పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయతీ
12 మంది యువకుల ఫిర్యాదు
19 ఏళ్ల యువకుడితో వివాహం
తలనొప్పిగా మారిన యువతి వ్యవహారం
తిరువళ్లూరు: ప్రేమ పేరిట 12 మంది యువకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి చివరికి కుమారుడి వరుసైన 19 ఏళ్ల యువకుడిని వివాహం చేసుకున్న యువతి వ్యవహరం పోలీసులకు తలనొప్పిగా మారింది. జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించిన వ్యవహారంపై పోలీసులు విచారణ ఎలా చేయాలో తెలియక తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరువళ్లూరు జిల్లా వేపంబట్టు బాలాజీ నగర్‌కు చెందిన 24 ఏళ్ల యువతి నర్సింగ్ డిప్లొమో పూర్తి చేసింది. అనంతరం నడవలేని స్తితిలో వున్న రోగుల ఇంటి వద్దకే వెళ్లి చికిత్స చేయడంతో పాటు కేర్‌టేకర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తూ వుంది.
ఈ క్రమంలో యువతి గత కొద్ది రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైంది. ఈ సంఘటనపై యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెవ్వాపేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది ఇలావుండగా యువతి అదృశ్యమైన రోజే ఆమెతో సన్నిహితంగా వ్యవహరించే సమీప బంధువు కుమారుడి వరసయ్యే 19 ఏళ్ల యువకుడు సైతం అదృశ్యమైనట్టు పోలీసులు గుర్తించి ఇద్దరి కోసం గాలించారు. ఈ క్రమంలో చెన్నైలోని మురుగన్ ఆలయంలో వివాహం చేసుకున్నట్టు సెవ్వాపేట పోలీసులకు తమ న్యాయవాదుల ద్వారా సమాచారం అందించింది. దీంతో పోలీసులు ఇద్దరిని శుక్రవారం ఉదయం కాన్సెలింగ్‌కు పిలిపించారు.
యువతి, యువకుడు కౌన్సెలింగ్‌కు హాజరైన క్రమంలో యువతి ద్వారా మోసపోయిన ఆమె మేనమామ సహా 12 మంది పోలీస్‌స్టేషన్‌కు క్యూకట్టారు. ప్రేమ పేరుతో తమను వంచిందని, తమ వద్ద లక్షల్లో వసూలు చేసి ఉడాయించినట్టు యువకులు ఫిర్యాదు చేశారు. తమ డబ్బులను తిరిగి ఇప్పించాలని ఫిర్యాదు చేయడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. విచారణ ఎలా చేయాలో, ముగింపు ఎలా పలకాలో అర్థం కాక తికమకపడ్డారు.
చివరికి యువతి, యువకుడ్ని వారి తల్లిదండ్రులతో పంపించారు. యువతి ద్వారా మోసపోయిన యువకులను ఆవడి కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని చెప్పి అక్కడి నుంచి పంపించి తాత్కాలికంగా సెవ్వాపేట పోలీసులు ఉపశమనం పొందారు. ఇదిఇలా వుండగా ప్రేమ పేరిట 12 మందిని మోసం చేసి లక్షలతో ఉడాయించడమే కాకుండా తనకన్నా చిన్న వయస్సు యువకుడిని చేసుకుని అతడితోనే కాపురం చేస్తానని యువతి పోలీస్‌స్టేషన్‌లో నానా హంగామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment