పసుపు..కాషాయం
- టీడీపీ, బీజేపీ పొత్తు ఖరారు
- బీజేపీకీ ఒక ఎంపీ... 4 అసెంబ్లీ స్థానాలు
- వరంగల్ తూర్పు, పశ్చిమ, జనగామ, భూపాలపల్లి కేటాయింపు
- వర్ధన్నపేటపై తొలగని అస్పష్టత
- మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం పోటీ
సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా బీజేపీకి జిల్లాలో ఒక లోక్‌సభ, నాలుగు అసెంబీ స్థానాలు దక్కాయి. వరంగల్ లోక్‌సభ స్థానంతో పాటు వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, జనగామ, భూపాలపల్లి అసెంబ్లీ స్థానాలను టీడీపీ.. బీజేపీకి కేటాయించింది. వర్ధన్నపేటను సైతం బీజేపీకే ఇవ్వగా.. ఈ సీటుకు బదులుగా స్టేషన్‌ఘన్‌పూర్ ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోంది.
వర్ధన్నపేటలో మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పోటీ చేయనున్న నేపథ్యంలో ఈ సెగ్మెంట్‌లో ఆయనకు మద్దతు తెలపాలని బీజేపీ ప్రాథమికంగా నిర్ణయింది. దీంతో స్టేషన్‌ఘన్‌పూర్ సీటు కోసం ఇంకా ప్రయత్నిస్తోంది. అయితే టీడీపీ దీనికి నిరాకరిస్తోంది. కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని సీపీఐకి ఇస్తే... స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఒకరు టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీని వల్లే టీడీపీ సైతం ఈ సీటు కోసం పట్టుబడుతున్నట్లు తెలిసింది.
టీడీపీతో పొత్తుపై బీజేపీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తును నిరసిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొందరు నేతలు పార్టీకి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రాజీనామా నిర్ణయాలు తీసుకోని చాలా మంది నేతలు అసంతృప్తితో ఎన్నికల్లో పనిచేయబోమని చెబుతున్నారు. బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీలోనూ అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి.
భూపాలపల్లి టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణరావు పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తన్నారు. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తుతో సత్యనారాయణకు పోటీ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు కూడా అలాగే జరగడంతో ఈయన స్వతంత్రంగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. పొత్తులతో అసంతృప్తులు ఎలా ఉన్నా... పోటీ చేసే స్థానాల సంఖ్య తేలడంతో రెండు పార్టీలు ఇప్పుడు అభ్యర్థుల ఖరారుపై దృష్టి పెట్టాయి.