చట్టసభలకు నో ఎంట్రీ | No entry to the legislature | Sakshi
Sakshi News home page

చట్టసభలకు నో ఎంట్రీ

Published Sat, Mar 8 2014 4:08 AM | Last Updated on Sat, Sep 2 2017 4:27 AM

No entry to the legislature

కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : అన్నింటా సగం అంటున్నా... అతి ముఖ్యమైన చట్టసభలకు మాత్రం మహిళలకు అవకాశం రావడం లేదు. రాజకీయ వేదికలపై మహిళా సాధికారతపై ఉపన్యాసాలతో కలల ప్రపంచాన్ని చూపించే నేతలు వాస్తవ స్థితిలో చట్టసభల దరిచేరనీయడం లేదు. దశాబ్దకాలంగా జిల్లానుంచి ఒక్క మహిళ కూడా ఎమ్మెల్యే, ఎంపీగా చట్టసభల్లోకి ప్రవేశించిన దాఖలా లేదు. జిల్లాలో మహిళల పట్ల వివక్షతను చూపించడంలో అన్ని పార్టీలదీ ఒకే వైఖరి.
 
 జిల్లాలో 13 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉండగా, ఈ నియోజకవర్గాల్లో పురుషాధిక్యతే కొనసాగుతూ వస్తోంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉండడం, చట్టసభల్లో లేకపోవడంతో అన్ని పార్టీలు మహిళలను స్థానిక పదవులకే పరిమితం చేస్తున్నాయి. చివరిసారిగా 1999లో సుగుణకుమారి పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించి, 2004 వరకు కొనసాగారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మరే మహిళా నాయకురాలు జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీ పదవులను అలంకరించలేదు. అంతకుముందు కూడా చరిత్ర గొప్పగా లేదు. 62 ఏళ్ల గణతంత్ర రాజకీయ చరిత్రలో జిల్లా నుంచి ఇప్పటివరకు నలుగురు మహిళలకు మాత్రమే చట్టసభలకు వెళ్లే అవకాశం లభించింది.
 
 అందులో ఒకరు కేవలం ఆరు నెలలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముగ్గురు ఎమ్మెల్యేలుగా, ఒకరు ఎంపీగా విజయం సాధించి మహిళలకు అవకాశం కల్పిస్తే సత్తా చాటుతామని ప్రపంచానికి తెలియచేశారు. 1952లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి సోషలిస్టు పార్టీ తరపున రాజమణిదేవి ఎమ్మెల్యేగా గెలిచి జిల్లా నుంచి తొలిసారి చట్టసభలకు వెళ్లిన మహిళగా రికార్డుకెక్కారు. 1972లో అప్పటి నుస్తులాపూర్ నియోజకవర్గంలో ఇందిరాకాంగ్రెస్ పార్టీ నుంచి ప్రేమలతాదేవి ఎన్నికయ్యారు. నగరంలోని కార్ఖానగడ్డకు చెందిన ప్రేమలతాదేవి అంతకుముందు 1964లో ఇన్‌చార్జి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా, 1965 నుంచి 68 వరకు చైర్‌పర్సన్‌గా పనిచేశారు. 1998లో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ నుంచి మెట్‌పల్లి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొమొరెడ్డి జ్యోతి ఆరు నెలల స్వల్పకాలంతోనే సరిపెట్టుకున్నారు. అనంతరం ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేదు. సుగుణకుమారి పెద్దపల్లి నుంచి మూడు పర్యాయాలు టీడీపీ నుంచి పోటీచేసి 1998, 1999లో రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు.
 
 రెండు మార్లు రాజకీయ దిగ్గజం వెంకటస్వామిని ఓడించి మహిళలకు అవకాశం కల్పిస్తే చరిత్ర తిరుగరాస్తారని నిరూపించారు. ఆ తరువాత ఇప్పటివరకు ఎవరికీ అవకాశం దక్కలేదు సరికాదా, సుగుణకుమారికి మినహా ఇప్పటివరకు ఏ పార్టీ కూడా మహిళలకు ఎంపీ టికెట్ ఇవ్వలేదు. 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం అడపాదడపా తప్ప మహిళలకు పోటీచేసే భాగ్యం కూడా దక్కకపోవడం దారుణం. గుడ్ల మంజుల, గండ్ర నళిని, బల్మూరి వనిత, అంబళ్ల భాగ్యవతి తదితరులకు మాత్రమే వివిధ పార్టీల నుంచి కనీసం ఎమ్మెల్యేలుగా పోటీచేసే అవకాశం దక్కింది.
 
 తెలంగాణ రాష్ట్రంలోనూ అంతే...
 గత వివక్షతకు కొనసాగింపా... అన్నట్లు... తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న 2014 సాధారణ ఎన్నికల్లో కూడా ఏ పార్టీ నుంచి మహిళలు చట్టసభలకు వెళ్లే అవకాశం కనిపించడం లేదు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లలో జిల్లా, రాష్ట్ర స్థాయి పార్టీ పదవుల్లో మహిళా నేతలు ఉన్నప్పటికీ, ఎన్నికల్లో మాత్రం వారికి అవకాశం దక్కేట్లు కనిపించడం లేదు.
 
 రాజకీయ పార్టీల్లో పురుషాధిక్యం మూలంగా తెలంగాణ రాష్ట్రంలోనూ తొలి ఎమ్మెల్యే, ఎంపీలుగా చట్టసభల్లోకి ప్రవేశించే అవకాశం మహిళలకు కనిపించడం లేదు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement