ఐ పాడ్ కన్నా తక్కువ బరువు..
దుబాయ్: నెలలు నిండకుండా పుట్టే శిశువులు బరువు తక్కువగా ఉండటం, వారిని కాపాడటం కోసం వైద్యులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం తెలిసిందే. కాగా పుట్టినప్పుడు ఒక ఐ పాడ్ కంటే తక్కువ బరువుతో ఉన్న శిశువు, సుమారు 110 రోజుల ప్రత్యేక చికిత్స అనంతరం 1.9 కేజీల బరువు పెరగడం విశేషంగా నిలిచింది. కిలోకంటే తక్కువగా కేవలం 530 గ్రాముల బరువుతో పుట్టిన పసికందును దుబాయ్లోని వైద్య బృందం కాపాడిన వైనం అద్భుతంగా నిలించింది. ఈ వైద్య బృందంలో ఓ భారతీయ వైద్యుడు కూడా ఉండడం విశేషం. ఇది చాలా అరుదైన ఘటన అంటూ స్థానిక మీడియా ఆదివారం తెలిపింది. సాధారణంగా 600 గ్రాములపైన బరువుండే ఒక ఐ పాడ్ కంటే తక్కువ బరువుతో పుట్టిన శిశువు... కోలుకొని ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా సంతోషంగా ఇంటికి వెళ్లడం అద్భుతమని పేర్కొంది.
వివరాల్లోకి వెళితే ఫిలిపినా కు చెందిన క్రిస్టోఫర్ శాక్రమెంటో భార్య సూసీ గత అక్టోబర్లో ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే 14 వారాల ముందుగానే ప్రసవం జరగడంతో శిశువు, కేవలం 530 గ్రాముల బరువుతో పుట్టాడు. దీంతో ఆస్పత్రిలోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU) వద్ద నాలుగు నెలలపాటు ప్రత్యేక చికిత్స అందించారు. దాదాపు వైద్య బృందం కూడా ఆశలు వదిలేసినప్పటికీ అనూహ్యంగా శిశువు పూర్తిగా కోలుకున్నాడు. అతని బరువు, ఆరోగ్యం సంతృప్తికర స్థాయికి చేరడంతో ఇటీవల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దీనిపై సూసీ దంపతులు సంతోషం వ్యక్తం చేశారు. వైద్యులు తన బిడ్డ నికోలస్కు పునర్జన్మను ప్రసాదించారని ఉద్వేగంగా చెప్పారు.