
అమెరికా తాజాగా భారత్ నుంచి చేసుకునే దిగుమతులపై 26 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. దాంతో ఇరుదేశాల వాణిజ్య సంబంధాలు గణనీయంగా ప్రభావితం చెందుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా వస్తువులపై భారత్ అధిక సుంకాలు విధించడంపై ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఇదివరకే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. కొత్త టారిఫ్‌లు ప్రధానంగా భారతీయ ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, ఐటీ సర్వీసులు వంటి కీలక రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ప్రభావం ఎలాగంటే..
ఆటోమొబైల్స్: దేశం మొత్తం వాహన ఎగుమతుల్లో గణనీయమైన భాగం అమెరికాకు వెళ్తోంది. దాంతో ప్రస్తుత సుంకాల వల్ల భారతీయ ఆటోమొబైల్ ఎగుమతులు సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. అధిక సుంకాలతో భారతీయ వాహనాలు యూఎస్‌లో ఇతర కంపెనీ ఉత్పత్తులతో పోటీపడే అవకాశం తగ్గుతుంది. దాంతో దేశీ తయారీదారులు ఇతర ప్రాంతాల్లో తమ ఉత్పత్తులు విక్రయించేందుకు మార్గాలను అన్వేషించాల్సి వస్తుంది.
ఫార్మాస్యూటికల్స్: జనరిక్ ఔషధాల ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న భారత ఫార్మాస్యూటికల్స్‌కు యూఎస్ సుంకాలు అవరోధంగా నిలుస్తాయి. భారత్ ఫార్మా రంగానికి అమెరికాలో గణనీయ మార్కెట్ ఉంది. అలాంటిది ఈ ప్రతీకార సుంకాలతో భారత ఎగుమతులు తగ్గి ఫార్మా కంపెనీల లాభాలపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అమెరికాకు ఎగుమతి చేసే జనరిక్ ఔషధాల ధరలు పెంచేందుకు ఈ సుంకాలు అవకాశం కల్పిస్తాయి. దాంతో యూఎస్‌లో స్థానికంగా పోటీపడే వీలుండదని నిపుణులు చెబుతున్నారు.
ఐటీ సేవలు: ప్రధానంగా అమెరికాలో భారత ఐటీ సర్వీసులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. యూఎస్ ఆధారిత కాంట్రాక్టులే ఇండియన్ ఐటీ కంపెనీలను అధికంగా ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. కరోనా తర్వాత చాలా మంది ఐటీ సిబ్బందికి లేఆఫ్స్ ప్రకటించిన కంపెనీలు ఇటీవలే పుంజుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వేసేలా ట్రంప్ సుంకాలతో కంపెనీల రెవెన్యూ తగ్గే అవకాశం ఉంటుంది. దాంతో మళ్లీ లేఆఫ్స్ తప్పవని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి: టారిఫ్‌లపై కంట్రోల్ రూమ్..
విస్తృతంగా, విచ్చలవిడిగా విధించే సుంకాలు వాణిజ్య అసమతుల్యతకు దారితీయవచ్చు. ఇవి భారతదేశ ఎగుమతి ఆదాయాలను తగ్గిస్తాయి. వాణిజ్య లోటును పెంచుతాయి. పూర్తిగా అమెరికాపైనే ఆధారపడి పని చేస్తున్న భారతీయ కంపెనీలు ఆర్థిక అనిశ్చితిలోకి వెళ్లవచ్చు. సుంకాల తీవ్రతను తగ్గించేందుకు, పరస్పర ప్రయోజనాలను పొందడానికి భారత్ ఇప్పటికే అమెరికాతో వాణిజ్య చర్చలు ప్రారంభించింది. సమతుల్య వాణిజ్య సంబంధాలను పెంపొందిస్తూ, ఆర్థిక అంతరాయాలను తగ్గించేలా ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని మార్కెట్ వర్గాలు కోరుతున్నాయి.