అనకాపల్లి, న్యూస్‌లైన్: రైతుల షేరుధనంతో సహకార రంగంలో కొనసాగుతున్న తుమ్మపాల చక్కెర కర్మాగారంపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ఆర్థిక లేమితో కొట్టుమిట్టాడుతున్న దీనిపై ప్రైవేటు వ్యక్తుల కన్నుపడింది. లీజుమాటున దక్కించుకునేందుకు రాజకీయ వ్యూహం సాగుతోంది. ఫ్యాక్టరీ నిర్వహణను రైతులకు అప్పగించాలనే సాకుతో కొత్త వ్యూహానికి ఓ వర్గం తెరలేపింది. వచ్చే సీజన్‌లో కర్మాగారంలో క్రషింగ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గతేడాది చెరకు సరఫరా చేసిన రైతులకు సుమారు రూ.60 లక్షలు ఇప్పటికీ చెల్లించలేదు. కార్మికులకు వేతనాల విషయంలోనూ యాజమాన్యం విఫలమైంది. పలు దర్యాప్తులు, నివేదికల పేరిట ప్రభుత్వం సాచివేత ధోరణితో ఇప్పుడున్న యంత్రాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు కర్మాగారం భవితవ్యంపై శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలున్నాయి. ఇటీవల చక్కెర అధికారుల నివేదికల మేరకు కాసింత ఆర్థిక ఆసరా లేదా ఆధునికీకరణకు నిధులొస్తాయని భావిం చారు.
కానీ తాజాగా టీడీపీ నాయకుడొకరు దీనిని దక్కించుకోవడానికి అధికార పార్టీ నాయకులతో మంతనాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఈయన ఇప్పటికే సహకార రంగంలో ఓ వ్యవస్థను నడుపుతున్నారు. ఏదోలా గానుగాట జరగాలని ఆశించే రైతులకు ఇది కాసింత ఊరట నిచ్చే అంశమే అయినా రైతుల పోరాటంతో నిలిచిన ఈ ఫ్యాక్టరీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతుందన్న ప్రచారాన్ని ఈ ప్రాం తీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. కర్మాగారం ప్రైవేటు పరం అయితే సహకార స్ఫూర్తికే విఘాతం కలుగుతుందని కొందరు రైతులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పష్టత వస్తే పోరాటానికి రైతు ప్రతినిధులు సన్నద్ధమవుతున్నారు.
ప్రభుత్వ పాలసీ మేరకే
కర్మాగారం భవితవ్యం ప్రభుత్వ పాలసీపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కర్మాగారంలోని యంత్రాలకు ఓవర్ హాలింగ్ చేస్తున్నాం. మహాజనసభ నిర్వహణకు అనుమతి కోరాం. డిసెంబర్ మొదటి వారంలో గానుగాటకు సన్నాహాలు చేస్తున్నాం. ఇతరత్రా అంశాల తుది నిర్ణయం ప్రభుత్వానిదే.
-ప్రభుదాస్, ఎమ్‌డీ
సహకార రంగంలో ఉంటే ...
=రైతులకు భాగస్వామ్యం ఉంటుంది
=ప్రభుత్వ అజమాయిషీ పనిచేస్తుంది
=అవసరమైతే ప్రభుత్వం నిధులు, రుణాలు మంజూరవుతాయి
=ఫ్యాక్టరీ ఉద్యోగులకు భద్రత, లాభనష్టాలతో పని లేకుండా బోనస్ పంపిణీ
=రైతు ఉద్యమాలు, డిమాండ్ల సాధనలో ప్రజాస్వామ్యబద్ధ యాజమాన్యం ఉంటుంది
ప్రైవేటు యాజమాన్యం చేతుల్లోకి వెళితే...
=ఏకపక్ష నిర్ణయాలు ఉంటాయి.
=పెట్టుబడిదారీ వ్యవస్థ అమలవుతుంది.
=కర్మాగార ఉద్యోగులకు భద్రత ఉండదు
=కర్మాగారాన్ని తెరవడం, కొనసాగించడం, మూసివేతల్లో నియంతృత్వ నిర్ణయాలుంటాయి.
=బోనస్ పంపిణీలో లాభనష్టాలను బేరీజు వేస్తారు
=రైతుల భాగస్వామ్యానికి విలువుండదు
=చెరకు సేకరణలో యాజమాన్య విధానాలను ప్రశ్నించే వీలుండదు.
తుమ్మపాలపై ప్రయి‘వేటు’?
Published Sun, Oct 13 2013 1:43 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM
Advertisement