రాయ‘బేరాలు’
- అసమ్మతివాదుల మచ్చికకు టీడీపీ ఆపసోపాలు
- భారీగా వెదజల్లుతున్న డబ్బులు
- ఆరు నియోజకవర్గాల్లో ఇదే తంతు
సాక్షి,విశాఖపట్నం : టీడీపీలో నేతల కొనుగోళ్లు ముమ్మరమయ్యాయి. తమకు సహకరించని నాయకులను దారికితెచ్చుకునేందుకు టీడీపీ అభ్యర్థులు పచ్చనోట్లు ఎడాపెడా అందజేస్తున్నట్లు తెలిసింది. అసమ్మతి లేకుండా భారీగా వెదజల్లుతున్నారు. టిక్కెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందంటూ అనేక మంది సీనియర్ నేతలు,నియోజకవర్గ ఇంఛార్జులు, ద్వితీయశ్రేణి నేతలు ఇంకా అసంతృప్తితో రగిలిపోతున్నారు.
టిక్కెట్లు దక్కిన నేతలకు సహకరించకుండా వెన్నుచూపుతున్నారు. ప్రచారగడువు దగ్గరపడుతుండడంతో టీడీపీ అభ్యర్థులు వీరిని దారికి తెచ్చుకునేందుకు పచ్చనోట్లు పారిస్తున్నారు. యలమంచిలో ఎదురుతిరిగిన ఓ నాయకునికి ఇదే విధంగా ముట్టజెప్పినట్లు చర్చ జరుగుతోంది. రూ.1.50కోట్ల వరకు చేతులు మారిందని సమాచారం. విశాఖ దక్షిణ అభ్యర్థి తనకు వ్యతిరేకంగా పనిచేస్తోన్న గ్రూపులను మచ్చిక చేసుకుని ఆ వర్గం ఓట్లను కాపాడుకునేందు కు రూ.50లక్షల వరకు వెచ్చించినట్లు క్యాడర్ చెవులు కొరుక్కుంటున్నారు.
ఇంకొందరు నేతలను బుజ్జగించే పనిలో మరికొన్ని బేరాలు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అనకాపల్లిలో స్థానికేతర అభ్యర్థిని బరిలోకి దించడంతో ఆగ్రహంగా ఉన్న భంగపడ్డ ఆశావహ నేతలు పీలాకు సహకరించకూడదని నిర్ణయించుకున్నారు. వీరి మద్దతులేనిదే ముందుకెళ్లడం కష్టం కావడంతో సదరు నేత ఇటీవల రూ.1కోటి వరకు బేరసారాలు సాగించి సఫమైనట్లు తెలుస్తోంది. విశాఖ ఉత్తరంలో సీటు దక్కించుకున్న బీజేపీ అభ్యర్థికి టీడీపీ నేతలు కనీసం సహకరించడంలేదు.
వీరిని దారికితెచ్చుకునేందుకు సదరు నేత ఇప్పటికే రూ.20లక్షలు వెచ్చించారు. నియోజకవర్గానికి పూర్తిగా కొత్తకావడంతో వార్డుస్థాయిలో ఒక్కొక్కరికి రూ.1లక్ష నుంచి రూ.3లక్షల వరకు వెదజల్లుతున్నారు. పాడేరులో ప్రవాస భారతీయుడు, బీజేపీ అభ్యర్థి లోకులగాంధీ రెబల్స్‌ను,నాయకులను మచ్చిక చేసుకునేందుకు రూ.25లక్షల నుంచి బేరసారాలు ప్రారంభించినట్లు సమాచారం.
భీమిలిలో ఓటమి భయంతో వణికిపోతున్న గంటా ఎడాపెడా పచ్చనోట్లను విసిరేస్తున్నారు. కార్యకర్తలు,ద్వితీయశ్రేణి నేతలను తనవైపు తిప్పుకుంటున్నారు. ఇక్కడ టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులను దారికితెచ్చుకునేందుకు రూ.70లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. ఇదికాక చోడవరం ,మాడుగులలో టీడీపీ అభ్యర్థులకు మండలస్థాయి క్యాడర్ సహకరించడంలేదు. వీరికి ఎంతివ్వాలనేదానిపై బేరాలు సా..గుతున్నాయి. గాజువాకలోనూ ఇదే తంతు.