
సాక్షి, హైదరాబాద్: నకిలీ ఇన్‌స్ట్రాగామ్ సృష్టించి ఓ యువతి కుటుంబసభ్యులకు, ఆమెకు కాబోయే భర్తకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపుతున్న యువకుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... వికారాబాద్ జిల్లాకు చెందిన జాతావత్ సిద్ధూ (22) ప్రైవేట్ ఉద్యోగి. అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ఇష్టపడ్డాడు. అయితే, అప్పటికే ఆమెకు పెళ్లి నిశ్ఛయమైంది.
దీంతో ఆమెపై పగ పెంచుకున్న సిద్ధూ నకిలీ ఇన్‌స్ట్రాగామ్ సృష్టించి యువతి కుటుంబ సభ్యులకు అనేక ఫోన్ నంబర్ల నుంచి అసభ్యకరమైన సందేశాలు పంపాడు. యువతి పెళ్లి ఆగిపోవాలని, అప్పుడు ఆమెను తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన కుటుంబసభ్యులకు తరచూ అసభ్యకర మెసేజ్‌లు రావడంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితుడిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.