ఇదో తమాషా ఫేస్బుక్ కథ
లక్నో: ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులైనా...మనస్పర్థలు వస్తే విడిపోవడం ఇప్పుడు చాలా కామన్. నిర్మొహమాటంగా ఇంకో తోడు వెతుక్కోవడం...అదేనండి రెండో పెళ్లి చేసుకోవడం కూడా అంతే పరిపాటిగా మారిపోయింది. కాకపోతే పరస్పరం నిజాయితీగా లేకపోతేనే సమస్య. స్త్రీ పురుషుల్లో ఎవరు నిక్కచ్చిగా లేకపోయినా తిప్పలు తప్పవు. సరిగ్గా ఇలాగే వ్యవహరించి ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ జంట గతుక్కుమంది. తేలు కుట్టిన దొంగల్లా పక్కకు పోకుండా.. నానా గలాటా సృష్టించారు. అయితే పోలీసులు మాత్రం ఈ వింత అనుభవంతో తెల్ల మొహాలేశారు. ఏం కేసులు పెట్టాలో తెలియక తలలు పట్టుకున్నారు.
అచ్చం ఓ బాలీవుడ్ సినిమా స్టోరీని తలపించే ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని బరేలీకి చెందిన ఓ యువజంట మనస్పర్థలు కారణంగా విడిపోయారు. అలా ఎంతకాలం వుంటారు.. పైగా వయసులో ఉన్నారాయే... అందుకే మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ముందుగా కొత్త స్నేహాల కోసం ఇద్దరూ ఫేస్‌బుక్ను ఎంచుకున్నారు. మారు పేర్లతో ఫేస్ బుక్లో ఆ ఇద్దరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. అక్కడితో ఆగలేదు.. .. స్టేటస్ 'సింగిల్' అని పెట్టారు. ఇక ఇద్దరికీ ఫ్రెండ్ రిక్వెస్టులు, షేర్లు, లైక్లూ షరా మామూలే..
ఇలా కొన్ని నెలలు గడిచాక ఇద్దరికీ ఫ్రెండ్స్ పరిచయమయ్యారు. ప్రేమ చిగురించింది. గంటల తరబడి చాటింగులూ, ప్రేమ సందేశాలూ షురూ.. ఇంకా ఎన్నాళ్లిలా ముఖాలు తెలియకుండా మాట్లాడుకోవడం.. ఒకసారి కలుసుకుంటే పోలా అనుకుని డేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఓ హోటల్లో కలుసుకునేందుకు ఫేస్‌బుక్ ప్రేమికులు సిద్ధమయ్యారు. తీరా అక్కడి వెళ్లాక ఒకరి ముఖం ఒకరు చూసుకుని విస్తుపోయారు. నువ్వు మోసం చేశావంటే.. నువ్వే మోసం చేశావంటూ తిట్టుకోవడం మొదలుపెట్టారు.
దీంతో చిర్రెత్తుకొచ్చిన రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వచ్చి వారిని శాంతింపచేశారు. అయితే వీరి మీద ఏ సెక్షన్ కింద కేసు పెట్టాలో తెలియక ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్కి అప్పగించి ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఇలా ఉంటే...కొన్ని కోట్లమంది ఫేస్‌బుక్లో ఉన్నా... విడిపోయిన వీరిద్దరూ మళ్లీ ఆన్లైన్లో ప్రేమించుకోవడం ఏమిటబ్బా.. విధి కాకపోతేనూ.. అని కొందరు పెద్దాళ్లు ఆశ్చర్యపోతే....డామిట్ కథ అడ్డం తిరిగింది....'ఫేస్బుక్ లో అన్నీ నిజాలే చెప్పవలె' అని కుర్రకారు ఛలోక్తులు విసురుకున్నారట.