సైకిల్ జోరు
- 11 అసెంబ్లీ, 1 లోక్‌సభస్థానంలో గెలుపు
- మన్యంలో వైఎస్సార్ సీపీ హవా
- 3 అసెంబ్లీ,1 లోక్‌సభ స్థానంలో ఘన విజయం
- విశాఖ లోక్‌సభ స్థానంలో బీజేపీ విజయం
- విశాఖ ఉత్తరంలో కమల వికాసం
సాక్షి, విశాఖపట్నం : రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో జిల్లా శ్రేణుల్లో సంబరాలు మిన్నంటుతున్నాయి. కొత్తగా ఎన్నికైనఎమ్మెల్యేలు, కార్యకర్తలు, నేతలు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవగానే తొలి రౌండ్ నుంచి టీడీపీ అభ్యర్థులు అనేకచోట్ల ఆధిక్యం ప్రదర్శించారు. పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ, వైఎస్సార్ సీపీ మధ్య నువ్వా, నేనా అన్నట్టు పోటీ జరిగింది. ఈ స్థానాల్లో మినహా మిగిలిన 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు రౌండ్‌రౌండ్‌కు మెజార్టీ పెంచుకుని విజయం దక్కించుకున్నారు.
జిల్లాలో ఎన్నికైన మొత్తం ఎమ్మెల్యేల్లో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు 47,833 ఓట్ల ఆధిక్యంతో అత్యధికంగా మెజార్టీ సాధించారు. చోడవరం నుంచి టీడీపీ అభ్యర్థి కేఎస్‌ఎన్‌రాజు 905 ఓట్ల మెజార్టీ సాధించారు. విశాఖ ఉత్తరం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా విష్ణుకుమార్ రాజు 18,240, విశాఖ దక్షిణం నుంచి వాసుపల్లి గణేష్‌కుమార్ (టీడీపీ) 18,322, విశాఖ పశ్చిమం నుంచి గణబాబు (టీడీపీ) 30,866, భీమిలి నుంచి గంటాశ్రీనివాసరావు (టీడీపీ) 37,674, గాజువాక నుంచి పల్లా శ్రీనివాస్ (టీడీపీ) 21,712, పెందుర్తి నుంచి బండారు సత్యనారాయణ (టీడీపీ) 18,506, అనకాపల్లి నుంచి పీలాగోవింద్ (టీడీపీ) 23,341, యలమంచిలి నుంచి పంచకర్ల రమేష్‌బాబు 8,478, పాయకరావుపేట నుంచి అనిత (టీడీపీ) 2,819, నర్సీపట్నం నుంచి అయ్యన్నపాత్రుడు (టీడీపీ) 2,338 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రెండోసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో వెలగపూడి, గంటా శ్రీనివాసరావు, అవంతి శ్రీనివాస్, పంచకర్ల రమేష్‌బాబు, కె.ఎస్.ఎన్.రాజు ఉన్నారు.
వైఎస్సార్ సీపీ, టీడీపీ, బీజేపీలకు చెరో ఎంపీ స్థానం
జిల్లాలోని మూడు లోక్‌సభ స్థానాలకు టీడీపీ, బీజేపీ, వైఎస్సార్ సీపీ చెరో స్థానాన్ని దక్కించుకున్నాయి. అరకు లోక్‌సభ స్థానం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొత్తపల్లి గీత 91,391 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. విశాఖ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబు 90,698 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి అవంతి శ్రీనివాస్ 47,840 ఓట్ల మెజార్టీతో గెలిచారు.