
మహారాజ్‌గంజ్ : విచక్షణ మరిచి ఇద్దరు పోలీస్ అధికారులు చేసిన నిర్వాకం ఇప్పుడు మీడియాలో హల్ చల్ చేస్తోంది. మైనర్ అని కూడా చూడకుండా ఓ బాలుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి తీవ్ర విమర్శలతోపాటు వేటును ఎదుర్కున్నారు. ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంజ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓ దొంగతనం ఆరోపణలపై బాలుడిని స్టేషన్ కు తెచ్చిన పోలీసులు ఆ వస్తువు ఎక్కడ దాచాడో చెప్పాలంటూ అతన్ని వేధించటం మొదలుపెట్టారు. ముందు ఓ వెదురు బొంగును అతని తోడలపై పెట్టి ఇరుపక్కల అధికారులు నిల్చున్నారు. బాధతో అతను అరుస్తున్నా కనికరించలేదు. ఆపై మరో అధికారి లాఠీ తీసుకుని అతన్ని ఇష్టం వచ్చినట్లు చితకబాదాడు. కాలితో తంతుంటే ఆ పిల్లాడు వేడుకోవటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. పోలీస్ స్టేషన్ ఆవరణలోనే అతనిపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్న దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి.
అధికారుల వివరణ...
కాగా, ఈ ఘటనపై అడిషనల్ ఎస్పీ అశుతోష్ శుక్లా స్పందించారు. పనియారా స్టేషన్ పరిధిలో ఇది చోటు చేసుకుందని ఆయన చెప్పారు. సెప్టెంబర్‌లోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ఘటనపై ఇప‍్పటికే సబ్ ఇన్ స్పెక్టర్ కేఎన్ షాహి, మరో పోలీసును సస్పెండ్ చేశామని వెల్లడించారు. చోరీకి గురైన వస్తువుల రికవరీ కోసమే వారు అలా ప్రవర్తించారని.. అతని వద్ద ఏం లభించకపోవటంతో వదిలేశారని శుక్లా చెబుతున్నారు. కాగా, ఆ వీడియో ఎవరు తీశారన్నదానిపై స్పష్టత రాలేదు.