
వివాహితను హతమార్చిన ప్రియుడు
చిక్కమగళూరులో దారుణం
బనశంకరి: భర్త, పిల్లలతో ఉంటున్న మహిళ ఫేస్‌బుక్ ప్రియుని మాయలో పడి అతని వెంట వెళ్లింది. చివరకు తప్పు తెలుసుకుని మళ్లీ భర్త చెంతకు చేరింది. ఇది తట్టుకోలేని కిరాతక ప్రియుడు ఆమెను అంతమొందించాడు. ఈ సంఘటన చిక్కమగళూరు జిల్లాలోని ఎన్‌ఆర్‌పుర తాలూకా కిచ్చబ్బి గ్రామంలో జరిగింది. తృప్తి (25) అనే వివాహితను ప్రియుడు చిరంజీవి (29).. చాకుతో పొడిచి చంపి శవాన్ని అక్కడే బావిలో పడేసి పరారయ్యాడు.
ఘటనాస్థలానికి బాళెహొన్నూరు పోలీసులు చేరుకుని పరిశీలించారు. తృప్తి, చిరంజీవి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమై, ప్రేమలో పడ్డారు. నెల రోజుల క్రితం భర్త రాజును వదిలి ప్రియునితో వెళ్లిపోయింది. దీనిపై భర్త బాళెహొన్నూరు పోలీసు స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టాడు. విజయపుర (బిజాపుర)లో తలదాచుకున్న తృప్తి, చిరంజీవిని పోలీసులు వెదికి పట్టుకుని పిలుచుకొచ్చారు. తల్లిదండ్రులు నచ్చజెప్పడంతో తృప్తి భర్త వెంట వెళ్లింది. దీంతో ఆగ్రహం చెందిన చిరంజీవి.. చివరిసారిగా మాట్లాడాలని తృప్తిని ఓ పొలం వద్దకు పిలిపించి హత్య చేసి పరారయ్యాడు. హంతకుని కోసం గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment