మంత్రి పేషీకి ప్రైవేటు ఏసీలు...
చల్లగా ఉండాలిగానీ ఏసీలు ఎవరివైతేనేమి? ఇదీ ఓ మంత్రి ఓఎస్డీ ఉవాచ. ప్రభుత్వానికి బిల్లులు పెట్టేవరకూ ఏసీలు పెట్టుకోకుండా ఉండాలా? అంటూ మంత్రి ఓఎస్డీ ఒకరు ఓ ప్రైవేటు కాంట్రాక్టరుతో మాట్లాడి 24 గంటల్లోనే సుమారు రూ.3లక్షలు పైనే ఖర్చు చేసి పేషీలో ఏసీలు బిగించారు. మంత్రి చల్లటి గాలి చూశారుగానీ, ఎక్కడ్నుంచి వచ్చాయని అడగలేదు. ఇప్పుడా విషయం మిగతా మంత్రుల పేషీల్లో ఈదురుగాలిలా వ్యాపించింది.
ఇలా సచివాలయంలో ప్రైవేటు వ్యక్తులు స్పాన్సర్ చేసిన ఏసీలుగానీ, టేబుళ్లుగానీ ఏర్పాటు చేసుకునే వీలుందా? అని కొందరు, ఆ మంత్రిగారి పనే బావుందంటూ మరికొందరు చెవులు కొరుక్కుంటున్నారు. ఇప్పటికే ఆక్సిజన్ సరఫరా కాంట్రాక్టర్ల విషయంలో ఓఎస్డీ బినామీలే ఉన్నారంటూ వచ్చిన వార్తలు దులుపుకోలేక మంత్రి ఆపసోపాలూ పడుతుంటే ఏసీల వార్త చికాకు కలిగిస్తున్నట్టు తెలుస్తోంది. చివరకు ఇలాంటి వార్తలు పేషీనుంచే లీకవుతున్నాయంటూ ఓఎస్డీ... పేషీలోని ఉద్యోగులను ఒక్కొక్కరినే పిలిపించుకుని స్పెషల్‌క్లాసులు పీకి, మీరే చెబుతున్నారు, మీరే లీక్ చేస్తున్నారని హెచ్చరించారట కూడా.