ప్రభుత్వ ప్రైవేట్ వ్యాపారం!
- తొలి దశలో రూ.400 కోట్లతో పది లక్షల ఇళ్లకు సెట్‌టాప్ బాక్సుల పంపిణీ
- సీఎం చంద్రబాబు నిర్ణయం
సాక్షి, విజయవాడ: ప్రైవేట్ వ్యక్తులు చేసుకోవాల్సిన వ్యాపారంలోకి రాష్ట్ర ప్రభుత్వం అడుగు పెడుతోంది. సెట్‌టాప్ బాక్సులను కొనుగోలు చేసి, రాష్ట్రంలో కోటి ఇళ్లకు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. తొలి దశలో అత్యవసరంగా పది లక్షల ఇళ్లకు సెట్‌టాప్ బాక్సులను పంపిణీ చేయాలని యోచిస్తున్నారు. సాధారణంగా సెట్‌టాప్ బాక్సుల కావాల్సిన వారు మార్కెట్‌లో కొనుక్కుంటారు. లేదంటే కేబుల్ ఆపరేటర్లు, ఎంఎస్‌ఓలు వాటిని అందజేస్తారు. అయితే.
రాష్ట్ర ప్రభుత్వమే వీటిని కొనుగోలు చేయాలని నిర్ణయించడం పట్ల అధికార యంత్రాంగం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. తొలి దశలో పది లక్షల ఇళ్లకు అవసరమైన సెట్‌టాప్ బాక్సుల కొనుగోలుకు రూ.400 కోట్ల వ్యయం అవుతుందని మౌలిక సదుపాయాల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించింది. ఇందులో రూ.300 కోట్లను ఆంధ్రా బ్యాంకు నుంచి 9.75 శాతం వడ్డీపై రుణం తీసుకుంటామని, మిగతా రూ.100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అందులో పేర్కొంది. బ్యాంకు నుంచి తీసుకునే రుణానికి గ్యారెంటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది.