Nicholas
-
Britain: భార్యను 224 ముక్కలుగా నరికేశాడు
లండన్: భార్యను భర్త హత్యచేసి ఏకంగా 224 ముక్కలుగా నరికి మృతదేహాన్ని మాయంచేసిన దారుణ ఘటన బ్రిటన్‌లో చోటుచేసుకుంది. నికొలస్ మెట్సన్ (28), హోలీ బ్రామ్లీ (26) లింకన్ సిటీలోని బస్సింగ్హామ్లో ఉంటున్నారు. గత నెల 17 నుంచి బ్రామ్లీ కనిపించట్లేదని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆమె తనను చితకబాది వెళ్లిపోయిందని పోలీసులకు నికొలస్ చెప్పాడు. ఫ్లాట్‌ను తనిఖీ చేయగా పెద్ద మొత్తంలో రక్తపు మరకలు, అతిగా శుభ్రం చేసినట్లు అమ్మోనియా, బ్లీచింగ్ ఆనవాళ్లు కనిపించాయి. దాంతో అతన్ని అరెస్ట్‌చేసి విచారణ మొదలెట్టారు. తనకేం తెలీదని మెట్సన్ తొలుత వాదించాడు. ఈలోపు సమీపంలోని విథమ్ నదిలో నరికిన చేయి సహా చిన్నిచిన్న శరీరభాగాలున్న ప్లాస్టిక్ బ్యాగులు కొట్టుకుపోవడం చూసి స్థానికుడు పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసు గజ ఈతగాళ్లు వాటిని సేకరించి ల్యాబ్‌కు పంపించారు. అసలేమాత్రం గుర్తుపట్టలేనంతగా హోలీ బ్రామ్లీ శరీరాన్ని పలుమార్లు పొడిచి 224 ముక్కలుగా నరికి భర్త నదిలో పడేశాడు. శరీరభాగాలను పడేయటంతో సాయపడినట్లు భర్త స్నేహితుడు జాషువా హ్యాన్‌కాక్ తన నేరాన్ని అంగీకరించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఎట్టకేలకు భర్త తన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఆమె చంపడానికి ముందు పెంపుడు కుక్క పిల్ల, పెంపుడు ఎలుకలనూ చంపేశాడు. తన మాజీ జీవితభాగస్వాములనూ మెట్సన్ హింసించినట్లు 2013, 2016, 2017 పోలీసు రికార్డుల్లో ఉంది. జంతువుల పట్ల అతను అమానుషంగా ప్రవర్తించేవాడని పోలీసు విచారణలో వెల్లడైంది. హత్యచేసి దాదాపు వారంపాటు శరీరం ముక్కలున్న బ్యాగులను దాచి తర్వాత వాటిని పడేశాడు. హత్య తర్వాత భార్య బ్యాంక్ ఖాతా నుంచి 50 పౌండ్లు విత్‌డ్రా చేసి వాడుకున్నాడు. ‘భార్యను హత్య చేస్తే భర్తకు కలిగే లాభాలేంటి?. ఆ తర్వాత నన్ను ఎవరైనా వెంబడిస్తారా?. కూపీ లాగుతారా?’ అంటూ హత్యకు ముందు కొన్ని అంశాలపై ఆన్లైన్లో సెర్చ్చేశాడు. ఈ ఆన్లైన్ సెర్చ్ హిస్టరీని సైతం పోలీసులు వెలికితీశారు. -
చైనా, తైవాన్ మధ్య యుద్ధ మేఘాలు! పెలోసీ పర్యటనపై డ్రాగన్ కంట్రీ కన్నెర్ర
తైపీ: చైనాను రెచ్చగొడుతూ, ఉద్రిక్తతలను మరింతగా పెంచుతూ అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ (82) తైవాన్ పర్యటన బుధవారం ముగిసింది. ‘‘తైవాన్‌కు అమెరికా అన్నివిధాలా అండగా నిలుస్తుంది. అందుకు మేం కట్టుబడ్డామని ఈ పర్యటనతో మరోసారి చాటిచెప్పాం’’ అని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. తైవాన్ తన భూభాగమేనని, దానితో ఏ దేశమూ సంబంధాలు పెట్టుకోరాదని చెబుతున్న చైనా ఈ పరిణామంపై మండిపడింది. ‘‘పెలోసీ నిప్పుతో చెలగాటమాడారు. అది అమెరికానే కాల్చేస్తుంది. తీవ్ర పరిణామాలుంటాయి. చేతులు ముడుచుకుని కూర్చోం’’ అంటూ చైనా విదేశాంగ శాఖ ఉప మంత్రి జీ ఫెంగ్ స్పందించారు. ఈ తప్పిదానికి అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ‘‘చైనా సార్వభౌమాధికారాల పరిధిని, ప్రాదేశిక సమగ్రతను అమెరికా ఉల్లంఘించింది. తైవాన్ జలసంధి వద్ద శాంతిభద్రతలను పూర్తిగా దెబ్బతీసింది’’ అని విమర్శించారు. ‘‘చైనాను నిలువరించేందుకు తైవాన్ అంశాన్ని వాడుకోవడాన్ని అమెరికా ఇకనైనా కట్టిపెట్టాలి. తైవాన్ స్వాతంత్య్ర డిమాండ్లకు మద్దతివ్వొద్దు’’ అని డిమాండ్ చేశారు. చైనాలోని అమెరికా రాయబారి నికోలస్ బర్న్స్‌ను మంగళవారం రాత్రి పిలిపించి పెలోసీ పర్యటనపై తీవ్ర అభ్యంతరం, అసంతృప్తి వ్యక్తం చేశారు. చైనాతో కయ్యానికి కాలు దువ్వొద్దని హెచ్చరించారు. తైవాన్‌పై ఆంక్షలకూ చైనా తెర తీసింది. పళ్లు, చేపల దిగుమతులు, ఇసుక ఎగుమతులపై నిషేధం విధించింది. నిబద్ధత చాటుకున్నాం: పెలోసీ దక్షిణ కొరియా బయల్దేరే ముందు తైవాన్ అధ్యక్షురాలు సై ఇంగ్ వెన్‌తో పెలోసీ భేటీ అయ్యారు. తైవాన్లోనూ, ప్రపంచంలో ఇతర చోట్లా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న అమెరికా సంకల్పం మరింత బలపడిందంటూ సంఘీభావ ప్రకటన చేశారు. తమకు చిరకాలంగా మద్దతుగా నిలుస్తున్నందుకు పెలోసీకి వెన్ కృతజ్ఞతలు తెలిపారు. తైవాన్ అధ్యక్షురాలు సై ఇంగ్ వెన్‌తో పెలోసీ(ఎడమ) తైవాన్ చుట్టూరా సైనిక విన్యాసాలు పెలోసీ పర్యటనకు సమాధానంగా తైవాన్ను లక్ష్యంగా చేసుకుని మంగళవారం రాత్రి తెరతీసిన భారీ సైనిక విన్యాసాలను చైనా మరింత తీవ్రతరం చేసింది. తైవాన్ జలసంధిలోకి మరిన్ని యుద్ధ నౌకలను తరలించింది. దీర్ఘ శ్రేణి క్షిపణి పరీక్షలు, విన్యాసాల జోరు పెంచి అమెరికాకు హెచ్చరిక సంకేతాలు పంపింది. చైనా ఫైటర్ జెట్లు తైవాన్ గగనతలం సమీపంలో విన్యాసాలకు దిగాయి. గురువారం నుంచి నాలుగు రోజుల పాటు తైవాన్ ద్వీపం చుట్టూ మరిన్ని సైనిక విన్యాసాలుంటాయని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా ప్రకటించింది. ఇవి యుద్ధానికి దిగడంతో సమానమని పరిశీలకులంటున్నారు. బలప్రయోగంతోనైనా తైవాన్ను తనలో కలిపేసుకునే చర్యలకు చైనా దిగనుందనేందుకు ఇవి సంకేతాలేనంటున్నారు. చైనా చర్యలను తైవాన్ తీవ్రంగా నిరసించింది. ‘‘మేం జడిసేది లేదు. సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకుని తీరతాం’’ అని తైవాన్ అధ్యక్షురాలు ఇంగ్ వెన్ అన్నారు. -
కెన్యా అథ్లెట్ దుర్మరణం
నైరోబి: కెన్యాకు చెందిన ప్రముఖ అథ్లెట్, ప్రపంచ మాజీ చాంపియన్ నికోలస్ బెట్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. బుధవారం పశ్చిమ కెన్యాలో జరిగిన కారు ప్రమాదంలో 28 ఏళ్ల బెట్ దుర్మరణం పాలయ్యాడని స్థానిక పోలీసులు తెలిపారు. అతనికి రెండు సంవత్సరాల వయస్సున్న ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. 2015లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 400 మీటర్ల హర్డిర్స్లో బెట్ స్వర్ణం సాధించాడు. దీంతో పాటు చైనాలో జరిగిన షార్ట్ డిస్టెన్స్ హర్డిల్స్ టైటిల్... రెండు సార్లు ఆఫ్రికా హర్డిల్స్ చాంపియన్‌షిప్ సొంతం చేసుకొని చరిత్ర సృష్టించాడు. బెట్ మృతిపై కెన్యా అథ్లెటిక్ సమాఖ్య దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. క్రీడా రంగంలో అతని లోటు పూడ్చలేనిదని పేర్కొంది. -
ఐ పాడ్ కన్నా తక్కువ బరువు..
దుబాయ్: నెలలు నిండకుండా పుట్టే శిశువులు బరువు తక్కువగా ఉండటం, వారిని కాపాడటం కోసం వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం తెలిసిందే. కాగా పుట్టినప్పుడు ఒక ఐ పాడ్ కంటే తక్కువ బరువుతో ఉన్న శిశువు, సుమారు 110 రోజుల ప్రత్యేక చికిత్స అనంతరం 1.9 కేజీల బరువు పెరగడం విశేషంగా నిలిచింది. కిలోకంటే తక్కువగా కేవలం 530 గ్రాముల బరువుతో పుట్టిన పసికందును దుబాయ్‌లోని వైద్య బృందం కాపాడిన వైనం అద్భుతంగా నిలించింది. ఈ వైద్య బృందంలో ఓ భారతీయ వైద్యుడు కూడా ఉండడం విశేషం. ఇది చాలా అరుదైన ఘటన అంటూ స్థానిక మీడియా ఆదివారం తెలిపింది. సాధారణంగా 600 గ్రాములపైన బరువుండే ఒక ఐ పాడ్ కంటే తక్కువ బరువుతో పుట్టిన శిశువు... కోలుకొని ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా సంతోషంగా ఇంటికి వెళ్లడం అద్భుతమని పేర్కొంది. వివరాల్లోకి వెళితే ఫిలిపినా కు చెందిన క్రిస్టోఫర్ శాక్రమెంటో భార్య సూసీ గత అక్టోబర్‌లో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే 14 వారాల ముందుగానే ప్రసవం జరగడంతో శిశువు, కేవలం 530 గ్రాముల బరువుతో పుట్టాడు. దీంతో ఆస్పత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) వద్ద నాలుగు నెలలపాటు ప్రత్యేక చికిత్స అందించారు. దాదాపు వైద్య బృందం కూడా ఆశలు వదిలేసినప్పటికీ అనూహ్యంగా శిశువు పూర్తిగా కోలుకున్నాడు. అతని బరువు, ఆరోగ్యం సంతృప్తికర స్థాయికి చేరడంతో ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దీనిపై సూసీ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. వైద్యులు తన బిడ్డ నికోలస్‌కు పునర్జన్మను ప్రసాదించారని ఉద్వేగంగా చెప్పారు. -
సోషలిస్టు పాలనకు తెర
వెనుజువెలాలో ప్రతిపక్షాల ప్రజాస్వామ్య ఐక్య కూటమి విజయం కారకస్: వెనుజువెలాలో 17 ఏళ్లుగా సాగుతున్న సోషలిస్టు పార్టీ పాలనకు ప్రజలు చరమగీతం పాడారు. తాజా ఎన్నికల్లో విపక్షాల కూటమి విజయం సాధించింది. మొత్తం 167 స్థానాలున్న నేషనల్ అసెంబ్లీలో విపక్షాల ఐక్య ప్రజాస్వామ్య కూటమి 99 స్థానాల్లో గెలిచింది. అధికార సోషలిస్టు పార్టీకి కేవలం 46 స్థానాలే దక్కాయి. మిగిలిన 22 సీట్లలో మరికొన్నింటిని గెలిస్తే మూడింట రెండొంతుల మెజారిటీతో పాలనాయంత్రాంగంపై అధ్యక్షుడు నికోలస్‌కు ఉన్న పట్టును దెబ్బకొట్టే అవకాశముంది. తప్పనిసరిగా ఓటు వేయాల్సిన అవసరం లేదన్న నిబంధన జారీ చేసిన తర్వాత గత 17 ఏళ్ల లో తొలిసారిగా ఈ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 74 శాతం ఓటింగ్ నమోదైంది. హ్యూగో చావెజ్ సారథ్యంలో 17 ఏళ్ల క్రితం సోషలిస్టు విప్లవం విజయవంతమైనప్పటి నుంచి ఆయన పాలనాపగ్గాలు చేపట్టారు. 2013లో చావెజ్ మరణం తర్వాత నికోలస్ మదురో దేశాధ్యక్షుడయ్యారు. సోషలిస్టు పార్టీ ఓటమి ఖరారు కావడంతో కారకస్, ఇతర ప్రాంతాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకన్నారు. గత ఏడాది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఆందోళనలో ప్రజల రక్తం చిందిన ప్రదేశంలో ఎర్రచొక్కాలను దహనం చేశారు. నికోలస్ ఓటమిని అంగీకరిస్తూనే అమెరికా కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ సంప్రదాయ ప్రతిఘాతుక విప్లవం ద్వారా తన పాలనను అస్థిరపర్చిందని, ఆర్థిక యుద్ధం విజయం సాధించిందన్నారు. కాగా దేశంలో మార్పు ప్రారంభమైందని విపక్షాలు అన్నాయి. దేశంలో అంతటా సరుకులు, ఇతరత్రా కొరతలు ఏర్పడ్డాయని, కరెన్సీ విలువ దిగజారిందన్నారు. వెనుజువెలా ఫలితాలు లాటిన్ అమెరికాలోని వామపక్షాలకు పెద్ద దెబ్బే. కొన్ని దేశాల్లో ఆర్థిక వ్యవస్థ క్రమేణా అస్తవ్యస్తం కావడం, అవినీతి పెరిగిపోవడంతో ఓటర్లు విసిగిపోయారు. -
ఇది ప్రేమా... ప్రేమా!
హృదయం ఆమె, అతడు ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకుందామనుకుంటారు. కానీ ఓ యాక్సిడెంట్లో అతడి కాళ్లు పోతాయి. కానీ ఆమె అతణ్ని విడిచిపోదు. జీవితాంతం తనతోనే కలిసుండాలనుకుంటుంది. అతణ్నే పెళ్లి చేసుకుంటుంది! ఆమెకు చూపుండదు. కానీ అతడు ఆమెను ప్రేమిస్తాడు. ఎవరెన్ని చెప్పినా తననే పెళ్లి చేసుకుంటాడు. తనకు జీవితాన్నిస్తాడు. ఇలాంటి కథలు సినిమాల్లోనే కాక అప్పుడప్పుడూ నిజ జీవితంలోనూ దర్శనమిస్తుంటాయి. కాళ్లూ చేతులూ రెండూ లేని ఓ కుర్రాణ్ని ఓ అందాల రాశి ప్రేమించింది. అతడితో జీవితం పంచుకుంది. ఓ బిడ్డను కూడా కంది. సంతోషంగా జీవనం సాగిస్తోంది. ప్రేమకు వైకల్యం అడ్డురాదని చాటిచెప్పి, ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన ప్రేమికురాలు ఆమె. నికోలస్ జేమ్స్ వుజుసిక్... ఈ పేరు ఆస్ట్రేలియాలో బాగా పాపులర్. మోటివేషనల్ స్పీకర్‌గా ఈ కుర్రాడు ఎన్నో వేలమందిలో స్ఫూర్తి నింపాడు. అయితే ఇలా ఇతరుల్లో స్ఫూర్తి నింపే ముందు తన దురదృష్టాన్ని తలచుకుని అతను ఎంత వేదన అనుభవించాడో మాటల్లో చెప్పలేం. ఎందుకంటే నికోలస్ పుట్టుకే ఓ విషాదం. అతడికి రెండు కాళ్లూ లేవు. చేతులూ లేవు. దీంతో నికోలస్ బాల్యం దుర్భరంగా గడిచింది. తండ్రి తనలో ఎంత స్ఫూర్తి నింపినప్పటికీ, ఊహ తెలిసే సమయానికి తన పరిస్థితి చూసి తనకే జాలేసింది. ఏ పనీ చేసుకోలేని తన వైకల్యాన్ని చూసి, ఇక తనకు చావే శరణ్యమనుకున్నాడు నికోలస్. కానీ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సహకరించని శరీరం అతనిది. అయినా పదేళ్ల వయసులో బలవన్మరణానికి ప్రయత్నించాడు. విఫలమయ్యాడు. ఈ విషయం తండ్రికి తెలిసి, అతడిని ఓదార్చాడు. తనలో ధైర్యాన్ని నింపాడు. తనూ అందరిలా ఎలా బతకొచ్చో వివరించాడు. తండ్రి మాటలు నికోలస్‌లో స్ఫూర్తి నింపాయి. దాంతో తను గొప్పవాళ్ల జీవిత విశేషాలు తెలుసుకున్నాడు. ఎన్నో పుస్తకాలు చదివాడు. జ్ఞానం పెంచుకున్నాడు. మోటివేషనల్ స్పీకర్‌గా మారాడు. తన నగరంలో మొదలుపెట్టి, దేశ విదేశాలు తిరిగే స్థాయికి చేరుకున్నాడు. అంతా బాగానే ఉంది కానీ, తనకంటూ ఓ తోడు లేదన్న బాధ అతణ్ని వెంటాడేది. నికోలస్ మాటలు అందరికీ నచ్చేవి కానీ, తనతో కలిసి జీవితం పంచుకోవడానికి మాత్రం ఎవరూ ముందుకొచ్చేవాళ్లు కాదు. ఇలాంటి స్థితిలో కేనీ మియాహరా పరిచయం నికోలస్ జీవితంలో గొప్ప మార్పు తెచ్చింది. నికోలస్ స్పీచ్ వినడం కోసం తన స్నేహితురాలితో కలిసి ఓ కార్యక్రమానికి హాజరైన కేనీ, తన ప్రసంగం విని ముగ్ధురాలైపోయింది. అందాల రాశి అయిన కేనీని చూడగానే నికోలస్ కూడా పడిపోయాడు. కానీ తన ఫీలింగ్స్ ఆమెతో చెప్పడానికి తన వైకల్యం అడ్డొచ్చింది. దీంతో సెలైంటుగా ఉండిపోయాడు. కానీ కేనీ అలా ఉండిపోలేదు. మాట కలిపింది. తన ఈ-మెయిల్ కూడా తీసుకుంది. తర్వాత ఇద్దరూ తరచుగా మెయిల్స్, ఫోన్స్ ద్వారా దగ్గరయ్యారు. అప్పటికే ఇద్దరు ముగ్గురు అబ్బాయిలతో డేటింగ్ చేసి ఎదురుదెబ్బలు తిన్న కేనీ, వ్యక్తిత్వం అన్నింటికంటే ముఖ్యమని గ్రహించింది. తనింతకుముందు డేటింగ్ చేసిన వ్యక్తులతో పోల్చి చూస్తే, నికోలస్ గొప్పగా కనిపించడంతో తనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు అభ్యంతరం చెప్పారు. కానీ ఆమె వినలేదు. బాహ్య సౌందర్యం కంటే అంతఃసౌందర్యమే గొప్పదని చాటుతూ, ఓ మంచి ముహూర్తం చూసి నికోలస్‌కు ప్రపోజ్ చేసింది. తనూ ఒప్పుకోవడంతో వైభవంగా వారిద్దరి పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత నికోలస్‌కు కేనీ అన్నీ తానై చూసుకుంది. కేనీ సాహచర్యంలో తనకు వైకల్యం ఉందన్న సంగతే మరిచిపోయాడు నికోలస్. మరింత ఆత్మవిశ్వాసంతో మోటివేషనల్ స్పీకర్‌గా మరింత పేరు సంపాదించాడు. మొత్తం 24 దేశాలు తిరిగి, 30 లక్షల మందికి తన సందేశాన్ని వినిపించాడు. నికోలస్, కేనీల బంధానికి గుర్తుగా ఓ అబ్బాయి కూడా పుట్టాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ‘మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్యామిలీస్’లో ఒకటిగా నికోలస్ కుటుంబం సంతోషంగా జీవనం సాగిస్తోంది. -
దావో.. బ్రేవో.. దావో.. బ్రేవో..
భారీ తుపాను మేఘం ఈమెను మింగేయడానికి వచ్చేస్తున్నట్లు కనిపిస్తోంది కదూ.. ఇది గ్రాఫిక్ చిత్రం కాదు.. రెండు వేర్వేరు ఫొటోలను కలిపినది కానే కాదు.. ఇది అచ్చంగా ఒరిజినల్ ఫొటో. దీన్ని తీసింది అమెరికాలోని కాస్పర్‌కు చెందిన నికోలస్ అనే ఫొటోగ్రాఫర్.. ఫొటోలో ఉన్న యువతి అతడి భార్యే.. పేరు దావో. తుపాన్లకు సంబంధించిన ఫొటోలను చాలా మంది తీస్తారు. కానీ మనల్ని మింగేసేటట్లుండే ప్రమాదకరమైన మేఘాలు ఉన్నప్పుడు వాటికి దగ్గరగా వెళ్లడం.. వాటిని ఓ యువతి చూస్తున్నట్లు ఫొటోలు తీయడమంటే మాటలు కాదు కదా.. ఇలా తీయడం ప్రమాదకరమని తెలిసినా.. అలాంటి చిత్రాలు తీస్తేనే కదా కిక్ అంటున్నారు ఈ జంట. ‘కొన్నిసార్లు నాకు భయమేస్తుంది. కానీ ఈ జీవితం చాలా చిన్నది. అందుకే ఉన్నన్నాళ్లూ ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేయాలి’ అని దావో చెబుతోంది.