ఆశల పల్లకిలో కమలనాథులు
సాక్షి, సిటీబ్యూరో: సార్వత్రిక సమరంలో అలుపెరగని పోరాటం చేసిన కమలనాథులు ఇప్పుడు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. ఈసారి గ్రేటర్ హైదరాబాద్‌లో 3 నుంచి 4 స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమన్న ధీమా ఆ పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. జాతీయ స్థాయి పార్టీ అయిన బీజేపీ ఇక్కడ పరిమితమైన బలమున్న దృష్ట్యా టీడీపీతో పొత్తు పెట్టుకొని గ్రేటర్‌లో 9 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది.
అయితే... పోలింగ్ అనంతరం ఆ పార్టీ జరిపిన అంతర్గత సర్వేలో 3 స్థానాల్లో మాత్రమే తమ పార్టీకి విజయావకాశాలున్నట్లు తేలింది. ప్రధానంగా ముషీరాబాద్, అంబర్‌పేట, గోషామహల్ స్థానాలు బీజేపీ ఖాతాలో పడతాయని ఆ పార్టీ నేతలు గట్టిగా విశ్వసిస్తున్నారు. అలాగే... మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్న మలక్‌పేట నియోజకవర్గంలో కూడా పరిస్థితి ఈ సారి బీజేపీకి అనుకూలంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడ కొత్త ఓటర్లను ఆకట్టుకోగలిగామని, తద్వారా తమకు ఓట్ల సంఖ్య కూడా పెరిగినట్లు భావిస్తున్నారు. గట్టి పోటీ ఉన్న ఈ స్థానంలో స్వల్ప మెజార్టీతో బీజేపీ విజయం సాధిస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు.
భారీ మెజార్టీ అసాధ్యమే...
నగరంలో ఓటింగ్ సరళిని బట్టి చూస్తే ఏ పార్టీకి కూడా భారీ మెజార్టీ వచ్చే పరిస్థితి కన్పించడంలేదు. ప్రధాన రాజకీయ పార్టీల మధ్య తీవ్ర పోటీవల్ల ఓట్లు చీలిపోయాయి. దీంతో ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీయే వస్తుందని తెలుస్తోంది. అంబర్‌పేట నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీల మధ్యే పోటీ ఉంటుందని అందరూ ఊహిస్తున్నా... ఇక్కడ వైఎస్సార్‌సీపీ కూడా గట్టి పోటీ ఇచ్చినట్లు ఆయా పార్టీల నేతలు చెబుతున్నారు.
ఈ స్థానంలో బీజేపీకే అత్యధికంగా ఓట్లు పోలైనట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక్కడ త్రిముఖ పోటీలో విజయం మాత్రం బీజేపీ పక్షానే ఉంటుదన్నది ఆ పార్టీ నేతల ధీమా. అలాగే ముషీరాబాద్‌లో కూడా బీజేపీకి విశేషమైన ఆదరణ లభించిందని, డాక్టర్ లక్ష్మణ్‌కు ఉన్న వ్యక్తిగత ఇమేజ్‌తో పాటు మోడీ గాలి ఇక్కడ బాగా పనిచేసిందంటున్నారు. అయితే... ఇక్కడ కాంగ్రెస్ కంటే కూడా టీడీపీకి చెందిన ఓట్లను టీఆర్‌ఎస్ బాగా చీల్చినట్లు వినికిడి. వైఎస్సార్‌సీపీకి కూడా ఆశించిన స్థాయిలో ఓట్లు పోలైనట్లు చెబుతున్నారు.
ఇదే నిజమైతే... ఈ స్థానంలో ఎవరు గెలిచినా 200-250ల ఓట్ల తేడానే ఉంటుంది. అలాగే గోషామహల్ నియోజకవర్గం తమదేనని బీజేపీ భావిస్తున్నా... ఇక్కడ ఆ పార్టీ రెబల్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ భారీగా ఓట్లు చీల్చినట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్‌లకు కూడా ఆశించిన స్థాయిలో ఓట్లు పోలై ఉంటే... మధ్యలో కాంగ్రెస్ లబ్ధి పొందే అవకాశం కన్పిస్తోంది.
అయితే... బీజేపీ మాత్రం ఇక్కడున్న హిందుత్వ ఓట్లు గంపగుత్తగా బీజేపీకే పడ్డాయని ఆ స్థానం తమదేనని గట్టిగా చెబుతోంది. మైనార్టీలు అధికంగా ఉన్న మలక్‌పేటలో ఎంఐఎంకే అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంది. అయితే.. ఈసారి టీఆర్ ఎస్, వైఎస్సార్‌సీపీలు కూడా ఇక్కడ బరిలో ఉండటంతో ఓట్లు చీలిపోయాయి, కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీస్తుండటంతో బీజేపీకి లబ్ధి చేకూరడం ఖాయమని కమలనాథల అంచనా.
మిగతా స్థానాల్లో బీజేపీకి అంతంతమాత్రంగానే ఆదరణ లభించడంతో వాటిపై పెద్దగా ఆశలు పెంచుకోవట్లేదు. కార్వాన్‌లో పరిస్థితి బీజేపీకి కాస్త దగ్గరగా ఉంటుందని భావిస్తున్నా ఆ స్థానం తమదేనని బీజేపీ గట్టిగా చెప్పలేకపోతోంది. టీడీపీతో పొత్తు కుదుర్చుకున్నా స్థానికంగా ఆ పార్టీ నేతలు సహకరించలేదన్న కారణంతో గెలుపు స్థానాలను కూడా బీజేపీ పరిమితం చేసుకొంది.