Tummapala sugar factory
-
ఎన్ఎంఆర్ కార్మికులు ఇంటికే
సోమవారం నుంచి విధులకు రావద్దని చెప్పిన తుమ్మపాల కర్మాగారం ఎండీ ఆందోళన చేసిన కార్మికులతో చర్చలు.. 20 వరకు కొనసాగిస్తామని స్పష్టీకరణ బకాయిలు రాకపోవడంతో కార్మికుల ఆకలికేకలు ప్రభుత్వం తరుపున ఆర్డీవో చెప్పే ప్రకటన కోసం ఎదురుచూపు అనకాపల్లి: తుమ్మపాల చక్కెర కర్మాగారం పరిధిలో ఉద్యోగులను ఇంటికి పంపించే కార్యక్రమం మొదలైంది. తాజాగా 140 మంది ఎన్‌ఎంఆర్‌లు విధులకు రావద్దంటూ కర్మాగారం ఎండీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కార్మికుల్లో కలవరం మొదలైంది. ఏటాలాగే ఈ ఏడాది కూడా క్రషింగ్ కోసం ఆగస్టు నుంచే ఎన్ ఎంఆర్ కార్మికులను విధుల్లోకి తీసుకున్నారు. రెగ్యులర్ కార్మికులతోపాటు కాంట్రాక్టు కార్మికులకు కూడా 19 నెలల నుంచి జీతాలు చెల్లించలేదు. అయినప్పటికీ గానుగాట జరుగుతుందనే ఆశతో కార్మికులు ఉత్సాహంగా ఓవర్‌హాలింగ్ పనులు చేపట్టారు. వాస్తవానికి కర్మాగారం కష్టాల్లో ఉన్న నేపధ్యంలో గానుగాటపై స్పష్టత లేకుండా ఓవర్‌హాలింగ్ పనులు చేపట్టడం తప్పిదమే. ఈ క్రమంలోనే కార్మికులు సైతం యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రూ.10 లక్షలతో ఓవర్‌హాలింగ్ పనులు చేపట్టగా అప్పటికే గానుగాట లేనట్లుగా సంకేతాలు వచ్చాయి. దీంతో ఆ సొమ్మంతా వృథా అయింది. ఆఖరి నిమిషం వరకు గానుగాటపై ఆశలు చిగురింప చేసిన యాజమాన్యం అసలు విషయాన్ని దాచింది. వాస్తవానికి డిసెంబర్ 4వతేదీకే ఈ ఏడాదికి తుమ్మపాల గానుగాట లేదని యాజమాన్యానికి స్పష్టత వచ్చినా పూర్తిస్థాయి గోప్యత ప్రదర్శించింది. దీంతో రైతులు, కార్మికులు గానుగాట కోసం ఎదురు చూసినా ఫలితం దక్కలేదు. 33వరోజుకు చేరిన దీక్షలు.. రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించాలని, గానుగాట జరపాలని డిమాండ్‌చేస్తూ చక్కెర కర్మాగార పరిరక్షణ కమిటీ చేపట్టిన దీక్షలు శనివారంతో 33వరోజుకు చేరాయి. ఎండీ చాంబర్లో నిరసన ఎన్ఎంఆర్ కార్మికులను సోమవారం నుంచి విధులకు హాజరుకావద్దని ఎండీ తెలపడంతో కార్మికులు ఎండీ చాంబర్లో బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు రూ.10 లక్షలతో చేపట్టిన ఓవర్‌హాలింగ్ పనులు వృథాగా పోతాయని, యంత్రాలు పూర్తిగా పాడవుతాయని కార్మికులు పేర్కొనడంతో ఎండీ ఉన్నతాధికారులను సంప్రదించారు. తద్వారా ఈనెల 20 వరకు 140 మంది ఎన్ఎంఆర్ కార్మికులను కొనసాగించి యంత్రాలను విడదేసే పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈలోపు కార్మికుల జీతాలను చెల్లించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో సోమవారం కర్మాగారానికి రానున్న ఆర్డీవో ప్రభుత్వం తరుపున ఇచ్చే హామీని తెలపనున్నారు. ప్రభుత్వ ఉద్దేశం మేరకు రైతుల బకాయిలు చెల్లిస్తామే తప్ప కార్మికులు జీతాల కోసం ఆగాలని చెప్పడంతో కార్మికుల్లో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. కర్మాగార కార్మికుల బకాయిలు 3 కోట్లు, పీఎఫ్ బకాయిలు 1.5 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు 1.5 కోట్లు రావాల్సి ఉండగా ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా రాలేదు. ఈ నేపధ్యంలో ఆర్డీవో ఏంచెబుతారోనని అంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు. -
‘తుమ్మపాల’లో ఉద్రిక్తత
తలుపులు వేసిసుగర్స్ కర్మాగారం ఎండీ నిర్బంధం పోలీసులు వచ్చి బలవంతంగా తలుపులు తీయించిన వైనం పోలీస్‌స్టేషన్‌కు నాయకుల తరలింపు అనకాపల్లి: తుమ్మపాల చక్కెర కర్మాగారంలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తమకు జీతాలు చెల్లించేవరకు కదిలేది లేదని కార్మికులు ఎండీ చాంబర్లోకి వెళ్లి తలుపులు వేశారు. ఎండీని గదిలోనే నిర్బంధించారు. మరో వైపు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన విరమించేదిలేదని రైతులు భీష్మించడంతో కర్మాగారంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. డీఎస్పీ పురుషోత్తం, పట్టణ సీఐ చంద్ర, గ్రామీణ సీఐ ప్రసాద్, అనకాపల్లి పట్టణ, గ్రామీణ, మునగపాకలకు చెందిన ఎస్‌ఐలతోపాటు సుమారు 40 మంది పోలీస్ సిబ్బంది కర్మాగారం వద్దకు వెళ్లి తలుపులను బలవంతంగా తీయించారు. ఈ సమయంలో కొద్దిసేపు ప్రతిఘటన వాతావరణం ఏర్పడింది. ఎండీని పోలీసుల సమక్షంలో బయటకు తీసుకెళ్లారు. ఈ నిరసన కార్యక్రమానికి నేతృత్వం వహించిన సీపీఎం నేత ఎ.బాలకృష్ణ, ఆమ్ఆద్మీపార్టీ నేత ఫణిరాజుతోపాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు. ఆందోళనకారులపై కేసులు తుమ్మపాల చక్కెర కర్మాగారంలో ఎండీ సత్యప్రసాద్ విధులకు ఆటంకం కలిగిం చిన ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ జి.చంద్ర తెలిపారు. తుమ్మపాల చక్కెర కర్మాగారంలో మంగళవారం విధులు నిర్వహిం చేందుకు ఎండీ సత్యప్రసాద్ చేరుకున్నారు. ఈ సమయంలో అఖిలపక్ష నాయకులు ఎండీ చాంబర్లోకి వెళ్లి, విధులకు ఆటంకం కలిగించడంతో పాటు నిర్బం దించారు. ఈ సమాచారం తెలుసుకున్న పట్టణ సీఐ చంద్ర సంఘటక స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన పోలీసుల విధులకు కూడా ఆటంకం కలిగించడంతో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఫణిరాజు, కొణతాల హరనాథబాబు, ఎ.బాలకృష్ణ, పెంటకోట జగన్నాథం, వై.ఎన్.భద్రం, వి.వి.నర్సింగరావులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. -
ఆధునికీకరణకు నిధులివ్వాలి
గోవాడ, తుమ్మపాల సుగర్స్‌కు రూ.100 కోట్లు చొప్పున మంజూరు చేయాలి ప్రభుత్వానికి వామపక్ష నేతల డిమాండ్ ఫ్యాక్టరీలను సందర్శించిన బృందం అనకాపల్లి: హుదూద్ తుపాను కారణంగా తీ వ్రంగా నష్టపోయిన గోవాడ, తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీలకు ప్రభుత్వం రూ.100 కోట్ల చొప్పు న మంజూరు చేయాలని జిల్లా వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. మండలంలోని తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీని బుధవారం సీపీఐ జిల్లా కార్యదర్శి ఏజె స్టాలిన్, సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాధం, వామపక్ష నేతలు కొండబాబు, రామచంద్రరావు, వీవీఎమ్ రెడ్డిలు సందర్శించారు. ఈ సందర్భంగా వారు ఫ్యాక్టరీ యంత్రాలను, గొడౌన్, స్టోర్‌రూమ్‌ను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఫ్యాక్టరీపై వేలాది రైతు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. తుపానుకు నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారాన్ని చెల్లించాలన్నారు. పంటనష్టాన్ని పారదర్శకంగా నమోదు చేయాలన్నారు. గ్రామీ ణ ప్రాంతాలలో 25 కిలోల బియ్యం మూడునెలల పాటు ఉచితంగా ఇవ్వాలన్నారు. జిల్లాలో తుపానుపై నష్టం వివరాలు నమోదు చేసి తమ పార్టీ నేతలకు అందజేస్తామన్నారు. వామపక్ష నేతలు బాలకృష్ణ, కోన లక్షణ్, రాజాన దొరబాబు, ఆడారి అప్పారావు పాల్గొన్నారు. జాతీయ విపత్తుగా పరిగణించాలి చోడవరం: హుదూద్ తుపానును జాతీయ విపత్తుగా పరిగణించి దెబ్బతిన్న సహకార చక్కెర కర్మాగారాలను ప్రభుత్వం ఆదుకోవాలని వామపక్షాల బృందం డిమాండ్ చేసింది. సీపీఐ,సీపీఎం, సీపీఐఎంఎల్ న్యూ డెమొక్రసీ, సీపీఎం లిబరేషన్, ఎం సీపీఐ లకు చెందిన నాయకుల బృందం గోవాడ సహకార చక్కెర కర్మాగారాన్ని బుధవారం సందర్శించింది. ఉత్తరాంధ్ర జిల్లాల ను తుపాను తీవ్రంగా నష్టపరిచినందున జాతీ య విపత్తుగా కేంద్రం పరిగణించాలని బృంద సభ్యులు డిమాండ్ చేశారు. స్థానిక వామపక్షాల నాయకులు రెడ్డిపల్లి అప్పలరాజు, మట్టారమణ, నాగిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. -
తుమ్మపాలపై ప్రయి‘వేటు’?
అనకాపల్లి, న్యూస్‌లైన్: రైతుల షేరుధనంతో సహకార రంగంలో కొనసాగుతున్న తుమ్మపాల చక్కెర కర్మాగారంపై నీలినీడలు అలుముకుంటున్నాయి. ఆర్థిక లేమితో కొట్టుమిట్టాడుతున్న దీనిపై ప్రైవేటు వ్యక్తుల కన్నుపడింది. లీజుమాటున దక్కించుకునేందుకు రాజకీయ వ్యూహం సాగుతోంది. ఫ్యాక్టరీ నిర్వహణను రైతులకు అప్పగించాలనే సాకుతో కొత్త వ్యూహానికి ఓ వర్గం తెరలేపింది. వచ్చే సీజన్లో కర్మాగారంలో క్రషింగ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది చెరకు సరఫరా చేసిన రైతులకు సుమారు రూ.60 లక్షలు ఇప్పటికీ చెల్లించలేదు. కార్మికులకు వేతనాల విషయంలోనూ యాజమాన్యం విఫలమైంది. పలు దర్యాప్తులు, నివేదికల పేరిట ప్రభుత్వం సాచివేత ధోరణితో ఇప్పుడున్న యంత్రాలు ఎందుకూ కొరగాకుండా పోయాయి. నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు కర్మాగారం భవితవ్యంపై శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలున్నాయి. ఇటీవల చక్కెర అధికారుల నివేదికల మేరకు కాసింత ఆర్థిక ఆసరా లేదా ఆధునికీకరణకు నిధులొస్తాయని భావిం చారు. కానీ తాజాగా టీడీపీ నాయకుడొకరు దీనిని దక్కించుకోవడానికి అధికార పార్టీ నాయకులతో మంతనాలు జరపడం చర్చనీయాంశంగా మారింది. ఈయన ఇప్పటికే సహకార రంగంలో ఓ వ్యవస్థను నడుపుతున్నారు. ఏదోలా గానుగాట జరగాలని ఆశించే రైతులకు ఇది కాసింత ఊరట నిచ్చే అంశమే అయినా రైతుల పోరాటంతో నిలిచిన ఈ ఫ్యాక్టరీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతుందన్న ప్రచారాన్ని ఈ ప్రాం తీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. కర్మాగారం ప్రైవేటు పరం అయితే సహకార స్ఫూర్తికే విఘాతం కలుగుతుందని కొందరు రైతులు, కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పష్టత వస్తే పోరాటానికి రైతు ప్రతినిధులు సన్నద్ధమవుతున్నారు. ప్రభుత్వ పాలసీ మేరకే కర్మాగారం భవితవ్యం ప్రభుత్వ పాలసీపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం కర్మాగారంలోని యంత్రాలకు ఓవర్ హాలింగ్ చేస్తున్నాం. మహాజనసభ నిర్వహణకు అనుమతి కోరాం. డిసెంబర్ మొదటి వారంలో గానుగాటకు సన్నాహాలు చేస్తున్నాం. ఇతరత్రా అంశాల తుది నిర్ణయం ప్రభుత్వానిదే. -ప్రభుదాస్, ఎమ్డీ సహకార రంగంలో ఉంటే ... =రైతులకు భాగస్వామ్యం ఉంటుంది =ప్రభుత్వ అజమాయిషీ పనిచేస్తుంది =అవసరమైతే ప్రభుత్వం నిధులు, రుణాలు మంజూరవుతాయి =ఫ్యాక్టరీ ఉద్యోగులకు భద్రత, లాభనష్టాలతో పని లేకుండా బోనస్ పంపిణీ =రైతు ఉద్యమాలు, డిమాండ్ల సాధనలో ప్రజాస్వామ్యబద్ధ యాజమాన్యం ఉంటుంది ప్రైవేటు యాజమాన్యం చేతుల్లోకి వెళితే... =ఏకపక్ష నిర్ణయాలు ఉంటాయి. =పెట్టుబడిదారీ వ్యవస్థ అమలవుతుంది. =కర్మాగార ఉద్యోగులకు భద్రత ఉండదు =కర్మాగారాన్ని తెరవడం, కొనసాగించడం, మూసివేతల్లో నియంతృత్వ నిర్ణయాలుంటాయి. =బోనస్ పంపిణీలో లాభనష్టాలను బేరీజు వేస్తారు =రైతుల భాగస్వామ్యానికి విలువుండదు =చెరకు సేకరణలో యాజమాన్య విధానాలను ప్రశ్నించే వీలుండదు.