చేతులెత్తేసిన సహకారం | CHETULETTESINA SAHAKARAM | Sakshi
Sakshi News home page

చేతులెత్తేసిన సహకారం

Published Fri, Nov 18 2016 1:51 AM | Last Updated on Sat, Sep 22 2018 7:50 PM

CHETULETTESINA SAHAKARAM

భీమవరం టౌ¯ŒS : ఇతని పేరు రామకృష్ణ శర్మ. రిటైర్డ్‌ ఉద్యోగి తాను కూడబెట్టుకున్న రూ.20 లక్షలను జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ (డీసీసీబీ) భీమవరం శాఖలో డిపాజిట్‌ చేశారు. ఆ మొత్తంపై నెలనెలా వచ్చే వడ్డీ తీసుకుని కుటుంబ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో సహకార సంఘాల్లో ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో నవంబర్‌ నెలకు సంబంధించిన వడ్డీ తీసుకునే అవకాశం లేక రామకృష్ణ శర్మ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం ఆ బ్యాంక్‌ 
శాఖకు వచ్చిన ఆయన వడ్డీ సొమ్ము ఎప్పుడిస్తారని సిబ్బందిని అడిగారు. మరికొంత సమయం పడుతుందని చెప్పడంతో ఏం చేయాలో పోలుపోని స్థితిలో.. ఆ బ్రాంచికి వచ్చిన డీసీసీబీ చైర్మ¯ŒS ముత్యాల రత్నంను కలిశారు. తాను డీసీసీబీలో సొమ్ము దాచుకున్నానని, దానిపై వచ్చే వడ్డీపైనే ఆధారపడి జీవిస్తున్నానని.. ఇప్పటి పరిస్థితి చూస్తే భయంగా ఉందని కన్నీరు పెట్టుకున్నారు. అన్ని బ్యాంకుల్లోనూ లావాదేవీలు జరుగుతుంటే.. సహకార బ్యాంకులో మాత్రం ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. దీంతో బ్యాంక్‌ చైర్మ¯ŒS రత్నం వారానికి రూ.24 వేలు ఇస్తామని, కొంత ఓపిక పట్టాలని నచ్చజెప్పి పంపించారు. జిల్లాలోని సొసైటీలు, అన్ని డీసీసీబీ బ్రాంచిల్లోనూ ఇలాంటి ఘటనలు నిత్యం చోటు చేసుకుంటున్నాయి. 
 
రైతుల పరిస్థితి మరీ దుర్భరం
పెద్ద నోట్ల రద్దు ప్రభావం వ్యవసాయ రంగంపై తీవ్రంగానే ఉంది. డీసీసీబీ బ్రాంచిలు, సొసైటీల్లో అన్నిరకాల లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయాయి. సహకార బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన సొమ్మును తీసుకునే అవకాశం లేకపోవడం, కొత్త రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు కుదేలవుతున్నారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ (డీసీసీబీ) పరిధిలో 256 సహకార పరపతి సంఘాలు (సొసైటీలు) ఉండగా, 3.14 లక్షల మంది రైతులకు వాటిలో ఖాతాలు ఉన్నాయి. రూ.2 వేల కోట్లను సహకార సంఘాల ద్వారా రుణాలిచ్చారు. ఇందులో రూ.1,400 కోట్లను పంట పెట్టుబడుల నిమిత్తం ఇచ్చారు. మరో రూ.600 కోట్లను వ్యవసాయేతర రుణాలుగా మంజూరు చేసినా.. వాటిని కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబాలే తీసుకున్నాయి. ఇదిలావుంటే.. రూ.1,241 కోట్లను రైతులు, ఇతర వర్గాలవారు సహకార సంఘాల్లో డిపాజిట్లుగా వేశారు. సహకార సంఘాల్లో పొదుపు ఖాతాలు సైతం ఉన్నాయి. డిపాజిట్ల నుంచి, పొదుపు ఖాతాల నుంచి రైతులు నగదు తీసుకునే అవకాశం లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఆర్‌బీఐ మార్గదర్శకాలు, పరిమితులను అనుసరించి వాణిజ్య బ్యాంకుల్లో నోట్ల మార్పిడి, ఖాతాల నుంచి కొంతమొత్తంలో నగదు తీసుకునే అవకాశం కల్పించారు. డీసీసీబీ బ్రాంచిలు, సహకార సంఘాల్లోని ఖాతాదారులకు ఈ అవకాశం లేకుండాపోయింది. దీంతో రైతులు, సహకార సంఘాల్లో సొమ్ములు దాచుకున్న ఇతర ఖాతాదారులు నగదు పొందే అవకాశం లేక అవస్థలు పడుతున్నారు.
 
పొదుపు ఖాతాలూ స్తంభించాయి
డీసీసీబీ బ్రాంచిలు, సొసైటీల్లో పొదుపు ఖాతాలు కూడా ఉన్నాయి. వాటినుంచి కనీసం వంద రూపాయలైనా తీసుకునే అవకాశం లేకపోవడంతో ఖాతాదారులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాణిజ్య బ్యాంకుల్లోని ఖాతాల నుంచి నిర్ధిష్ట పరిమితి మేరకు నగదు తీసుకునే అవకాశం కల్పించినా.. సహకార బ్యాంకులకు మాత్రం ఆ ఛాన్స్‌ ఇవ్వలేదు. రెండో విడత రుణమాఫీ కింద కొందరు రైతులకు చెందిన వ్యక్తిగత అకౌంట్లలో రూ.2 వేల చొప్పున సొమ్ము జమకాగా, ఆ మొత్తాన్ని సైతం తీసుకునే అవకాశం లేకుండాపోయింది. ప్రస్తుతం వరి కోతల సీజ¯ŒS నడుస్తోంది. రైతులకు పెట్టబడులు నిమిత్తం వేలాది రూపాయలు అవసరం. సహకార బ్యాంకులు, సొసైటీల్లో లావాదేవీలు నిలిచిపోవడంతో వాటిలో ఖాతాలు కలిగిన రైతులంతా ఇబ్బందులు పడుతున్నారు. పోనీ.. వ్యవసాయ ఖర్చుల కోసం బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందుదామన్నా అవకాశం లేకుండాపోయింది.
 
ఆర్‌బీఐ నుంచి సొమ్ము రాలేదు
నోట్ల మార్పిడి నిమిత్తం డీసీసీబీ అధికారులు రూ.175 కోట్లను రిజర్వ్‌ బ్యాంక్‌కు డిపాజిట్‌ చేయగా, ఇప్పటివరకు రూ.5 కోట్ల విలువైన నోట్లు మాత్రమే వచ్చాయి. రూ.170 కోట్ల నగదుకు సంబంధించి కొత్త నోట్లు వస్తేగాని డీసీసీబీలో కనీస స్థాయిలో అయినా లావాదేవీలు జరిపే పరిస్థితి లేదు. ఆ సొమ్ము ఎప్పుడొస్తుందో, లావాదేవీలు ఎప్పుడు మొదలవుతాయో తెలియక అటు ఉద్యోగులు, ఇటు ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. 
 
ఉపశమన చర్యలు అక్కరకొస్తాయా
రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం గురువారం కొన్ని ఉపశమన చర్యలు ప్రకటించింది.  పంట రుణం పొందిన, కిసా¯ŒS క్రెడిట్‌ కార్డు ఉన్న రైతు తన ఖాతా నుంచి వారానికి రూ.25 వేల నగదు తీసుకోవచ్చు. పంట అమ్మగా వచ్చిన సొమ్ము ఆర్‌టీజీఎస్‌ లేదా చెక్కు ద్వారా తన ఖాతాలోకి వచ్చి ఉంటే, అదనంగా వారానికి మరో రూ.25 వేలు తీసుకోవచ్చు. అంటే ఇలాంటి సందర్భాల్లో రైతు గరిష్టంగా వారానికి రూ.50 వేలు విత్‌డ్రా చేయడానికి ఆస్కారం ఉంటుంది. రబీ సీజ¯ŒS మొదలైన నేపథ్యంలో పెట్టుబడులు, ఎరువులు, ఇతర ఖర్చుల నిమిత్తం రైతులకు ఈ వెసులుబాటు కల్పించారు. పంట బీమా ప్రీమియం గడువును 15 రోజులు పొడిగించారు. ఈ నిర్ణయం వాణిజ్య బ్యాంకుల్లో ఖాతాలున్న రైతులకు ఉపశమనం ఇస్తుంది. సహకార సంఘాల్లో రుణాలు తీసుకున్న, వాటిలో డిపాజిట్లు, పొదుపు ఖాతాలు ఉన్న రైతులకు తాజా నిర్ణయం వల్ల ఒరిగేదేమీ ఉండదని సహకార రంగ వర్గాలు చెబుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement