socialist party
-
స్పెయిన్ ప్రధానిగా మళ్లీ పెడ్రో సాంచెజ్
మాడ్రిడ్: స్పెయిన్ ప్రధాని పీఠాన్ని సోషలిస్ట్ పార్టీకి చెందిన మరోసారి పెడ్రో సాంఛెజ్ అధిష్టించనున్నారు. గురువారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్‌లో 350 మందికి గాను 179 మంది ఎంపీలు ఆయనకు మద్దతు తెలిపారు. కేటలోనియా వేర్పాటు ఉద్యమ నేత చార్లెస్ పిడ్గెమాంట్కు క్షమాభిక్ష ప్రకటించేందుకు పెడ్రో సాంఛెజ్ అంగీకరించడం.. బదులుగా వేర్పాటువాద పార్టీలు ఆయన ప్రభుత్వంలో చేరేందుకు అంగీకరించడంతో మైనారిటీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. నూతన ప్రభుత్వంలో రెండు కేటలోనియా వేర్పాటువాద పార్టీలు సహా మొత్తం ఆరు చిన్న పార్టీలు భాగస్వాములు కానున్నాయి. జూలై 23న జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. 2017లో స్పెయిన్ నుంచి విడిపోతున్నట్లు కేటలోనియా వేర్పాటువాదులు ప్రకటించడంతో దేశంలో సంక్షోభం ఏర్పడింది. వేర్పాటువాద నేత చార్లెస్ పిడ్గెమాంట్ను ప్రభుత్వం నేరగాడిగా ప్రకటించింది. -
పోర్చుగల్‌లో సోషలిస్టుల గెలుపు
లిస్బన్: పోర్చుగల్‌లోని లెఫ్టిస్టు ఆలోచనాధోరణితో కూడిన సోషలిస్ట్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోమారు విజయం సాధించింది. కోవిడ్‌తో కునారిల్లిన పోర్చుగల్ ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు యూరోపియన్ యూనియన్ వందల కోట్ల యూరోల సాయాన్ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సోషలిస్టుపార్టీ మరోమారు విజయదుందుభి మోగించింది. కరోనా వైరస్ కేసుల పెరుగుదల సమయంలో జరిగిన ఈ ఎన్నికలలో 230 సీట్ల పార్లమెంటులో సోషలిస్టులు 106 సీట్లు గెలుచుకున్నారు. ఆదివారానికి ఎన్నికల్లో 98.5 శాతం ఓట్లను లెక్కించగా ఇందులో సోషలిస్టులు 41 శాతం ఓట్లను పొందారు. సోషలిస్టుల ప్రధాన ప్రత్యర్థి సెంటర్–రైట్ సోషల్ డెమోక్రటిక్ పార్టీకి 28 శాతం ఓట్లు వచ్చాయి. ఈ పార్టీ 65 పార్లమెంటరీ స్థానాలను గెలుచుకుంది. దేశంలోని 1.08 కోట్ల అర్హులైన ఓటర్లలో ఈ దఫా విదేశాల్లో నివసిస్తూ మెయిల్ ద్వారా ఓటు వేసే 15 లక్షల మంది ఓట్లను పరిగణనలోకి తీసుకోలేదు. మరోదఫా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న ప్రధాని ఆంటినో కోస్టాకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పోర్చుగల్‌తో బలమైన బంధాన్ని కోరుకుంటున్నామన్నారు. 116 సీట్ల మెజార్టీ.. పార్లమెంట్లో మెజార్టీకి అవసరమైన 116 సీట్లను సోషలిస్టులు గెలుచుకుంటారా? లేక చిన్న పార్టీల మద్దతు అవసరంపడుతుందా అనే విషయమై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. పోర్చుగీస్ టెలివిజన్ చానెళ్ల ప్రత్యేక ఎగ్జిట్ పోల్స్ మాత్రం సోషలిస్టులకు పూర్తి మెజార్టీ రావచ్చని అంచనా వేశాయి. పోర్చుగల్‌లో కొత్త ప్రభుత్వంపై అంచనాలు అధికంగా ఉన్నాయి. పశ్చిమ యూరప్‌లో పేదదైన ఈ దేశానికి ఈయూ 5000 కోట్ల డాలర్ల సాయం అందించనుంది. ఈ మొత్తంలో మూడింట రెండు వంతులు ప్రధాన మౌలిక సదుపాయాలు కోసం ఉద్దేశించారు. మిగిలిన మొత్తాన్ని ప్రైవేట్ కంపెనీలకు అందిస్తారు. పార్లమెంట్లో పూర్తి మెజార్టీ ఉన్న ప్రభుత్వం ఏర్పడితే ఈ నిధుల కేటాయింపు, వ్యయం సజావుగా సాగుతాయని నిపుణులు భావిస్తున్నారు. 2022 కోసం అప్పటి మైనారిటీ సోషలిస్ట్ ప్రభుత్వం రూపొందించిన వ్యయ ప్రణాళికను పార్లమెంటు గత నవంబర్‌లో తిరస్కరించింది. దీంతో నూతన వ్యయప్రణాళిక అమలుకు స్థిర ప్రభుత్వ అవసరం ఉంది. 2015లో అధికారంలోకి వచ్చినప్పటి నుండి, వార్షిక బడ్జెట్‌ను ఆమోదానికి ప్రతిసారీ మిత్రపక్షాలైన లెఫ్ట్ బ్లాక్, పోర్చుగీస్ కమ్యూనిస్ట్ పార్టీల మద్దతుపై సోషలిస్టు పార్టీ ఆధారపడుతోంది. కానీ రెండు నెలల క్రితం ఈపార్టీల మధ్య విభేదాలు ముదిరాయి. దీంతో పార్లమెంట్లో సోషలిస్ట్ ప్రధాన మంత్రి ఆంటినో కోస్టాకు మెజార్టీ మద్దతు గగనమైంది. ఈ ఎన్నికల్లో మెజార్టీ సోషలిస్టులకు తగినంత బలాన్ని ఇవ్వనుంది. చేగా.. గెలుపు పోర్చుగల్‌లో వరుసగా రెండుమార్లు సోషలిస్టు పార్టీనే అధికారంలో ఉంది. దీని ప్రధాన ప్రత్యర్థి సోషల్ డెమొక్రాటిక్ పార్టీ. ఈ రెండు పార్టీలే దేశంలో దశాబ్దాలుగా అధికారం అనుభవిస్తున్నాయి. కానీ ఈసారి చేగా అనే పార్టీ సత్తా చూపింది. మూడు సంవత్సరాల క్రితం దేశంలో ఆవిర్భవించిన ప్రజాకర్షక మరియు జాతీయవాద పార్టీ చేగా (చాలు అని అర్థం) ఈ ఎన్నికల్లో 5– 8 శాతం ఓట్లను కొల్లగొట్టినట్లు ఆర్టీపీ పోల్స్ అంచనా వేసింది. దీంతో ఈ పార్టీకి పార్లమెంట్లో 13 సీట్లు దక్కవచ్చని అంచనా. గత ఎన్నికల్లో ఈ పార్టీ కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. పోర్చుగీస్ కమ్యూనిస్ట్ పార్టీకి 3– 5 శాతం ఓట్లు లభించాయి. ఈ ఎన్నికల్లో 46– 51 శాతం మధ్య పోలింగ్ నమోదైంది. 2019 ఎన్నికల్లో 48.6 శాతం పోలింగ్ నమోదైంది. కరోనా కారణంగా అర్హులైన ఓటర్లలో దాదాపు 10 లక్షలమంది ఇంకా ఐసోలేషన్‌లోనే ఉన్నారు. దేశాధ్యక్షుడు మార్సెలో రెబోలో డీసౌజా సైతం ఓటు వేయమని ప్రజలకు పిలుపునిచ్చారు. -
అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నా..
సాక్షి,సిటీబ్యూరో: ‘వైవిధ్యభరితమైన హైదరాబాద్ సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. శతాబ్దాల నాటి చారిత్రక వారసత్వ కట్టడాలు మసకబారుతున్నాయి. ఇప్పటికే వందలాది చెరువులు, కుంటలు, నీటి వనరులు కబ్జాలకు గురయ్యాయి. వరదలతో నాలాలు ఉప్పొంగుతున్నాయి. నగర జీవనం అస్తవ్యస్తమవుతోంది. క్రమంగా అస్తిత్వాన్ని కోల్పోతోంది. ఈ ముప్పు నుంచి నగరాన్ని కాపాడుకోవాలి’.. అంటున్నారు. ప్రముఖ సామాజిక కార్యకర్త లుబ్నా సార్వత్. నగరంలో నీటి వనరుల పరిరక్షణ కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తోన్న ఆమె ఆ లక్ష్య సాధన కోసం ఎన్నికలను ప్రచార అస్త్రంగా చేసుకున్నారు. ఆ లక్ష్యంతోనే ఎన్నికల బరిలోకి దిగారు. వారసత్వ కట్టడాలకు నెలవైన కార్వాన్ నియోజకవర్గం నుంచి సోషలిస్టు (ఇండియా) పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఆమ్ ఆద్మీ నుంచి హైదరాబాద్ ఎంపీ పదవి కోసం పోటీ చేశారు. ‘నాలుగున్నరేళ్ల క్రితం ఎంపీ అభ్యర్థిగా నగరంలో విస్తృతంగా పర్యటించాను. అన్ని వర్గాల ప్రజలను కలిసాను. అప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఇప్పుడూ ప్రజలు అవే సమస్యలను ఎదుర్కొంటున్నారు. అప్పటికి ఇప్పటికీ నగర పర్యావరణానికి ముప్పు రెట్టింపైంది’ అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారామె. ఎన్నికల బరిలోకి దిగిన ఆమె ‘సాక్షి’తో పలు అంశాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. జీవన ప్రమాణాల నాణ్యత పడిపోయింది ప్రజల జీవన ప్రమాణాల్లో నాణ్యత పూర్తిగా పడిపోయింది. తెలంగాణ వల్ల ఎలాంటి మెరుగైన అవకాశాలు లభించలేదు. సాంకేతిక పరిజ్ఞానం మానవ అభివృద్ధి కాదు. పర్యావరణం బాగా దెబ్బతింది. భూగర్భ జలాలు చెడిపోయాయి. చెరువులన్నీ కుంచించుకొనిపోయాయి. ప్రజల సంతోషం ఆవిరైపోయింది. ఏ ఒక్క రంగంలోనూ తెలంగాణకు ముందు, తర్వాత అని చెప్పుకోదగిన అభివృద్ధి కనిపించడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం గ్రేటర్లో 185 చెరువులు ఉన్నాయి. కానీ అంతకంటే ఎక్కువే కబ్జాకు గురయ్యాయి. జలగం వెంగళరావు పార్కులో పెద్ద చెరువు ఉండేది. ఇప్పుడది చిన్న నీటి కుంటలా మారింది. ఇందిరాపార్కులో పెద్ద చెరువు ఉండేది. హుస్సేన్ సాగర్ నాలాను ఈ చెరువులోకి మళ్లించేవారు. ఇప్పుడు చెరువును కుదించారు. నాలాను ముసేశారు. చెరువులోకి వరదనీరు చేరడం వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లిందో గతంలోనే చూశాం. పబ్లిక్‌గార్డెన్, మాసబ్ ట్యాంక్ సహా అనేక చెరువులు ఇలాగే కుంచించుకుపోయాయి. దీంతో వరదనీటితో నాలాలు ఉప్పొంగి జనావాలను ముంచెత్తుతోంది. హుస్సేన్ సాగర్ కాలుష్య కాసారంగా మారింది. ప్రక్షాళన కాగితాలకే పరిమితమైంది. కార్వాన్ నుంచే ఎందుకంటే.. అతి పురాతనమైన నగరం కార్వాన్. ఒకప్పుడు ఇక్కడ రతనాలు, ముత్యాలు, వజ్రాలు రాశులుగా పోసి విక్రయించేవారట. అలాంటి కార్వాన్ పురాతన వైభవం ఇప్పుడు పూర్తిగా కనుమరుగైంది. గొప్పగొప్ప చారిత్రక వారసత్వ కట్టడాలు మసకబారాయి. గోల్కొండ కోట, టూంబ్స్, నయాఖిల్లా, పాతబస్తీలో ఉన్న చారిత్రక కట్టడాలకు రక్షణ లేకుండా పోయింది. చారిత్రక, వారసత్వ కట్టడాలకు విఘాతం కలిగించే గోల్ఫ్ కోర్సులోచ్చాయి. ఇక కోట చుట్టూ ఉన్న చెరువులు లంగర్‌హౌస్ చెరువు, జమాల్ చెరువు, నయాఖిల్లా చెరువు, షాహతమ్ చెరువు, జమాలీకుంట వంటివి చాలా వరకు కబ్జాకు గురయ్యాయి. పేద ప్రజలు ఏం తిని బతుకుతారు? పాతబస్తీతో పాటు, అనేక చోట్ల దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేద ప్రజలు వంటగ్యాస్ కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు. రూ.1000 గ్యాస్ ధర వారికి భారంగా మారింది. ఎప్పుడో వచ్చే సబ్సిడీ కోసం ఇప్పుడు ఆ వెయ్యి రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలంటూ చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికీ వంటగ్యాస్ అని గొప్పగా చెప్పినా, ఆ గ్యాస్ కొనుక్కోలేని స్థితిలో తిరిగి కట్టెల పొయ్యినే ఆశ్రయిస్తున్నారు. వినూత్నంగా ప్రచారం.. పర్యావరణ పరిరక్షణ కోసం ఎన్నికల ప్రచారంలో ఫ్లెక్సీలు, బ్యానర్లు, ప్లాస్టిక్ వస్తువులకు బదులు కాటన్ బ్యానర్లను మాత్రమే వినియోగిస్తాం. సీఎన్జీతో నడిచే ఆటో రిక్షాలనే వినియోగిస్తాం. నా వల్ల నగరంలో కార్బన్ స్థాయి ఏ మాత్రం పెరగకుండా జాగ్రత్తలు పాటిస్తాను. అన్ని రాజకీయ పార్టీలు పర్యావరణహితంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే బాగుంటుంది. -
మహానుభావుడు... మరి లేరు
సాక్షి, న్యూఢిల్లీ : జస్టిస్ రాజిందర్ సచార్. నిన్న (శుక్రవారం) ఢిల్లీలో కన్నుమూశారు. ఆయనకు 95 ఏళ్లు. ఆయన్ని ఎన్నో రకాలుగా గుర్తించుకోవచ్చు. అయినప్పటికీ మెయిన్ మీడియా ఆయనను ఎందుకు విస్మరించిందో తెలియదు. రాజిందర్ సచార్ ఢిల్లీ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. పౌరుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తే కాకుండా సోషలిస్ట్ పార్టీలో పనిచేసిన వారు. రాజకీయ కుటుంబానికి చెందిన వారు. ఆయన తండ్రి భీమ్ సేన్ సచార్ పంజాబ్‌కు రెండుదసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పాలక ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఎప్పుడూ ముందుండే వారు. భారత తొలి ప్రధాన మంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1953 ప్రాంతంలో అప్పడు పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న భీమ్ సేన్ సచార్ నివాసానికి విందు భోజనానికి హాజరయ్యారు. ఆ విషయాన్ని ఆయన ముందుగానే తన కుమారుడైన రాజిందర్ సచార్‌కు గొప్పగా చెప్పి, తమతోపాటు అల్పాహార విందుకు ఉండాలని కోరారట. మామూలుగా అయితే ఉండేవాణ్నేమోగానీ, నెహ్రూ వస్తున్నానంటే అసలే ఉండనంటూ రాజిందర్ సచార్ బయటకు వెళ్లిపోయారట. అప్పటికే రాజిందర్ సచార్ సోషలిస్ట్ పార్టీలో చేరి కాంగ్రెస్ విధానాలను విమర్శిస్తున్నారు. ప్రేమ్ సింగ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాజిందర్ సచార్ 1948లో సోషలిస్ట్ పార్టీలో చేరారు. నెహ్రూతోని అల్పాహార విందుకు హాజరుకానందుకు కాంగ్రెస్ పార్టీ తనకు ఎలాంటి హాని చేయలేదంటూ అప్పుడప్పుడు ఆయన ఆ పార్టీపై చురకలేసేవారు. దేశంలో ముస్లింల స్థితిగతులు, అభ్యున్నతి, తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాన మంత్రి వేసిన ఉన్నతస్థాయి కమిటీకి రాజిందర్ సచార్ చైర్‌పర్సన్‌గా వ్యవరించి ఓ సుదీర్ఘ నివేదికను సమర్పించారు. 2006లో వెలుగుచూసిన ఆ నివేదిక పట్ల పలు సామాజిక వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయి. దేశంలో ఎస్టీ, ఎస్సీలకన్నా ముస్లింలు బాగా వెనకబడి ఉన్నారని, ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటి ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో కేవలం 3.2 శాతం మంది మాత్రమే ముస్లింలు ఉన్నారని ఆయన నివేదిక వెల్లడించింది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలోనే ముస్లింలు మెరుగైన పరిస్థితుల్లో బతుకుతున్నారని, అందుకు కారణం ముస్లింలకు కొంత మేరకు రిజర్వేషన్లు కల్పించడమేనని కూడా ఆయన నివేదిక పేర్కొంది. వామపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముస్లింల పరిస్థితి మెరుగ్గా ఉందనే భ్రమ అప్పట్లో ఉండేది. అదంతా ఒట్టిదని, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే ముస్లింలు దేశంలోకెల్లా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని, 2011లో ఆ రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వం పడిపోవడానికి ముస్లింల వ్యతిరేకతే కారణమని కూడా సచార్ నివేదిక వెల్లడించింది. దేశంలో ముస్లింల అభ్యున్నతి కోసం జస్టిస్ రాజిందర్ సచార్ కమిటీ చేసిన సిఫార్సులను అమలు చేయాలని పలు పార్టీల నుంచి నేటికి డిమాండ్ వినిపిస్తూనే ఉంటోంది. -
సోషలిస్టు పాలనకు తెర
వెనుజువెలాలో ప్రతిపక్షాల ప్రజాస్వామ్య ఐక్య కూటమి విజయం కారకస్: వెనుజువెలాలో 17 ఏళ్లుగా సాగుతున్న సోషలిస్టు పార్టీ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. తాజా ఎన్నికల్లో విపక్షాల కూటమి విజయం సాధించింది. మొత్తం 167 స్థానాలున్న నేషనల్ అసెంబ్లీలో విపక్షాల ఐక్య ప్రజాస్వామ్య కూటమి 99 స్థానాల్లో గెలిచింది. అధికార సోషలిస్టు పార్టీకి కేవలం 46 స్థానాలే దక్కాయి. మిగిలిన 22 సీట్లలో మరికొన్నింటిని గెలిస్తే మూడింట రెండొంతుల మెజారిటీతో పాలనాయంత్రాంగంపై అధ్యక్షుడు నికోలస్‌కు ఉన్న పట్టును దెబ్బకొట్టే అవకాశముంది. తప్పనిసరిగా ఓటు వేయాల్సిన అవసరం లేదన్న నిబంధన జారీ చేసిన తర్వాత గత 17 ఏళ్ల లో తొలిసారిగా ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 74 శాతం ఓటింగ్ నమోదైంది. హ్యూగో చావెజ్ సారథ్యంలో 17 ఏళ్ల క్రితం సోషలిస్టు విప్లవం విజయవంతమైనప్పటి నుంచి ఆయన పాలనాపగ్గాలు చేపట్టారు. 2013లో చావెజ్ మరణం తర్వాత నికోలస్ మదురో దేశాధ్యక్షుడయ్యారు. సోషలిస్టు పార్టీ ఓటమి ఖరారు కావడంతో కారకస్, ఇతర ప్రాంతాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకన్నారు. గత ఏడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఆందోళనలో ప్రజల రక్తం చిందిన ప్రదేశంలో ఎర్రచొక్కాలను దహనం చేశారు. నికోలస్ ఓటమిని అంగీకరిస్తూనే అమెరికా కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ సంప్రదాయ ప్రతిఘాతుక విప్లవం ద్వారా తన పాలనను అస్థిరపర్చిందని, ఆర్థిక యుద్ధం విజయం సాధించిందన్నారు. కాగా దేశంలో మార్పు ప్రారంభమైందని విపక్షాలు అన్నాయి. దేశంలో అంతటా సరుకులు, ఇతరత్రా కొరతలు ఏర్పడ్డాయని, కరెన్సీ విలువ దిగజారిందన్నారు. వెనుజువెలా ఫలితాలు లాటిన్ అమెరికాలోని వామపక్షాలకు పెద్ద దెబ్బే. కొన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థ క్రమేణా అస్తవ్యస్తం కావడం, అవినీతి పెరిగిపోవడంతో ఓటర్లు విసిగిపోయారు. -
పసుపు..కాషాయం
టీడీపీ, బీజేపీ పొత్తు ఖరారు బీజేపీకీ ఒక ఎంపీ... 4 అసెంబ్లీ స్థానాలు వరంగల్ తూర్పు, పశ్చిమ, జనగామ, భూపాలపల్లి కేటాయింపు వర్ధన్నపేటపై తొలగని అస్పష్టత మిగిలిన స్థానాల్లో తెలుగుదేశం పోటీ సాక్షిప్రతినిధి, వరంగల్ : తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా బీజేపీకి జిల్లాలో ఒక లోక్‌సభ, నాలుగు అసెంబీ స్థానాలు దక్కాయి. వరంగల్ లోక్‌సభ స్థానంతో పాటు వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, జనగామ, భూపాలపల్లి అసెంబ్లీ స్థానాలను టీడీపీ.. బీజేపీకి కేటాయించింది. వర్ధన్నపేటను సైతం బీజేపీకే ఇవ్వగా.. ఈ సీటుకు బదులుగా స్టేషన్‌ఘన్‌పూర్ ఇవ్వాలని బీజేపీ పట్టుబడుతోంది. వర్ధన్నపేటలో మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పోటీ చేయనున్న నేపథ్యంలో ఈ సెగ్మెంట్లో ఆయనకు మద్దతు తెలపాలని బీజేపీ ప్రాథమికంగా నిర్ణయింది. దీంతో స్టేషన్‌ఘన్‌పూర్ సీటు కోసం ఇంకా ప్రయత్నిస్తోంది. అయితే టీడీపీ దీనికి నిరాకరిస్తోంది. కాంగ్రెస్ పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని సీపీఐకి ఇస్తే... స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఒకరు టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీని వల్లే టీడీపీ సైతం ఈ సీటు కోసం పట్టుబడుతున్నట్లు తెలిసింది. టీడీపీతో పొత్తుపై బీజేపీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తును నిరసిస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొందరు నేతలు పార్టీకి దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. రాజీనామా నిర్ణయాలు తీసుకోని చాలా మంది నేతలు అసంతృప్తితో ఎన్నికల్లో పనిచేయబోమని చెబుతున్నారు. బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీలోనూ అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. భూపాలపల్లి టీడీపీ నియోజకవర్గ ఇంచార్జీ గండ్ర సత్యనారాయణరావు పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తుతో సత్యనారాయణకు పోటీ చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు కూడా అలాగే జరగడంతో ఈయన స్వతంత్రంగా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. పొత్తులతో అసంతృప్తులు ఎలా ఉన్నా... పోటీ చేసే స్థానాల సంఖ్య తేలడంతో రెండు పార్టీలు ఇప్పుడు అభ్యర్థుల ఖరారుపై దృష్టి పెట్టాయి. -
చట్టసభలకు నో ఎంట్రీ
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : అన్నింటా సగం అంటున్నా... అతి ముఖ్యమైన చట్టసభలకు మాత్రం మహిళలకు అవకాశం రావడం లేదు. రాజకీయ వేదికలపై మహిళా సాధికారతపై ఉపన్యాసాలతో కలల ప్రపంచాన్ని చూపించే నేతలు వాస్తవ స్థితిలో చట్టసభల దరిచేరనీయడం లేదు. దశాబ్దకాలంగా జిల్లానుంచి ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యే, ఎంపీగా చట్టసభల్లోకి ప్రవేశించిన దాఖలా లేదు. జిల్లాలో మహిళల పట్ల వివక్షతను చూపించడంలో అన్ని పార్టీలదీ ఒకే వైఖరి. జిల్లాలో 13 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా, ఈ నియోజకవర్గాల్లో పురుషాధిక్యతే కొనసాగుతూ వస్తోంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉండడం, చట్టసభల్లో లేకపోవడంతో అన్ని పార్టీలు మహిళలను స్థానిక పదవులకే పరిమితం చేస్తున్నాయి. చివరిసారిగా 1999లో సుగుణకుమారి పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించి, 2004 వరకు కొనసాగారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మరే మహిళా నాయకురాలు జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీ పదవులను అలంకరించలేదు. అంతకుముందు కూడా చరిత్ర గొప్పగా లేదు. 62 ఏళ్ల గణతంత్ర రాజకీయ చరిత్రలో జిల్లా నుంచి ఇప్పటివరకు నలుగురు మహిళలకు మాత్రమే చట్టసభలకు వెళ్లే అవకాశం లభించింది. అందులో ఒకరు కేవలం ఆరు నెలలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముగ్గురు ఎమ్మెల్యేలుగా, ఒకరు ఎంపీగా విజయం సాధించి మహిళలకు అవకాశం కల్పిస్తే సత్తా చాటుతామని ప్రపంచానికి తెలియచేశారు. 1952లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ తరపున రాజమణిదేవి ఎమ్మెల్యేగా గెలిచి జిల్లా నుంచి తొలిసారి చట్టసభలకు వెళ్లిన మహిళగా రికార్డుకెక్కారు. 1972లో అప్పటి నుస్తులాపూర్ నియోజకవర్గంలో ఇందిరాకాంగ్రెస్ పార్టీ నుంచి ప్రేమలతాదేవి ఎన్నికయ్యారు. నగరంలోని కార్ఖానగడ్డకు చెందిన ప్రేమలతాదేవి అంతకుముందు 1964లో ఇన్చార్జి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా, 1965 నుంచి 68 వరకు చైర్‌పర్సన్‌గా పనిచేశారు. 1998లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి మెట్పల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొమొరెడ్డి జ్యోతి ఆరు నెలల స్వల్పకాలంతోనే సరిపెట్టుకున్నారు. అనంతరం ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేదు. సుగుణకుమారి పెద్దపల్లి నుంచి మూడు పర్యాయాలు టీడీపీ నుంచి పోటీచేసి 1998, 1999లో రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. రెండు మార్లు రాజకీయ దిగ్గజం వెంకటస్వామిని ఓడించి మహిళలకు అవకాశం కల్పిస్తే చరిత్ర తిరుగరాస్తారని నిరూపించారు. ఆ తరువాత ఇప్పటివరకు ఎవరికీ అవకాశం దక్కలేదు సరికాదా, సుగుణకుమారికి మినహా ఇప్పటివరకు ఏ పార్టీ కూడా మహిళలకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం అడపాదడపా తప్ప మహిళలకు పోటీచేసే భాగ్యం కూడా దక్కకపోవడం దారుణం. గుడ్ల మంజుల, గండ్ర నళిని, బల్మూరి వనిత, అంబళ్ల భాగ్యవతి తదితరులకు మాత్రమే వివిధ పార్టీల నుంచి కనీసం ఎమ్మెల్యేలుగా పోటీచేసే అవకాశం దక్కింది. తెలంగాణ రాష్ట్రంలోనూ అంతే... గత వివక్షతకు కొనసాగింపా... అన్నట్లు... తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 2014 సాధారణ ఎన్నికల్లో కూడా ఏ పార్టీ నుంచి మహిళలు చట్టసభలకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు. కాంగ్రెస్, టీఆర్ఎస్లలో జిల్లా, రాష్ట్ర స్థాయి పార్టీ పదవుల్లో మహిళా నేతలు ఉన్నప్పటికీ, ఎన్నికల్లో మాత్రం వారికి అవకాశం దక్కేట్లు కనిపించడం లేదు. రాజకీయ పార్టీల్లో పురుషాధిక్యం మూలంగా తెలంగాణ రాష్ట్రంలోనూ తొలి ఎమ్మెల్యే, ఎంపీలుగా చట్టసభల్లోకి ప్రవేశించే అవకాశం మహిళలకు కనిపించడం లేదు.