అమెరికా, చైనాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు(US-China trade tensions) భారత్‌కు కొత్త అవకాశాలను చూపిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చైనా వస్తువులపై అమెరికా సుంకాలు విధించడంతో భారతీయ ఎగుమతిదారుల ఆర్డర్లలో పెరుగుదల నమోదవుతుందని తెలియజేస్తున్నారు. అమెరికా-చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య సంఘర్షణతో భారతదేశం లబ్ధిదారుగా మారుతుందని చెబుతున్నారు.
గతంలో ఇలా..
గతంలో యూఎస్-చైనాల మధ్య సుంకాల పరంగా నెలకొన్న వాణిజ్య యుద్ధాల సమయంలో భారతదేశం భారీగానే లాభపడింది. ఉదాహరణకు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత హయాంలో ప్రారంభించిన వాణిజ్య యుద్ధం కాలంలో భారత్ అమెరికాకు భారీగానే వస్తువులను ఎగుమతి చేసింది. ఆ సమయంలో అమెరికాకు ఎగుమతి చేసే దేశాల్లో ఇండియా నాలుగో అతిపెద్ద లబ్ధిదారుగా అవతరించింది. ప్రస్తుతం చైనా దిగుమతులపై సుంకాలు విధించడంతో యూఎస్ ప్రత్యామ్నాయ సరఫరాదారులను అన్వేషిస్తోంది. అందులో ప్రధానంగా భారత్‌వైపు మొగ్గు చూపేందుకు అవకాశం ఉంది.
ఏయే వస్తువులకు గిరాకీ
ఎలక్ట్రానిక్స్, మెషినరీ, దుస్తులు, తోలు, పాదరక్షలు, ఫర్నిచర్, ఫార్మాస్యూటికల్స్, బొమ్మలు వంటి కీలక రంగాల్లో యూఎస్-చైనా టారిఫ్‌ల వల్ల భారత్ లబ్ధి పొందే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనా దిగుమతులతో ముడిపడి ఉన్న అధిక ఖర్చులను నివారించడానికి యూఎస్ కొనుగోలుదారులు భారతీయ కంపెనీలపై దృష్టి సారించనున్నారు. ముఖ్యంగా భారత్, చైనా రెండింటిలోనూ తయారీ కార్యకలాపాలు కలిగి ఉన్న సంస్థలకు యూఎస్ నుంచి ఆర్డర్లు పెరుగుతాయని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: త్వరలో జీఎస్టీ శ్లాబ్‌ల సరళీకరణ
ఆర్డర్ల పెరుగుదల
ఈ పరిణామంపై ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఎఫ్ఐఈఓ) ఎగుమతిదారుల్లో సానుకూల సెంటిమెంట్ ఉందని తెలిపింది. ఇప్పటికే చాలా మంది ఆర్డర్లు పెరిగినట్లు పేర్కొంది. ఈ వ్యవహారం భారత ఎగుమతులను పెంచుతుందని, ఆర్థిక వృద్ధికి, ఉద్యోగాల కల్పనకు దోహదం చేస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే భారత మౌలిక సదుపాయాలు, సులభతర వాణిజ్యం మెరుగుపడాలని తెలియజేస్తున్నారు. ఈ అంశంపై కొన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ ప్రస్తుత విధానాలు భారతదేశానికి ప్రపంచ వాణిజ్య ఉనికిని పెంచుకోవడానికి అవకాశాన్ని అందిస్తున్నట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment