Third Degree of Police
-
సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ
సాక్షి, అమరావతి: సోషల్ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు ప్రభుత్వం యథేచ్ఛగా అమానుష కాండను కొనసాగిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుండడమే వారు చేసిన నేరం. వారిపై అక్రమ కేసులు నమోదు చేయడమే కాకుండా ...వారిని అక్రమంగా నిర్బంధించి భౌతికంగా దాడులు చేస్తూ ...కసి తీరిన తరువాతే అరెస్ట్ చూపిస్తోంది. మానవ హక్కులను నిర్భీతిగా ఉల్లంఘిస్తూ ...రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ సాగిస్తున్న ఈ దమనకాండకు ప్రభుత్వ ముఖ్యనేతే ప్రధాన కుట్రదారు కాగా... కీలక పోలీసు అధికారులు పాత్రధారులు, పర్యవేక్షకులు. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఈ రాక్షస క్రీడ కొనసాగుతోంది. అందులో ప్రధానంగా ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఇందులో బాగా ఆరితేరిపోయారు. అందరికన్నా ముందుండాలన్న తాపత్రయం వారిలో కనిపిస్తోంది. పౌరుల భావప్రకటనా స్వేచ్ఛను దారుణంగా కాలరాస్తున్న సర్కారు దమననీతిపై న్యాయపోరాటానికి ప్రజలు సన్నద్ధమవుతున్నారు. అంతేకాదు తమ విద్యుక్తధర్మాన్ని గాలికొదిలేసి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్లల్లా తలాడిస్తూ సోషల్ మీడియా యాక్టివిస్టులపై దమనకాండను కొనసాగిస్తున్న పోలీసు అధికారులపైనా ఎక్కడికక్కడ ప్రైవేటు కేసులు వేసేందుకు బాధిత కుటుంబాలు సిద్ధమవుతున్నాయి. వీరికి పలువురు మేధావులు, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమకారులు, పలు పౌరసంఘాల నేతలు మద్దతుగా నిలుస్తున్నారు. త్వరలోనే ‘పచ్చ’పాత పోలీసు అధికారులందరూ న్యాయస్థానం ముందు దోషులుగా నిలబడడం తథ్యమని బాధిత కుటుంబాలు స్పష్టం చేస్తున్నాయి. అంతా ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే... ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో కొనసాగుతోంది. రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో శాంతిభద్రతల విభాగాన్ని పర్యవేక్షించే ఉన్నతాధికారి ఈ వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షిస్తుండటం గమనార్హం. అంటే ఈ అమానుష కాండను కొనసాగించేందుకు ప్రభుత్వ పెద్దలు రాష్ట్రస్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారని దీనినిబట్టి స్పష్టమవుతోంది. ప్రభుత్వ పెద్దలు టార్గెట్ చేసిన సోషల్ మీడియా యాక్టివిస్టులను వారు సంతృప్తిచెందే స్థాయిలో భౌతికంగా హింసించారా లేదా అన్నది వీడియో కాల్ ద్వారా పర్యవేక్షిస్తుండటం ప్రభుత్వ కక్షకు పరాకాష్టగా నిలుస్తోంది. ఆ రాక్షసకాండ ఇలా సాగుతోంది... ఎన్ని కేసులు.. ఎక్కడికి తరలిస్తున్నారు? రాష్ట్రంలో సోషల్‌మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం ఎడాపెడా అక్రమ కేసులు బనాయిస్తోంది. ఒక్కో యాక్టివిస్టుపై ఒకటికి మించిన కేసులు నమోదు చేయడమే కాకుండా... వేర్వేరు జిల్లాల్లో కేసులు నమోదు చేస్తోంది. వారిని పోలీసులు హఠాత్తుగా అదుపులోకి తీసుకుని తమతో పట్టుకుపోతున్నారు. ఏ జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకుందీ... ఏ పోలీస్ స్టేషన్‌కు తరలించారన్న కనీస సమాచారాన్ని కూడా కుటుంబ సభ్యులకు చెప్పడం లేదు. దాంతో తమ పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వాకబు చేస్తే అసలు తాము ఎవర్నీ అదుపులోకి తీసుకోలేదని అక్కడి పోలీసు అధికారులు చెబుతున్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి కరడుగట్టిన నేరస్తులా? అక్రమంగా అదుపులోకి తీసుకున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను పోలీస్ స్టేషన్లు తిప్పుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారు. కరడుగట్టిన నేరస్తులపై ప్రయోగించినట్లు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ భౌతికంగా హింసిస్తున్నారు. తాము చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వాలని..లేకపోతే మరిన్ని రోజులు చిత్రవధ తప్పదని హెచ్చరిస్తున్నారు. వీడియో కాల్ ద్వారా నిర్ధారణ సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించామని పోలీసులు మాటలతో చెబితే ఉన్నతాధికారులు సంతృప్తి చెందడం లేదు. పోలీసు అధికారులు రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో శాంతిభద్రతల విభాగాన్ని పర్యవేక్షించే ఓ ఉన్నతాధికారికి వీడియో కాల్ చేసి మరీ చూపిస్తున్నారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై థర్డ్ డిగ్రీ తాము ఆశించినస్థాయిలో ప్రయోగించారా లేదా అన్నది ఆ ఉన్నతాధికారి వీడియో కాల్ ద్వారా పరిశీలిస్తారు. ఆయన సంతృప్తి చెందితే ఆ విషయాన్ని తన బిగ్ బాస్‌కు నివేదిస్తారు. ఆయన అనుమతి ఇచ్చిన తరువాతే... ఒకే ఇక చాలు... అరెస్ట్ చూపించండి అని ఆ ఉన్నతాధికారి జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు చెబుతారు.చిత్రహింసల తర్వాతే అరెస్ట్..ఆ విధంగా ప్రభుత్వ పెద్దలు ఆదేశించినస్థాయిలో థర్డ్ డిగ్రీని ప్రయోగించారని నిర్ధారించుకున్న తరువాతే సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్ట్ చూపిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా మూడు రోజుల నుంచి వారం రోజులపాటు సాగుతోంది. కుట్రపూరిత, కక్ష పూరిత రాజకీయాలకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న తీరుపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పోలీసు వ్యవస్థను గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతగా దుర్వినియోగం చేయలేదని పోలీసు అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. పోలీసులను గుండాల మాదిరిగా మార్చి రాజకీయ అరాచకం సాగిస్తుండటం విభ్రాంతికరమని మండిపడుతున్నారు. ఈ పరిణామాలతో పోలీసు అధికారులు భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. -
చేయని నేరానికి మహిళపై థర్డ్ డిగ్రీ!
సాక్షి, హైదరబాద్: చేయని నేరాన్ని ఒప్పుకోవాలని ఓ మహిళను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. ఆమె చేతులు, కాళ్ల మీద లాఠీలతో చితకబాదారు. ఈ ఘటనలో ఆమె బాబాయిని విచారణ నిమిత్తం రావాలని పోలీ సులు పిలవడంతో భయపడి ఆత్మహత్యకు యత్నంచాడు. ఈ ఘటన బాచుపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చిత్తారపు లక్ష్మీ, తాతారావు భార్యభర్తలు. తాతారావు బాచుపల్లి రాజీవ్‌గాంధీ నగర్‌లోని జయదీప్ ఎస్టేట్‌లోని ఎన్డీ–5 అపార్ట్మెంట్లో వాచ్‌మేన్‌గా, లక్ష్మీ ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవిస్తున్నారు. అయితే గత నెల 16న ఎన్డీ–4 అపార్ట్మెంట్లో జీ–1 ఇంటి యజ మాని కోరడంతో వారి ఇంట్లో లక్ష్మీ పనికి వెళ్లింది. 18న ఆ యజమాని తన ఇంటిలో బంగారుగొలుసు చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మీపై యజమాని అనుమానం వ్యక్తం చేయడంతో 19న పోలీసులు ఆమెను రోజూ స్టేషన్‌కు తీసుకొచ్చి చిత్రహింసలకు గురిచేశారు. కాళ్లు, చేతుల మీద చితకబాదారు. ఏదో ఒకటి తెచ్చి ఇస్తే వదిలేస్తామని పోలీసులు చెప్పడంతో దెబ్బలకు తట్టుకోలేక పోయిన లక్ష్మీ తన బాబాయ్ రాజేష్ మెడలోని గొలుసును తీసుకొచ్చి పోలీసులకు అప్పగించింది. అయితే అది తన చెయిన్ కాదని యజమాని చెప్పడంతో తిరిగి దానిని లక్ష్మీకి అప్పగించారు. భయపడి.. పురుగులమందు తాగి..లక్ష్మీ, ఆమె బాబాయ్ రాజేష్ ను పోలీసు స్టేషన్‌కు రావాలని మంగళవారం పోలీసులు పిలి చారు. కొడతారేమోనని భయపడిపోయిన రాజేష్ ఠాణా గేటు బయట పురుగులమందు తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన రాజేశ్‌ను ఆయన భార్య సుధా, బంధువులు వెంటనే బాచుపల్లిలోని ఎస్ఎల్జీ ఆసుపత్రికి తరలించారు. వైద్యానికి రోజుకు రూ.45 వేలు ఖర్చు అవుతుందని ఆసుపత్రి యాజమాన్యం చెప్పడంతో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిపోతామని బాధితులు బదులిచ్చారు. బయటికి వెళితే అసలు విషయం బట్టబయలవుతుందని భావించిన పోలీసులు.. వైద్య ఖర్చులు తామే భరిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఐసీయూలో రాజేష్ చికిత్స పొందుతున్నాడు. ఇదిలా ఉండగా.. పోలీసులపై ఫిర్యాదు చేసేందుకు బాధితులు బాచుపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళితే ఎవరూ స్వీకరించకపోవడం గమనార్హం. చేయని నేరానికి మమ్మల్ని మానసికంగా, శారీరకంగా హింసించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని లక్ష్మీ, రాజేష్ కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.రెండు వారాల తర్వాత..బాచుపల్లికి చెందిన పఠాన్ మహబూబ్ జానీ గత నెల 19న తన ఇంట్లో 5 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఫిర్యాదు చేశారని తెలిపారు. లక్ష్మిపై అనుమానం ఉందని తెలపగా ఈ నెల 1న ఆమెను స్టేషన్‌కు తీసుకొచ్చి మహిళా పోలీసుల సమక్షంలో విచారించామని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడి ఇంట్లో పనిచేసేందుకు వెళ్లి బంగారు చెయిన్‌ను దొంగిలించి, దాన్ని తన ఆడపడుచు భర్త రాజే‹Ùకు ఇచ్చినట్లు తెలిపిందని, అయితే ఇప్పటివరకు రాజేష్‌ను ఒక్కసారి కూడా స్టేషన్‌కు పిలవలేదని పోలీసులు తెలిపారు.ఆమె చెయిన్‌ను తిరిగి ఇచ్చేశాంవిచారణ నిమిత్తం లక్ష్మీని స్టేషన్‌కు తీసుకొచ్చాం. ఎవరూ కొట్టలేదు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడితే పోలీసులు తమ జోలికి రారని ఓ న్యాయవాది సలహా మేరకు రాజేష్ అలా చేసినట్టు తెలిసింది. ఇంటి యజమాని తన గొలుసు కాదని చెప్పడంతో దానిని ఆమెకే తిరిగి ఇచ్చేశాం. అసలు నిందితుల పట్టుకునేందుకు కేసు దర్యాప్తు చేస్తున్నాం. – ఉపేందర్, ఇన్స్పెక్టర్, బాచుపల్లి -
పద్మనాభం పీఎస్ ఘటన.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు
సాక్షి, విశాఖపట్నం: పద్మనాభం పోలీస్ స్టేషన్ ఘటన పై సీపీ రవి శంకర్ సీరియస్ యాక్షన్‌కి దిగారు. యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో ముగ్గురిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భీమిలి పద్మనాభం మండలంలో బాందేవుపురం గ్రామానికి చెందిన వ్యక్తిపై పోలీసులు థర్ద్ డిగ్రీ ప్రయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ యువకుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి మరీ కాళ్లు విరగొట్టారని.. వాళ్లపై చర్యలు తీసుకోవాలని సోమవారం దళిత కులాల సంక్షేమ సేవా సంఘం ఆందోళన సైతం చేపట్టింది. ఈ విషయం సీపీ రవిశంకర్ దృష్టికి రావడంతో ఆయన చర్యలకు ఉపక్రమించారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసుల థర్డ్ డిగ్రీ
సాక్షి, అనంతపురం: జిల్లాలోని తాడిపత్రిలో దారుణం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే లక్ష్యంగా పోలీసులు మరోసారి దాడికి దిగారు. వైఎస్సార్సీసీ కార్యకర్తలపై జులూం ప్రదర్శించారు. చిన్న వివాదాన్ని ఆసరాగా చేసుకుని వైఎస్సార్సీపీకి చెందిన నలుగురు కార్యకర్తలపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. లాఠీలతో కుళ్లపొడిచారు. ఈ ఘటనలో వైఎస్సార్సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. అయినప్పటికీ వారిని ఆస్పత్రికి పంపకుండా కౌన్సిలింగ్ పేరిట పోలీస్ స్టేషన్లోనే ఉంచారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై పోలీసులు దాష్టికాన్ని ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. విచారణ జరపకుండానే థర్డ్ డిగ్రీ ప్రయోగించే హక్కు ఎవరిచ్చారని వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులను ప్రశ్నిస్తున్నారు. ఇటీవల సీఐ నారాయణరెడ్డి బదిలీ అయినప్పటికీ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై తాడిపత్రి పోలీస్ స్టేషన్లో విచక్షణా రహితంగా దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ శ్రేణులు లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
మైనర్‌ను ఘోరంగా హింసించారు
మహారాజ్‌గంజ్ : విచక్షణ మరిచి ఇద్దరు పోలీస్ అధికారులు చేసిన నిర్వాకం ఇప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తోంది. మైనర్ అని కూడా చూడకుండా ఓ బాలుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి తీవ్ర విమర్శలతోపాటు వేటును ఎదుర్కున్నారు. ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ దొంగతనం ఆరోపణలపై బాలుడిని స్టేషన్ కు తెచ్చిన పోలీసులు ఆ వస్తువు ఎక్కడ దాచాడో చెప్పాలంటూ అతన్ని వేధించటం మొదలుపెట్టారు. ముందు ఓ వెదురు బొంగును అతని తోడలపై పెట్టి ఇరుపక్కల అధికారులు నిల్చున్నారు. బాధతో అతను అరుస్తున్నా కనికరించలేదు. ఆపై మరో అధికారి లాఠీ తీసుకుని అతన్ని ఇష్టం వచ్చినట్లు చితకబాదాడు. కాలితో తంతుంటే ఆ పిల్లాడు వేడుకోవటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్న దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అధికారుల వివరణ... కాగా, ఈ ఘటనపై అడిషనల్ ఎస్పీ అశుతోష్ శుక్లా స్పందించారు. పనియారా స్టేషన్ పరిధిలో ఇది చోటు చేసుకుందని ఆయన చెప్పారు. సెప్టెంబర్‌లోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఘటనపై ఇప్పటికే సబ్ ఇన్ స్పెక్టర్ కేఎన్ షాహి, మరో పోలీసును సస్పెండ్ చేశామని వెల్లడించారు. చోరీకి గురైన వస్తువుల రికవరీ కోసమే వారు అలా ప్రవర్తించారని.. అతని వద్ద ఏం లభించకపోవటంతో వదిలేశారని శుక్లా చెబుతున్నారు. కాగా, ఆ వీడియో ఎవరు తీశారన్నదానిపై స్పష్టత రాలేదు. -
దళితులపై ‘థర్డ్ డిగ్రీ’
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల దాష్టీకం సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు దళితులపై ప్రతాపం చూపించారు. రైతు భూమయ్యను ఇసుకలారీ ఢీకొన్న ఘటన తర్వాత జరిగిన ఇసుక లారీల దహనానికి బాధ్యులంటూ పోలీసులు కొందరిని పట్టు కెళ్లి థర్డ్‌డిగ్రీ ప్రయోగించడంతో వారికి కనీ సం నోట మాట రావడం లేదు. పక్కటెము కలు విరిగిపోయాయి. గాయాలతో ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు. గాయాలు చూసిన జైలర్ వారిని రిమాండ్‌కు తీసుకో కుండా వెనక్కి పంపించాడంటే.. బాధితుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వద్ద ఈనెల 2న నేరెళ్ల గ్రామ రైతు భూమయ్యను ఇసుక లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఆగ్రహించిన స్థానికులు ఐదు ఇసుక లారీల కు నిప్పు పెట్టారు. అడ్డుకున్న తంగళ్లపల్లి ఎస్సై సైదారావుపైనా దాడి చేశారు. దీనికి సంబందించి 13 మందిపై పోలీసులు క్రిమిన ల్ కేసులు పెట్టారు. ఈనెల 4 రాత్రి బాణయ్య, హరీశ్, బాలరాజు, ఈశ్వర్‌కు మార్, గోపాల్, మహేశ్.. మరో ఇద్దరిని పోలీసులు తీసుకెళ్లినట్లు బాధితుల కుటుంబ సభ్యులు తెలిపారు. వారిని జిల్లా కేంద్రం లోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో 4 రోజులు నిర్బంధించి, చితకబాదారు. థర్డ్‌డిగ్రీ ప్ర యోగించారు. దీంతో తీవ్ర గాయాలపాలైన బాధితుల అవయవాలు దెబ్బతిన్నాయి. మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు.. పోలీసుల దెబ్బలతో 8 మంది ఆస్పత్రిపాలు కావడంపై బాధిత కుటుంబ సభ్యులతో పాటు.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. బాధ్యులైన ఎస్పీ విశ్వజిత్, సీసీఎస్ ఎస్సై రవీందర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుల కుటుంబ సభ్యులు డీజీపీకి ఫిర్యాదు చేశారు.