సోమవారం నుంచి విధులకు రావద్దని చెప్పిన తుమ్మపాల కర్మాగారం ఎండీ
ఆందోళన చేసిన కార్మికులతో చర్చలు.. 20 వరకు కొనసాగిస్తామని స్పష్టీకరణ
బకాయిలు రాకపోవడంతో కార్మికుల ఆకలికేకలు
ప్రభుత్వం తరుపున ఆర్డీవో చెప్పే ప్రకటన కోసం ఎదురుచూపు
అనకాపల్లి: తుమ్మపాల చక్కెర కర్మాగారం పరిధిలో ఉద్యోగులను ఇంటికి పంపించే కార్యక్రమం మొదలైంది. తాజాగా 140 మంది ఎన్‌ఎంఆర్‌లు విధులకు రావద్దంటూ కర్మాగారం ఎండీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కార్మికుల్లో కలవరం మొదలైంది. ఏటాలాగే ఈ ఏడాది కూడా క్రషింగ్ కోసం ఆగస్టు నుంచే ఎన్ ఎంఆర్ కార్మికులను విధుల్లోకి తీసుకున్నారు. రెగ్యులర్ కార్మికులతోపాటు కాంట్రాక్టు కార్మికులకు కూడా 19 నెలల నుంచి జీతాలు చెల్లించలేదు. అయినప్పటికీ గానుగాట జరుగుతుందనే ఆశతో కార్మికులు ఉత్సాహంగా ఓవర్‌హాలింగ్ పనులు చేపట్టారు. వాస్తవానికి కర్మాగారం కష్టాల్లో ఉన్న నేపధ్యంలో గానుగాటపై స్పష్టత లేకుండా ఓవర్‌హాలింగ్ పనులు చేపట్టడం తప్పిదమే. ఈ క్రమంలోనే కార్మికులు సైతం యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రూ.10 లక్షలతో ఓవర్‌హాలింగ్ పనులు చేపట్టగా అప్పటికే గానుగాట లేనట్లుగా సంకేతాలు వచ్చాయి. దీంతో ఆ సొమ్మంతా వృథా అయింది. ఆఖరి నిమిషం వరకు గానుగాటపై ఆశలు చిగురింప చేసిన యాజమాన్యం అసలు విషయాన్ని దాచింది. వాస్తవానికి డిసెంబర్ 4వతేదీకే ఈ ఏడాదికి తుమ్మపాల గానుగాట లేదని యాజమాన్యానికి స్పష్టత వచ్చినా పూర్తిస్థాయి గోప్యత ప్రదర్శించింది. దీంతో రైతులు, కార్మికులు గానుగాట కోసం ఎదురు చూసినా ఫలితం దక్కలేదు.
33వరోజుకు చేరిన దీక్షలు..
రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించాలని, గానుగాట జరపాలని డిమాండ్‌చేస్తూ చక్కెర కర్మాగార పరిరక్షణ కమిటీ చేపట్టిన దీక్షలు శనివారంతో 33వరోజుకు చేరాయి. ఎండీ చాంబర్‌లో నిరసన ఎన్‌ఎంఆర్ కార్మికులను సోమవారం నుంచి విధులకు హాజరుకావద్దని ఎండీ తెలపడంతో కార్మికులు ఎండీ చాంబర్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు రూ.10 లక్షలతో చేపట్టిన ఓవర్‌హాలింగ్ పనులు వృథాగా పోతాయని, యంత్రాలు పూర్తిగా పాడవుతాయని కార్మికులు పేర్కొనడంతో ఎండీ ఉన్నతాధికారులను సంప్రదించారు. తద్వారా ఈనెల 20 వరకు 140 మంది ఎన్‌ఎంఆర్ కార్మికులను కొనసాగించి యంత్రాలను విడదేసే పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈలోపు కార్మికుల జీతాలను చెల్లించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇదే సమయంలో సోమవారం కర్మాగారానికి రానున్న ఆర్డీవో ప్రభుత్వం తరుపున ఇచ్చే హామీని తెలపనున్నారు. ప్రభుత్వ ఉద్దేశం మేరకు రైతుల బకాయిలు చెల్లిస్తామే తప్ప కార్మికులు జీతాల కోసం ఆగాలని చెప్పడంతో కార్మికుల్లో ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. కర్మాగార కార్మికుల బకాయిలు 3 కోట్లు, పీఎఫ్ బకాయిలు 1.5 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు 1.5 కోట్లు రావాల్సి ఉండగా ప్రభుత్వం నుంచి ఎటువంటి భరోసా రాలేదు. ఈ నేపధ్యంలో ఆర్డీవో ఏంచెబుతారోనని అంతా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నారు.
ఎన్‌ఎంఆర్ కార్మికులు ఇంటికే
Published Sat, Mar 5 2016 11:50 PM | Last Updated on Sun, Sep 3 2017 7:04 PM
Advertisement
Advertisement