ప్రేమ ఎంత కఠినం! | How much harder to love! | Sakshi
Sakshi News home page

ప్రేమ ఎంత కఠినం!

Published Sat, Nov 8 2014 11:46 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

ప్రేమ ఎంత కఠినం! - Sakshi

ప్రేమ ఎంత కఠినం!

ప్రేమ ప్రాణమైనా ఇస్తుందని అంటారు. కానీ ఆ ప్రేమ హద్దులు దాటితే... పిచ్చిగా పరిణమిస్తే... ప్రాణాలు తీసేందుకు సైతం సిద్ధపడితే... దాన్ని ప్రేమ అనాలా? అనవచ్చా? లేదు. అది ప్రేమ ఎంతమాత్రం కాదు. ఆ నిజం తెలిస్తే ఒక కత్తి లేచేది కాదు. ఒక తుపాకీ పేలేది కాదు. ఓ నిండు ప్రాణం పోయేది కాదు. అది ప్రేమ కాదు. కానే కాదు!!
 
 జూన్ 9, 2008... అమెరికాలోని ఆరిజోనా...
 హాల్లో కూర్చుని, ఫుట్‌బాల్ మ్యాచ్‌ని రెప్ప వేయకుండా చూస్తున్నాడు జోనా. అంతలో లోపల్నుంచి వచ్చాడు కెవిన్.
 ‘‘రేయ్... ఎంత ఫుట్‌బాల్ అంటే ఇష్టమైతే మాత్రం, కాలింగ్ బెల్ సౌండ్ కూడా వినిపించనంతగా లీనమైపోవాలా’’ అంటూ జోనా నెత్తిమీద ఒక్కటిచ్చాడు.
 ‘‘పోరా... నీకు వినిపించింది కదా... నువ్వే తియ్యి తలుపు’’ అనేసి మళ్లీ టీవీలో తలదూర్చాడు జోనా. ‘‘వీడీ జన్మకి మారడు’’ అని తిట్టుకుంటూ వెళ్లి తలుపు తీశాడు కెవిన్. ఎదురుగా ఓ కొత్త వ్యక్తి నిలబడి ఉన్నాడు. ‘‘నా పేరు కార్టర్, ట్రావిస్ అలెగ్జాండర్ కొలీగ్‌ని. తను ఉన్నాడా?’’ అడిగాడా వ్యక్తి.
 ‘‘అలెక్స్ ఇంట్లో లేడు. ఆఫీస్ పనిమీద ఐదు రోజుల క్రితం టూర్ వెళ్లాడు. అయినా ఆ విషయం మీకు తెలిసే ఉండాలి కదా’’
 కెవిన్ అలా అనగానే ముఖం అదోలా పెట్టాడు కార్టర్. ‘‘అలెక్స్ టూర్‌కి వెళ్లాల్సిన మాట వాస్తవమే. కానీ తను వెళ్లలేదు. నాలుగో తేదీన ఓ ముఖ్యమైన కాన్ఫరెన్స్ ఉంది. కానీ తను అక్కడికి రాలేదని మాకు ఫోన్ వచ్చింది. అప్పట్నుంచీ కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా ఫోన్ కనెక్ట్ కావడం లేదు.’’
 కెవిన్ అవాక్కయ్యాడు. ‘‘అదేంటి? తను ఆ రోజే వెళ్లిపోయాడు’’ అన్నాడు షాక్ తిన్నవాడిలా.
 ‘‘లేదు. ఇంకెక్కడికైనా వెళ్లాడో ఏమో. ఒక ముఖ్యమైన ఫైల్ తన దగ్గరుంది. దాని కోసమే వచ్చాను.’’
 ‘‘తన రూమ్‌లో ఉందేమో చూస్తాను’’ అంటూ వెళ్లి అల్మరాలో అలెక్స్ గది తాళం కోసం వెతికాడు కెవిన్. కనిపించలేదు. తాళమేమయ్యిందని జోనాని అడిగాడు. అతడూ తెలియదన్నాడు.
 ‘‘ఒకవేళ తాళం తనతో తీసుకెళ్లాడేమో’’ అన్నాడు కార్టర్.
 ‘‘లేదండీ... ఎవరు ఎక్కడికెళ్లినా తాళం అల్మరాలో పెట్టి వెళ్లిపోతాం. ఎప్పుడే అవసరం వస్తుందో తెలియదు కదా! ’’ అన్నాడు కెవిన్. జోనాతో కలిసి హాలంతా వెతికాడు. చివరకు సోఫా కింద దొరికింది.
 ‘‘హమ్మయ్య... దొరికింది. ఏదైనా తీసినప్పుడు అల్మరాలోంచి పడిపోయి ఉంటుంది’’ అంటూ వెళ్లి అలెక్స్ బెడ్‌రూమ్ తాళం తీశాడు కెవిన్. ‘‘మీరూ రండి సర్. అదేం ఫైలో నాకు తెలియదు కదా’’ అన్నాడు. కార్టర్ గదివైపు నడిచాడు. ఇద్దరూ లోపల అడుగుపెట్టారు. అంతే... గుప్పుమన్న వాసనకు కడుపులో తిప్పినట్టయ్యింది. వెంటనే ఖర్చీఫులు తీసి ముక్కుకు అడ్డం పెట్టుకున్నాడు.
 ‘‘ఏంటీ వాసన?’’ అన్నాడు కార్టర్.
 ‘‘తెలియదు’’ అంటూ ముందడుగు వేయబోయిన కెవిన్ బ్రేక్ వేసినట్టుగా ఆగిపోయాడు. గదిలో అక్కడక్కడా రక్తపు మడుగులు! కొన్ని ఎండిపోయాయి. కొన్ని ఎండిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. గోడల మీద కూడా రక్తపు మరకలు!
 ‘‘మైగాడ్... ఏమిటిదంతా’’ అన్నాడు కెవిన్ కంగారుగా. బెడ్‌రూమ్‌కి ఉన్న గ్లాస్ డోర్‌మీద కూడా రక్తం ఉంది. దాంతో గబగబా బాత్రూమ్ వైపు నడిచాడు. తలుపు తోశాడో లేదో... కెవ్వున కేక పెట్టాడు.
 బాత్రూములో... నేలమీద... నగ్నంగా, నిర్జీవంగా పడివున్నాడు అలెగ్జాండర్. ఒళ్లంతా రక్తపు ముద్దలా ఉంది. మెడ దాదాపు తెగి వేళ్లాడుతోంది.
 కెవిన్ అరుపు విని కంగారుగా వచ్చిన జోనా, అక్కడి దృశ్యాన్ని చూసి విస్తుపోయాడు. భోరున విలపించసాగాడు.
 వాళ్ల పరిస్థితి అర్థమయ్యింది కార్టర్‌కి. అందుకే తనే పోలీసులకు ఫోన్ చేశాడు. అరగంటలో పోలీసులు వచ్చేశారు. ఇల్లంతా పరిశీలించారు. బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించారు.
 కెవిన్, జోనాలు ఇంకా కన్నీరు మున్నీరవుతూనే ఉన్నారు. వాళ్ల దగ్గరకు వెళ్లి ధైర్యంగా ఉండమన్నట్టు భుజం తట్టాడు ఇన్‌స్పెక్టర్ ప్యాట్రిక్.
 ‘‘అలెక్స్ చాలా మంచివాడు సర్. కానీ ఆ రాక్షసి... తనని పట్టుకుని పీడించింది. తనే వాడినేదో చేసి ఉంటుంది’’
 కెవిన్ అలా అనగానే జోనా అందుకున్నాడు. ‘‘అవును సర్. నేను అనుకుంటూనే ఉన్నాను.. వాడిని బ్రతకనివ్వదని.’’
 కేసుకు కావలసిన బలమైన క్లూ దొరికింది ప్యాట్రిక్‌కి. ‘‘ఎవరు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు?’’ అన్నాడు ఆతృతగా. వాళ్ల దగ్గర మొత్తం విషయాన్ని లాగేశాడు. తర్వాత వేయాల్సిన అడుగేమిటో అర్థమై అక్కడ్నుంచి వేగంగా కదిలాడు.
   
 ‘‘జోడీ అరియాస్. ఇదేగా మీ పేరు?’’
 తన ఎదురుగా ఉన్న యువతిని ప్రశ్నించాడు ఇన్‌స్పెక్టర్ ప్యాట్రిక్. ఆమె అవునన్నట్టు తలాడించింది.
 ‘‘నాకు తిప్పి తిప్పి మాట్లాడ్డం ఇష్టముండదు మిస్ జోడీ... అందుకే డెరైక్ట్‌గానే అడిగేస్తున్నాను. ట్రావిస్ అలెగ్జాండర్‌ని ఎందుకు చంపారు?’’
 చివ్వున తలెత్తింది జోడీ. ‘‘నేను అలెక్స్‌ని చంపడమేంటి! తను నా ప్రాణం. ఎంతో ప్రేమించాను తనని. అలాంటిది నేనెందుకు తనని చంపుతాను?’’
 నవ్వాడు ప్యాట్రిక్. ‘‘ప్రేమ... సరే అయితే. కనీసం మీరు తనని చివరిసారిగా ఎప్పుడు కలిశారో చెప్తారా?’’
 ‘‘ఆరు నెలల క్రితం. మళ్లీ తనకి దగ్గరవ్వాలనే నేనెప్పుడూ ఆశపడ్డాను. దాని గురించి మాట్లాడ్డానికే తనని కలిశాను. కానీ తను అందుకు సిద్ధంగా లేడు. ఇక డిస్టర్బ్ చేయడం మంచిది కాదని దూరంగా ఉండిపోయాను.’’
 ఈసారి పకపకా నవ్వాడు ప్యాట్రిక్. అతడి నవ్వు చూసి జోడీకి చిర్రెత్తుకొచ్చింది. ‘‘ఎందుకలా నవ్వుతున్నారు’’ అంది ఆవేశంగా.
 ‘‘నవ్వకేం చేయమంటారు... ఇంత చక్కగా కథలు చెబుతుంటే’’ అంటూ ఓ కవర్ తీసి ఆమె చేతికందించాడు ప్యాట్రిక్. తెరచి చూడమని సైగ చేశాడు.
 మెల్లగా కవర్‌ని తెరిచింది జోడీ. అందులో ఉన్న ఫొటోలను చూడగానే ఆమె బుర్ర గిర్రున తిరిగింది. ‘‘ఇవి... ఇవి...’’ అంటూ నీళ్లు నమిలింది.
 ‘‘నువ్వు చెప్పేవన్నీ కథలు అని నిరూపించే సాక్ష్యాలు. అలెక్స్ చనిపోబోయే ముందు నువ్వు తనతో గడిపిన గుర్తులు. ఇవి చాలు నిజాన్ని నిరూపించడానికి.’’
 జోడీ ముఖం మ్లానమయ్యింది.

 ‘‘పగవాడిని కూడా చంపకూడనంత దారుణంగా చంపావ్ అతణ్ని. 29 సార్లు కత్తితో పొడిచావ్. తుపాకితో తలలో షూట్ చేశావ్. అప్పటికీ కసి తీరక మెడను కోసేశావ్. ఛీ... నువ్వసలు మనిషివేనా... ఇదేనా నీ ప్రేమ?’’ అనేసి అక్కడ్నుంచి విసవిసా వెళ్లిపోయాడు ప్యాట్రిక్.
 ముఖాన్ని చేతుల్లో దాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది జోడీ. రెండేళ్ల నుంచీ అలెక్స్‌తో అనుబంధం ఉంది ఆమెకి. అతడు ఓ లీగల్ ఏజెన్సీలో పని చేస్తున్నాడు. ఆఫీసు పని మీద ఒక చోటికి వెళ్లినప్పుడు, అనుకోకుండా జోడీతో పరిచయమయ్యింది. ఇద్దరూ చురుకైనవారు. అందుకే త్వరగా స్నేహితులయ్యారు. అంతే త్వరగా ప్రేమికులూ అయ్యారు. అయితే కొన్నాళ్లు గడిచాక తేడాలు వచ్చాయి. ముఖ్యంగా జోడీ ప్రవర్తన అలెక్స్‌ని విసుగెత్తించింది. ఎంతసేపూ ఆమెతోనే గడపాలి. లేదంటే గోల చేసేది. ఆమె వల్ల తన ఉద్యోగానికి ఇబ్బంది కలుగుతుందేమోనని భయపడేవాడు అలెక్స్. కాస్త స్పేస్ ఇవ్వమని కోరేవాడు. పనికి కూడా సమయం కేటాయించాలనేవాడు. దాంతో గొడవలు పెరిగాయి. విడిపోయారు.
 
కానీ జోడీ అతడిని వదల్లేదు. ఫోన్లు, మెసేజులు ఇచ్చి చాలా విసిగించేది. తట్టుకోలేకపోయేవాడు అలెక్స్. నా జీవితాన్ని నరకం చేసేసింది అంటూ ఫ్రెండ్స్ దగ్గర వాపోయేవాడు. అయితే ఎక్కడో ఓ మూల ఆమె మీద ప్రేమ ఉంది. అందుకే ఆమెకు మళ్లీ దగ్గరయ్యాడు. కానీ జోడీ ఏమాత్రం మారలేదు. టూర్‌కి వెళ్తున్నానని అతడు చెప్పినప్పుడు నేనూ వస్తానంటూ పట్టుబట్టింది. ప్రొఫెషనల్ టూర్ కాబట్టి కుదరదన్నాడు అలెక్స్. వెళ్లకముందు కాసేపు గడుపుదాం రమ్మన్నాడు. అతడు తనని కాదనడం నచ్చలేదు జోడీకి. అప్పటికే తనతో బ్రేకప్ అయిన అతడి మీద కోపం ఉందామెకి. ఇప్పుడిలా అనడంతో తనని కావాలనే అవాయిడ్ చేస్తున్నాడని కసి పెంచుకుంది. ప్లాన్ చేసుకుని వెళ్లింది. అతడితో గడిపినట్టే గడిపి అంతం చేసేసింది.
 
అయిదేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఈ నిజాలన్నిటినీ కోర్టు ముందు ఉంచారు పోలీసులు. అయితే జోడీ మాత్రం తాను నిర్దోషినంటూ గగ్గోలు పెట్టింది. కానీ ఫలితం లేకపోయింది. ఘటన జరగడానికి కొన్ని గంటల ముందు నుంచీ అలెక్స్‌తో అతడి గదిలో ఏకాంతంగా గడిపింది జోడీ. స్నానాల గదిలో సన్నిహితంగా ఉన్నప్పుడు తన ఆటోమేటిక్ కెమెరాను ఆన్ చేసి పెట్టాడు అలెక్స్. హత్య జరగ్గానే ఫొటోలన్నింటినీ డిలీట్ చేసి, కెమెరాని ఓ మూలకు విసిరి కొట్టింది జోడీ. అది పోలీసులకు దొరకడంతో వారు అధునాతన టెక్నాలజీని ఉపయోగించి ఫొటోల్ని రికవర్ చేశారు. వాటిలో వారి రొమాన్స్‌తో పాటు రక్తపు మడుగులో పడివున్న అలెక్స్ ఫొటోలు కూడా ఉన్నాయి. దాంతో అప్పుడు అక్కడ ఉన్న జోడీయే అలెక్స్‌ని చంపిందని నిర్ధారణ అయిపోయింది.
 
పోలీసులు ఈ రహస్యాన్ని ఛేదించగానే మరో కట్టుకథ అల్లింది జోడీ. తామిద్దరూ బాత్‌రూమ్‌లో ఉండగా ఓ ఆగంతకుడు దాడి చేశాడని, అతడే అలెక్స్‌ని చంపేశాడని అంది. అది నమ్మశక్యంగా లేదని పోలీసులు అనడంతో మరో కథ మొదలెట్టింది. అలెక్స్ తనని చిత్రహింసలు పెట్టేవాడని, ఆ రోజు కూడా తన మీద దాడి చేయడంతో, తనను తాను రక్షించుకోవడానికే అతణ్ని చంపానని అంది. అదీ నిజం కాదని తేలిపోయింది. ఎందుకంటే, మృతదేహం పక్కన పిస్టల్ ఉంది. అది జోడీ వాళ్ల అంకుల్‌ది అని, కొన్ని రోజులుగా కనిపించడం లేదని పరిశోధనలో తేలింది. పైగా అలెక్స్ దగ్గరకు వెళ్లేందుకు ఓ కారును అద్దెకు తీసుకుంది జోడీ. తిరిగి దాన్ని అప్పగించినప్పుడు కారులోని మ్యాట్స్ మిస్సయ్యాయి.  పైగా అక్కడక్కడా తుడిచీ తుడవకుండా వదిలేసిన ఏవో కొన్ని మరకలు కూడా ఉన్నాయని ఆ రెంటల్ కార్ కంపెనీ యజమాని ద్వారా తెలిసింది.
 
దాంతో జోడీ కథ అడ్డం తిరిగింది. అన్ని సాక్ష్యాలూ జోడీయే హంతకురాలని నొక్కి వక్కాణించాయి. కోర్టు కూడా ఈ నిజాన్ని అంగీకరించింది. జోడీని జీవితమంతా జైలులో ఉంచాలా లేక అలెక్స్ మరణానికి ప్రతిగా ఆమెకు కూడా మరణశిక్ష విధించాలా అన్న ఆలోచనలో ఉంది న్యాయస్థానం. బహుశా... త్వరలోనే తుది తీర్పు వెలువడవచ్చు!

- సమీర నేలపూడి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement