ఇది ప్రేమా... ప్రేమా!
హృదయం
ఆమె, అతడు ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకుందామనుకుంటారు. కానీ ఓ యాక్సిడెంట్‌లో అతడి కాళ్లు పోతాయి. కానీ ఆమె అతణ్ని విడిచిపోదు. జీవితాంతం తనతోనే కలిసుండాలనుకుంటుంది. అతణ్నే పెళ్లి చేసుకుంటుంది!
ఆమెకు చూపుండదు. కానీ అతడు ఆమెను ప్రేమిస్తాడు. ఎవరెన్ని చెప్పినా తననే పెళ్లి చేసుకుంటాడు. తనకు జీవితాన్నిస్తాడు.
ఇలాంటి కథలు సినిమాల్లోనే కాక అప్పుడప్పుడూ నిజ జీవితంలోనూ దర్శనమిస్తుంటాయి. కాళ్లూ చేతులూ రెండూ లేని ఓ కుర్రాణ్ని ఓ అందాల రాశి ప్రేమించింది. అతడితో జీవితం పంచుకుంది. ఓ బిడ్డను కూడా కంది. సంతోషంగా జీవనం సాగిస్తోంది. ప్రేమకు వైకల్యం అడ్డురాదని చాటిచెప్పి, ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన ప్రేమికురాలు ఆమె.
నికోలస్ జేమ్స్ వుజుసిక్... ఈ పేరు ఆస్ట్రేలియాలో బాగా పాపులర్. మోటివేషనల్ స్పీకర్‌గా ఈ కుర్రాడు ఎన్నో వేలమందిలో స్ఫూర్తి నింపాడు. అయితే ఇలా ఇతరుల్లో స్ఫూర్తి నింపే ముందు తన దురదృష్టాన్ని తలచుకుని అతను ఎంత వేదన అనుభవించాడో మాటల్లో చెప్పలేం. ఎందుకంటే నికోలస్ పుట్టుకే ఓ విషాదం. అతడికి రెండు కాళ్లూ లేవు. చేతులూ లేవు. దీంతో నికోలస్ బాల్యం దుర్భరంగా గడిచింది. తండ్రి తనలో ఎంత స్ఫూర్తి నింపినప్పటికీ, ఊహ తెలిసే సమయానికి తన పరిస్థితి చూసి తనకే జాలేసింది.
ఏ పనీ చేసుకోలేని తన వైకల్యాన్ని చూసి, ఇక తనకు చావే శరణ్యమనుకున్నాడు నికోలస్. కానీ ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సహకరించని శరీరం అతనిది. అయినా పదేళ్ల వయసులో బలవన్మరణానికి ప్రయత్నించాడు. విఫలమయ్యాడు. ఈ విషయం తండ్రికి తెలిసి, అతడిని ఓదార్చాడు. తనలో ధైర్యాన్ని నింపాడు. తనూ అందరిలా ఎలా బతకొచ్చో వివరించాడు.
తండ్రి మాటలు నికోలస్‌లో స్ఫూర్తి నింపాయి. దాంతో తను గొప్పవాళ్ల జీవిత విశేషాలు తెలుసుకున్నాడు. ఎన్నో పుస్తకాలు చదివాడు. జ్ఞానం పెంచుకున్నాడు. మోటివేషనల్ స్పీకర్‌గా మారాడు. తన నగరంలో మొదలుపెట్టి, దేశ విదేశాలు తిరిగే స్థాయికి చేరుకున్నాడు. అంతా బాగానే ఉంది కానీ, తనకంటూ ఓ తోడు లేదన్న బాధ అతణ్ని వెంటాడేది. నికోలస్ మాటలు అందరికీ నచ్చేవి కానీ, తనతో కలిసి జీవితం పంచుకోవడానికి మాత్రం ఎవరూ ముందుకొచ్చేవాళ్లు కాదు.
ఇలాంటి స్థితిలో కేనీ మియాహరా పరిచయం నికోలస్ జీవితంలో గొప్ప మార్పు తెచ్చింది. నికోలస్ స్పీచ్ వినడం కోసం తన స్నేహితురాలితో కలిసి ఓ కార్యక్రమానికి హాజరైన కేనీ, తన ప్రసంగం విని ముగ్ధురాలైపోయింది. అందాల రాశి అయిన కేనీని చూడగానే నికోలస్ కూడా పడిపోయాడు. కానీ తన ఫీలింగ్స్ ఆమెతో చెప్పడానికి తన వైకల్యం అడ్డొచ్చింది. దీంతో సెలైంటుగా ఉండిపోయాడు. కానీ కేనీ అలా ఉండిపోలేదు. మాట కలిపింది. తన ఈ-మెయిల్ కూడా తీసుకుంది.
తర్వాత ఇద్దరూ తరచుగా మెయిల్స్, ఫోన్స్ ద్వారా దగ్గరయ్యారు. అప్పటికే ఇద్దరు ముగ్గురు అబ్బాయిలతో డేటింగ్ చేసి ఎదురుదెబ్బలు తిన్న కేనీ, వ్యక్తిత్వం అన్నింటికంటే ముఖ్యమని గ్రహించింది. తనింతకుముందు డేటింగ్ చేసిన వ్యక్తులతో పోల్చి చూస్తే, నికోలస్ గొప్పగా కనిపించడంతో తనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు అభ్యంతరం చెప్పారు. కానీ ఆమె వినలేదు. బాహ్య సౌందర్యం కంటే అంతఃసౌందర్యమే గొప్పదని చాటుతూ, ఓ మంచి ముహూర్తం చూసి నికోలస్‌కు ప్రపోజ్ చేసింది. తనూ ఒప్పుకోవడంతో వైభవంగా వారిద్దరి పెళ్లి జరిగింది.
పెళ్లి తర్వాత నికోలస్‌కు కేనీ అన్నీ తానై చూసుకుంది. కేనీ సాహచర్యంలో తనకు వైకల్యం ఉందన్న సంగతే మరిచిపోయాడు నికోలస్. మరింత ఆత్మవిశ్వాసంతో మోటివేషనల్ స్పీకర్‌గా మరింత పేరు సంపాదించాడు. మొత్తం 24 దేశాలు తిరిగి, 30 లక్షల మందికి తన సందేశాన్ని వినిపించాడు. నికోలస్, కేనీల బంధానికి గుర్తుగా ఓ అబ్బాయి కూడా పుట్టాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ‘మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్యామిలీస్’లో ఒకటిగా నికోలస్ కుటుంబం సంతోషంగా జీవనం సాగిస్తోంది.