bye elections
-
ఇమ్రాన్ ఖాన్ సిక్సర్.. ఆకాశానికెత్తిన మీడియా
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ చరిత్ర సృష్టించారు. ఆ దేశ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో ఏడు స్థానాల్లో పోటీ చేసి.. ఆరింటిలో ఆయన ఘన విజయం సాధించారు. దీంతో అధికారం కోల్పోయినప్పటికీ తెగ విమర్శలు గుప్పించిన ఆ దేశ మీడియా.. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్‌ను ఆకాశానికెత్తేస్తోంది. తాజాగా జాతీయ అసెంబ్లీలో ఎనిమిది సీట్లకు, పంజాబ్ అసెంబ్లీకి మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఏడు స్థానాలకు పోటీ చేశారు. ఆదివారం ఈ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అందులో ఆరు స్థానాల్లో ఆయన ఘన విజయం సాధించారు. దీంతో.. పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలన్న పీటీఐ డిమాండ్‌కు బలం చేకూరినట్లయ్యింది. పాక్‌లో ఈ ఏప్రిల్‌లో ప్రధాని పీఠం నుంచి ఇమ్రాన్ ఖాన్ దిగిపోయాక.. షెహ్బాజ్ షరీఫ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. ఈ క్రమంలో 131 స్థానాలకు గానూ దశల వారీగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది పాక్ ఎన్నికల సంఘం. అయితే.. ఈ ఆరు నెలల పాలన తీరుపైనా ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిందనేది పీటీఐ వాదన. ఈ మేరకు జాతీయ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఈసీ మాత్రం అందుకు సాంకేతిక కారణాలను సాకుగా చూపిస్తోంది. ఈ క్రమంలో.. ఇప్పుడు ఉప ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి ప్రతికూలంగా రావడం గమనార్హం. Entire nation stands with Imran Khan !! pic.twitter.com/hbvdMBAz70 — PTI (@PTIofficial) October 17, 2022 ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమికి భంగపాటే ఎదురైంది. అధికార పార్టీ మిత్రపక్షం పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ రెండు స్థానాలు మాత్రమే దక్కించుకుంది. ఇక అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు గడుస్తున్నా.. ఆర్థిక సంక్షోభం, ఆ వెంటనే వరదలు పాక్‌ను అల్లకల్లోలం చేశాయి. ఈ క్రమంలో సహాయక చర్యల్లోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. మంత్రులు, అధికారులు ఎక్కడ కనిపించినా.. ప్రజల నుంచి బహిరంగంగా అవమానాలే ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఫలితాలు సైతం ప్రతికూలంగా రావడంతో ప్రభుత్వానికి గుబులు పట్టుకుంది. దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహిస్తున్న ఇమ్రాన్ ఖాన్.. పాక్ పార్లమెంట్‌కు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని, విదేశీ కుట్రతో గద్దెనెక్కిన ప్రభుత్వాన్ని కూలగొట్టి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని పిలుపు ఇస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ఆరు స్థానాల్లో గెలుపొందినప్పటికీ.. ఒక్కదాని మినహా మిగతా అన్నింటికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో మిగతా స్థానాలకు మళ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. గతంలో పాక్ గడ్డపై అత్యధికంగా ఐదు స్థానాల్లో పోటీ చేసి.. ఐదింటిలోనూ విజయం సాధించారు ఇమ్రాన్ ఖాన్. ఇప్పుడు తన రికార్డును తానే బద్దలు కొట్టి పాక్ రాజకీయాల్లో సరికొత్త చరిత్రను తిరగరాశారు. ఇదిలా ఉంటే.. ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పీటీఐ పార్టీ న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా, యూఏఈ నుంచి ఇల్లీగల్‌గా ఫారిన్ ఫండ్స్ దక్కించుకుందని పీటీఐ మీద ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ ఈ ఆరోపణలు రుజువైతే మాత్రం ఇమ్రాన్ ఖాన్ జైలుకు వెళ్లాల్సి రావడమే కాదు.. ఎన్నికల్లో పోటీ చేయడానికి పీటీఐ అర్హత కోల్పోతుంది కూడా. ఇదీ చదవండి: చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చిన్నదేశం -
మునుగోడు వరకే టీఆర్ఎస్కు మద్దతు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల వరకే టీఆర్ఎస్కు తమ మద్దతు అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్పష్టంచేశారు. బీజేపీని ఓడించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కాషాయ పార్టీ గెలిస్తే కమ్యూనిస్టులు సహా ఇతర రాజకీయ పార్టీల మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. తమ్మినేని గురువారం విలేకరులతో మాట్లాడారు. మునుగోడు సభ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అసలు విషయాన్ని ప్రకటించారనీ, రాజ గోపాల్‌రెడ్డి గెలిచిన నెలరోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొడతామన్నా రని గుర్తు చేశారు. పూర్తి మెజార్టీతో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలా పడగొడతారని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐలను ప్రయోగించి ఎమ్మెల్యేలను లొంగదీసుకుంటారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతం టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉందని తమ్మినేని చెప్పారు. అయితే మునుగోడులో ప్రస్తుతం రెండోస్థానంలో ఉన్న కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయే అవకాశముందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి వచ్చాక ఆ పార్టీ శ్రేణుల్లో కొంత కదలిక వచ్చిందని అభిప్రాయపడ్డారు. మునుగోడులో మద్దతివ్వాలంటూ కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు తమను సంప్రదించారని, బీజేపీని ఓడించే పార్టీకే మద్దతిస్తామని చెప్పామన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ కేసీఆర్ ఏకం చేస్తున్నారని అన్నారు. అదే తమకు సీపీఐకి తేడా...: ‘మునుగోడు ఉప ఎన్నికల్లో అనుసరించే వ్యూహంపై సీపీఐని సంప్రదించాం. పోటీచేసి ఓట్లు చీల్చి బీజేపీ గెలిచేందుకు మేలు చేయడం కంటే ఓడించాలన్న నిర్ణయానికి వచ్చాం. అయితే ఈ ఎన్నికలతోపాటు సాధారణ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామంటూ సీపీఐ ప్రకటించింది. మేము మునుగోడు ఉప ఎన్నికల వరకే టీఆర్ ఎస్‌కు మద్దతు ఇస్తాం. సాధారణ ఎన్నికల నాటికి రాజకీయ పరిణామాలు, బీజేపీ ప్రమాదం వంటి అంశాలను బట్టి అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. అదే సీపీఐకి, మాకు తేడా’ అని తమ్మినేని చెప్పారు. -
కేసీఆర్ పోటీ చేసినా గెలుస్తా: కోమటిరెడ్డి
సాక్షి ,మునుగోడు: మునుగోడు ఉపఎన్నికలో సీఎం కేసీఆర్ పోటీచేసినా విజయం తనదేనని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఉపఎన్నికలో పోటీ చేయాలని సవాల్ విసిరారు. కేసీఆర్ నియంత పాలనను అంతమొందించేందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరానన్నారు. శనివారం మునుగోడులో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ కుటుంబసభ్యులు జైలుకు వెళ్లే రోజులు దగ్గరపడ్డాయని, ఇప్పటికే ఆయన కుమార్తె కవిత లిక్కర్ కేసులో దొరికిపోయారన్నారు. రూ.లక్ష కోట్లకు పైగా దోచుకున్న కేసీఆర్‌తో పాటు ఆయన కుమారుడు, అల్లుడిని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా త్వరలో జైలుకు పంపి తీరుతారని హెచ్చరించారు -
మునుగోడు ఉప ఎన్నిక: టికెట్ రెడ్డికా.. బీసీకా?
సాక్షి, హైదరాబాద్: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక అభ్యర్థిని ఖరారు చేసే అంశంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. బీసీ లేదా రెడ్డి సామాజికవర్గానికి చెందినవారిలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యుల్లో తర్జనభర్జనలు జరుగుతున్నాయి. బీసీ వర్గాలకు టికెట్ కేటాయించే యోచనలో ఉన్న రాష్ట్ర పార్టీ పెద్దల వైఖరిలో కొంత మార్పు వచ్చినట్టు కనిపిస్తోంది. మునుగోడు అభ్యర్థి ఎంపిక కోసం గురువారం గాంధీభవన్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న పాల్వాయి స్రవంతి, పల్లె రవి, పున్నా కైలాశ్‌నేత, చల్లమల్ల కృష్ణారెడ్డిలతో పీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన నాయకుడు ఆర్.దామోదర్‌రెడ్డి ఆ నలుగురు ఆశావహులతో విడివిడిగా భేటీ అయ్యారు. మీరు ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారా? మళ్లీ ఎన్నికలకు చాలా తక్కువ సమయముంది, అయినా బరిలో ఉంటారా? బలం ఏంటి? బలహీనత ఏంటి? డబ్బులే ప్రాతిపదికగా ఎన్నికలు నడిస్తే ఏం చేస్తారు? రెండు ప్రభుత్వాలను ఎలా ఢీ కొడతారు? మీ ప్రణాళిక ఏంటి? అనే ప్రశ్నలను అడిగి వారి అభిప్రాయాలు తీసుకున్నట్టు తెలిసింది. ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తాం భేటీ అనంతరం ఆశావహులు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తమ అభిప్రాయాలను పార్టీ నాయకత్వానికి చెప్పామని, తమలో ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కలిసి పనిచేస్తామని చెప్పారు. ఈ సమావేశం అనంతరం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్‌తో ఫోన్లో మాట్లాడిన రేవంత్‌రెడ్డి గాంధీభవన్ నుంచి నేరుగా పుణే వెళ్లిపోయారు. భట్టి, దామోదర్‌రెడ్డి ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లి మాణిక్యంతో భేటీ అయ్యారు. ఆ తర్వాత సాయంత్రం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. మునుగోడు అభ్యర్థి విషయంలో ఆయన అభిప్రాయం తెలుసుకోవడంతోపాటు ఈ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. వెంకట్‌రెడ్డి నివాసం నుంచి నేరుగా ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లిన భట్టి అక్కడ మాణిక్యం ఠాగూర్‌తో సమావేశమయ్యారు. అక్కడి నుంచి రేవంత్, మధుయాష్కీ, కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో మాట్లాడి మూడు పేర్లతో కూడిన జాబితాను ఏఐసీసీకి పంపినట్టు సమాచారం. ఈ జాబితాలో ఒక పేరును పార్టీ అధిష్టానం ఆమోదించి అధికారికంగా ప్రకటించనుంది. -
ఆత్మకూరులో పోటిపై చంద్రబాబు క్లారిటీ
సాక్షి, అమరావతి: మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి కారణంగా వచ్చిన ఆత్మకూరు ఉప ఎన్నికలో తాము పోటీ చేయడం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రకటించారు. ఎక్కడైనా సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందితే.. అక్కడ తాము పోటీ పెట్టడం లేదన్నారు. మొదటి నుంచి టీడీపీ ఈ విధానాన్ని పాటిస్తోందని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్చార్జిలతో గురువారం చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. బాదుడే బాదుడు, సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీల ఏర్పాటు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకూరు ఎన్నికపై మాట్లాడారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులకే తిరిగి ఉప ఎన్నికలో సీటు ఇస్తే పోటీ పెట్టకూడదన్నారు. బద్వేలులో తాము ఎందుకు పోటీ చేయలేదో ఆత్మకూరులోనూ అందుకే చేయడం లేదన్నారు. చదవండి: Divyavani On Chandrababu Naidu: టీడీపీలో మహిళలకు గౌరవం లేదు -
ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చుక్కెదురు
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చేదు అనుభవం ఎదురు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ అధికార రహిత రాష్ట్రాలు.. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, బీహార్‌లో ఉప ఎన్నికల ఫలితాలు ప్రతికూలంగా వస్తున్నాయి. చాలాచోట్ల విజయ సంబురాలు జరుగుతున్నప్పటికీ.. ఈసీ అధికారిక ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. పశ్చిమ బెంగాల్ ఉపఎన్నికల ఫలితాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తోంది. అసన్సోల్ లోక్‌సభతో పాటు బాలీంగజ్ అసెంబ్లీ స్థానాల్లో.. శతృఘ్నసిన్హా, బాబుల్ సుప్రియోలు ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. దాదాపు వీళ్ల విజయం ఖాయమైంది. అసన్సోల్.. ఇది వరకు బీజేపీ సీటు. ఈ నేపథ్యంలో టీఎంసీ కార్యకర్తలు విజయోత్సవ సంబురాల్లో మునిగిపోయారు. టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. I sincerely thank the electors of the Asansol Parliamentary Constituency and the Ballygunge Assembly Constituency for giving decisive mandate to AITC party candidates. (1/2) — Mamata Banerjee (@MamataOfficial) April 16, 2022 ► నాలుగు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో.. ఈసీ ట్రెండ్స్ ప్రకారం ఒకటి టీఎంసీ, రెండు కాంగ్రెస్, ఒకటి ఆర్జేడీ(విజయం) ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ► ఇక బీహార్‌లో లాలూ నేతృత్వంలోని ఆర్జేడీ బబోచాహన్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఘన విజయం సాధించింది. ఆర్జేడీ అభ్యర్థి అమర్ కుమార్‌పాశ్వాన్ గెలుపొందినట్లు ఈసీ ప్రకటించింది. ► ఛత్తీస్‌గఢ్ ఖాయిరాగఢ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి యశోధ నీలాంబర్ వర్మ ముందజంలో కొనసాగుతున్నారు. ► మహారాష్ట్ర కోల్హాపూర్(నార్త్) అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి జాదవ్ జైశ్రీ చంద్రకాంత్(అన్నా) ఆధిక్యంలో కొనసాగుతున్నారు. -
‘ప్రభుత్వ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి’
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనితీరు, ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే తిరుపతి ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీని తీసుకొస్తాయి అంటూ అదిమూలపు సురేష్ గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు టీడీపీని నమ్మే స్థితిలో లేరని ఈ విషయం తెలియక ఆ పార్టీ నేతలు ఇంకా గెలుస్తామనే భ్రమల్లో బతుకుతున్నారని అన్నారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు వైస్సార్సీపీ ఎంపీలు గొర్రెలంటూ నోరూపారేసుకోవడం సరైన పద్ధతి కాదంటూ మండిపడ్డారు. టీడీపీ ఎంపీలు సింహాలో లేక గుంటనక్కలో ఈ ఉపఎన్నికల్లో తిరుపతి ప్రజలే తమ ఓటు ద్వారా తేలుస్తారని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను కేవలం మీ స్వార్థం కోసం తాకట్టు పెట్టి ,ప్యాకేజీకి కక్కర్తి పడింది టీడీపీ ప్రభుత్వం కాదా ? అని ప్రశ్నించారు. ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ రూపంలో మళ్లీ తన ప్రతాపం చూపిస్తున్న సమయంలో స్కూళ్ల లో నిబంధనలు పాటించకుండా విద్యార్థుల ఆరోగ్యం తో ఆడుకుంటే ఆ స్కూళ్ల యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ( చదవండి: తిరుపతి ఉప ఎన్నిక: ‘ఫ్యాను’దే హవా ) -
అభ్యర్థిని రేపు ప్రకటిస్తాం: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి నిజామాబాద్‌లో ఒక్కో రిస్టార్‌లో వంద మంది చొప్పున జడ్పీటీసీలను బంధీ చేశారంటూ కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికలో పార్టీ తరఫున బరిలో నిలిపే అభ్యర్థి గురించి గాంధీ భవన్లో సమావేశమై చర్చించారు. అనంతరం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దుబ్బాక ఉప ఎన్నిక అభ్యర్థి ప్రకటన రేపు చేస్తామని తెలిపారు. దీని గురించి పార్టీలో ఇంకా చర్చ జరగుతుందన్నారు. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోయినా విలువలు పాటించిందని ప్రశంసించారు. ఇక టికెట్ దక్కుతుందని భావిస్తున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి విషయం గురించి ఉత్తమ్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ప్రజాస్వామ్య విలువలు మరింత పెరుగుతాయి అనుకున్నాము. తెలంగాణ వచ్చాక కల్వకుంట్ల కుటుంబం ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ లూటీ చేస్తూ.. రాజకీయాన్ని కమర్షియల్ చేసింది. టీఆరెస్ పార్టీ రాజకీయాలను దిగజార్చుతుంది. నిజామాబాద్ లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయిన కవితను లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ బరిలో మళ్ళీ నిలబెట్టారు. నిజామాబాద్ జిల్లాలో ఏ పార్టీకి ఎంత బలం ఉందో ప్రజలు గమనిస్తున్నారు. కరోనా సమయంలో రాజకీయ పార్టీలు సమావేశాలు-భేటీలు పెట్టొద్దన్న టీఆర్ఎస్ తాను మాత్రం అన్ని జరిపింది. ప్రజల తీర్పును వ్యతిరేకిస్తూ ఇతర పార్టీ నేతలను డబ్బులు పెట్టి కొంటుంది. ఎన్నికల ఉల్లంఘనకు టీఆర్ఎస్ పార్టీ పాల్పడింది. ఎన్నికల నిబంధనల ప్రకారం టీఆర్ఎస్ అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరుతాం’ అన్నారు ఉత్తమ్. (చదవండి: ఒక్కటి కాదు.. ఐదు మంత్రి పదవులు ) అనంతరం షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌కి మద్దతు ఇచ్చారని రాములు నాయక్- భూపతి రెడ్డిని డిస్క్వాలిపై చేశారు. లోక్ సభలో ఓడిన కవితను మళ్ళీ ఎమ్మెల్సీ బరిలో నిలబెట్టారు. కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేసేందుకు సూటికేసులు చేతులు మారుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ పై రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కామారెడ్డి-నిజామాబాద్ కలెక్టర్‌కు విజ్ఞపి చేసినా పట్టించుకోవట్లేదు. ఉమ్మడి నిజామాబాద్‌లో ఒక్కో రిసార్ట్‌లో వంద మంది చొప్పున జడ్పీటీసీలను బందీ చేశారు. లోకల్ బాడీలో ఏ పార్టీ తరపున ఎన్నికైతే పదవీకాలం అయ్యే వరకు అదే పార్టీలో కొనసాగాలి. పార్టీ మారితే వెంటనే డిస్క్వాలిపై చేయాలి అని కోరారు. -
కన్నడ ఎగ్జిట్ పోల్స్.. వారికి నిరాశే!
బెంగళూరు : కర్ణాటకలోని 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బీజేపీకి అగ్ని పరీక్షగా మారిన ఈ ఉప ఎన్నికలపై పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెలువరించాయి. బీజేపీ మెజారిటీ స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఈ ఎన్నికల్లో జేడీఎస్, కాంగ్రెస్‌లకు పరాభవం తప్పదనేలా ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్స్ ఉన్నాయి. బీజేపీ 8-10, కాంగ్రెస్ 3-5, జేడీఎస్ 1-2, ఇతరులు 1 స్థానాల్లో గెలుపొందుతాయని కన్నడ పబ్లిక్ టీవీ సర్వే తెలిపింది. బీటీవీ వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీ 9, కాంగ్రెస్ 2, జేడీఎస్ 2, ఇతరులు 1 స్థానంలో విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. పవర్ టీవీ కూడా బీజేపీ 8-12, కాంగ్రెస్‌కు 3-6, జేడీఎస్ 0-2, ఇతరులు 1 స్థానాల్లో గెలుపొందుతుందని తెలిపింది. ప్రసుత్తం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ బట్టి చూస్తే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిలేదని స్పష్టమవుతోంది. బీజేపీ అధికారం కాపాడుకోవాలనుకుంటే కనీసం 6 స్థానాల్లో తప్పకుండా విజయం సాధించాల్సిన సంగతి తెలిసిందే. కాగా, గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగింది. మొత్తంగా 66.25 శాతం పోలింగ్ నమోదైనట్టు ఈసీ తెలిపింది. డిసెంబర్ 9న ఈ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
బీజేపీ నేతపై దాడి.. కాళ్లతో తన్నుతూ..
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరీంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి జై ప్రకాశ్ మజుందార్‌పై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటన జియాఘాట్ ఇస్లాంపూర్ ప్రైమరీ స్కూల్ పోలింగ్ కేంద్రం వద్ద చోటు చేసుకుంది. పోలింగ్ బూత్‌ను సందర్శించేందుకు వెళ్లిన జైప్రకాశ్ మజుందార్‌పై తృణమూల్‌కార్యకర్తలు విరుచుపడ్డారు. పోలింగ్ బయట కాళ్లతో తన్నుతూ.. చెట్ల పొదలు ఉన్న మురికి కాలువలో తోసేశారు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది కార్యకర్తలను చెదరగొట్టారు. కాగా, తనపై దాడికి యత్నించిన తృణమూల్ కార్యకర్తలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ప్రకాశ్ మజుందార్ డిమాండ్ చేశారు. తృణమూల్ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందనడానికి ఈ దాడియే నిదర్శనమన్నారు. తృణమూల్ నేతలు వీధి రౌడిల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాగా తృణమూల్ నేతలు మాత్రం ఈ దాడిని తమ కార్యకర్తలు చేయలేదని చెప్పుకొచ్చారు. స్థానికులే బీజేపీపై ఆగ్రహంతో జైప్రకాశ్ ముజుందార్‌పై దాడి చేశారని పేర్కొన్నారు. పశ్చిమ మిడ్నపూర్ జిల్లాలోని ఖరగ్‌పూర్ సదర్, నదియాలోని కరీంపూర్, ఉత్తర్ దినాజ్‌పూర్‌లోని కలియాగంజ్ నియోజక వర్గాలకు నేడు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కలియాగంజ్ నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే పపర్మతానాథ్ రాయ్ మృతి చెందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. కరీంపూర్‌నుంచి ఎన్నికైన టిఎంసి ఎమ్మెల్యే మహువా మొయిత్రా, ఖరగ్‌పూర్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే దిలీప్ ఘోష్ లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నిక జరుగుతోంది. -
జేడీఎస్‌కు షాక్.. పోటీ విరమణ!
బెంగళూరు: ఉప ఎన్నికల సమరంలో ప్రతిపక్ష జేడీఎస్‌కు ఊహించని ఫలితాలు ఎదురవుతున్నాయి. హిరేకరూరు, అథణి అభ్యర్థులు పోటీ చేయరాదని నిర్ణయించారు. మరో నియోజకవర్గంలో అభ్యర్థి నామినేషన్ చెల్లలేదు. మండ్య కేఆర్‌పేటెలో పార్టీ ఎమ్మెల్యేలు ప్రచారానికి ముఖం చాటేయడం గమనార్హం. 15కు గాను 14 స్థానాల్లో పోటీలోనున్న జేడీఎస్‌కు తాజా పరిణామాలు శరాఘాతమే. త్వరలో ఈ సంఖ్య పెరిగినా పెరగవచ్చని నాయకుల మాట. రాష్ట్రంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న ఉప ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణకు గురువారం చివరిరోజు కాగా జేడీయస్‌కు పలువురు అభ్యర్థులు అనూహ్యంగా షాక్ ఇస్తున్నారు. హిరేకరూరు నియోజకవర్గం నుంచి జేడీయస్ అభ్యర్థి శివలింగ శివాచార్యస్వామీజీ నామినేషన్ వెనక్కి తీసుకోనున్నారు. అదేవిధంగా అథణి నియోజకవర్గం జేడీయస్ అభ్యర్థి, డిప్యూటీ సీఎం లక్ష్మణసవది ఆప్తుడు గురుదాస్కళ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. చిక్కబళ్లాపురం అభ్యర్థి కేపీ.బచ్చేగౌడ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు సక్రమంగా లేదని తిరస్కరించారు. అతనికి బదులు స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే అనితా కుమారస్వామి బంధువును ప్రకటించాలని జేడీయస్ భావిస్తోంది. కేఆర్ పేటెలో కినుక మండ్య జిల్లాలోని కేఆర్.పేటే నియోజకవర్గంలో దేవరాజుకు జేడీఎస్ టికెట్ కేటాయించడం ఎమ్మెల్యేలు పుట్టరాజు, డీసీ. తమ్మణ్ణ, అన్నదానికి నచ్చడం లేదు. దీంతో వారు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. కేఆర్.పేటే ఉప ఎన్నికలో జేడీయస్ నుంచి జిల్లా పంచాయతీ సభ్యుడు హెచ్డీ.రాజు కు టికెట్ ఇవ్వాలని పుట్టరాజుతో పాటు పలువురు జేడీయస్ నేతలు దళపతులపై ఒత్తిడి తీసుకువచ్చినా పట్టించుకోలేదు. హ్యాండిచ్చిన స్వామీజీ హిరేకరూరు నియోజకవర్గం నుంచి జేడీయస్ అభ్యర్థి శివలింగాచార్యస్వామిజీ సీనియర్ మఠాధీశుల ఒత్తిడి వల్ల పోటీ నుంచి వైదొలిగారు. మాజీ సీఎం కుమారస్వామి ఆదివారం అర్ధరాత్రి శివలింగాచార్య స్వామిజీతో మాట్లాడిన తరువాత రాత్రికి రాత్రి బీ.ఫారం తీసుకుని నామినేషన్ వేశారు. కానీ మంగళవారం పంచపీఠాధీశ్వర ఇతర స్వామీజీల ఒత్తిడితో గురువారం నామినేషన్ ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. జేడీఎస్ నేతల బహిష్కరణ యశవంతపుర: బెంగళూరు మహలక్ష్మీ లేఔట్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గోపాలయ్యకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారని బీబీఎంపీ జేడీఎస్ కార్పొరేటర్ హేమలతా గోపాల య్య తో పాటు ఇద్దరు జేడీఎస్ నాయకులను పార్టీ నుండి బహష్కరించారు. మహదేవ్, జయరామ్ అనేవారిని పార్టీనుంచి బహష్కరించారు. -
కర్ణాటక ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 15 అసెంబ్లీ స్థానాలకు డిసెంబర్ 5న పోలింగ్ జరగనుంది. వీటి ఫలితాలు డిసెంబర్ 9న విడుదల కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారన్న కారణంతో గత ప్రభుత్వంలో స్పీకర్ వారిపై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. దీనిపై వారు సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితంలేకపోయింది. దీంతో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో రేపటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. అయితే అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు అసెంబ్లీ గడువు ముగిసే వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా స్పీకర్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో 15 ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. అయితే వీరి కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. స్పీకర్ నిర్ణయాన్ని కోర్టు కొట్టివేస్తుందా? లేక సమర్థిస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో అనర్హతకు గురైన ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. అయితే మరో రెండు రోజుల్లోనే దీనిపై న్యాయస్థానం తీర్పును వెలువరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఉప ఎన్నికల ప్రకటనతో కన్నడలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికలు జరిగే స్థానాల్లో గెలుపు అధికార బీజేపీకి సవాలుగా మారింది. ఎలాగైనా మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకోవాలని యడియూరప్ప సర్కార్ భావిస్తోంది. మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్, జేడీఎస్ కూడా ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఇరు పార్టీల మధ్య ఏర్పడిన వైరుధ్యాలు బీజేపీకి లాభం చేకూర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
భారీ వర్షం.. పోలింగ్‌కు అంతరాయం
కొచ్చి : కేరళను భారీ వర్షం ముంచెత్తింది. రాష్ట్రంలోని 12 జిల్లాలో కుండపోత వర్షం కురవనుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే అరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అంటే 11 నుంచి 20 సెం.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. భారీ వర్షం కారణంగా కేరళలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. మరోవైపు కేరళలోని వట్టియూర్కావు, అరూర్, కొన్నీ, ఎర్నాకుళం, మంజేశ్వరం నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే భారీ వర్షం కొన్ని చోట్ల పోలింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగిస్తోంది. దీంతో కొన్ని పోలింగ్ స్టేషన్లలో.. బూత్‌లను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కు షిప్ట్ చేశారు. భారీ వర్షాల కారణంగా తాము ఓటు వేయలేకపోతున్నామని కొందరు ఓటర్లు ఆవేదన వక్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. అధికారలు అప్రమత్తంగా ఉండాలని సీఎం పినరాయి విజయన్ ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను సమీక్షిస్తున్నట్టు ఆయన తెలిపారు. వరద బాధితులకు పునరావాస కల్పించడంపై దృష్టి సారించామని పేర్కొన్నారు. మరోవైపు ఎర్నాకుళం రైల్వే స్టేషన్లో నీరు నిలిచిపోవడంతో.. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
అనర్హత ఎమ్మెల్యేలకు బీజేపీ టికెట్లు
శివమొగ్గ : ఒకవైపు అనర్హత, మరోవైపు కోర్టులో విచారణతో తమ రాజకీయ భవితవ్యం ఏమవుతుందోనని మథనపడుతున్న అనర్హత ఎమ్మెల్యేలకు కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప అభయమిచ్చారు. 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల్లో అనర్హత ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామని యడియూరప్ప తెలిపారు. సోమవారం జిల్లాలోని శికారిపుర పట్టణంలో నిర్వహించిన జనతాదర్శన్ కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యల అర్జీలు స్వీకరించిన అనంతరం మాట్లాడారు. ఇటీవల ఢిల్లీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో సమావేశమై ఉపఎన్నికల్లో అనర్హత ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేయగా అందుకు అంగీకరించారని చెప్పారు. అనర్హత ఎమ్మెల్యేలు తమ భవిష్యత్తు గురించి బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇద్దరు ఇంచార్జ్‌లను నియమించి అనర్హత ఎమ్మెల్యేలను గెలిపించుకోవడానికి వ్యూహాలు కూడా సిద్ధం చేస్తున్నామన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడాలి అనర్హత ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడానికి అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలని ఉపఎన్నికల్లో అనర్హత ఎమ్మెల్యేలను గెలిపించడానికి సహకరించాలని సూచించారు. పారీ్టలోని కీలకనేతలకు సముచిత స్థానం కలి్ప స్తామని ఇదే విషయంపై తదుపరి మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామన్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన నేతలకు నిగమ మండళి స్థానాలు కట్టబెడతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గెలిస్తే కరెక్టా? ఈవీఎంల ట్యాంపరింగ్ అవుతాయేమోనని మాజీ సీఎం సిద్ధరామయ్య అనుమానం వ్యక్తం చేయడాన్ని యడియూరప్ప తప్పుపట్టారు. కాంగ్రెస్ గెలిస్తే సరిగ్గా పనిచేసే ఈవీఎంలు బీజేపీ గెలిచినపుడు మాత్రం ఎలా ట్యాంపరింగ్ అవుతాయో సిద్దరామయ్యే చెప్పాలని కోరారు. అనర్హత ఎమ్మెల్యేల విషయంలో ఇక ఎవరిదారి వారిదే అని ఉమేశ్ కత్తి చేసిన వ్యాఖ్యలపై త్వరలోనే ఆయన భేటీ అయి చర్చిస్తానని చెప్పారు. చకచకా శివమొగ్గ ఎయిర్‌పోర్టు శివమొగ్గ నగర శివార్లలోని సోనగానహళ్లిలో నిలిచిపోయిన విమానాశ్రయ నిర్మాణ పనులను పునఃప్రారంభిస్తామంటూ సీఎం తెలిపారు. అతి త్వరలో విమానాశ్రయ పనులను పునఃప్రారంభించనున్నామని అందుకోసం రూ.45 కోట్ల నిధులు విడుదల చేశామన్నారు. పదినెలల్లో విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేస్తామని విమానాశ్రయంతో పాటు జిల్లా యువతకు ఉపాధి కల్పించడానికి పరిశ్రమలు స్థాపనపై కూడా దృష్టి సారించామన్నారు. -
ఉప ఎన్నికల ఎఫెక్ట్: కేంద్రం దిద్దుబాటు చర్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీకి గట్టి షాక్ తగిలిన సంగతి తెలిసిందే. మొత్తం నాలుగు లోక్‌సభ స్థానాలు, 11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ ఒక లోక్‌సభ స్థానం, ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే గెలుపొందింది. దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టు ఈ ఉప ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. దేశవ్యాప్తంగా రైతులు ఆందోళనబాటు పడుతున్న నేపథ్యంలో వారికి చేరువయ్యేందుకు కొన్ని ఊరట చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా చెరకు రైతులకు ఒకట్రెండు రోజుల్లో కేంద్రం తీపి కబురు అందించనుందని తెలుస్తోంది. సంక్షోభంలో ఉన్న చెరకు రైతులను ఆదుకునేందుకు రూ. 10వేల కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించనుంది. అలాగే చెరకు ఎగుమతులపై సుంకాన్ని పూర్తిగా రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చెరకు దిగుమతులపై ప్రస్తుతం 50శాతం సుంకం విధిస్తుండగా.. దానిని 100శాతానికి పెంచనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో నిర్ణయం వెలువడవచ్చునని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కీలకమైన కైరానా లోక్‌సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బీజేపీ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది. సిట్టింగ్ సీటు అయిన కైరానాలో బీజేపీ విపక్షాల ఉమ్మడి అభ్యర్థి చేతిలో పరాజయం పాలైంది. ఇక్కడ బీజేపీ ఓటమిలో చెరకు రైతులు కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో కేంద్రం చెరకు రైతులను ఆదుకునేందుకు ముందుకొచ్చింది. -
బీజేపీ ఆటనే.. మేమూ మొదలుపెట్టాం!
లక్నో : తాజా ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించడం ద్వారా ఆ పార్టీకి ప్రజలు గట్టి బుద్ధి చెప్పారని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేనివారిని తాజా ఉప ఎన్నికలు ఓడించాయని ఆయన చెప్పారు. ఎన్నికల్లో బీజేపీ ఆడుతున్న ఆటను.. తాము కూడా ఆడుతున్నామని, విపక్షాలను చీల్చి గండి కొట్టాలన్న బీజేపీ ఎత్తుగడలకు బ్రేక్ వేశాయని ఆయన అన్నారు. గెలిచిన అభ్యర్థులకు ఆయన అభినందనలు తెలిపారు. ‘బీజేపీ మాతో ఆడుతున్న ఆటనే.. మేం ఆ పార్టీ నుంచి నేర్చుకొని.. ఆడుతున్నాం. రైతులకు రుణాలు మాఫీ చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కానీ ఏమైంది? రుణమాఫీ కాదు రైతుల ప్రాణాలను బీజేపీ సర్కారు బలిగొంటోంది. ఇది పెద్ద మోసం’ అని అఖిలేశ్ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని కైరానా లోక్‌సభ నియోజకవర్గంలో ఆర్ఎల్డీ అభ్యర్థి తబస్సుమ్ హసన్ 55వేల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇక్కడ విపక్షాలన్నీ(ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్) కలిసి ఆర్ఎల్డీకి మద్దతునిచ్చాయి. మరోవైపు నూర్పూర్ అసెంబ్లీ స్థానంలోనూ బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ సిట్టింగ్ నియోజకవర్గమైన ఇక్కడ ఎస్పీ అభ్యర్థి విజయం సాధించారు. -
బీజేపీ ఘోర పరాభవానికి అదే కారణం!
సాక్షి, పట్నా : దేశవ్యాప్తంగా జరిగిన తాజా ఉప ఎన్నికల్లో అధికార బీజేపీకి షాక్ తగిలింది. అటు, బిహార్‌లోని జోకిహాట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో జేడీయూ-బీజేపీ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జేడీయూ అధినేత, సీఎం నితీశ్‌కుమార్ ప్రతిష్టాత్మకంగా భావించిన జోకిహాట్ బైపోల్స్‌లో అధికార పార్టీ ఓటమి పాలైంది. ఈ నియోజకవర్గంలో ఆర్జేడీ భారీ మెజారిటీతో గెలుపొందింది. దీంతో ఆర్జేడీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. అదే కారణం.. ఎన్నికల ఫలితాలపై బీజేపీ మిత్రపక్షం జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగి ఘాటుగా వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం నెలకొందని, వరుసగా పెట్రో, డీజిల్ ధరలు పెరగడం.. తాజా ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ఒక కారణమని ఆయన విశ్లేషించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నితీశ్‌పై మండిపాటు.. తాజా ఉప ఎన్నికల్లో గెలుపు నేపథ్యంలో సీఎం నితీశ్‌కుమార్‌పై ఆర్జేడీ నేత, లాలూ ప్రసాద్ తనయుడు తేజస్వి యాదవ్ మండిపడ్డారు. జోకిహాట్‌లో జేడీఎస్‌కు వచ్చిన ఓట్లు తమ మెజారిటీ కన్నా తక్కువేనని అన్నారు. యూటర్న్ తీసుకొని బీజేపీతో పొత్తు పెట్టుకున్న నితీశ్‌పై రాష్ట్ర ప్రజలు పత్రీకారం తీర్చుకున్నారని, అందుకు తాజా ఉప ఎన్నికలే నిదర్శనమని అన్నారు. కేంద్ర సంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీలను దుర్వినియోగం చేసి.. తమ కుటుంబంపై ఉసిగొల్పుతున్నారని ఆయన మండిపడ్డారు. తమ కుటుంబాన్ని వేధిస్తున్న నితీశ్‌కు ఈ ఉప ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. -
బీజేపీ కూటమిని గద్దె దించే యోచనలో కాంగ్రెస్!
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిపక్షాల ఐక్యత అధికార బీజేపీని గట్టి దెబ్బతీసింది. మొత్తం నాలుగు లోక్‌సభ స్థానాలు, 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరగగా.. మూడు లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క మహారాష్ట్రలోని పాల్ఘర్ నియోజకవర్గాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. ఇటు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లోనూ బీజేపీకి చేదు అనుభవమే ఎదురైంది. మొత్తం 11 స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా.. తొమ్మిది స్థానాల్లో ఎదురీదుతోంది. ముఖ్యంగా మేఘాలయాలోని అంపటి అసెంబ్లీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. అంపటిలో కాంగ్రెస్ అభ్యర్థి మియానీ డీ షిరా 3,191 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తాజా గెలుపుతో మేఘాలయలో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉన్న మేఘాలయాలో తాజా గెలుపుతో కాంగ్రెస్ సంఖ్యాబలం 21కి చేరింది. మరోవైపు అధికార ఎన్పీపీ 20 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఎన్పీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. కోనార్డ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీ-బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. కర్ణాటక రాజకీయాలను మేఘాలయలో పునరావృతం చేసి.. విపక్షాల ఐక్యతతో మరో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. సాధారణ మెజారిటీ సాధించలేదు. అయినా, గవర్నర్ వజుభాయ్ వాలా మొదట బీజేపీ నేత యడ్యూరప్పకు అవకాశం కల్పించారు. దీంతో బిహార్, గోవా, మణిపూర్ తదితర రాష్ట్రాల్లోనూ అతిపెద్ద పార్టీలుగా నిలిచిన పలు పార్టీలు ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని ఆయా రాష్ట్రాల గవర్నర్లను కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేఘాలయాలో అధికార బీజేపీకూటమిని గద్దె దింపి.. ప్రతిపక్షాల ఐక్యతతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. -
బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
దేశంలోని ఆరు రాష్ట్రాల్లో జరగనున్న పార్లమెంటు, అసెంబ్లీ ఉప ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థుల వివరాలను బీజేపీ ప్రకటించింది. వీళ్ల పేర్లను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నిర్ణయించిందని పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.. మధ్యప్రదేశ్: షాదోల్ (ఎస్టీ) పార్లమెంటరీ నియోజవర్గం నుంచి జ్ఞాన్ సింగ్, నేపానగర్ (ఎస్టీ) అసెంబ్లీ నియోజవర్గం నుంచి మంజు దాడు తమిళనాడు: అరవకురిచి అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఎస్.ప్రభు, తంజావూరు అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఎంఎస్ రామలింగం, తిరుపరంకుంద్రం అసెంబ్లీ నియోజవర్గం నుంచి ప్రొఫెసర్ ఆర్ శ్రీనివాసన్ పశ్చిమబెంగాల్: కూచ్‌బీహార్ (ఎస్సీ) పార్లమెంటు నియోజవర్గం నుంచి హేమ చంద్ర బర్మన్, తమ్లుక్ పార్లమెంటు నియోజవర్గం నుంచి ప్రొఫెసర్ అంబుజ్ మొహంతి, మాంటేశ్వర్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి బిశ్వజిత్ పొద్దార్ త్రిపుర: బర్జలా అసెంబ్లీ నియోజవర్గం నుంచి శిష్ట మోహన్ దాస్, ఖొవాయ్ అసెంబ్లీ నియోజవర్గం నుంచి తపన్ కుమార్ పాల్ అరుణాచల్ ప్రదేశ్: హేయులియాంగ్ (ఎస్టీ) అసెంబ్లీ నియోజవర్గం నుంచి దసంగ్లు పుల్ అసోం: లఖింపూర్ పార్లమెంటు నియోజవర్గం నుంచి ప్రధాన్ బారువా, బైతాలంగాసో (ఎస్టీ) అసెంబ్లీ నియోజవర్గం నుంచి డాక్టర్ మాన్ సింగ్ రోంగ్పి -
ఎక్కడెక్కడ.. ఎవరెవరు గెలిచారు?
దేశంలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం నాడు ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో నాలుగు స్థానాలను బీజేపీ గెలుచుకోగా.. రెండుచోట్ల మాత్రం కాంగ్రెస్ గెలిచింది. టీఆర్ఎస్, సమాజ్‌వాదీ పార్టీ, శిరోమణి అకాలీదళ్, ఆర్ఎల్ఎస్పీ, సీపీఎం, శివసేన తలో సీటును గెలుచుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. వాటిలో ముజఫర్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి కపిల్ దేవ్ అగర్వాల్ విజయం సాధించారు. బికాపూర్‌లో సమాజ్‌వాదీ అభ్యర్థి ఆనంద్ సేన్, దేవ్బంద్లో కాంగ్రెస్ నేత మావియా అలీ గెలిచారు. కర్ణాటకలోనూ మూడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అక్కడ రెండుచోట్ల బీజేపీ గెలిచింది. దేవదుర్గలో శివన గౌడ నాయక్, హెబ్బల్‌లో వై.ఎ. నారాయణస్వామి విజయం సాధించారు. బీదర్ స్థానంలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి రహీం ఖాన్ విజయం సాధించారు. తెలంగాణలో ఒకే స్థానంలో ఉప ఎన్నిక జరగ్గా, ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్‌రెడ్డి విజయం సాధించారు. పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ స్థానంలో అకాలీదళ్ అభ్యర్థి రవీందర్ సింగ్, మధ్యప్రదేశ్‌లోని మైహార్‌లో బీజేపీ అభ్యర్థి నారాయణ్ త్రిపాఠీ, బిహార్‌లోని హర్లాఖిలో ఆర్ఎల్ఎస్పీ అభ్యర్థి సుధాంశు శేఖర్, త్రిపురలోని అమర్పూర్లో సీపీఎం అభ్యర్థి పరిమల్ దేవ్నాథ్, మహారాష్ట్రలోని పాలఘర్‌లో శివసేన అభ్యర్థి అమిత్ కృష్ణ విజయం సాధించారు.