చేయని నేరానికి మహిళపై థర్డ్‌ డిగ్రీ! | Third degree against woman in hyderabad | Sakshi
Sakshi News home page

చేయని నేరానికి మహిళపై థర్డ్‌ డిగ్రీ!

Published Wed, Jul 3 2024 6:51 AM | Last Updated on Wed, Jul 3 2024 6:51 AM

Third degree against woman in hyderabad

 గొలుసు చోరీ కేసులో  బాచుపల్లి పోలీసుల  చిత్రహింసలు 

కొడతారని భయపడిన ఆమె బాబాయి ఆత్మహత్యాయత్నం 

సాక్షి, హైదరబాద్‌: చేయని నేరాన్ని ఒప్పు­కోవాలని ఓ మహిళను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. ఆమె చేతులు, కాళ్ల మీద లాఠీలతో చితకబాదారు. ఈ ఘటనలో ఆమె బాబాయిని విచారణ నిమిత్తం రావాలని పోలీ సులు పిలవడంతో భయపడి ఆత్మహత్యకు యత్నంచాడు. ఈ ఘటన బాచుపల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చిత్తారపు లక్ష్మీ, తాతారావు భార్యభర్తలు. తాతారావు బాచుపల్లి రాజీవ్‌గాంధీ నగర్‌లోని జయదీప్‌ ఎస్టేట్‌లోని ఎన్‌డీ–5 అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మేన్‌గా, లక్ష్మీ ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవిస్తున్నారు. 

అయితే గత నెల 16న ఎన్‌డీ–4 అపార్ట్‌మెంట్‌లో జీ–1 ఇంటి యజ మాని కోరడంతో వారి ఇంట్లో లక్ష్మీ పనికి వెళ్లింది. 18న ఆ యజమాని తన ఇంటిలో బంగారుగొలుసు చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మీపై యజమాని అనుమానం వ్యక్తం చేయడంతో 19న పోలీసులు ఆమెను రోజూ స్టేషన్‌కు తీసుకొచ్చి చిత్రహింసలకు గురిచేశారు. కాళ్లు, చేతుల మీద చితకబాదారు. ఏదో ఒకటి తెచ్చి ఇస్తే వదిలేస్తామని పోలీసులు చెప్పడంతో దెబ్బలకు తట్టుకోలేక పోయిన లక్ష్మీ తన బాబాయ్‌ రాజేష్‌ మెడలోని గొలుసును తీసుకొచ్చి పోలీసులకు అప్పగించింది. అయితే అది తన చెయిన్‌ కాదని యజమాని చెప్పడంతో తిరిగి దానిని లక్ష్మీకి అప్పగించారు. 

భయపడి.. పురుగులమందు తాగి..
లక్ష్మీ, ఆమె బాబాయ్‌ రాజేష్‌ ను పోలీసు స్టేషన్‌కు రావాలని మంగళవారం పోలీసులు పిలి చారు. కొడతారేమోనని భయపడిపోయిన రాజేష్‌ ఠాణా గేటు బయట పురుగులమందు తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన రాజేశ్‌ను ఆయన భార్య సుధా, బంధువులు వెంటనే బాచుపల్లిలోని ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రికి తరలించారు. వైద్యానికి రోజుకు రూ.45 వేలు ఖర్చు అవుతుందని ఆసుపత్రి యాజమాన్యం చెప్పడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిపోతామని బాధితులు బదులిచ్చారు.

 బయటికి వెళితే అసలు విషయం బట్టబయలవుతుందని భావించిన పోలీసులు.. వైద్య ఖర్చులు తామే భరిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఐసీయూలో రాజేష్‌ చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉండగా.. పోలీసులపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు బాచుపల్లి పోలీస్‌ స్టేషన్‌కు వెళితే ఎవరూ స్వీకరించకపోవడం గమనార్హం. చేయని నేరానికి మమ్మల్ని మానసికంగా, శారీరకంగా హింసించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని లక్ష్మీ, రాజేష్‌ కుటుంబసభ్యులు డిమాండ్‌ చేశారు.

రెండు వారాల తర్వాత..
బాచుపల్లికి చెందిన పఠాన్‌ మహబూబ్‌ జానీ గత నెల 19న తన ఇంట్లో 5 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేశారని తెలిపారు. లక్ష్మిపై అనుమానం ఉందని తెలపగా ఈ నెల 1న ఆమెను స్టేషన్‌కు తీసుకొచ్చి మహిళా పోలీసుల సమక్షంలో విచారించామని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడి ఇంట్లో పనిచేసేందుకు వెళ్లి బంగారు చెయిన్‌ను దొంగిలించి, దాన్ని తన ఆడపడుచు భర్త రాజే‹Ùకు ఇచ్చినట్లు తెలిపిందని, అయితే ఇప్పటివరకు రాజేష్‌ను ఒక్కసారి కూడా స్టేషన్‌కు పిలవలేదని పోలీసులు తెలిపారు.

ఆమె చెయిన్‌ను తిరిగి ఇచ్చేశాం
విచారణ నిమిత్తం లక్ష్మీని స్టేషన్‌కు తీసుకొచ్చాం. ఎవరూ కొట్టలేదు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే పోలీసులు తమ జోలికి రారని ఓ న్యాయవాది సలహా మేరకు రాజేష్‌ అలా చేసినట్టు తెలిసింది. ఇంటి యజమాని తన గొలుసు కాదని చెప్పడంతో దానిని ఆమెకే తిరిగి ఇచ్చేశాం. అసలు నిందితుల పట్టుకునేందుకు కేసు దర్యాప్తు చేస్తున్నాం. 
    – ఉపేందర్, ఇన్‌స్పెక్టర్, బాచుపల్లి

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement