French Election Results 2024: సంకీర్ణమా... సంక్షోభమా? | French Election Results 2024: France faces hung parliament after leftist alliance election win | Sakshi
Sakshi News home page

French Election Results 2024: సంకీర్ణమా... సంక్షోభమా?

Published Tue, Jul 9 2024 5:43 AM | Last Updated on Tue, Jul 9 2024 11:53 AM

French Election Results 2024: France faces hung parliament after leftist alliance election win

ఫ్రాన్స్‌ ఎన్నికల్లో హంగ్‌

రైటిస్ట్‌ కూటమికి ఎదురుదెబ్బ ..  143 సీట్లతో మూడో స్థానం 

లెఫ్ట్‌ కూటమికి 193, అధికార కూటమికి 164 

సంకీర్ణం ఏర్పాటుపై ప్రస్తుతానికి అస్పష్టతే 

10 రోజుల్లోగా స్పష్టత వచ్చే అవకాశం

పారిస్‌:  ఫ్రాన్స్‌ ముందస్తు ఎన్నికల్లో నేషనల్‌ ర్యాలీ పార్టీ సారథ్యంలోని అతివాద కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. పార్లమెంటు దిగువ సభ నేషనల్‌ అసెంబ్లీకి జూన్‌ 30న జరిగిన తొలి రౌండ్‌ ఎన్నికల్లో గెలిచిన ఆ కూటమి ఆదివారం కీలకమైన రెండో రౌండ్‌ పోలింగ్‌లో చేతులెత్తేసింది. 577 స్థానాలకు గాను 143 సీట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. సోమవారం వెలువడ్డ ఫలితాల్లో ఏ కూటమికీ మెజారిటీ రాలేదు.

 తొలి రౌండ్‌ పరాజయం నేపథ్యంలో వామపక్ష న్యూ పాపులర్‌ ఫ్రంట్‌ (ఎన్‌పీఎఫ్‌)తో అవగాహనకు రావడం అధికార సెంట్రిస్ట్‌ కూటమికి కలిసొచి్చంది. మెజారిటీ స్థానాల్లో అవి ఒకే అభ్యరి్థని నిలపడంతో నేషనల్‌ ర్యాలీ కూటమి జోరుకు కళ్లెం పడింది. ముఖ్యంగా మెరీన్‌ లీ పెన్‌ సారథ్యంలోని నేషనల్‌ ర్యాలీ కూటమి ఫాసిస్టు ఎజెండాకు ప్రత్యామ్నాయంగా సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పరిరక్షణ తదితరాలతో ముందుకొచ్చిన ఎన్‌పీఎఫ్‌ అతి పెద్ద కూటమిగా అవతరించింది. 

దానికి 193 సీట్లు రాగా సెంట్రిస్ట్‌ కూటమి 164 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఎవరికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 289 సీట్లు రాకపోవడంతో హంగ్‌ ఏర్పడింది. దాంతో ఎన్‌పీఎఫ్‌తో కలిసి మాక్రాన్‌ కూటమి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదా, లేక పరిస్థితి రాజకీయ సంక్షోభం దిశగా వెళ్తుందా అన్నది ఆసక్తిగా మారింది. 

ప్రధాని పదవి కోసం ఎన్‌పీఎఫ్‌ పట్టుబడుతుండటం, ఆ కూటమిలోని అతివాద పార్టీలతో అధికారం పంచుకునేందుకు మాక్రాన్‌ సుముఖంగా లేకపోవడం వంటివి కారణం. దీనికి తోడు ఎన్‌పీఎఫ్‌లోనూ కీచులాటలున్నాయి. ఫ్రాన్సు లో దశాబ్దాలుగా ఏక పార్టీ పాలనే సాగుతూ వస్తోంది. నేషనల్‌ ర్యాలీకి ఆశించిన ఫలితాలు రాకపోయినా 2022 ఎన్నికల్లో కేవలం 89 సీట్లు సాధించిన కూటమి బలం ఈసారి గణనీయంగా పెరిగింది. ఫలితాలు తమకు ఎదురుదెబ్బ కాదని, తమ విజయం వాయిదా మాత్రమే పడిందని లీ పెన్‌ అన్నారు.     

అప్పుడే కీచులాటలు 
ఫలితాల నేపథ్యంలో ప్రధాని గేబ్రియెల్‌ అటల్‌ సోమవారం రాజీనామా చేశారు. దాన్ని మాక్రాన్‌ తిరస్కరించారు. ఫ్రాన్స్‌ ఆతిథ్యమిస్తున్న ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు మూడు వారాలే ఉండటంతో తాత్కాలికంగా పదవిలో కొనసాగాలని కోరారు. అందుకు అటల్‌ సిద్ధంగా ఉన్నా ఎన్‌పీఎఫ్‌ మాత్రం అధికారం చేతులు మారాల్సిందేనని పట్టుబడుతోంది. 

ప్రజాభీష్టాన్ని గౌరవించి తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని, ప్రధాని పదవి తమకే చెందాలని వామపక్ష నేత జీన్‌ లూక్‌ మెలెన్‌చోన్‌ డిమాండ్‌ చేశారు. అదే జరిగితే అధ్యక్షుడు, ప్రధాని వేర్వేరు పారీ్టల నుంచి ఉండటం ఫ్రాన్స్‌లో 22 ఏళ్లలో ఇదే తొలిసారి అవుతుంది. పలు అధికారాలను కూడా ప్రధానితో మాక్రాన్‌ పంచుకోవాల్సి ఉంటుంది. దీన్ని కో హాబిటేషన్‌గా పిలుస్తారు. దేశ చరిత్రలో ఇలాంటి సందర్భాలు ఇప్పటికి మూడుసార్లు వచ్చాయి. 

పలు మాక్రాన్‌ సంస్కరణలకు చరమగీతం పాడతామని, అత్యంత వ్యయ ప్రయాసలతో కూడిన ప్రజా వ్యయ పథకాన్ని తెస్తామని, ఇజ్రాయెల్‌పై కఠిన వైఖరి అవలంబిస్తామని ఎన్‌పీఎఫ్‌ ఇప్పటికే స్పష్టం చేయడంతో సంకీర్ణం ఏర్పాటు, మనుగడపై సందేహాలు తలెత్తుతున్నాయి. దీనికి తోడు ఎన్‌పీఎఫ్‌ భాగస్వాముల్లో అతివాద వామపక్షమైన ఫ్రాన్స్‌ అన్‌»ౌడ్‌తో కలిసి పని చేయబోమని మాక్రాన్‌ ఇప్పటికే ప్రకటించారు. 

సోషలిస్టులు, గ్రీన్స్‌తో భాగస్వామ్యానికి మొగ్గుతున్నారు. కానీ కొన్ని పక్షాలను పక్కన పెట్టేందుకు ఎన్‌పీఎఫ్‌ కూటమి అంగీకరించకపోవచ్చంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా నూతన జాతీయ అసెంబ్లీని జూలై 18న సమావేశపరుస్తానని మాక్రాన్‌ ప్రకటించారు. నాటో భేటీ కోసం బుధవారం నుంచి రెండు రోజుల పాటు ఆయన అమెరికాలో పర్యటించనున్నారు. తిరిగొచ్చాక సంకీర్ణ ఏర్పాటుపై ఎన్‌పీఎఫ్‌తో చర్చలుంటాయని భావిస్తున్నారు. హంగ్‌ ప్రభావంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ పడిపోయింది. యూరో విలువ కూడా 0.2 శాతం పడిపోయింది.

ప్రధానీ పవర్‌ఫుల్లే... 
ఫ్రాన్స్‌లో 1958 నుంచి సెమీ ప్రెసిడెన్షియల్‌ పాలన వ్యవస్థ అమల్లో ఉంది. దీన్ని ఫిఫ్త్‌ రిపబ్లిక్‌గా పిలుస్తారు. ఇందులో అధ్యక్షునితో పాటు పార్లమెంటుకూ విశేషాధికారాలు ఉంటాయి. 1962 నుంచి అధ్యక్షుడిని ప్రత్యక్ష ఓటింగ్‌ ద్వారా నేరుగా ఎన్నుకుంటున్నారు. ఆయనే దేశాధిపతిగా, సాయుధ దళాల కమాండర్‌గా వ్యవహరిస్తారు.

 విదేశాంగ విధానం, రక్షణ విషయాలపై సర్వాధికారాలు ఆయనవే. ప్రధాని సిఫార్సు మేరకు కేబినెట్‌ను నియమిస్తారు. దేశీయ నిర్ణయాలన్నీ ప్రధాని నేతృత్వంలోని పార్లమెంటు తీసుకుంటుంది. ఆయనను అధ్యక్షుడు తొలగించలేరు. రాజీనామాను అభ్యరి్థంచవచ్చు. రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘిస్తే మూడింట రెండొంతుల మెజారిటీతో అధ్యక్షున్ని పార్లమెంటు అభిశంసించవచ్చు.  

ఫలించని ముందస్తు... 
నేషనల్‌ అసెంబ్లీ పదవీకాలం 2027 దాకా ఉంది. కానీ జూన్‌ 9న యూరోపియన్‌ యూనియన్‌ ఎన్నికల్లో నేషనల్‌ ర్యాలీ చేతుల్లో మాక్రాన్‌ కూటమి ఘోర పరాజయం చవిచూసింది. దీనికితోడు ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న నేరాలు తదితరాలతో మాక్రాన్‌ నాయకత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. వీటన్నింటి నేపథ్యంలో మాక్రాన్‌ ముందస్తుకు వెళ్లారు.

 ఎన్నికల తేదీలు ప్రకటించగానే, సోషలిస్టులు, ఎకాలజిస్టులు, కమ్యూనిస్టులు, ఫ్రాన్స్‌అన్‌»ౌడ్‌ వంటివి కలిసి కలిసి ఎన్‌పీఎఫ్‌గా ఏర్పడ్డాయి. నేషనల్‌ ర్యాలీ కూటమిని ఓడించడమే లక్ష్యంగా చాలాచోట్ల ఎన్‌పీఎఫ్, సెంట్రిస్ట్‌ అభ్యర్థుల్లో ఎవరో ఒకరు తప్పుకుని ఓట్ల చీలికను నివారించారు. ఫలితంగా నేషనల్‌ ర్యాలీని నిలువరించినా మాక్రాన్‌ కూటమికి ఆయన ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు.

దేశవ్యాప్త హింస... 
ఎన్నికల్లో ఆధిక్యం నేపథ్యంలో ఎన్‌పీఎఫ్‌ మద్దతుదారులు వీధుల్లోకొచ్చి సంబరాలు చేసుకున్నారు. పారిస్‌లోని ప్లేస్‌ డి లా రిపబ్లిక్‌ వద్ద వేలాదిగా గుమిగూడారు. ఈ క్రమంలో వారికి, నేషనల్‌ ర్యాలీ అభిమానులకు ఘర్షణ చోటుచేసుకుంది. దాంతో పారిస్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హింస చెలరేగింది. మాసు్కలు ధరించిన నిరసనకారులు పారిస్‌ వీధుల్లో పరుగులు తీశారు. కొన్నిచోట్ల ఆస్తులను తగలబెట్టారు. రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఒలింపిక్స్‌పై ప్రభావమెంత? 
హంగ్‌ ఫలితాలతో ఫ్రాన్స్‌లో రాజకీయ అస్థిరత నెలకొనడంతో జూలై 26 నుంచి జరగాల్సిన పారిస్‌ ఒలింపిక్స్‌పై దాని ప్రభావం ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. అవి పూర్తయేదాకా పదవిలో కొనసాగేందుకు ప్రధాని అటల్‌ సుముఖంగా ఉన్నా ఆలోపే కొత్త ప్రధాని రావాల్సిందేనని అత్యధిక స్థానాలు సాధించిన లెఫ్ట్‌ కూటమి పట్టుబడుతోంది. 

ఒలింపిక్స్‌ భద్రత వ్యవహారాలు చూసుకునే కీలకమైన అంతర్గత భద్రత శాఖ మంత్రి గెలాల్డ్‌ డ్రమానియన్‌ కొనసాగడంపైనా సందిగ్ధతే కొనసాగుతోంది. ఒలింపిక్స్‌ను ఫ్రాన్స్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏడేళ్లుగా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. తాత్కాలిక స్టేడియాలు, మౌలిక సదుపాయాలు తదితరాలపై ఇప్పటికే 260 కోట్ల డాలర్లకు పైగా వెచి్చంచింది. ఏర్పాట్లన్నీ దాదాపుగా పూర్తయినట్టేనని, ఒలింపిక్స్‌ నిర్వహణకు ఇబ్బందేమీ ఉండబోదని మాక్రాన్‌ ప్రభుత్వం చెబుతోంది. వాటి పర్యవేక్షణకు ఇబ్బంది ఉండకూడదనే అటల్‌ రాజీనామాను మాక్రాన్‌ ఆమోదించలేదని సమాచారం.  

ఏం జరగవచ్చు? 
సంకీర్ణ ఏర్పాటు సాధ్యపడని పక్షంలో రోజువారీ వ్యవహారాలను నడిపేందుకు ఏ  పారీ్టలకు చెందని నిపుణులతో కూడిన ప్రభుత్వాన్ని మాక్రాన్‌ ఏర్పాటు చేసే వీలుంది. అయితే దేనికైనా పార్లమెంటు అనుమతి తప్పనిసరి. అధ్యక్షునిగా మాక్రాన్‌ పదవీకాలం 2027 దాకా ఉంది. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ఆలోపు తప్పుకోబోనని ఆయన ఇప్పటికే ప్రకటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement