ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ చరిత్ర సృష్టించారు. ఆ దేశ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఏడు స్థానాల్లో పోటీ చేసి.. ఆరింటిలో ఆయన ఘన విజయం సాధించారు. దీంతో అధికారం కోల్పోయినప్పటికీ తెగ విమర్శలు గుప్పించిన ఆ దేశ మీడియా.. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌ను ఆకాశానికెత్తేస్తోంది.
తాజాగా జాతీయ అసెంబ్లీలో ఎనిమిది సీట్లకు, పంజాబ్ అసెంబ్లీకి మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఏడు స్థానాలకు పోటీ చేశారు. ఆదివారం ఈ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అందులో ఆరు స్థానాల్లో ఆయన ఘన విజయం సాధించారు. దీంతో.. పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలన్న పీటీఐ డిమాండ్‌కు బలం చేకూరినట్లయ్యింది.
పాక్‌లో ఈ ఏప్రిల్‌లో ప్రధాని పీఠం నుంచి ఇమ్రాన్ ఖాన్ దిగిపోయాక.. షెహ్‌బాజ్ షరీఫ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఈ క్రమంలో 131 స్థానాలకు గానూ దశల వారీగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది పాక్ ఎన్నికల సంఘం. అయితే.. ఈ ఆరు నెలల పాలన తీరుపైనా ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిందనేది పీటీఐ వాదన. ఈ మేరకు జాతీయ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఈసీ మాత్రం అందుకు సాంకేతిక కారణాలను సాకుగా చూపిస్తోంది. ఈ క్రమంలో.. ఇప్పుడు ఉప ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి ప్రతికూలంగా రావడం గమనార్హం.
Entire nation stands with Imran Khan !! pic.twitter.com/hbvdMBAz70
— PTI (@PTIofficial) October 17, 2022
ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమికి భంగపాటే ఎదురైంది. అధికార పార్టీ మిత్రపక్షం పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ రెండు స్థానాలు మాత్రమే దక్కించుకుంది. ఇక అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు గడుస్తున్నా.. ఆర్థిక సంక్షోభం, ఆ వెంటనే వరదలు పాక్‌ను అల్లకల్లోలం చేశాయి. ఈ క్రమంలో సహాయక చర్యల్లోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మంత్రులు, అధికారులు ఎక్కడ కనిపించినా.. ప్రజల నుంచి బహిరంగంగా అవమానాలే ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఫలితాలు సైతం ప్రతికూలంగా రావడంతో ప్రభుత్వానికి గుబులు పట్టుకుంది. దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్న ఇమ్రాన్ ఖాన్.. పాక్ పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని, విదేశీ కుట్రతో గద్దెనెక్కిన ప్రభుత్వాన్ని కూలగొట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని పిలుపు ఇస్తూ వస్తున్నాడు.
ప్రస్తుతం ఆయన ఆరు స్థానాల్లో గెలుపొందినప్పటికీ.. ఒక్కదాని మినహా మిగతా అన్నింటికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో మిగతా స్థానాలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. గతంలో పాక్ గడ్డపై అత్యధికంగా ఐదు స్థానాల్లో పోటీ చేసి.. ఐదింటిలోనూ విజయం సాధించారు ఇమ్రాన్ ఖాన్. ఇప్పుడు తన రికార్డును తానే బద్దలు కొట్టి పాక్ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను తిరగరాశారు.
ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పీటీఐ పార్టీ న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా, యూఏఈ నుంచి ఇల్లీగల్‌గా ఫారిన్ ఫండ్స్ దక్కించుకుందని పీటీఐ మీద ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ఈ ఆరోపణలు రుజువైతే మాత్రం ఇమ్రాన్ ఖాన్ జైలుకు వెళ్లాల్సి రావడమే కాదు.. ఎన్నికల్లో పోటీ చేయడానికి పీటీఐ అర్హత కోల్పోతుంది కూడా.
ఇదీ చదవండి: చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చిన్నదేశం
Comments
Please login to add a commentAdd a comment