చిచ్చు రాజుకుంది
- బీజేపీ పొత్తుపై మన్యం టీడీపీ నేతల ఆగ్రహం
- అరకు ఎంపీ..పాడేరు అసెంబ్లీ కమలానికి కేటాయించడంపై సెగలు
- బాబును నమ్ముకుని నష్టపోయామంటూ నిరసనలు
- బీజేపీకి సహకరించేది లేదంటూ తెగేసి చెబుతున్న వైనం
- ఏజెన్సీలో ఉనికి కోల్పోతున్న తెలుగుదేశం
సాక్షి, విశాఖపట్నం: ఏజెన్సీలో పొత్తు చిచ్చు రాజుకుంది. అంతంతమాత్రంగా ఉన్న టీడీపీ బలాన్ని ఇది కుంగదీసింది. అరకు ఎంపీ.. పాడేరు అసంబ్లీ స్థానాలు కమలనాథుల కోటాలో చేరడంతో తెలుగుతమ్ముళ్ల పరిస్థితి దిక్కుతోచనివిధంగా తయారైంది. పార్టీ అధినేత ఆదేశాలతో పనిచేసుకుంటున్న ఆశావహులు నీరుగారిపోయారు. తాము ఖర్చుపెట్టిన సొమ్మంతా బూడిదలో పోసినట్టేనని వాపోతున్నారు.
పాడేరులో బీజేపీకి కనీస బలం కూడా లేదని వీరు గుర్తుచేస్తున్నారు. సీటు చే జార్చి అధినేత తమ గొంతుకోశారంటూ ఇక్క డి టీడీపీ నాయకులు నిప్పులు కక్కుతున్నారు. మాజీ మంత్రి మణికుమారి, కొట్టుగుల్లి సు బ్బారావు, లోకుల గాంధీ, బొర్రా నాగరాజు,చల్లంగి జ్ఞానేశ్వరి,ఎంవీఎస్ ప్రసాద్ తదితరులు ఇప్పటికే భారీగా ఖర్చుచేశారు.
చంద్రబాబు జిల్లాకు వచ్చిన ప్రతిసారి వీరిని పిలిపించి గట్టిగా పనిచేయండి, కచ్చితంగా టిక్కెట్ ఇస్తానని అనేక సార్లు నమ్మబలకడంతో వీరంతా ఎవరికివారే పోటీగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో ఈసీటును సీపీఎంకు కేటాయించారు. అప్పుడే పార్టీ బాగా బలహీనపడింది. మరోమారు అదే చరిత్ర పునరావృతం చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. బీజేపీకి సహకరించేదిలేదని కరాఖండిగా చెబుతున్నారు.
అరకులోనూ ఇరకాటమే..
అరకులో సిట్టింగ్ ఎమ్మెల్యే సిరివేము సోమ ఈఎన్నికల్లో టిక్కెట్ తనకే వస్తుందని భావించారు. కాని బాబు ఇటీవల పార్టీలో చేరిన కుంభా రవిబాబుకు టిక్కెట్ ఇచ్చేందుకు నిర్ణయించినట్లు సమాచారం. దీంతో సోమ పరిస్థితి అయోమయంగా మారింది. అటు అరకు పార్లమెంట్ సీటుకూడా బీజేపీకి కట్టబెట్టడంపై ఆశావహులు పార్టీని వీడడానికి సమాయత్తమవుతున్నారు.
పాడేరులో పోటీ తీవ్రంగా ఉన్నందున తనకు అక్కడ సీటు ఇవ్వకపోతే కనీసం పార్లమెంట్ ఇవ్వాలని మణికుమారి చంద్రబాబును కోరారు. విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన డాక్టర్ పార్వతీశం కూడా ఈ టిక్కెట్‌పై కన్నేశారు. ప్రజాబలం లేని బీజేపీకి ఇవ్వడంతో ఇప్పుడు వీరందరి దారెటో అర్థంకావడంలేదు. మొత్తానికి ఏజన్సీ కంచుకోట అని గొప్పలు చెప్పుకునే టీడీపీకి ఇప్పుడు ఉనికి ప్రశ్నార్థమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది. ఇప్పటికే మన్యంలో తగిన బలం లేక ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో బోర్లాపడింది. ఈనెల 11న జరగబోయే మలివిడత జెడ్పీ ఎన్నికలపైనా బీజేపీతో పొత్తు ప్రభావం పార్టీని మరింత దెబ్బతీయనుంది.