‘తుమ్మపాల’లో ఉద్రిక్తత | tension in "Tummapala ' | Sakshi
Sakshi News home page

‘తుమ్మపాల’లో ఉద్రిక్తత

Published Tue, Mar 1 2016 11:57 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

tension in "Tummapala '

తలుపులు వేసిసుగర్స్ కర్మాగారం ఎండీ నిర్బంధం
పోలీసులు వచ్చి  బలవంతంగా తలుపులు తీయించిన వైనం
పోలీస్‌స్టేషన్‌కు  నాయకుల తరలింపు

 
 అనకాపల్లి: తుమ్మపాల చక్కెర కర్మాగారంలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. తమకు జీతాలు  చెల్లించేవరకు కదిలేది లేదని కార్మికులు ఎండీ చాంబర్‌లోకి వెళ్లి తలుపులు వేశారు.   ఎండీని గదిలోనే నిర్బంధించారు. మరో వైపు తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళన విరమించేదిలేదని  రైతులు  భీష్మించడంతో కర్మాగారంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. చివరకు పోలీసులు  రంగంలోకి దిగాల్సి వచ్చింది. డీఎస్పీ పురుషోత్తం,  పట్టణ సీఐ చంద్ర, గ్రామీణ  సీఐ ప్రసాద్, అనకాపల్లి పట్టణ, గ్రామీణ, మునగపాకలకు చెందిన ఎస్‌ఐలతోపాటు సుమారు 40 మంది పోలీస్ సిబ్బంది కర్మాగారం వద్దకు వెళ్లి తలుపులను బలవంతంగా తీయించారు. ఈ సమయంలో కొద్దిసేపు ప్రతిఘటన వాతావరణం ఏర్పడింది. ఎండీని పోలీసుల సమక్షంలో బయటకు తీసుకెళ్లారు. ఈ నిరసన కార్యక్రమానికి నేతృత్వం వహించిన సీపీఎం నేత  ఎ.బాలకృష్ణ, ఆమ్‌ఆద్మీపార్టీ నేత ఫణిరాజుతోపాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేశారు.   

ఆందోళనకారులపై కేసులు
తుమ్మపాల చక్కెర కర్మాగారంలో ఎండీ సత్యప్రసాద్ విధులకు ఆటంకం కలిగిం చిన ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ జి.చంద్ర తెలిపారు.  తుమ్మపాల చక్కెర కర్మాగారంలో మంగళవారం విధులు నిర్వహిం చేందుకు ఎండీ సత్యప్రసాద్ చేరుకున్నారు. ఈ సమయంలో అఖిలపక్ష నాయకులు ఎండీ చాంబర్‌లోకి వెళ్లి, విధులకు ఆటంకం కలిగించడంతో పాటు నిర్బం దించారు. ఈ సమాచారం తెలుసుకున్న పట్టణ సీఐ చంద్ర సంఘటక స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపు  చేసేందుకు వచ్చిన పోలీసుల విధులకు కూడా ఆటంకం కలిగించడంతో ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఫణిరాజు, కొణతాల హరనాథబాబు, ఎ.బాలకృష్ణ, పెంటకోట జగన్నాథం, వై.ఎన్.భద్రం, వి.వి.నర్సింగరావులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement