పొత్తులు.. కత్తులు | Alliances .. knives | Sakshi
Sakshi News home page

పొత్తులు.. కత్తులు

Published Fri, Apr 4 2014 2:44 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

పొత్తులు.. కత్తులు - Sakshi

పొత్తులు.. కత్తులు

  •       ‘దేశం’లో ముసలం
  •      తమ్ముళ్ల తిరుగుబాట
  •      అధినేత ఇంటి వద్ద నిరసన
  •      అమీతుమీకి సిద్ధం     
  •      స్వతంత్రులుగా పోటీకి సై
  •  సాక్షి, సిటీబ్యూరో: పోటీకి ముందే సొంత పార్టీల్లో పేచీలు.. ఒకపక్క పొత్తుల కోసం ఎత్తులు పై ఎత్తులు.. మరోపక్క అవి పొసగక కత్తులు దూస్తున్న శ్రేణులు.. సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల్లో చిచ్చు రగులుతోంది. పోటీపై స్పష్టత కొరవడటంతో మంటలు రేగుతున్నాయి. ఇన్నాళ్లూ తాము పోటీ చేద్దామని ఆశించిన నియోజకవర్గాలను పొత్తుల్లో భాగంగా ఇతర పార్టీలకు ధారాదత్తం చేస్తున్నారనే సమాచారంతో ఆయా పార్టీల శ్రేణులు మండిపడుతున్నాయి.

    ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేసిన తమను లెక్కలోకి తీసుకోకుండా ఇష్టానుసారం ఇతర పార్టీలకు ఆ సీట్లను కట్టబెడుతుండటాన్ని జీర్ణించుకోలేని నాయకులు అధిష్ఠానాలతోనే అమీతుమీకి సిద్ధమవుతున్నారు. దీన్ని చూస్తూ ఊరుకోబోమని, ఇతర పార్టీల్లోకి ఫిరాయించైనా పోటీ చేస్తామని, లేకుంటే స్వతంత్రంగానైనా బరిలోకి దిగుతామని సవాల్ విసురుతున్నారు.  

    ప్రధానంగా ఈ పరిణామాలు గ్రేటర్ హైదరాబాద్‌లోని తెలుగుదేశం పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పొత్తులో భాగంగా తమ నియోజకవర్గాలు బీజేపీ ఖాతాలోకి వెళ్తున్నాయని భావించిన ఆయా నియోజకవర్గాల నేతలు ఏకంగా చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళనలకు దిగుతున్నారు. ఇంకొందరు వేచి చూసే ధోరణిలో ఉన్నారు. పార్టీ అధిష్ఠానం తీరును నేతలు తీవ్రంగా దుయ్యబడుతున్నారు.

    ఆర్నెళ్ల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామన్న అధిష్ఠానం అది చేయకపోగా, తీరా నామినేషన్ల సమయంలో ఉత్తచేయి చూపడాన్ని ఆయా నియోజకవర్గాల నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు, అభ్యర్థుల ఎంపికకు ఐవీఆర్‌ఎస్‌ను వినియోగిస్తున్నామని చెప్పిన అధినేత.. బీజేపీతో పొత్తుపై ఎందుకు అభిప్రాయాలు సేకరించడం లేదని ప్రశ్నిస్తున్నారు.
     
     ‘దేశం’లో ఇదీ వరస..
     మహేశ్వరం నియోజకవర్గం టిక్కెట్‌ను టీడీపీ.. బీజేపీకి కేటాయించనుందనే ప్రచారంతో మాజీ మేయర్, ఆ స్థానాన్ని ఆశిస్తున్న తీగల కృష్ణారెడ్డి తన అనుచరులతో కలిసి గురువారం చంద్రబాబు ఇంటి ఎదుట ఆందోళన చేపట్టారు. మహేశ్వరం సీటును బీజేపీకి ఇవ్వరాదని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే, తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు
         
     ఎల్‌బీనగర్ టిక్కెట్ ఆశిస్తున్న ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎస్వీ కృష్ణప్రసాద్ సైతం చంద్రబాబు ఇంటి సమీపంలో బైఠాయించారు. ఈ సీటు బీజేపీకి ఇస్తే సహించమని తేల్చి చెప్పారు
         
     సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన హైదరాబాద్ జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి బద్రినాథ్‌యాదవ్ సైతం ఆందోళనకు దిగారు
         
     ఖైరతాబాద్‌ను బీజేపీకి కేటాయించవద్దని ఆ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కె.విజయరామారావు మూడ్రోజుల క్రితం చంద్రబాబుకి విజ్ఞప్తి చేశారు
     
     ఎన్టీఆర్‌కు జై.. చంద్రబాబు నై నై!
     
    బీజేపీతో పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయే అవకాశం ఉన్న నేతలంతా కూటమిగా ఏర్పడి ప్రచారం నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రచారంలో.. పార్టీ జెండాలు, బ్యానర్లు వాడాలని, అయితే వాటిలో ఎక్కడా చంద్రబాబు బొమ్మ లేకుండా, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ బొమ్మ మాత్రమే ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం.

    ఎంతో కాలంగా పార్టీని నమ్ముకున్న తమకు అదే పార్టీలో జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలిపేందుకు, ఎన్టీఆర్ ఏ ఆశయాలతో టీడీపీని ఏర్పాటు చేశారో అందుకు వ్యతిరేకంగా ప్రస్తుత టీడీపీ నడుస్తోందని చెప్పేందుకు ఈ ప్రదర్శనలు ఉపకరిస్తాయని భావిస్తున్నారు. అసలైన టీడీపీ వాళ్లం తామేనని ప్రకటించుకోవడంతో పాటు, టీడీపీ మద్దతిచ్చిన బీజేపీ అభ్యర్థికి ఓటు వేయవద్దని ప్రచారం చేసేందుకూ ఇది తోడ్పతుందని అంచనా వేస్తున్నారు. ముషీరాబాద్, అంబర్‌పేట, గోషామహల్ నియోజకవర్గాల నేతలు ఈ యోచనకొచ్చినట్లు తెలుస్తోంది.

    ఇందువల్ల తమ గెలుపు సంగతెలా ఉన్నా.. తమకు టిక్కెట్ రాకపోవడానికి కారకులైన వారూ గెలవరాదనేది వీరి తలంపుగా ఉంది. ప్రచారంలో ‘ఎన్టీఆర్ జిందాబాద్’ నినాదమే తప్ప ఎక్కడా చంద్రబాబు పేరు, బొమ్మల్ని ప్రస్తావించరాదని నిర్ణయించినట్లు సమాచారం. తద్వారా ‘చంద్రబాబు ముర్దాబాద్’ అని వేరుగా చెప్పాల్సిన పనిలేదని భావిస్తున్నారు. కాగా, కార్వాన్, యాకుత్‌పురా/చార్మినార్, ఉప్పల్, మల్కాజిగిరి/కుత్బుల్లాపూర్‌ను సైతం బీజేపీ కోరుతుండటంతో ఆ నియోజకవర్గాల టీడీపీ నేతలూ ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement