సోషలిస్టు పాలనకు తెర
వెనుజువెలాలో ప్రతిపక్షాల ప్రజాస్వామ్య ఐక్య కూటమి విజయం
కారకస్: వెనుజువెలాలో 17 ఏళ్లుగా సాగుతున్న సోషలిస్టు పార్టీ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. తాజా ఎన్నికల్లో విపక్షాల కూటమి విజయం సాధించింది. మొత్తం 167 స్థానాలున్న నేషనల్ అసెంబ్లీలో విపక్షాల ఐక్య ప్రజాస్వామ్య కూటమి 99 స్థానాల్లో గెలిచింది. అధికార సోషలిస్టు పార్టీకి కేవలం 46 స్థానాలే దక్కాయి. మిగిలిన 22 సీట్లలో మరికొన్నింటిని గెలిస్తే మూడింట రెండొంతుల మెజారిటీతో పాలనాయంత్రాంగంపై అధ్యక్షుడు నికోలస్‌కు ఉన్న పట్టును దెబ్బకొట్టే అవకాశముంది. తప్పనిసరిగా ఓటు వేయాల్సిన అవసరం లేదన్న నిబంధన జారీ చేసిన తర్వాత గత 17 ఏళ్ల లో తొలిసారిగా ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 74 శాతం ఓటింగ్ నమోదైంది. హ్యూగో చావెజ్ సారథ్యంలో 17 ఏళ్ల క్రితం సోషలిస్టు విప్లవం విజయవంతమైనప్పటి నుంచి ఆయన పాలనాపగ్గాలు చేపట్టారు.
2013లో చావెజ్ మరణం తర్వాత నికోలస్ మదురో దేశాధ్యక్షుడయ్యారు. సోషలిస్టు పార్టీ ఓటమి ఖరారు కావడంతో కారకస్, ఇతర ప్రాంతాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకన్నారు. గత ఏడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఆందోళనలో ప్రజల రక్తం చిందిన ప్రదేశంలో ఎర్రచొక్కాలను దహనం చేశారు. నికోలస్ ఓటమిని అంగీకరిస్తూనే అమెరికా కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ సంప్రదాయ ప్రతిఘాతుక విప్లవం ద్వారా తన పాలనను అస్థిరపర్చిందని, ఆర్థిక యుద్ధం విజయం సాధించిందన్నారు. కాగా దేశంలో మార్పు ప్రారంభమైందని విపక్షాలు అన్నాయి.
దేశంలో అంతటా సరుకులు, ఇతరత్రా కొరతలు ఏర్పడ్డాయని, కరెన్సీ విలువ దిగజారిందన్నారు. వెనుజువెలా ఫలితాలు లాటిన్ అమెరికాలోని వామపక్షాలకు పెద్ద దెబ్బే. కొన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థ క్రమేణా అస్తవ్యస్తం కావడం, అవినీతి పెరిగిపోవడంతో ఓటర్లు విసిగిపోయారు.