అలజడి సృష్టించిన యువతి
అనంతపురం సిటీ: తాను ప్రేమించిన ఒంగోలు యువకుడితో పెళ్లి చేయాలంటూ అనంతపురంలో ఓ యువతి ‘సఖి’ సెంటర్‌లో హల్‌చల్ చేసింది. తల్లిదండ్రులను చూడగానే రగిలిపోవడమే కాకుండా కౌన్సెలింగ్ నిర్వాహకులకు సహకరించకుండా దాడికి యత్నించడం, తాను చెప్పిందే రాసుకోవాలంటూ మీడియా ప్రతినిధులపై హుకుం చేస్తూ వీరంగం సృష్టించింది. గుంతకల్లు ప్రాంతంలో బ్యూటీషియన్ కోర్సు చేసిన యువతి విజయనగరంలో డిగ్రీ చదువుతున్న ఒంగోలు యువకుడితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకుంది. అది కాస్తా ప్రేమగా మారింది. అలా ఏడాదిగా వారిద్దరి మధ్య చాటింగ్‌లు కొనసాగాయి. ఇంతలోనే విషయం ఇంట్లో తెలిసి యువతిని పెద్దలు మందలించారు. చావైనా, బతుకైనా ప్రేమించినోడితోనేనని తెగేసి చెప్పి ఒంగోలు వెళ్లింది. అక్కడ ప్రతిఘటన ఎదురవడంతో వెనక్కు తిరిగొచ్చింది.
చదవండి: ‘హాయ్..! మరదలా..’ అంటూ నగ్న చిత్రాలు, బూతు బావ భరతం పట్టిన మరదలు
న్యాయం కోసం ‘సఖి’ని ఆశ్రయించి..
ప్రేమించిన యువకుడితో పెళ్లి చేయాలంటూ యువతి అనంతపురంలోని సఖి సెంటర్ నిర్వాహకులను గురువారం ఆశ్రయించింది. వారు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు యత్నించారు. అయితే అందుకు సహకరించలేదు. ప్రేమించినోడితేనే పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరిస్తూ ఆస్పత్రిపై నుంచి దూకేస్తానంటూ పారిపోయేందుకు యత్నించింది. అడ్డుకోబోయిన ఏఎస్‌ఐ గోవిందమ్మ, సఖి సెంటర్ మేనేజర్ శాంతామణి, సిబ్బందిపై ఎదురు దాడికి దిగింది. రాత్రంతా ఆమెను కాపలా కాయడం వారికి కష్టతరమైంది. చేసేది లేక ఆ అమ్మాయిని ఓ గదిలో పెట్టి గడియ బిగించారు. అంతే ఉగ్రరూపం దాల్చింది. ఒక్కసారిగా తలుపులను గట్టిగా తన్నడంతో గడియతో సహా ఊడొచ్చాయి. ఊహించని ఈ హఠాత్పరిణామంతో భయభ్రాంతులకు గురైన అధికారులు ‘దిశ’ పోలీసులకు సమాచారం అందించారు. రాత్రంతా కాపలా కాశారు.\
మీడియా ప్రతినిధులతోనూ వాగ్వాదం..
ప్రేమించినోడితో పెళ్లి చేయకపోతే ఇక్కడే చస్తానని బెదిరిస్తూ గురువారమంతా నీళ్లు, ఆహారం ఏమీ తీసుకోకుండా నిరసన ప్రకటించింది. శుక్రవారం కూడా ఆహారం తీసుకోలేదు. తనకు సఖి సెంటర్ నిర్వాహకులు న్యాయం చేయడం లేదంటూ మీడియాకు సమాచారం అందించింది. విలేకరులు వచ్చాక రెండు మూడు గంటల తర్వాత నోరు విప్పింది. తనను ఎదురు ప్రశ్నించకూడదని, తను చెప్పింది మాత్రమే రాసుకోవాలని, రికార్డు చేసుకోవాలని విలేకర్లతోనూ వాగ్వాదం చేసింది.
తల్లిదండ్రులు కనిపిస్తే కస్సుమంటోంది...
తన ప్రేమ భగ్నం కావడానికి తల్లిదండ్రులు, అక్క,బావలే కారణమనే ఆగ్రహంతో ఊగిపోతున్న యువతి.. సఖి సెంటర్ నిర్వాహకుల కోరిక మేరకు ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు తమ బిడ్డకు ఎంతగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారిని చూడగానే రగిలిపోయింది. తన జీవితాన్ని నాశనం చేసింది చాలు. మీరెళ్లండి. నేను మాత్రం మీ వెంట ఇంటికి రానంటూ చీదరించుకుంది.
చేతుల నిండా బ్లేడ్ గాయాలే..
ప్రేమించినోడి కోసం ఆ యువతి రెండు చేతులపై కోసుకున్న గాయాలే కనిపిస్తున్నాయి. వాడి కోసం అవసరమైతే చచ్చిపోవడానికైనా సిద్ధమేనంటూ, తన మనస్సు మార్చేందుకు ఎవరూ ప్రయత్నించొద్దంటూ ‘దిశ’ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సీఐ ధరణి కిశోర్ సహా మహిళా పోలీసులు, విలేకర్లతో యువతి వాదించింది. దీంతో గుంతకల్లు డీఎస్పీ నరసింగప్పకు సమాచారం అందించారు. అక్కడి నుంచి పోలీస్ బృందం కూడా బయలుదేరి వచ్చింది.
కౌన్సెలింగ్‌కు సహకరించడం లేదు
యువతి మంకుపట్టు పడుతోంది. కౌన్సెలింగ్‌కు సహకరించడం లేదు. అబ్బాయితో మాట్లాడి, పిలిపిస్తామని చెప్పినా వినడం లేదు. ఎదురు దాడికి దిగుతోంది. నోటికొచ్చినట్లు తిడుతోంది. నేను, ఏఎస్‌ఐ, మా సిబ్బంది రెండ్రోజులుగా నిద్రాహారాలు మాని ఆ అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడుతున్నాం.
– శాంతామణి, సఖి సెంటర్ నిర్వాహకురాలు
చట్టప్రకారమే ముందుకెళ్తాం
యువతి మానసిక పరిస్థితి బాగోలేదు. ప్రభుత్వాస్పత్రి మానసిక వైద్య నిపుణుడి వద్దకు పిల్చుకెళ్తాం. వైద్యుడి సర్టిఫికెట్ రాగానే జడ్జి ఎదుట యువతిని హాజరుపరుస్తాం. ఆ తరువాత జడ్జి ఆదేశిస్తే విశాఖలోని మానసిక రోగుల ఆస్పత్రికి తరలిస్తాం. ఏదైనా చట్టం ప్రకారమే ముందుకెళ్తాం.
– ఆర్ల శ్రీనివాసులు, దిశ డీఎస్పీ, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment