచే బంద్‌కు పూనుకోగా.. ఫెడరేషన్ ఆఫ్ కర్ణాటక లారీ ఓనర్స్ అసోషియేషన్ కూడా బంద్‌కు పిలుపునివ్వడంతో శనివారం నుంచి పూర్తి స్థాయిలో ఇసుక లారీల సంచారం ఆగిపోనుంది. కాగా శుక్రవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో అసోషియేషన్ అధ్యక్షుడు చెన్నారెడ్డి మాట్లాడుతూ....ప్రైవేటు వ్యక్తుల నుంచి ఇసుకను సేకరిస్తే జైలు శిక్షను విధిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోందని చెప్పారు. అయితే అదే సందర్భంలో ప్రభుత్వమే ఇసుక పంపిణీని ఎలా నిర్వహిస్తుందనే విషయంపై మాత్రం ఇప్పటికీ ఎలాంటి ప్రణాళికను రూపొందించలేదని తెలిపారు. ఇక ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు మాత్రమే ఇసుకను రవాణా చేయాలని పేర్కొనడం కూడా ఒక అవైజ్ఞానిక చర్యేనని విమర్శించారు. ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన ఇసుక రవాణా చట్టంతో ప్రతిరోజూ తాము కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రికి వినతి పత్రాన్ని అందజేశామని, అయితే ఇప్పటికీ ఆయన స్పందించలేదని తెలిపారు. ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ఇసుక రవాణా చట్టం శనివారం నుంచే అమల్లోకి వస్తుండడంతో తాము విధిలేక బంద్‌కు దిగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక రవాణా చట్టంలో ప్రభుత్వం సవరణలు చేసే వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పది వేల ఇసుక లారీలు బంద్‌లో పాల్గొంటాయని స్పష్టం చేశారు. -
తుమ్మపాలపై ప్రయి‘వేటు’?
అనకాపల్లి, న్యూస్‌లైన్: రైతుల షేరుధనంతో సహకార రంగంలో కొనసాగుతున్న తుమ్మపాల చక్కెర కర్మాగారంపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ఆర్థిక లేమితో కొట్టుమిట్టాడుతున్న దీనిపై ప్రైవేటు వ్యక్తుల కన్నుపడింది. లీజుమాటున దక్కించుకునేందుకు రాజకీయ వ్యూహం సాగుతోంది. ఫ్యాక్టరీ నిర్వహణను రైతులకు అప్పగించాలనే సాకుతో కొత్త వ్యూహానికి ఓ వర్గం తెరలేపింది. వచ్చే సీజన్లో కర్మాగారంలో క్రషింగ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది చెరకు సరఫరా చేసిన రైతులకు సుమారు రూ.60 లక్షలు ఇప్పటికీ చెల్లించలేదు. కార్మికులకు వేతనాల విషయంలోనూ యాజమాన్యం విఫలమైంది. పలు దర్యాప్తులు, నివేదికల పేరిట ప్రభుత్వం సాచివేత ధోరణితో ఇప్పుడున్న యంత్రాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు కర్మాగారం భవితవ్యంపై శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలున్నాయి. ఇటీవల చక్కెర అధికారుల నివేదికల మేరకు కాసింత ఆర్థిక ఆసరా లేదా ఆధునికీకరణకు నిధులొస్తాయని భావిం చారు. కానీ తాజాగా టీడీపీ నాయకుడొకరు దీనిని దక్కించుకోవడానికి అధికార పార్టీ నాయకులతో మంతనాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఈయన ఇప్పటికే సహకార రంగంలో ఓ వ్యవస్థను నడుపుతున్నారు. ఏదోలా గానుగాట జరగాలని ఆశించే రైతులకు ఇది కాసింత ఊరట నిచ్చే అంశమే అయినా రైతుల పోరాటంతో నిలిచిన ఈ ఫ్యాక్టరీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతుందన్న ప్రచారాన్ని ఈ ప్రాం తీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. కర్మాగారం ప్రైవేటు పరం అయితే సహకార స్ఫూర్తికే విఘాతం కలుగుతుందని కొందరు రైతులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పష్టత వస్తే పోరాటానికి రైతు ప్రతినిధులు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ పాలసీ మేరకే కర్మాగారం భవితవ్యం ప్రభుత్వ పాలసీపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కర్మాగారంలోని యంత్రాలకు ఓవర్ హాలింగ్ చేస్తున్నాం. మహాజనసభ నిర్వహణకు అనుమతి కోరాం. డిసెంబర్ మొదటి వారంలో గానుగాటకు సన్నాహాలు చేస్తున్నాం. ఇతరత్రా అంశాల తుది నిర్ణయం ప్రభుత్వానిదే. -ప్రభుదాస్, ఎమ్డీ సహకార రంగంలో ఉంటే ... =రైతులకు భాగస్వామ్యం ఉంటుంది =ప్రభుత్వ అజమాయిషీ పనిచేస్తుంది =అవసరమైతే ప్రభుత్వం నిధులు, రుణాలు మంజూరవుతాయి =ఫ్యాక్టరీ ఉద్యోగులకు భద్రత, లాభనష్టాలతో పని లేకుండా బోనస్ పంపిణీ =రైతు ఉద్యమాలు, డిమాండ్ల సాధనలో ప్రజాస్వామ్యబద్ధ యాజమాన్యం ఉంటుంది ప్రైవేటు యాజమాన్యం చేతుల్లోకి వెళితే... =ఏకపక్ష నిర్ణయాలు ఉంటాయి. =పెట్టుబడిదారీ వ్యవస్థ అమలవుతుంది. =కర్మాగార ఉద్యోగులకు భద్రత ఉండదు =కర్మాగారాన్ని తెరవడం, కొనసాగించడం, మూసివేతల్లో నియంతృత్వ నిర్ణయాలుంటాయి. =బోనస్ పంపిణీలో లాభనష్టాలను బేరీజు వేస్తారు =రైతుల భాగస్వామ్యానికి విలువుండదు =చెరకు సేకరణలో యాజమాన్య విధానాలను ప్రశ్నించే వీలుండదు. -
బల్దియా సొమ్ము దుబారా
గోదావరిఖని, న్యూస్‌లైన్ : ప్రజాధనమే కదా.. పోతోపోనీ అన్నట్లుంది రామగుండం కార్పొరేషన్ అధికారుల తీరు. అవసరమని చెప్పి అడ్డగోలు లోడ్‌తో విద్యుత్ కనెక్షన్లు తీసుకుని.. ఇప్పుడు కరెంటు వినియోగించకున్నా బిల్లు మాత్రం రూ.లక్షల్లో చెల్లిస్తున్నారు. ఇందులో ప్రైవేట్ వ్యక్తులు వాడుకుంటున్న కరెంటుకు కూడా నెలనెలా ఠంఛన్‌గా బిల్లు కడుతున్నారు. ఇలా ఎందుకు చెల్లిస్తున్నామని కనీసం ఫైల్ చూసుకునే తీరిక కూడా వీరికి దొరకడం లేదు. నెలకు రూ.5.75 లక్షల చొప్పున సుమారు రూ.61.50 లక్షలు ట్రాన్స్‌కో ఖాతాలో జమచేశారు. అంటే ఈ మేరకు కార్పొరేషన్‌కు ఆర్థిక నష్టం వాటిల్లినట్టే. కార్పొరేషన్ పరిధిలోని మల్కాపురం శివారులో నిర్మించిన సీవరేజ్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం హై ఓల్టేజీ(హెచ్‌టీ) సర్వీస్‌తో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. కొన్నాళ్లకు వినియోగించకపోవడంతో ట్రాన్స్‌కో వాళ్లు సర్వీస్‌ను తొలగించారు. ప్లాంట్‌లోని నీటి మడుగుల్లో చేపలు పెంచుకోడానికి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి చెప్పారని తిరిగి ఆ సర్వీసును పునరుద్ధరించారు. చేపలు పెంచుకునే వ్యక్తి నుంచి చిల్లిగవ్వ కూడా కార్పొరేషన్‌కు రాకపోగా విద్యుత్ బిల్లును నెలకు రూ.లక్ష మాత్రం కార్పొరేషన్ ఖాతాలోంచే చెల్లిస్తున్నారు. ఈ తంతు రెండేళ్లుగా సాగుతోంది. ఎన్టీపీసీ నర్రశాలపల్లి వద్ద వాటర్‌ట్యాంకు కోసం 250 కేవీ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ట్యాంకు ద్వారా చుక్క నీరు కూడా రాకపోగా విద్యుత్ బిల్లు నెలకు రూ.1.50 లక్షలు ట్రాన్స్‌కోకు సమర్పించుకోవాల్సిన దుస్థితి. ఏడాది నుంచి ఈ బిల్లు చెల్లిస్తున్నారు. అంటే ఈ రెండింటిపై ఇప్పటికే రూ.43 లక్షలకుపైగా అప్పనంగా చెల్లించారు. మున్సిపల్ కార్యాలయం వెనుక జిరాక్స్ సెంటర్‌ను ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తుండగా, దానికి కార్పొరేషన్ కార్యాలయం నుంచి విద్యుత్ ఇస్తున్నారు. నెలకు వచ్చే రూ.3,600 బిల్లు కూడా కార్పొరేషన్ ఖాతా నుంచే చెల్లిస్తున్నారు. ఇదే ఆవరణలోని కమ్యూనిటీ రిసోర్స్ సెంటర్‌కు కేటాయించిన భవనంలో మెప్మా పథకానికి సంబంధించిన కార్యకలాపాలు సాగుతుంటాయి. ఈ సంస్థకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది. అందులోంచే విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రతీ నెలా వచ్చే రూ.12 వేల కరెంటు బిల్లును కార్పొరేషన్ ఖాతా నుంచే కడుతున్నారు. పాత మున్సిపల్ కార్యాలయంలో ఐసీడీఎస్ భవనంతోపాటు లక్ష్మీనగర్‌లోని వ్యాపారుల వాహనాలకు అనధికారికంగా పార్కింగ్ కొనసాగుతోంది. ఇక్కడ కమర్షియల్ కేటగిరి-2లో త్రీఫేజ్ విద్యుత్ వినియోగిస్తున్నందున నెలకు రూ.10 వేల వరకు కరెంటు బిల్లును కార్పొరేషన్ చెల్లించాల్సి వస్తోంది. ఈ మూడు కలిసి నెలకు రూ.25,600 అవుతోంది. ఆరు నెలలుగా ఈ చెల్లింపులు జరుగుతున్నా అధికారులు కిమ్మనడం లేదు. ఈ పేరిట ఇప్పటికే రూ.1.50 లక్షలకు పైగా ప్రజాధనం వృథా అయింది. వెలగని దీపాలకూ బిల్లులు కార్పొరేషన్ పరిధిలో వీధిదీపాల కోసం మొత్తం 237 విద్యుత్ మీటర్లు అమర్చగా 52 పని చేయడం లేదు. వీటి పరిధిలో 40 వాట్స్ సామర్థ్యం గల ట్యూబ్‌లైట్లు 4,668 ఉండగా 1,662 లైట్లు వెలగడం లేదు. 70 వాట్స్ సామర్థ్యం గల డ్యూమ్లైట్లు 151 ఉండగా 93 వెలగడం లేదు. 150 వాట్స్ సామర్థ్యం గల డ్యూమ్లైట్లు 735 ఉండగా 343 వెలగడం లేదు. 250 వాట్స్ సామర్థ్యం గల డ్యూమ్ లైట్లు 142 ఉండగా 52 పనిచేయడం లేదు. 400 వాట్స్ సామర్థ్యం గల హైమాస్ట్ లైట్లు 15 సెంటర్లలో 120 అమర్చగా 81 వెలగడం లేదు. మున్సిపల్ కార్యాలయం నుంచి ఫైవింక్లయిన్ చౌరస్తా వరకు రూ.36 లక్షల వ్యయంతో 71 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. ఇందులో 142 డ్యూమ్లైట్లకు 52 పనిచేయడం లేదు. దీంతో మంథనితోపాటు సింగరేణి గనులు, ఓసీపీలకు వెళ్లే కార్మికులు, ప్రజలు రాత్రి సమయంలో తరుచూ ప్రమాదాలకు గురవుతున్నారు. రాజేశ్ థియేటర్ నుంచి మార్కండేయకాలనీ మీదుగా అడ్డగుంటపల్లి, కళ్యాణ్‌నగర్ వరకున్న వీధిదీపాలు వెలగకపోవడంతో ఆ కాలనీల్లో రహదారులు చీకట్లోనే మగ్గుతున్నాయి. మార్కండేయకాలనీలో పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసినప్పటికీ రహదారులు చీకటిగా ఉండడంతో దొంగలను పోలీసులు కనిపెట్టలేకపోతున్నారు. ప్రధాన వ్యాపార కేంద్రాలైన కళ్యాణ్‌నగర్ నుంచి మేదరిబస్తీ మీదుగా లక్ష్మీనగర్, ప్రధాన చౌరస్తా వరకు గల డ్యూమ్లైట్లు కూడా సరిగా వెలగడం లేదు. తరుచూ లైట్లకు ఏర్పాటు చేసిన చాప్టర్లు, స్విచ్ బ్రేకర్లు చెడిపోతున్నా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. కానీ.. విద్యుత్ దీపాల పేరుతో కార్పొరేషన్ ప్రతీ నెలా రూ.10 లక్షల బిల్లు ట్రాన్స్‌కోకు చెల్లిస్తోంది. 52 మీటర్లు పనిచేయక వీధిదీపాలు వెలగకపోయినా ట్రాన్స్‌కో నెలకు రూ.3 లక్షల వరకు బిల్లు వేస్తోంది. ఇవి చెడిపోయి ఆరు నెలలవుతుండగా ఈ ఆరు నెలలుగా మొత్తం రూ.18 లక్షలు అప్పనంగా చెల్లించినట్లే. ఇంత జరుగుతున్నా అధికారులు కొత్త మీటర్ల ఏర్పాటుపై మాత్రం దృష్టి సారించడం లేదు. ఇలా మొత్తం కలిసి ఇప్పటికే సుమారు రూ.62 లక్షలకు పైగా కరెంటు బిల్లు పేరిట ట్రాన్స్‌కోకు చెల్లించగా... ఇవి ఎందుకు చెల్లిస్తున్నామనే విషయాన్ని మాత్రం అధికారులు వెనక్కి తిరిగి చూసుకోవడం లేదు. తనకు సంబంధం లేని బిల్లును కూడా అనవసరంగా కార్పొరేషన్ చెల్లిస్తుండడంతో లక్షలాది రూపాయల ఆర్థిక భారం పడుతోంది. బిల్లులు చెల్లించకపోవడంతో ట్రాన్స్‌కో ఇటీవల పలుమార్లు కరెంట్ కట్ చేసింది. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు కలగజేసుకుని రామగుండం కార్పొరేషన్ పాలనను చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటున్నాం - ఎస్.రవీంద్ర, కమిషనర్, రామగుండం కార్పొరేషన్ అవసరం లేకున్నా గతంలో హెచ్‌టీ కనెక్షన్లు ఇచ్చారు. దీంతో కరెంటు ఎక్కువ కాలుతోందని గుర్తించాం. ఇప్పుడు వాటన్నింటినీ ఎల్టీ కనెక్షన్లుగా మారుస్తున్నాం. అవసరం లేని చోట కనెక్ష న్లు కట్ చేస్తున్నాం. చేపల చెరువు దగ్గర కరెంట్ కనెక్షన్ కట్ చేయమని ట్రాన్స్‌కోకు లేఖ రాశాం. సీఆర్టీ భవనం నిర్వహణను చూసుకోవాలని స్వశక్తి సంఘాలకు సూచించాం. వీధి దీపాలున్నచోట పనిచేయని మీటర్లు తొలగించి కొత్త మీటర్లు ఏర్పాటు చేస్తాం. విద్యుత్ వినియోగం ఎక్కువ కాకుండా కార్పొరేషన్ ప్రత్యేకాధికారి అయిన జేసీతో చర్చించి అన్ని కాలనీల్లో టైమర్లు బిగించేందుకు చర్యలు తీసుకుంటాం.